కిరణ్‌ను దోషిగా నిలబెడుతున్న స్థానికఎన్నికలు?
posted on Oct 31, 2012 8:06AM
కిందిస్థాయి నుంచి కేడర్‌ను నియమించాలంటే కార్యకర్తలు ద్వితీయశ్రేణికి ఎదగాలి. ద్వితీయశ్రేణి నాయకులు ప్రథమశ్రేణివారితో పోటీపడాలి. ఏ రాజకీయపార్టీ రాణించాలన్నా ఇదే సూత్రం వర్తిస్తుంది. అటువంటిది కాంగ్రెస్ పార్టీ ఈ సూత్రాన్ని తప్పించింది. తన కార్యకర్త మనస్సును గెలుచుకునే స్థానిక ఎన్నికలను గాలికి వదిలేసింది. దీనికి కారణమేమిటని పరిశీలిస్తే సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వైఖరి అంటూ కాంగ్రెస్‌లోని సీనియర్లు నుంచి కార్యకర్తల వరకూ అందరూ వేలెత్తి చూపుతున్నారు. నిన్నటిదాకా కేంద్ర మంత్రి పదవుల పంపకం గురించి అధిష్టానం అనుమతి ఇవ్వలేదని సిఎం దాటవేశారు. అయితే ప్రతీ చోట మాత్రం ఒక్కనెలలో స్థానికఎన్నికలు వచ్చేస్తాయని ఊరించారు. అలా నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఎవరైనా ప్రశ్నిస్తే ఒక్కనెలలోనే బ్రదర్ అని సిఎం సమాధానమిస్తారట. ఎంతకాలం ఈ ఒక్కనెల అన్న మాట వినాలని కాంగ్రెస్ కేడర్ నిరాశను వ్యక్తం చేస్తోంది. తనపై నిరసన వ్యక్తమవుతోందని తెలిసినా సిఎం అధిష్టానాన్ని ఎందుకు స్థానిక ఎన్నికల గురించి నిలదీయలేకపోయారు? పైగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ కార్పొరేషను, పంచాయతీల ఎన్నికలు జరగక అభివృద్థికి దూరమయ్యామని నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆఖరికి 11ఫైనాన్స్ నిధులు ఆపేస్తున్నామని కేంద్ర మంత్రి కిశోర్‌చంద్రదేవ్ ప్రకటించినా సిఎం ఒక ప్రేక్షకునిలా చూస్తుండిపోయారని ఆందోళనల మాటేమిటీ? ఎక్కడ సిఎం పర్యటన జరిగినా పంచాయతీలు, కార్పొరేషన్లు, మున్సిపాల్టీల ఎన్నికల గురించే అడుగుతున్నా కేంద్రాన్ని ఒప్పించుకోలేని అసమర్ధతను సిఎం ఎందుకు ప్రదర్శిస్తున్నారు. ఏమైనా సిఎం కిరణ్ తన వైఖరి మార్చుకోకపోతే దోషిగా స్థానిక ఎన్నికలు నిలబెడుతున్నాయన్నది అక్షరసత్యమవుతోంది. ఆయన సన్నిహితులు హెచ్చరిస్తున్నా తన నెమ్మదైన వైఖరిని సిఎం కొనసాగిస్తే ఇదొక్కటిచాలు ఆయన పదవికి ఎసరు పెట్టడానికి అని రాజకీయవిశ్లేషకులు తేల్చేస్తున్నారు.