Read more!

తెరాస పోయి భారాస వచ్చే..!

ఐదు దశాబ్దాల తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేసిన ఉద్యమ పార్టీ  తెలంగాణ రాష్ట్ర సమితి చరిత్రలో కలిసి పోయింది. ఆ పార్టీ స్థానంలో భారత రాష్ట్ర సమితి వచ్చింది. నాడు తెరాస కైనా.. ఇప్పుడు దాని స్థానంలో కొత్తగా వచ్చిన భారాస కైనా కర్త, కర్మ, క్రియ అన్నీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆరే. ఇప్పుడు తెరాసను చరిత్ర గర్భంలో కలిపేసి భారాసను తెరమీదకు తీసుకురావడం వల్ల కొత్తగా ఇప్పటికిప్పుడు జరిగే మార్పు ఏమిటి అన్న ప్రశ్నకు ఏమీ లేదనే జవాబే వస్తోంది.

శుక్రవారం బీఆర్ఎస్ ఆవిర్భావం వల్ల జరిగిందేమైనా ఉందంటే అది టీఆర్ఎస్ అంతర్ధానం అవ్వడం మాత్రమే. ఈ ఆవిర్భావ మహోత్సవానికి కూడా కేసీఆర్ పెద్దగా ప్రిపరేషన్ లేమీ చేసినట్లు లేదు. ఘనంగా జరిగిన ఈ ఆవిర్భావ సభలో ఆయన ఈ సారి వచ్చేది రైతు  ప్రభుత్వమే అన్న నినాదం ఇవ్వడం వినా కొత్తగా చెప్పిందేమీ లేదు. అలాగే క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపడానికి ఢిల్లీ ఎర్రకోటపై గులాబీ జెండా ఎగురుతుందన్న ధీమా వ్యక్తం చేశారు. అంతే అంతకు మించి ఏమీ లేదు. కనీసం కొత్త జాతీయ పార్టీ జెండా రూపకల్పన కూడా చేసినట్లు కనిపించదు. పాత తెరాస జెండానే తెలంగాణ స్థానంలో భారత దేశం మ్యాప్ పెట్టి టీఆర్ఎస్ అన్న అక్షరాల స్థానంలో బీఆర్ఎస్ అని రాయించేశారు. ఫ్లెక్సీలు, బ్యానర్ల విషయంలో కూడా అంతే మమ అనిపించేశారు.

 ఇక పార్టీ విధానాల రూపకల్పన ఇంకా చేయలేదు. ఇక వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పోటీ చేయబోయేది లేదన్న మాట స్వయంగా కేసీఆర్ నోటి వెంటే రావడంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకూ టీఆర్ఎస్ కాదు కాదు బీఆర్ఎస్ జాతీయ రాజకీయాలలో పోషించబోయే పాత్ర శూన్యం అని తేలిపోయింది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో జేడీఎస్ తరఫున ప్రచారం బీఆర్ఎస్ ప్రచారం చేస్తుందని మాత్రం చెప్పారు.  కర్నటక అసెంబ్లీకి  వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఎన్నికలుజరుగుతాయి. అక్కడ బీజేపీ, కాంగ్రెస్ తో పాటు జేడీఎస్ కూడా పోటీ చేస్తుంది. ఆ ఎన్నికలలో సాటి ప్రాంతీయ పార్టీకి కేసీఆర్ ప్రచార సహకారం అందింస్తారన్న మాట. బీఆర్ఎస్ ఆవిర్భావం సందర్బంగా జాతీయ రాజకీయాలకు సంబంధించి తమకొత్త పార్టీ పాత్ర ఏమిటన్నది ఈ ఒక్కముక్కతో తేల్చేశారు.

పైగా జేడీఎస్ కు కేసీఆర్ సహకారం అందించడమన్నది కొత్త విషయమేమీ కాదు. కేసీఆర్ జాతీయ రాజకీయాలంటూ పయనం మొదలు పెట్టినప్పటి నుంచీ కారణాలేమైతేనేం జేడీఎస్ నాయకుడు, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆయనతో అడుగులు  వేస్తూనే ఉన్నారు. బీఆర్ఎస్ ప్రకటన చేసినప్పుడూ కుమారస్వామి ఉన్నారు. తాము ఆయనతోనే నడుస్తామని ప్రకటించారు. ఇప్పుడుఈ ఆవిర్బావ సందర్భంగానూ ఆయన హాజరయ్యారు. సో.. కొత్తగా బీఆర్ఎస్ తో కలిసి అడుగులు వేసేవారెవరూ ఇప్పటికిప్పుడు కేసీఆర్ తో లేరనే చెప్పాలి. అన్నిటికీ మించి బీఆర్ఎస్ ఆవిర్భావం అనంతరం రాష్ట్రం బయట జరిగే జరిగే తొలి ఎన్నికలోనే పోటీకి వెనకడుగు వేయడమేమిటని ఇప్పటికే పార్టీ శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరో  వారం రోజుల్లో ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభిస్తామని చెప్పిన కేసీఆర్.. హస్తిన వేదికగా చురుకుగా రాజకీయ కార్యకలాపాలు ఎప్పటి నుంచి ప్రారంభిస్తారన్న విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.  మొత్తంగా బీఆర్ఎస్ ఆవిర్బావ సభ కేవలం ఒక నామకరణ మహోత్సవంగా మాత్రమే సాగింది. తెరాస బదులు భారసా అన్నపేరు మాత్రమే మారింది. అంతకు మించి బ్రహ్మాండం ఏమీ బద్దలు కాలేదు. బీఆర్ఎస్ జాతీయ పార్టీ అని పాత తెరాస శ్రేణులు మాత్రమే భావిస్తున్నాయా అనిపించేలా కార్యక్రమం సాగింది.