రసవత్తరంగా మారుతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలు
posted on Sep 13, 2015 @ 11:09AM
వచ్చే నెల నుండి ఐదు దశలలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో జనతా పరివార్, ఎన్డీయే, వామపక్ష కూటములు పోటీ చేస్తున్నాయి. అవిగాక జనతా పరివార్ తో కలిసి కాంగ్రెస్ పార్టీ, జనతా పరివార్ నుండి విడిపోయి సమాజ్ వాదీ పార్టీలు కూడా పోటీ చేస్తున్నాయి. ఇవేగాక చాలా మంది స్వతంత్ర అభ్యర్ధులు పోటీలో ఉంటారు. బీహార్ ఎన్నికలలో మజ్లీస్ పార్టీ కూడా 40 స్థానాలకు పోటీ చేయబోతున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు.
బీహార్ ఎన్నికలలో మజ్లీస్ పార్టీ ప్రవేశం వలన ముస్లిం ఓట్లపై ఆధారపడే కాంగ్రెస్, జనతా పరివార్, సమాజ్ వాదీ పార్టీలు తీవ్రంగా నష్ట పోవచ్చును. ముస్లింలు అధికంగా ఉన్న నియోజక వర్గాలలో ముస్లిం అభ్యర్ధులనే పోటీలో నిలబెట్టినప్పటికీ, మజ్లీస్ పార్టీ నూటికి నూరు పాళ్ళు ముస్లింల పార్టీ కనుక ముస్లిం ప్రజలు మజ్లీస్ పార్టీ వైపే మ్రోగ్గు చూపే అవకాశం ఉంది.
అలాగని మజ్లీస్ పార్టీతో జనతా పరివార్ పొత్తులు పెట్టుకోలేదు. ఎందుకంటే అందుకోసం తమ సీట్లలో దానికి కూడా వాటా పంచి ఇవ్వవలసి వస్తుంది. ఈ ఎన్నికలలో గెలిచి మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలని తహతహలాడుతున్న నితీష్ కుమార్ తన ప్రభుత్వం సుస్థిరంగా సాగాలంటే తనంతట తాను కనీసం 75-100 సీట్లు గెలుచుకోవడం చాలా అవసరం. అప్పుడే లాలూ ప్రసాద్, కాంగ్రెస్ పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చును. కనుక ఆయన తన పార్టీ కోసం అట్టేబెట్టుకొన్న 100 సీట్లలో మజ్లీస్ పార్టీకి పంచి ఇవ్వలేరు.
అలాగే లాలూ ప్రసాద్ యాదవ్ కూడా తను ముఖ్యమంత్రి కాలేకపోయినప్పటికీ వెనుక సీటులో కూర్చొని ప్రభుత్వాన్ని నడిపించాలని ఉవ్విళ్లూరుతున్నారు. కనుక తను అట్టే బెట్టుకొన్న 100 సీట్లలో కనీసం 50-70 సీట్లయినా గెలుచుకోవలసి ఉంటుంది. కనుక లాలూ కూడా తన సీట్లలో మజ్లీస్ పార్టీకి వాటా పంచి ఇవ్వలేరు.
కనుక ఈ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేస్తున్న సమాజ్ వాదీ పార్టీతో పొత్తుల కోసం మజ్లీస్ పార్టీ ప్రయత్నించవచ్చును. బీజేపీ ఎన్నడూ ముస్లిం ఓటు బ్యాంకు మీద ఆధారపడదు కనుక మజ్లీస్ ప్రవేశం దానిపై పెద్దగా నేరుగా ప్రభావం చూపకపోవచ్చును. కానీ ఒకవేళ మజ్లీస్-సమాజ్ వాదీ పార్టీల మధ్య ఎన్నికల పొత్తులు లేదా స్నేహం కుదిరినట్లయితే బీజేపీ కూడా ఎంతో కొంత నష్టపోయే అవకాశం ఉంది. ఏవిధంగా అంటే బీజేపీ కూడా సమాజ్ వాదీ పార్టీతో పొత్తులు లేదా ఎన్నికల తరువాత మద్దతు కోసం ములాయం సింగ్ ని ద్రువ్వుతోంది.
ఒకవేళ ఆయన మజ్లీస్ పార్టీతో పొత్తులకి సిద్దపడినట్లయితే అప్పుడు ములాయం సింగ్ బీజేపీని దూరం పెట్టవచ్చును. మజ్లీస్-సమాజ్ వాదీ పార్టీలకి వామ పక్షాలు కూడా తోడయినట్లయితే బీహార్ ఎన్నికలు చాలా రసవత్తరంగా మారుతాయి. అప్పుడు మళ్ళీ బీజేపీ ఒక్కటీ ఒక్కవైపు, జనతా పరివార్+కాంగ్రెస్, వామపక్ష కూటమి+ సమాజ్ వాదీ పార్టీ+మజ్లీస్ మరో వైపు బరిలో నిలిచి పోటీపడవలసి ఉంటుంది.