Read more!

బీజేపీ మడిబట్ట పక్కన పడేసిందా?

రాజకీయాలలో ఏదైనా జరుగుతుంది. శత్రువులు మితరులు అవుతారు. మిత్రులు శత్రువులు అవుతారు. సిద్ధాంతాలంటూ ఏమీ ఉండవు. అధికారమే అన్ని పార్టీల సిద్ధాంతం. అయితే ఈ అన్ని ఉపమానాలకూ రెండు పార్టీలు మినహాయింపు అన్న భావన ఇప్పటి వరకూ దేశంలో బలంగా ఉంది. ఆ రెండు పార్టీలూ ఏవంటే ఒకటి కమ్యూనిస్టు పార్టీలు( వాపమపక్ష పార్టీలు). వేర్వేరు పార్టీలైనా సైద్ధాంతికంగా పెద్దగా తేడాలేని ఉభయ కమ్యూనిస్టు పార్టీలనూ ప్రజలు ఒకే గాటిన ఎప్పుడో కట్టేశారు.

వేర్వేరు పార్టీలు అయినా అవి రెండూ ఎప్పుడూ ఒకే కూటమిలో ఉంటాయి. రాజకీయంగా ఒకదానికొకటి సహకరించుకుంటాయి. ఇక రెండో పార్టీ బీజేపీ. పరిశీలకులైనా, రాజకీయ విశ్లేషకులైనా కూడా సిద్ధాంత పరంగా నిలబడి, క్రమశిక్షణ ఉన్న క్యాడర్ ఉన్న పార్టీలుగా ఆ రెండు పార్టీలనే చెబుతు ఉంటారు. అయితే దేశ వ్యాప్తంగా పట్టు కోల్పోయి.. చాలా రాష్ట్రాలలో ఉనికి మాత్రంగా  మిగిలిన వామపక్షాలను పక్కన పెడితే బీజేపీ మాత్రం తన బలాన్ని పెంచుకుంటూ వస్తోంది. ఆ పెంచుకునే క్రమంలో ఆ పార్టీ అనుసరిస్తున్న వ్యూహాలూ ఎలా ఉన్నా.. ఒక్కప్పుడు దేశం మొత్తంలో కేవలం రెండు ఎంపీ సీట్లకు మాత్రమే పరిమితమైన బీజేపీ ఇప్పుడు దేశంలో అధికార పగ్గాలను అందుకునే స్థాయికి చేరుకుంది. అంతే కాకుండా అత్యధిక రాష్ట్రాలలో  బీజేపీ ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయి.  

అయితే ఈ క్రమంలో బీజేపీ తన సొంత రంగు, రుచి, వాసన కోల్పోయిందన్న విమర్శలను కూడా ఎదుర్కొంటోంది. గత కొన్నేళ్ల వరకూ అంటరాని పార్టీగా దేశంలోని మెజారిటీ పార్టీలు బీజేపీని పరిగణించేవి. అయితే వాజ్ పేయి హయాంలో బీజేపీపై ఆ ముద్ర చెరిగిపోయింది. రైటిస్టులలో లెఫ్టిస్టుగా అందరి మన్ననలూ, గౌరవాన్నీ పొందిన వాజ్ పేయి అన్ని వర్గాలనూ కలుపుకుని సంకీర్ణ ధర్మాన్ని పాటించడం ద్వారా అందరి మన్ననలూ అందుకున్నారు.  బీజేపీకి ఉందని పరిశీలకులు చెప్పే ప్రత్యేకత, విశిష్టత, ఇతర పార్టీల నుంచి వేరు చేస్తూ వచ్చిన గుర్తింపు అన్నీ కూడా వాజ్ పేయి, అద్వానీ వంటి నేతలతోనే పోయింది. ఇప్పుడు ఉన్న నాయకత్వం మౌలిక సిద్ధాంతాల మడిబట్టను పక్కన పడేసింది. ఒక్క ఓటు ఒకే ఒక్క ఓటుతో ప్రభుత్వం కూలిపోయినా పట్టించుకోకుండా సిద్ధాంతాలకు కట్టుబడిన వాజ్ పేయి ఎక్కడా.. అసెంబ్లీలో మెజారిటీ లేకపోయినా ప్రభుత్వ ఏర్పాటుకు ఆపరేషన్ కమల్ ను యథేచ్ఛగా ప్రయోగిస్తున్న మోడీ  ఎక్కడా అంటూ పార్టీలో నాటి.. నేటి తేడాను పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీజేపీ సిద్ధాంతాలకు పక్కన పెట్టి మరీ అధికారం కోసం వెంపర్లాడుతున్న తీరు.. మిగిలిన పార్టీలకు బీజేపీకీ ఇంత కాలం ఉన్న భిన్నత్వాన్ని మాయం చేసింది.

