రాష్ట్ర విభజన నుండి నేర్చుకోవలసిన గుణపాఠం
posted on Mar 10, 2015 @ 8:14PM
రాష్ట్ర విభజన వల్ల ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందులలో చిక్కుకొంటే, తెలంగాణా రాష్ట్రం దేశంలో గుజరాత్ తరువాత రెండవ ధనిక రాష్ట్రంగా మారింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం, తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా దృవీకరించారు. ఆ ఆదాయంలో ప్రధానంగా హైదరాబాద్ మరియు దాని చుట్టుపక్కల నెలకొల్పబడిన వేలాది ఐటి మరియు ఇతర పరిశ్రమలు, వ్యాపార సంస్థల నుండే వస్తోందనే మాట కూడా అంతే యదార్ధం. అందుకే హైదరాబాద్ లేని తెలంగాణా మాకు అక్కరలేదని తెలంగాణావాదులు ఆనాడు పట్టుబట్టి మరీ సాధించుకొన్నారు. అదే వారికి నేడు అక్షయ పాత్రగా మారి ఆదుకొంటోందని చెప్పవచ్చును.
రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణా రాష్ట్రం ఆర్ధికంగా బలపడుతుందని తాను ఆనాడే చెప్పానని కేసీఆర్ అన్నారు. ఆయన నిజంగా ఆ మాట అని ఉండి ఉంటే అది ఆయన దూరదృష్టికి నిదర్శనమని ఒప్పుకోక తప్పదు. కానీ పదేళ్లుగా తెలంగాణా ఉద్యమాలు ఉదృతంగా సాగుతున్నప్పటికీ రాష్ట్రాన్ని పాలించిన మహామహులయిన ఆంద్ర పాలకులెవరూ కూడా ఏదో ఒకనాడు రాష్ట్రం విడిపోతుందని, అప్పుడు హైదరాబాద్ ని వదులుకొని చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఇలా నడిరోడ్డు మీద నిలబడే పరిస్థితి వస్తుందని ఊహించలేకపోవడమే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక పక్క రాష్ట్ర విభజన కోసం ఉద్యామాలు జరుగుతుండటం కళ్ళార చూస్తూ కూడా వారు మేల్కొనకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. కనీసం పదేళ్ళ క్రితం నుండయినా ఆంధ్రాలో అన్ని జిల్లాలకు అభివృద్ధిని వికేంద్రీకరించే ప్రయత్నాలు మొదలుపెట్టి ఉండి ఉంటే నేడు ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ పరిస్థితి దాపురించి ఉండేదికాదు. కానీ పాలకులకి ఆ దూరదృష్టి లేకపోవడం వలన రాష్ట్రంలో మిగిలిన అన్ని జిల్లాలను పూర్తిగా విస్మరించి ఒక్క హైదరాబాద్ నగరాన్నే అభివృద్ధి చేసుకొంటూపోయారు.
కనుక ఈ పరిస్థితులకి ఇప్పుడు వారినే నిందించక తప్పదు. కానీ ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకొని వారిని నిందిస్తూ బాధపడటం కంటే మళ్ళీ అటువంటి ఘోరమయిన తప్పిదం చేయకుండా రాష్ట్రంలో 13 జిల్లాలకు సమానంగా అభివృద్ధిని విస్తరించే ప్రయత్నాలు చేయాలి. ఒకవేళ పాలకులు ఈ విషయాన్ని మళ్ళీ విస్మరించినా సమాజంలో మేధావులు ఈ విషయాన్ని సదా వారికి గుర్తు చేస్తుండటం చాలా అవసరం.
అయితే ఈ చేదు అనుభవం నుండి నేర్చుకోవలసిన మరో గుణపాటం కూడా ఉంది. అదేమిటంటే రాష్ట్రంలో కనీసం ఒక్క నగరాన్ని గట్టిగా అభివృద్ధి చేసినా అది యావత్ రాష్ట్రాన్ని ఆదుకొంటుందని తెలంగాణా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చూస్తే అర్ధమవుతోంది. బహుశః ఆ ఆలోచనతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రపంచ స్థాయి రాజధాని నగరాన్ని నిర్మించాలని తహతహలాడుతున్నారు. అది కేవలం రాజధాని నగరంగా మాత్రమే కాకుండా రాష్ట్ర ఆర్ధిక రాజధానిగా తయారుచేయాలని ఆయన చాలాసార్లు చెప్పడం గమనిస్తే ఆయన చాలా దూరదృష్టితో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకొన్నట్లు అర్ధమవుతోంది.
ఇప్పుడు హైదరాబాద్ నుండి వచ్చే ఆదాయాన్ని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో మిగిలిన అన్ని జిల్లాల అభివృద్ధికి ఏవిధంగా కేటాయిస్తున్నారో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మించిన తరువాత దానిపై వచ్చే ఆదాయాన్ని రాష్ట్రంలో మిగిలిన అన్ని జిల్లాల అభివృద్ధికి కేటాయించినట్లయితే క్రమంగా అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది.
కానీ అంతవరకు డబ్బు కోసం కటకటలాడక తప్పదు కనుక ఈలోగా రాష్ట్రానికి భారీగా ఆదాయం సమకూర్చగల ఐటి, పరిశ్రమలు, వ్యాపార సంస్థల స్థాపనకు ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో కృషి చేయవలసి ఉంటుంది. చంద్రబాబు నాయుడి ఆ దిశలో ఇప్పటికే చాలా గట్టిగా కృషి చేస్తున్నారు. ఆయన రాష్ట్రాన్ని ఈ కష్టాల నుండి ఏదో విధంగా ఒడ్డేక్కిస్తారనే అపారమయిన నమ్మకంతోనే రాష్ట్ర ప్రజలు తెదేపాకు అధికారం కట్టబెట్టారు. కనుక ఇటువంటి తీవ్ర వ్యతిరేక పరిస్థితులలో కూడా ఆయన రాష్ట్రాభివృద్ధి చేయవలసిన బాధ్యత వహిస్తున్నారు. కానీ దానర్ధం అన్నీ ముఖ్యమంత్రే చూసుకొంటారనే మంత్రుల, సంబంధిత అధికారుల భావన సరయినది కాదు. వారందరూ అటువంటి భావన నుండి బయటపడి ప్రతీ ఒక్కరు స్వయంగా చొరవ తీసుకోవలసిన అవసరం ఉంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే పెద్దల మాటను సదా గుర్తుంచుకొని ప్రజా ప్రతినిధులు అందరూ కూడా తమ తమ నియోజక వర్గాలను వీలయినంత వేగంగా అభివృద్ధి చేసుకొంటే చాలు. రాష్ట్రం ఒడ్డున పడుతుంది.