రాష్ట్రానికి కేంద్రం బొనాంజా
posted on Oct 28, 2012 @ 9:31AM
రాష్ట్ర కాంగ్రెస్‌లో అంతా సందడిసందడిగా వుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. అధికార భాషా సంఘం ఛైర్మన్‌గా మండలి బుద్ధప్రసాద్ నియామకం ఇందులో మొదటిది. మిగిలిన నామినేటెడ్ పదవుల భర్తీలో తమకు అవకాశం లభించగలదని ఆశావహులు ఎదురు చూస్తున్నారు. ఇకపోతే కేంద్రంలో కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణలో రాష్ట్రానికి అగ్రతాంబూలం లభించింది. ఇప్పటికే కేంద్ర కేబినెట్‌లో మన రాష్ట్రంనుంచి ఐదుగురు వున్నారు. మరో ఐదుగురికి కొత్తగా అవకాశం వచ్చింది. దీంతో కేంద్ర కేబినెట్‌లో మన రాష్ట్రం వాటా గణనీయంగా పెరిగింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంనుంచి అత్యధిక సీట్లను గెలుచుకునే లక్ష్యంతోనే కేబినెట్‌లో రాష్ట్ర ఎంపీలకు ప్రాధాన్యం కల్పించారని చెప్పవచ్చు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం వరుసగా రెండుసార్లు అధికారంలోకి రావడానికి రాష్ట్రంనుంచి అధిక సంఖ్యలో ఎన్నికయిన కాంగ్రెస్ ఎంపీలే కారణం. ఇదే ఒరవడి 2014 ఎన్నికల్లోనూ కొనసాగాలనే ఆకాంక్షతోనే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రాష్ట్రంనుంచి ఎక్కువ మందికి కేబినెట్‌లో అవకాశం కల్పించారు. అయితే రాసిలో ఎక్కువగా వుండే ఈ మంత్రులు రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు ఏ మేరకు కృషి చేస్తారన్నదే ప్రశ్నార్థకం.