బిహారీ సెంటిమెంటుతోనే మహాకూటమి విజయం?
posted on Nov 8, 2015 @ 5:29PM
బిహార్ ఎన్నికలలో ప్రధాని నరేంద్ర మోడీ, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ల పరిపాలన ప్రధాన అజెండాగా నిలిచిందని అందరికీ తెలుసు. అందుకే పోటీ వారిద్దరి మధ్యే అన్నట్లు అందరూ భావించారు. ఆ పోటీలో నితీష్ కుమార్ విజయం సాధించారు. కొద్ది సేపటి క్రితం నితీష్ కుమార్-లాలూ ప్రసాద్ యాదవ్ కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో నితీష్ కుమార్ మాట్లాడుతూ ఈ ఎన్నికలు అహంభావానికి బీహార్ ఆత్మగౌరవానికి మధ్య జరిగినవని అందులో బిహారీ ప్రజల ఆత్మగౌరవం నెగ్గిందని చెప్పడం గమనార్హం.
కీలకమయిన మూడవ దశ ఎన్నికల ప్రచార సభలలో ప్రధాని నరేంద్ర మోడి నితీష్, లాలూ, కాంగ్రెస్ పార్టీలను కలిపి ‘త్రీ ఈడియేట్స్’ అనడం బిహారీల మనసులను చాలా గాయపరిచి ఉండవచ్చును. “మోడీ-అమిత్ షాలిద్దరూ కూడా బాహరీ ఆద్మీ (బయటి వ్యక్తులు). వారు మనల్ని అవమానిస్తున్నారు...ఇది మన ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం," అని లాలూ-నితీష్ కుమార్ గట్టిగా ప్రచారంతో చేసి బిహారీలను తమవైపు తిప్పుకోగలిగారని భావించవచ్చును.
‘రాష్ట్రంలో బీజేపీ ఓడిపోతే పాకిస్తాన్ లో మిటాయిలు పంచుకొంటారని” బీజేపీ జాతీయ అద్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలు కూడా బిహార్ లోని ముస్లిం ప్రజల మనసులను గాయపరిచి ఉండవచ్చును. ఆకారణంగా వారు సెక్యులర్ ముద్ర కలిగి మహా కూటమితో కలిసి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి ఉండవచ్చును. లేకుంటే వారి ఓట్లు ఎన్డీయే కూటమికి పడకపోయినా వేరే ఇతర పార్టీలకి పడి ఉండేవేమో. అందుకే ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 40 స్థానాలకి పోటీ చేస్తే వాటిలో ఏకంగా 27స్థానాలలో విజయం సాధించగలిగిందని చెప్పవచ్చును.
ఇదివరకు ఎన్టీఆర్ కూడా తెలుగు ప్రజల ఆత్మగౌరవం కాపాడుకోవాలని పిలుపునిచ్చి ఎన్నికలలో విజయం సాధించారు. ఆ తరువాత తెలంగాణాలో ఎన్నికలు జరిగినప్పుడల్లా కేసీఆర్ తెలంగాణా సెంటిమెంటును తట్టిలేపి, తన ప్రత్యర్ధులపై విజయం సాధించేవారు. తెరాసకు బలమయిన రాజకీయ ప్రత్యర్ధి అయిన తెదేపాను అడ్డుకొనేందుకు కేసీఆర్ దానికి "ఆంధ్రా పార్"టీ అని ముద్రవేసి దానిపై పైచేయి సాధించేవారు. ఇప్పుడు బిహార్ ఎన్నికలలో లాలూ-నితీష్ కుమార్ తమ ప్రధాన ప్రత్యర్దులయిన మోడీ-అమిత్ షాలను 'బాహరీ ఆద్మీ" (బయట వ్యక్తులు) అని ప్రజల మనస్సులో నాటుకొనేలా ప్రచారం చేసారు. బయట నుంచి వచ్చిన వ్యక్తులు బిహారీలను “త్రీ ఈడియట్స్” అని అవమానించారని లాలూ ప్రసాద్ యాదవ్-నితీష్ కుమార్ ఇరువురూ గట్టిగా ప్రచారం చేసి వారిలో బిహారీ సెంటిమెంటుని తట్టిలేపి తమకు అనుకూలంగా మలుచుకోగలిగారు. వారి విజయానికి ఇంకా అనేక కారణాలు ఉండవచ్చును కానీ ఇది కూడా ఒక ప్రధాన కారణమేనని చెప్పవచ్చును. అందుకే ఈ ఎన్నికలు బీజేపీ అహంభావానికి బీహార్ ఆత్మగౌరవానికి మధ్య జరిగినవని, అందులో బిహారీ ప్రజల ఆత్మగౌరవం నెగ్గిందని నితీష్ కుమార్ చెప్పారని భావించాల్సిఉంటుంది.