బీహార్ రాజకీయాలలో ఊహించని పరిణామాలు
posted on Sep 8, 2015 8:37AM
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఆ రాష్ట్ర రాజకీయాలలో ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఈ ఎన్నికలను ఎదుర్కోవడానికే అధికార జెడియు, ప్రతిపక్ష ఆర్.జె.డి. సమాజ్ వాదీ పార్టీ తదితర ఆరు పార్టీలు కలిసి జనతా పరివార్ కూటమిని ఏర్పాటు చేసుకొన్నాయి. కానీ ఆ కూటమికి అధ్యక్షుడయిన ములాయం సింగ్ కి చెప్పకుండా నితీష్ కుమార్, లాలూ ఇద్దరూ కలిసి మొత్తం అన్ని సీట్లు పంచేసుకోవడంతో ఆయన ఆగ్రహం చెంది కూటమి నుండి తప్పుకొని ఒంటరి పోరుకి సిద్దం అయ్యారు. ఆయనని వెనక్కి రప్పించేందుకు నితీష్, లాలూ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇటువంటి పరిణామం వారికి ఎదురుదెబ్బే. కానీ అది వారి స్వయంకృతపరాధమే.
సరిగ్గా ఇటువంటి సమయంలోనే బీహార్ రాజకీయాలలో ఊహించని మరో పరిణామం ఏర్పడింది. ఇంతవరకు ఏదో ఒక ప్రధాన పార్టీ వెనుక తిరిగే వామపక్షాలన్నీ కలిసి వామపక్ష కూటమిని ఏర్పాటు చేసుకొని, బీహార్ ఎన్నికలలో జనత పరివార్, బీజేపీ, కాంగ్రెస్ తదితర ప్రత్యర్ధులను డ్డీ కొంటామని ప్రకటించాయి. ఈ వామపక్ష కూటమిలో సి.పి.ఐ., సి.పి.ఎం., సి.పి.ఐ.(ఎం.ఎల్.), ఎన్.యు.సి.ఐ., ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్, ఆర్.ఎస్.పి. భాగస్వాములుగా ఉంటాయి.
బీహార్ రాష్ట్రాన్ని ఇంతవరకు పరిపాలిస్తున్న భూస్వామ్య, కుల శక్తులను, రాష్ట్రంలోకి అడుగుపెట్టాలని చూస్తున్న బీజేపీని, కార్పోరేట్ శక్తులను ఎదుర్కొని బీహార్ రాష్ట్రంలో ప్రజాహిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వామపక్ష కూటమి నేతలు చెపుతున్నారు. బీహార్ రాజకీయాలలో ఇంతవరకు కుల సమీకరణలే నిర్ణయాత్మక శక్తిగా ఉంటూ వచ్చాయి. కానీ నక్సల్స్ పీడిత బీహార్ రాష్ట్రంలో వామపక్షాల ప్రభావం కూడా చాల అధికంగానే ఉంది. కానీ ఇంతవరకు వామపక్షాలు కూటమిగా ఏర్పడకపోవడంతో రాష్ట్ర రాజకీయాలలో వాటి ఉనికి పెద్దగా కనబడలేదు. రాజకీయాలపై ప్రభావం చూపలేకపోయాయి. అవిప్పుడు సంఘటిత శక్తిగా అవతరించడంతో జనతా పరివార్, బీజేపీలకు ఎన్నికలలో సవాలు చేస్తున్నాయి. కానీ కుల ప్రభావం చాలా అధికంగా ఉండే బీహార్ రాజకీయాలలో వామ పక్షాలు కూటమిగా ఏర్పడినప్పటికీ ఎన్నికలలో గెలిచి స్వయంగా అధికారం చేప్పట్టే అవకాశం లేదనే భావించవచ్చును. కానీ ఈసారి ఎన్నికలలో ఓట్లు చీల్చే అవకాశం ఉంది. కనుక ఇప్పుడు బీజేపీ, జనతా పరివార్, వాటితో జత కట్టిన కాంగ్రెస్, ఒంటరిగా బరిలోకి దిగుతున్న సమాజ్ వాదీ పార్టీల మధ్య ఓట్లు చీలిపోయినట్లయితే, ఈసారి బీహార్ రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడవచ్చును.
ఈ ఎన్నికలలో ఒకవేళ సమాజ్ వాదీ పార్టీ కనుక ఎక్కువ స్థానాలలో గెలవగలిగితే అదే ‘కింగ్ మేకర్’ అయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే ఆయన ఏ పార్టీ లేదా కూటమి వైపు మ్రోగ్గితే దానికే అధికారం దక్కవచ్చును. సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ బీజేపీతో రహస్య అవగాహన కుదుర్చుకొన్నందునే జనతా పరివార్ ని విచ్చినం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జై రామ్ రమేష్ ఆరోపించారు. ఒకవేళ జైరామ్ ఆరోపణలు నిజమనుకొంటే బీహార్ రాష్ట్రంలో బీజేపీ లేదా బీజేపీ మద్దతుతో సమాజ్ వాదీ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కానీ బీహార్ రాజకీయ పార్టీలన్నీ అవకాశవాద రాజకీయాలకు పెట్టింది పేరుగా ప్రసిద్ధి చెందాయి. కనుక ఏ క్షణంలో ఎవరు ఏ ఏ పార్టీతో ఉంటారో, ఎవరికి మద్దతు ఇస్తారో ఎవరూ ఊహించలేరు. కనుక అక్కడ ఎప్పుడూ ఏమయినా జరుగవచ్చును.