కరోనా జాతి వైరస్ లన్నీంటికీ చెక్
posted on Aug 28, 2020 @ 1:14PM
వ్యాక్సిన్ రెడీ చేస్తున్న కేంబ్రిడ్జీ వర్సిటీ
కరోనా వైరస్ చాలా సాధారణంగా ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో కాస్త ఇబ్బంది, దగ్గు లేదా ముక్కు కారడం లాంటి ప్రారంభ లక్షణాలతో దానిని గుర్తించవచ్చు. కానీ కరోనా కుటుంబానికే చెందిన సార్స్(సివియర్ ఎక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్), మర్స్(మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) వంటి కొన్ని వైరస్‌లు చాలా ప్రమాదకరం. వుహాన్ నుంచి వ్యాపించిన అంటువ్యాధులకు కారణమైన వైరస్‌కు 'నావెల్ కరోనా వైరస్ లేదా కోవిద్ 19 పేరు పెట్టారు. ఇది కరోనాకుటుంబానికి చెందిన కొత్త జాతి వైరస్. ఈ కొత్త జాతి వైరస్ ను అరికట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. పనిలో పనిగా కరోనా జాతిలోని అన్ని వైరస్ లకు చెక్ పెట్టేందుకు కేంబ్రిడ్జి యూనివర్సిటీ పరిశోధనలు నిర్వహిస్తోంది.
కరోనా జాతికి చెందిన అన్ని రకాల వైరస్ ల జన్యువులను ఉపయోగించి డీఐవోఎస్-కోవాక్స్2 అనే వ్యాక్సిన్‌ను ఇప్పటికే అభివృద్ధి చేశామని కేంబ్రిడ్జి పరిశోధనబృందం తెలిపింది. ఈ వ్యాక్సిన్ పై ప్రయోగాలు పూర్తి అయ్యాయని క్లినికల్ ట్రయల్స్ మాత్రమే నిర్వహించాల్సి ఉన్నదని వెల్లడించారు. ట్రయల్స్ విజయవంతమైన తర్వాత రోగులకు ఏ మాత్రం నొప్పి కలుగకుండా ‘స్ప్రింగ్ పవర్డ్ జెట్ ఇంజిక్షన్' (సూది లేకుండా టీకాను శరీరంలోకి ఎక్కించడం) ద్వారా వ్యాక్సిన్ ఇస్తామంటున్నారు ఈ పరిశోధన బృందానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ జోనథాన్ హీనే.
కరోనా వైరస్ శ్వాసవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. 1960ల్లో ఈ వైరస్ ని కనుగొన్నారు. ఇప్పటి వరకూ ఆరు రకాల కరోనా వైరస్‌లను గుర్తించారు. హ్యూమన్ కరోనావైరస్ 229ఈ, హ్యూమన్ కరోనావైరస్ ఓసీ 43, సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (సార్స్-సీఓవీ), హ్యూమన్ కరోనావైరస్ ఎన్‌ఎల్ 63, హ్యూమన్ కరోనావైరస్ హెచ్‌కేయూ 1, మిడిల్‌ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనావైరస్ (మెర్స్-సీఓవీ). ఇవి ఎక్కువగా పక్షులు, క్షీరదాలపై ప్రభావం చూపిస్తాయి.
అయితే కొత్తగా వచ్చిన కోవిద్ 19 వైరస్ మనుషులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ వైరస్ సోకినప్పుడు తేలికపాటి లక్షణాలతో ప్రారంభమై వ్యాధి తీవ్రరూపం దాల్చి ప్రాణాంతకంగా మారుతుంది. ఈ రకమైన వైరస్ సోకిన వారిలో 10 నుంచి 20శాతం మందికి చికిత్స అవసరం అయితే రెండు నుంచి మూడు శాతం మంది మరణిస్తారు. అలాంటి కొత్త వైరస్ కొవిడ్-19 నిర్మాణాన్ని 3డీ కంప్యూటర్ మోడలింగ్ ద్వారా విశ్లేషించి వ్యాక్సిన్ ను అభివృద్ధి చేశారు. ఇప్పడు ప్రపంచమానవాళి ఎదుర్కోంటున్న సమస్యనే కాకుండా భవిష్యత్‌లో జంతువుల నుంచి మానవులకు సోకే అవకాశమున్న సార్స్, మెర్స్ వంటి కరోనా జాతి వైరస్ రకాలను కూడా కట్టడి చేసేలా ఈ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేశారు కేంబ్రిడ్జి పరిశోధనకులు. ఇందుకోసం కరోనా జాతి వైరస్ జన్యు క్రమాలను కూడా విశ్లేషించారు. సింథటిక్ డీఎన్‌ఏ, 3డీ కంప్యూటింగ్ సాంకేతికత సాయంతో అభివృద్ధి చేసిన తమ వ్యాక్సిన్ అన్ని రకాల కరోనా వైరస్‌లను కట్టడి చేయగలుగుతుందని ఈ పరిశోధనలో పాల్గొన్న మరో శాస్త్రవేత్త డాక్టర్ రెబెకా కిన్స్‌లే వెల్లడించారు. ప్రపంచ మానవళికి కరోనా వైరస్ వల్ల సంక్రమించే అంటువ్యాధుల నుంచి రక్షణ ఇచ్చే ఈ వ్యాక్సిన్ అందరికీ అందుబాటులో ఉండేలా అత్యంత తక్కువ ధరలోనే తీసుకువస్తామంటున్నారు.