ఇక బీజేపీకి ఇంత కాలం మెంటార్ గా ఉన్న ఆర్ఎస్ఎస్ కూడా తన ప్రాభవాన్ని కోల్పోయిందనే చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కు కూడా బీజేపీయే మెంటార్ గా వ్యవహరిస్తోందా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే నాగపూర్ తో బలమైన సంబంధాలు, అనుబంధం ఉన్న నితిన్ గడ్కరీని బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి తొలగించినా ఆర్ఎస్ఎస్ నుంచి స్పందన లేదు. దీనిని బట్టే మోడీ, షా ద్వయం ఆర్ఎస్ఎస్ ను ఎంతగా ప్రభావితం చేస్తున్నారో చెప్పవచ్చు. రాజకీయ పార్టీగా బీజేపీయే కాదు.. సంఘ్ కూడా బీజేపీ రాజకీయ వ్యూహాలకు అనుగుణంగానే అడుగులు వేస్తున్న పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. సంఘ్ ను నియంత్రించడంలో సక్సెస్ అయిన తరువాత మోడీ, షా ద్వయం బీజేపీ విస్తరణ విషయంలో ఇక ఎలాంటి నైతికతనూ పట్టించుకోకుండా దూసుకు వెళుతోంది.

బలం లేని రాష్ట్రాలలో బలంగా ఉన్న పార్టీలను బలహీనం చేయడం ద్వారా తాను బలోపేతమయ్యే ‘ఆకర్ష్’ వ్యూహాలను అమలు చేస్తూ దూసుకుపోతోంది. హిమాచల్ లో సంపూర్ణ మెజారిటీ సాధించినా కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి నానా కష్టాలూ పడుతున్న పరిస్థితే ఇందుకు తాజా ఉదాహరణ. షిండే ప్రయోగం ద్వారా మహారాష్ట్రలో అధికారంలో ఉన్న సంకీరణ ప్రభుత్వాన్ని కూలదోసి.. శివసేన చీలిక వర్గంతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కూడా బీజేపీ ఆధునిక పోకడలకు అద్దంపట్టేదిగానే ఉంది. దేశంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాల ఏర్పాటు నినాదంతో ఇతర పార్టీలలోని నాయకులను ఆకర్షించి అడ్డదారిలో అధికారాన్ని చేజిక్కించుకోవడం ద్వారా బీజేపీ గతంలో ఏ విషయంలో అయితే కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించిందో.. ఇప్పుడు దేశాన్ని కాంగ్రెస్ ముక్త భారత్ చేయాలన్న లక్ష్యంతో ఆ కాంగ్రెస్ గతంలో అనుసరించిన విధానాలనే ఇప్పుడు తాను అమలు చేస్తోంది.

 ఇప్పటికే తెలంగాణలో అధికారానికి దగ్గర దారిగా రాష్ట్రంలో బలంగా ఉన్న తెరాస నుంచి నాయకులను, ఎమ్మెల్యేలనూ ఆకర్షించడంలో కొంత వరకూ సక్సెస్ అయిన బీజేపీ తనకు ఇసుమంతైనా బలం లేని మునుగోడు, దుబ్బాక, హుజూరాబాద్ వంటి నియోజకవర్గాలలో పాగా వేసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయానికి రాష్ట్రంలో అధికార పగ్గాలను అందుకునే దూకుడుతో ముందుకు వెళుతోంది.