బీహార్ లో బీజేపీకే విజయావకాశాలు?
posted on Sep 9, 2015 @ 9:39PM
బీహార్ రాజకీయ పరిణామాలపై ఆమాద్మీ బహిష్కృత నేత యోగేంద్ర యాదవ్ చాలా చక్కగా విశ్లేషించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్.జెడి. అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ తదితరులు అందరూ కలిసి జనతా పరివార్ అనే కూటమిని ఏర్పాటు చేసుకోవడం ద్వారా వారు బీజేపీని చూసి భయపడుతున్నట్లు ప్రకటించుకొన్నట్లయిందని అన్నారు. ఆరు పార్టీల జనతా పరివార్ కూటమి, దానితో కలిసిన కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, బీజేపీ ఒక్కటే ఒకవైపు ఉండటంతో ఆ ఏడు పార్టీల కంటే బీజేపీయే చాలా బలమయిన పార్టీ అని, అది మాత్రమే రాష్ట్రంలో సుస్థిరమయిన పరిపాలన అందించగలదని లాలూ, నితీష్ స్వయంగా ప్రజలకి చాటి చెప్పుకొన్నట్లయిందని ఆయన అభిప్రాయపడ్డారు. జనతా పరివార్ ఏర్పాటు చేసుకోవడం వలన రాష్ట్ర ప్రజలలో ఇటువంటి భావన ఏర్పడేందుకు లాలూ, నితీష్ కుమార్ అవకాశం కల్పించారని ఆయన అన్నారు. ఈ కారణంగా కాంగ్రెస్ పార్టీ కూడా దెబ్బతినే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. బీహార్ రాష్ట్ర ప్రజలు బీజేపీకే అధికారం కట్టబెట్టే అవకాశం ఉందని అన్నారు.
యోగేంద్ర యాదవ్ విశ్లేషణ నూటికి నూరు పాళ్ళు నిజమని భావించవచ్చును. ఎందుకంటే, అధికారం కోసం అర్రులు చాచే నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ వంటివారందరూ ఒక్క కూటమిగా ఏర్పడినప్పుడే వారు ఎంత కాలం కలిసి పనిచేయగలరనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. జనతా పరివార్ లో ఆరు పార్టీలని జేర్పించడానికే వారు చాలా ప్రయాసపడవలసి వచ్చింది. ఆ తరువాత ముఖ్యమంత్రి అభ్యర్ధి, సీట్ల సర్దుబాట్లు వంటి అనేక అంశాల మీద వారి మధ్య తీవ్ర భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఒకసారి ఆ కూటమి నుండి నితీష్ కుమార్ తప్పుకొంటున్నట్లు ప్రకటిస్తే, ఇంకోసారి ములాయం సింగ్ తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. ఒకవేళ నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీలు వేర్వేరుగా పోటీ చేసి ఉండి ఉంటే ప్రజలకి వారి పార్టీలపై ఇంతకంటే ఎక్కువ విశ్వాసం ఏర్పడి ఉండేదేమో? కానీ కప్పల తక్కెడ వంటి జనతా పరివార్ లో ఏ పార్టీ ఎన్ని రోజులు ఉంటుందో ఎప్పుడు బయటకు దూకేస్తుందో ఎవరూ ఊహించలేరు.
ఈ జనతా కప్పల తక్కెడ నుండి మిగిలిన కప్పలు గెంతి బయటకు పోకుండా పట్టుకొని ఉంచడం కోసం వారిద్దరూ చాలా కష్ట పడవలసివస్తోంది. జనతా పరివార్ లో నెలకొన్న ఈ అనిశ్చిత పరిస్థితిని చూసి సహజంగానే ప్రజలు సుస్థిరమయిన పాలనను అందించగల బీజేపీవైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. అదీగాక కేంద్రంలో కూడా బీజేపీయే అధికారంలో ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ మధ్యనే బీహార్ రాష్ట్రానికి రూ.1.25లక్షల కోట్లు ఆర్ధిక ప్యాకేజీ కూడా ప్రకటించి ఉన్నారు. రాష్ట్రంలో బీజేపీకి అధికారం కట్టబెడితేనే ఆ మొత్తం మంజూరు అవుతుంది. లేకుంటే నిత్యం కేంద్రంతో పోట్లాడే నితీష్ కుమార్ చేతిలో అంత భారీ మొత్తం కేంద్రం పోస్తుందని ఆశించడం కష్టం. కనుక బీజేపీని గెలిపించడం వలననే బీహార్ రాష్ట్రానికి ఎక్కువ ప్రయోజనం చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఒకవేళ బీజీపీని కాదని అధికార దాహంతో అలమటించిపోతున్న లాలూ, నితీష్ కుమార్ కూటమికి ఓటు వేసినా వారిద్దరి గత చరిత్రలు చూసినట్లయితే సుస్థిరమయిన పరిపాలన అందించలేరని రుజువు చేసుకొన్నారు. ఒకవేళ ఎన్నికల వరకు జనతా పరివార్ విడిపోకుండా ఉండగలిగితే, ఎన్నికలలో గెలిచిన మరుక్షణం నుండి లాలూ, నితీష్ కుమార్ ముఖ్యమంత్రి కుర్చీ కోసం కొట్లాడుకోవచ్చును. ఒకవేళ ముఖ్యమంత్రి కుర్చీని నితీష్ కుమార్ కి వదిలిపెట్టినా లాలూ ప్రసాద్ వెనుక సీట్లో కూర్చొని నితీష్ ప్రభుత్వాన్ని డ్రైవ్ చేసే ప్రయత్నం చేయడం తధ్యం. అప్పుడు వారిద్దరి మధ్య గొడవలు మొదలయ్యి ప్రభుత్వం కూలిపోవచ్చును.
బీహార్ ప్రజలు ఇప్పటికే నితీష్, లాలూ పరిపాలనలను రుచి చూసి ఉన్నారు. వారిలో నితీష్ కుమార్ పరిపాలన మొదట్లో కొంచెం మెరుగుగా కనిపించినా తరువాత ఆయనలో కూడా అన్నీ లాలూ లక్షణాలే ప్రస్పుటంగా కనిపించడం మొదలుపెట్టాయి. ఈ అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి బీహార్ ప్రజలు ఎవరితోను పొత్తులు పెట్టుకోకుండా ఒంటరిగా బరిలో దిగుతున్న బీజేపీకే అధికారం కట్టబెట్టవచ్చును.