మిత్రపక్షమా..ప్రతిపక్షమా?
posted on Nov 6, 2015 @ 10:49AM
ప్రస్తుతం ఏపీలో తెదేపా-బీజేపీ నేతల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం ద్వారా బీజేపీ నేత సోము వీర్రాజు రాష్ట్ర ప్రజల దృష్టిని అలాగే తన అధిష్టానం దృష్టిని బాగానే ఆకర్షించగలుగుతున్నారు. బహుశః అదే ఉద్దేశ్యంతోనే ఆయన తెదేపా మిత్రపక్షమని చూడకుండా చాలా తీవ్ర విమర్శలు చేస్తున్నట్లున్నారు. ఒకవేళ సోము వీర్రాజు ఆరోపిస్తున్నట్లు తెదేపా తప్పులు చేస్తున్నట్లయితే తెదేపా ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న ఇద్దరు బీజేపీ నేతలు డా. కామినేని శ్రీనివాస్ మరియు పి.మాణిక్యాల రావు కూడా ప్రభుత్వ తీరును తప్పు పట్టి ఉండాలి లేదా ప్రభుత్వం నుంచి తప్పుకొని ఉండాలి కానీ వాళ్ళిద్దరూ ఏపీ ప్రభుత్వంపై ఎటువంటి విమర్శలు చేయడం లేదు. ఈ సందర్భంగా తెదేపా నేత బుద్దా వెంకన్న సోము వీర్రాజుపై చేసిన విమర్శలను గమనించవలసి ఉంటుంది. మంత్రి పదవి ఆశించిన సోము వీర్రాజు అది దక్కకపోవడం చేతనే ఈవిధంగా తమ ప్రభుత్వంపై అక్కసు వెళ్ళగ్రక్కుతున్నారని బుద్దా వెంకన్న ఆరోపించారు.
రాష్ట్రంలో తెదేపా-బీజేపీల ప్రభుత్వం ఏర్పడేవరకు కూడా అసలు సోము వీర్రాజు పేరు పెద్దగా వినబడలేదు. బీజేపీలో చేరిన పురందేశ్వరి, కావూరి సాంభశివరావు, కన్నా లక్ష్మినారాయణ ముగ్గురూ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగారు కనుక వారి పేర్లు, మొహాలు అందరికీ సుపరిచితం. కానీ వారిలో కావూరి, కన్నా బీజేపీలో చేరి సుమారు ఏడాది కావస్తున్నా ఇంతవరకు ఎన్నడూ తేదేపాకు వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు లేవు. వారిరువురూ కనీసం రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడానికి ప్రయత్నించినట్లు దాఖలాలు కూడా లేవు. వారిరువురూ బీజేపీలో చేరక మునుపు తెదేపాలోకి రావాలనుకొన్నారు కానీ స్థానిక తెదేపా నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో బీజేపీలో చేరారు. బహుశః తెదేపాలో చేరేందుకు ఇంకా అవకాశం ఉందేమోననే ఆలోచనతోనే ఇంతకాలం వారిరువురు తొందరపడి నోరు జారకుండా జాగ్రత్త పడినట్లున్నారు. కానీ ఆ అవకాశం లేదని నిర్ధారించుకొన్న తరువాత సోము వీర్రాజుతో కలిసి తెదేపాకు వ్యతిరేకంగా కోరస్ పాడటం మొదలుపెట్టినట్లున్నారు.
పురందేశ్వరి స్వర్గీయ ఎన్టీఆర్ కుమార్తె అయినప్పటికీ ఆమె మొదటి నుంచి తెదేపాకు దూరంగా ఉంటూ దానిని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. కనుక ఆమె బీజేపీలో చేరిన తరువాత కూడా అదే ధోరణిలో సాగిపోతున్నారు. అయితే ఈ నలుగురు బీజేపీ నేతలు రాష్ట్రంలో తమ ఉనికిని చాటుకొనేందుకు, రాష్ట్ర ప్రజల, తమ అధిష్టానం దృష్టిని ఆకర్షించేందుకు చేస్తున్న వేర్వేరు వ్యక్తిగత, రాజకీయ కారణాలతో చేస్తున్న ఈ ప్రయత్నాల వలన రెండు పార్టీలకు ఇబ్బందికర పరిస్థితులను చేజేతులా సృష్టించుకొని, నష్టం కలిగిస్తున్నారని చెప్పకతప్పదు.
“ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఉన్న ఏ అవకాశాన్ని కూడా తను వదులుకోనని” సోము వీర్రాజు చెప్పడం హర్షించదగ్గదే. దానిని ఎవరూ కూడా తప్పు పట్టలేరు. కానీ అందుకోసం అవసరమయిన ఎటువంటి పార్టీ కార్యక్రమాలు చేపట్టకుండా, మిత్రపక్షమయిన తెదేపా మీద, తెదేపా ప్రభుత్వం మీద యుద్ధం చేయడం ద్వారా బీజేపీ బలపడుతుందని భావించడం అవివేకమే అవుతుంది. అటువంటి ఆలోచనలు ప్రతిపక్ష పార్టీలయిన కాంగ్రెస్, వైకాపాలు చేస్తుంటే అర్ధం చేసుకోవచ్చును కానీ తెదేపాకు మిత్రపక్షంగా ఉంటూ, రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ దానిపై కత్తులు దూస్తుంటే, వారి ధోరణిని తప్పుపట్టక తప్పదు, అనుమానించక తప్పదు.
వారు చేస్తున్న ఈ యుద్ధం, ప్రభుత్వంపై గుప్పిస్తున్న విమర్శల వలన కేంద్రప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. అలాగే కేంద్రరాష్ట్ర సంబంధాలు, తెదేపా-బీజేపీల సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ప్రతిపక్షాలకు కూడా తమను విమర్శించే అవకాశం స్వయంగా కల్పిస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ నేతలు తమ పార్టీని బలపరుచుకోవాలనుకొంటే అందుకు తగ్గట్లుగా తమ కార్యక్రమాలు రూపొందించుకోవడం మంచిది. కానీ ఆ పని చేయకుండా తెదేపాను, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ దానితో యుద్ధం చేస్తుంటే పుణ్యకాలం కాస్త పూర్తయిపోతుంది.