వర్గాలవారిగా పదవుల పంపకం
posted on Oct 28, 2012 @ 4:13PM
కేంద్రంలో సంకీర్ణం నుండి మమతా బెనర్జీ పార్టీ అయిన టియంసి వైదోలగటం,ఎన్ సిపి, సమాజ్ వాది పార్టీలు బయటనుండే మద్దతు ప్రకటిస్తామనటంతో ఈ సారి రాష్ట్రంలోని ఎక్కువ మంది ఎంపీలకు కేంద్రమంత్రులయ్యే అవకాశం వచ్చిందని సీనియర్లు అంటున్నారు. లేకపోతే 33 మంది ఎంపిలున్నప్పటికీ కేంద్రం ఎప్పుడూ అంత అవకాశాలు ఇవ్వలేదని, అలాగే ఈసారి వర్గాలవారిగా పదవుల పంపకం జరిగిందనే రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఉత్తర కోస్తాలో జగన్ కు చెందిన వైసిపి పార్టీని, తెలుగుదేశం బిసిలకు ఇస్తున్న ప్రాధాన్యలను దష్టిలో పెట్టుకొనే కిల్లి కృపారాణి మంత్రిపదవి ఇచ్చారని, అలాగే తెలుగుదేశానికి మాదిగలు దగ్గరవుతున్నారని సర్వే సత్యన్నారాయణకు చోటు కల్పించారని నాయకులు చెబుతున్నారు. రాయలసీమలో జగన్ ని కట్టడి చేసి రెడ్లను దూరం చేసుకోకూడదనే కోట్ల సూర్య ప్రకాశ్ కు స్ధానం కల్పించారు. కాపులను నిర్లక్ష్యం చేయట్లేదనటానికి చిరంజీవికి, ఎస్టీలకు చెందిన వారిని దగ్గరకు చేసుకుంటానికి బలరాం నాయక్ కు మంత్రి పదవులను కట్టబెట్టారంటున్నారు.
అయితే వీరంతా సభలు సమావేశాలు ఏర్పాటు చేస్తే పట్టుమని వంద మందిని కూడా సభలకు తరలించే సత్తా ఉన్నవారు కాదని పార్టీ వర్గాల వారే బాహాటంగా విమర్శిస్తున్నారు. దీంతో పదవులు దక్కించుకున్నందుకు సంతోషంతో ఉన్నా రానున్న ఎన్నికల్లో ఇంత బలహీనమైన మంత్రులతో రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రాగలమా అని కాంగ్రెస్ వర్గీయులు మల్లగుల్లాలు పడుతున్నారు.