రసవత్తరంగా సాగుతున్న బీహార్ రాజకీయాలు
posted on Sep 18, 2015 @ 10:28AM
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఆ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ ఎన్నికలలో వామపక్ష కూటమి, జనతా పరివార్, దానితో జత కట్టిన కాంగ్రెస్ పార్టీ, బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి, ములాయం సింగ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ, కొత్తగా హైదరాబాద్ కి చెందిన మజ్లీస్ పార్టీ పోటీ చేస్తున్నాయి. జనతా పరివార్ నుండి బయటకు వచ్చేసిన ములాయం సింగ్ ని బీజేపీ ఆకర్షించే ప్రయత్నాలు చేస్తుంటే, ఆయన ఎన్డీయే కూటమిలో సభ్యుడు ఉన్న మాజీ బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మంజీని తనవైపు ఆకర్షించేందుకు విఫల యత్నాలు చేసారు. అదే విధంగా బీహార్ ఎన్నికలలో మొట్టమొదటిసారిగా పోటీ చేస్తున్న మజ్లీస్ పార్టీని జనత పరివార్ లోకి ఆకర్షించేందుకు ఆ కూటమి నేత లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ములాయం సింగ్ కూడా మజ్లీస్ పార్టీతో పొత్తులు పెట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు.
అక్టోబర్ 12నుండి మొదలయ్యే బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్ధుల పేర్లను ఖరారు చేసుకొనే పనిలో పడ్డాయి. జనతా పరివార్ కూటమిలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్.జె.డి. అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ చెరో 100 సీట్లు పంచుకొని కాంగ్రెస్ పార్టీకి-40 సీట్లు కేటాయించారు. కానీ ఇప్పుడు ఏ నియోజక వర్గంలో ఎవరు పోటీ చేయాలనే విషయంపై వారి మధ్య చర్చ జరుగుతోంది. మూడు పార్టీలు తమకు బాగా పట్టున్న నియోజకవర్గాలలో తమ పార్టీ అభ్యర్ధులను నిలబెట్టాలని భావిస్తాయి కనుక నియోజకవర్గాల పంపకాల విషయం కూడా మూడు పార్టీలు మధ్య అభిప్రాయభేదాలు ఉత్పన్నం అయ్యే అవకాశం ఉందని భావించవచ్చును. ఎందుకంటే ఈ ఎన్నికలలో నితీష్ కుమార్ ని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించినందున ఆయన తమ పార్టీ పోటీ చేస్తున్న 100 సీట్లలో అత్యధికంగా గెలిచేందుకు అనువయిన నియోజక వర్గాల కోసం పట్టుబట్టవచ్చును. ఒకవేళ తన పార్టీకి తక్కువ సీట్లు వచ్చి, లాలూ నేతృత్వం వహిస్తున్న ఆర్.జె.డి.కి ఎక్కువ సీట్లు వచ్చినట్లయితే అప్పుడు లాలూ చెప్పినట్లు ఆడవలసి వస్తుంది. అదేవిధంగా లాలూ కూడా తనకి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని తేలిపోయింది కనుక ఈ ఎన్నికలలో వీలయినన్ని ఎక్కువ సీట్లు గెలుచుకొని ప్రభుత్వంపై పెత్తనం చేలాయించాలని అనుకొంటున్నారు కనుక తన పార్టీకి అనుకూలమయిన నియోజకవర్గాల కోసం పట్టుబట్టవచ్చును. కనుక ఈ ఆఖరి గండం కూడా గట్టెక్కగలిగితేనే జనతా పరివార్ మనుగడ సాగించగలదు. లేకుంటే ఎన్నికలకు ముందే విచ్చినం కాక తప్పదు. అదే జరిగితే ఇక బీజేపీ సగం విజయం సాధించినట్లే భావించవచ్చును.
ఎన్డీయే కూటమిలో బీజేపీయే అత్యధికంగా 160 సీట్లు ఉంచుకొంది కనుక దానికి ఇటువంటి సమస్య ఉండబోదు. ఈసారి వామపక్షాలు కూటమిగా ఏర్పడి ఎన్నికలలో పోటీ చేస్తున్నప్పటికీ అవి ఎన్నికలను తీవ్రంగా ప్రభావితం చేసే కుల,మత, రాజకీయ సమీకరణాలను అధిగమించి అధికారం చేజ్జించుకోవడం అసాధ్యమేనని చెప్పవచ్చును. సమాజ్ వాదీ, మజ్లీస్ పార్టీలను తక్కువ అంచనా వేయలేము. మజ్లీస్ పార్టీ రాష్ట్రంలోని ముస్లిం ఓటు బ్యాంక్ పైనే ఆధారపడి 25స్థానాలకు పోటీచేస్తోంది. కనుక ఈసారి ముస్లింల ఓట్లలో మరింత చీలవచ్చును. వారి ఓటు బ్యాంకుపై ఆధారపడిన జనత పరివార్, కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలకు తీవ్ర నష్టం జరుగవచ్చును. అదేవిధంగా మజ్లీస్, సమాజ్ వాదీ పార్టీల వలన జనతా పరివార్ కి ఎక్కువ నష్టం జరుగవచ్చును. కనుక ఈసారి ఎన్నికలు చాలా రసవత్తరంగా సాగవచ్చును. ఒకవేళ బీహార్ ప్రజల ఓట్లు ఈ పార్టీలు, కూటముల మధ్య చీలిపోయినట్లయితే హంగ్ అసెంబ్లీ ఏర్పడవచ్చును. అదే జరిగితే ఇప్పటికే భ్రష్టు పట్టిపోయిన బీహార్ రాజకీయాలు మరింత దిగజారే ప్రమాదం ఉంది.