ఏపీకి నిధుల విడుదలకు ముహూర్తం ఎప్పుడో!
posted on Jan 23, 2015 @ 9:45AM
దాదాపు 8 నెలలు పూర్తి కావస్తున్నా ఇంతవరకు కేంద్రప్రభుత్వం ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులను విడుదల చేయలేదు. ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ఒకటి అరా ఉన్నత విద్యా సంస్థల స్థాపనకు శంఖు స్థాపనలు చేసింది గానీ మరే ఇతర ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయలేదు. క్లియరెన్స్ కూడా ఇవ్వలేదు. ప్రత్యేక హోదా, ప్రాజెక్టుల విషయంలో కేవలం సాంకేతిక కారణాల చేతనే జాప్యం జరుగుతోందని సమాచారం. కానీ నిధుల విడుదలకు దేశంలో ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న కారణంగానే కేంద్రం వెనకడుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ కి భారీగా నిధులు విడుదల చేసినట్లయితే మిగిలిన రాష్ట్రాల నుండి కూడా కేంద్రంపై ఒత్తిడి వస్తుంది. విడుదల చేయకపోతే ఆయా రాష్ట్రాలలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు బీజేపీ పక్షపాత వైఖరి అవలంభిస్తోంది అంటూ ప్రచారం చేస్తే బీజేపీకి రాజకీయంగా నష్టంజరిగే ప్రమాదం ఉంటుంది కనుకనే ఆంధ్రప్రదేశ్ కి నిధులు విడుదల చేయడానికి వెనకాడుతోందేమో.
లోటు బడ్జెట్టులో ఉన్న ఆంద్రతో బాటు మిగులు బడ్జెట్టులో ఉన్న తెలంగాణా రాష్ట్రం కూడా వివిధ పధకాలు, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల కొరకు కేంద్రం ఇవ్వవలసిన నిధులను కోరుతోంది. తెలంగాణాకు మంజూరు చేసిన ఎయిమ్స్ ఆసుపత్రి నిర్మాణం కోసం కేంద్రం నుండి రూ.820 కోట్లు వస్తాయని తెలంగాణా ప్రభుత్వం ఆశిస్తోంది. కానీ ఇంతవరకు హూద్ హూద్ తుఫాను కోసం ప్రధాని మోడీ ప్రకటించిన రూ.1000 కోట్లే పూర్తిగా ఇవ్వలేదు.
ఇటువంటి పరిస్థితుల్లో తక్షణమే ఆర్ధిక సహాయం చేయాలని లేకుంటే పరిస్థితులు విషమిస్తాయని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీని, ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీని అభ్యర్ధించారు. ప్రధాని మోడీ, ఆర్ధికమంత్రి జైట్లీలను కలిసిన తరువాత చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ తను వారిని ఏమేమీ కోరారో వివరంగా చెప్పారు కానీ వారు ఆయనకు ఏమి హామీ ఇచ్చేరో చెప్పకపోవడం గమనిస్తే వారిరువురూ ఆయనకు ఎటువంటి హామీ ఇవ్వలేదనే భావించవలసి వస్తుంది.
తెదేపా,బీజేపీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో భాగస్వాములుగా ఉన్నప్పటికీ కేంద్రం నుండి నిధులు తెచ్చుకోలేకపోతున్నందుకు ప్రతిపక్షాలు కూడా తప్పు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి దాని సమస్యలు దానికి ఉండవచ్చును. కానీ ఇప్పుడు ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొని ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే స్వయంగా చెబుతున్నప్పుడు కూడా కేంద్రం ఇంకా ఉదాసీనంగా వ్యవహరించినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఎలాగూ ఆర్ధిక ఇబ్బందుల్లో పడుతుంది. దాని వలన రెండు పార్టీల మధ్య దూరం పెరిగే అవకాశం కూడా ఉంది. అంతేకాక దాని వలన బీజేపీ వైఖరిపై ప్రజలకి తప్పుడు సంకేతాలు కూడా వెళ్ళే ప్రమాదం ఉంది.
చంద్రబాబు మాత్రం రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మురంగా చేస్తున్నారు. ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉన్న అయన అక్కడ చాలా మంది పారిశ్రామికవేత్తలను, వ్యాపార సంస్థల సి.ఈ.ఓ.లను కలిసి రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పించగలిగారు. అవి కాక ఇప్పటికే వైజాగ్, చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో అనేక కొత్త పరిశ్రమల స్థాపనకి సన్నాహాలు చురుకుగా సాగుతున్నాయి. కానీ అవన్నీ నిర్మాణాలు పూర్తి చేసుకొని తమ వ్యాపార కార్యకలాపాలు మొదలుపెట్టేందుకు మరి కొంత సమయం పడుతుంది. అప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అండగా నిలబడితే ఆ తరువాత రాష్ట్రం నుండే కేంద్రానికి కూడా టాక్సుల రూపంలో భారీ ఆదాయం సమకూరుతుంది.
రాష్ట్రానికి ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తానని కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్ పదేపదే చెపుతున్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి తెలిసిన వారిరువురూ ముందుగా నిధులు విడుదలయ్యేలా చేయగలిగితే మిగిలిన అంశాలను తరువాత పరిష్కరించుకోవచ్చును.