బిహార్ ఎన్నికలు నేర్పుతున్న గుణపాఠం ఏమిటంటే...
posted on Nov 10, 2015 9:28AM
దేశ ప్రజలపై ప్రధాని నరేంద్ర మోడి ప్రభావాన్ని, ప్రజలలో ఆయనకున్న పాపులారిటీని ఉపయోగించుకొని బిహార్ ఎన్నికలలో విజయం సాధించాలని బీజేపీ ప్రయత్నించడమే ఒక పెద్ద పొరపాటని ఇప్పుడు స్పష్టం అవుతోంది. ఒకవేళ ఈ ఎన్నికలలో బీజేపీ ‘మోడీ-కార్డు’ వాడకుండా రాష్ట్ర బీజేపీ నేతల స్వశక్తితో పోరాడి ఓడిపోయినా ఎటువంటి నష్టమూ జరిగి ఉండేది కాదు. కానీ మోడీని ‘పణంగా’ పెట్టి ఎన్నికలకు వెళ్లి ఓడిపోవడంతో బిహార్ లో బీజేపీ ఓటమిని మోడీ ఓటమిగా, మోడీకి వ్యతిరేకంగా యావత్ దేశ ప్రజలు ఇచ్చిన తీర్పుగా ప్రతిపక్షాలు అభివర్ణించడం మొదలుపెట్టాయి. కానీ అది నిజమయిన కారణం కాదని, కేవలం దేశ ప్రజలను తప్పుద్రోవ పట్టించేందుకే బీజేపీ వ్యతిరేక శక్తులు దీనిని మోడీ ఓటమిగా ప్రచారం చేస్తున్నాయని చెప్పవచ్చును.
ఈ బిహార్ ఎన్నికల ద్వారా మూడు విషయాలు తెలిసివచ్చేయి. 1. ప్రతీ ఎన్నికలలో మోడీని పణంగా పెట్టకూడదు. 2. రాష్ట్రాలలో బీజేపీ బలోపేతం చేసుకొని స్వశక్తితోనే ఎన్నికలను ఎదుర్కొనే శక్తి సంపాదించుకోవాలి. 3. ప్రాంతీయ పార్టీలను తక్కువ అంచనా వేయకూడదు.
వీటిలో 1వ పాయింటును వరంగల్ ఉప ఎన్నికలకి వర్తిస్తుంది. 2, 3 పాయింట్ల గురించి రెండు తెలుగు రాష్ట్రాలలో బీజేపీ నేతలు గట్టిగా ఆలోచించడం మంచిది. వచ్చే ఎన్నికల నాటికి రెండు రాష్ట్రాలలో బీజేపీ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దిశానిర్దేశం చేసి వెళ్ళారు. కానీ దాని కోసం ఆ పార్టీ నేతలు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్లు కనబడటం లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెదేపాకు మిత్రపక్షంగా ఉంటూ, ప్రభుత్వంలో భాగస్వామిగా కూడా ఉంటూ దానిపై కత్తులు దూస్తూ తమ అధిష్టానం వద్ద, ప్రజలలో గుర్తింపు పొందాలని ప్రయత్నిస్తున్నారు తప్ప రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకోవడానికి గట్టిగా ప్రయత్నాలు చేయడంలేదనే చెప్పాలి. ఒకవేళ వాళ్ళు ఇదే ధోరణిలో మిగిలిన మూడున్నరేళ్ళు కాలక్షేపం చేస్తూ, రాష్ట్రంలో మిత్రపక్షమయిన తెదేపాను కూడా దూరం చేసుకొన్నట్లయితే అప్పుడు ఎన్నికలలో మళ్ళీ మోడీని పణంగా పెట్టవలసి రావచ్చును... మళ్ళీ అప్పుడు కూడా ఇవే పరిస్థితులు పునరావృతం అయినా ఆశ్చర్యం లేదు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశంలో అన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ పాతుకుపోయుంది. అయినా దానిని కూడా ప్రజలు ఇప్పుడు పెద్దగా పట్టించుకోవడం లేదు. కారణం ప్రాంతీయ పార్టీల ప్రభావమే. అటువంటప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో కేవలం ఐదేళ్ళ సమయంలో ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా చాలా బలంగా ఉన్న తెదేపా, తెరాస, వైకాపాల వంటి ప్రాంతీయ పార్టీలను ఓడించి అధికారం చేజిక్కించుకోవడం సాధ్యమేనా? సాధ్యం కాదనుకొన్నట్లయితే రాష్ట్ర బీజేపీ నేతలు వాటితో వ్యవహరిస్తున్న తీరు సరయినదేనా? అని ఆలోచించుకోవడం మంచిది.