గురువింద సామెతను గుర్తు చేస్తున్న భూమన కరుణాకరరెడ్డి తీరు
posted on Aug 29, 2025 @ 3:03PM
జగన్ హయాంలో తిరుమలలో జరిగిన అనాచారాలకు అంతే లేదు. జగన్ మోహన్ రెడ్డి హిందూ వ్యతిరేకా, కాదా అన్నది పక్కన పెడితే ఆయన హిందువు అయితే కాదు. ఇందులో ఎటువంటి సందేహాలకూ తావు లేదు. అయితే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దేవుళ్లకు, ఆలయాలకు, హిందూ ధర్మానికి జరిగిన అపచారాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ సంఘటనలే ఆయన హిందూ వ్యతిరేకా అన్న అనుమానాలు బలపడేలా చేశాయి.
ఒక విధంగా చెప్పాలంటే హిందూ సమాజం వ్యక్తం చేసిన ధర్మాగ్రహమే ఆయనను అధికారం నుంచి దించేసిందని చెప్పవచ్చే. హైందవ ధర్మం పట్ల , మరీ ముఖ్యంగా తిరుమల విషయంలో ఆయన హయాంలో జరిగిన అనాచారాలు, అపచారాలు జగన్మోహన్ రెడ్డి ప్రియ స్వామీజీ శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపానంద సరస్వతీ స్వామీజీకి సైతం ఆగ్రహం తెప్పించాయి. జగన్ హయాంలో సింహాచలం చందనోత్సవంలో చోటుచేసుకున్న అవకతవకల పై ఆయన మీడియా ముఖంగా వ్యక్తం చేసిన ఆగ్రహమే అందుకు నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి పాలనలో పనిగట్టుకుని హిందువుల మనోభావాలను దెబ్బ తీసిన సంఘటనకోకొల్లలు. జగన్మోహన రెడ్డి అధికారంలోకి వచ్చింది మొదలు, ఎన్నెన్ని దేవాలయాల మీద దాడులు జరిగాయో, ఎక్కడెక్కడ దేవుని ఆస్తులు అన్యాక్రాంత మయ్యాయో. చివరకు ఏడుకొండల వెంకన్నదేవుని సన్నిధిలో అన్యమత ప్రచారం మొదలు, ఇంకెన్ని అకృత్యాలు జరిగాయో తెలియంది కాదు.
అంతెందుకు కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే శ్రీ వేంకటేశ్వర స్వామిని నల్లరాతితో పోల్చిన నాస్తికుడు భూమన కరుణాకరరెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ గా నియమించడం ద్వారా జగన్ తన తీరు ఏమిటో? వైఖరి ఏమిటో ఎటువంటి దాపరికం లేకుండా చాటుకున్నారు. టీటీడీ చైర్మన్ గా భూమన ఉన్న కాలంలో వైఖానస ఆగమ శాస్త్రాన్ని, ఆచార వ్యవహారాలను పక్కన పెట్టి టీటీడీ ఇష్టారాజ్యంగా తీసుకుంటున్న నిర్ణయాలు భక్తులను ఆవేదనకు గురి చేశాయి. ఒక్క మాటలో చెప్పాలంటే హిందూ ధర్మ రక్షణ కోసం ఏర్పడిన టీటీడీ ధర్మ విరుద్ధ చర్యలకు నిలయంగా మారింద విమర్శలు వెల్లువెత్తాయి. అంతే కాదు భూమన టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత టీటీడీ ఒక వ్యాపార కేంద్రంగా మారిపోయిందన్న ఆరోపణలు, విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. గోవింద నామ స్మరణ తప్ప మరో పేరు వినిపించడమే అపచారంగా భావించే తిరుమల కొండపైన ఏకంగా రాజకీయ జెండాలు, స్టిక్కర్లు దర్శనం ఇచ్చాయి.
ఇంతగా తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లేలా వ్యవహరించిన భూమన కరుణాకరరెడ్డి ఇప్పుడు హైందవ ధర్మపరిరక్షకుడి అవతారం ఎత్తినట్లుగా...టీటీడీపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాను టీటీడీ చైర్మన్ గా ఉండగా మొదలై, ఆ తరువాత కూడా కొనసాగిన అవకతవకలు, అక్రమాలు, అధర్మాలను... రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత బాధ్యతలు చేపట్టిన తిరుమల తిరు పతి దేవస్థానం బోర్డు సభ్యులు సరిదిద్దుతూ, తిరుమల పవిత్రత పెంచేలా చర్యలు తీసుకుంటుంటే.. భూమన విమర్శలతో చెలరేగిపోతున్నారు. ఆరోపణలతో రెచ్చిపోతున్నారు.
తప్పులన్నీ తాను చేసి.. ఇప్పుడు భూమన టీటీపై ఆరోపణలతో ఎందుకింతగా రెచ్చిపోతున్నారు? జనం విశ్వసిస్తారని ఎలా భావిస్తున్నారు? అంటే తిరుమలలో వర్షం పడితే... ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తిరుమల శ్రీవారి భక్తులు తడిసి ముద్దౌతారు. తిరుమలలో జరిగే ఏ చిన్న సంఘటన అయినా భక్తులు, హిందూ ధార్మిక సంస్థల దృష్టిని ఆకర్షిస్తుంది. అందుకే.. తనను చుట్టుముడుతున్న కేసుల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి భూమన ఈ రకంగా టీటీడీపై విమర్శల దాడికి దిగుతున్నారు. తద్వారా తాను తిరుమల పవిత్రతను కాపాడటానికి కంకణం కట్టుకున్న వ్యక్తిగా జనం దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. తిరుమలకు సంబంధించిన అంశం అంటే మీడియా వాస్తవమా? అవాస్తవమా? అన్న శోధనలోకి పోకుండా ప్రాధాన్యత ఇచ్చి ప్రాచుర్యం కల్పిస్తుందన్న భావనతో భూమన ఇలా రెచ్చిపోతున్నారని పరిశీలకులు అంటున్నారు.
అన్నిటికీ మించి జనం మెమరీ చాలా తక్కువ అన్నభ్రమల్లో భూమన తన హయాంలో జరిగిన అపచా రాలను ప్రజలు మరిచిపోయి ఉంటారనుకుంటున్నారు. ఇపుడున్న తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుల ప్రతిష్టను దెబ్బతీయాలంటే ఇలాంటి ఎదురుదాడే శరణ్యమని భ్రమిస్తున్నారు. అయితే భూమన రీతి గురివింద చందంగా ఉందన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తం అవుతోంది. భూమన ప్రతి విమర్శపైనా మీ హయాంలో చేసిందేమిటి? అంటూ జనం చర్చించుకుంటున్నారు.