రిలేషన్ సంతోషంగా ఉండటానికి బెస్ట్ సలహా .!
posted on Aug 1, 2025 @ 9:30AM
ఒక రిలేషన్ ఏర్పడటం పెద్ద సమస్య కాదు.. కానీ ఆ రిలేషన్ అన్ని సమస్యలను ఎదుర్కొని విజయవంతం కావడం నేటి కాలంలో చాలా పెద్ద సాహసమనే చెప్పాలి. ఎందుకంటే సంబంధాలు ఏర్పడినంత తొందరగానే బ్రేకప్ అవుతున్నాయి. ముఖ్యంగా బార్యాభర్తల బంధం మన భారతదేశ ధర్మానికి ఒక ముఖ్యమైన మూల స్తంభం. అలాంటి మూల స్తంభం చాలా బలహీనం అయి, బీటలు వారుతోంది. ఈ కారణంగా నేటికాలంలో వివాహాలు చేసుకోవాలన్నా కూడా చాలామంది సంకోచిస్తున్నారు.
ఒక రిలేషన్ విజయవంతం కావడానికి ప్రేమ, నమ్మకం, గౌరవంతో పాటు ఇద్దరి మధ్య స్పష్టమైన సంభాషణ అవసరం. సంతోషకరమైన సంబంధానికి పునాది అనేక విషయాలపై ఆధారపడి ఉంటుంది. సంబంధంలో నిజాయితీ, అర్థం చేసుకోవడం, ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైనవి. సంబంధం కొత్తదైనా లేదా పాతదైనా, ఇవన్నీ ప్రతి జంటకు ముఖ్యమైనవే. ఇది సంబంధాన్ని బలపరుస్తుంది, సంబంధంలో సమస్యలు రాకుండా చేస్తుంది. ప్రతి జంట సంతోషకరమైన వైవాహిక జీవితం కావాలంటే ఏం చేయాలి అనేది రిలేషన్షిప్ నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు. వాటి గురించి తెలుసుకుంటే..
వినడం..
వినడం అనేది ఒక సాధారణమైన విషయమే కానీ సంబంధంలో చాలా ముఖ్యమైనది. ఇది ప్రతి ఒక్కరూ అది అబ్బాయి అయినా లేదా అమ్మాయి అయినా తెలుసుకోవాలి. భార్యాభర్తల రిలేషన్ లో మాట్లాడటం, అభిప్రాయాన్ని వ్యక్తపరచడంతో పాటు, వినడం కూడా చాలా ముఖ్యం. తరచుగా భార్యాభర్తలు ఒకరు చెప్పేది మరొకరు వింటారు. కానీ కొందరి ఉద్దేశ్యం ఎలా ఉంటుందంటే కేవలం వినడం ఆ తరువాత ఆ విషయానికి ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం తనకు నచ్చినట్టే జరగాలని అనుకోవడం జరుగుతుంది. ఇది సంబంధాన్ని చాలా దెబ్బ తీస్తుంది.ఆరోగ్యకరమైన రిలేషన్ ఉండాలంటే అవతలి వ్యక్తి చెప్పే మాటలను వినడమే కాదు.. వారికి ప్రాధాన్యత కూడా ఇవ్వాలి.
స్పేస్..
భార్యాభర్తల బంధంలో ప్రేమదే అగ్రస్థానం. భాగస్వాములు అయ్యాక ఒకరికొకరు ఇచ్చే ప్రాధాన్యత, ఒకరికి మరొకరు ఇచ్చే విలువ ఆ బంధాన్ని మరింత బలంగా మారుస్తుంది. కానీ ప్రేమ అంటే మనిషిని కట్టడి చేసినట్టు ఉండకూడదు. ప్రతి విషయం తనకు తెలియాలి అనుకోకూడదు. కొంతమంది ప్రేమ ఎలా ఉంటుందంటే.. పెళ్లైంది కదా.. ఆ మనిషి నా సొంతం.. తనకు ఎలాంటి స్పేస్ కూడా ఉండకూడదు అని అనుకుంటారు. కానీ సంబంధంలో ప్రేమ ఎంత ముఖ్యమో.. వారికంటూ కాస్త స్పేస్.. వారికంటూ పర్సనల్ సమయం ఇవ్వడం కూడా ముఖ్యం. స్పేస్ అనేది లేకపోతే బంధాన్ని గట్టిగా బిగించినట్టు ఉంటుంది. నిజానికి కొందరు ఇలా స్పేస్ ఇవ్వకుండా ఉండటం వల్ల అనుమాన పూరిత ప్రవర్తన అనుకునే అవకాశం కూడా ఉంటుంది.
సారీ.. థ్యాంక్స్..
రిలేషన్ ను బలంగా మార్చేది ఏదైనా ఉందంటే అది తనకు ఏదైనా సహాయం చేసినప్పుడు కృతజ్ఞత చెప్పడం. అలాగే తన వైపు ఏదైనా తప్పు జరిగినప్పుడు క్షమాపణ చెప్పడం. పెళ్లి చేసుకున్నారు, భాగస్వామి అయ్యారు కాబట్టే కదా బాధ్యత కాబట్టి మనకోసం ఏదైనా చేశారు అనుకోవడం, కనీసం థ్యాంక్స్ చెప్పకపోవడం.. ఏదైనా తప్పు జరిగినప్పుడు సారీ చెప్పకపోగా అయితే ఏంటి? అని రివర్స్ లో వాళ్ళ మీద అరవడం, సమర్థించుకోవడం వంటివి చేయడం వల్ల ఒకరిమీద ఒకరికి ఆశించినంత ప్రేమ, గౌరవం నిలబడవు. ఎప్పుడైతే ఇట్లా సందర్బానుసారంగా సారీలు, థ్యాంక్సులు చెపుతూ ఉంటారో అప్పుడు ప్రేమ, గౌరవం పెరుగుతాయి. నిజమైన ప్రేమ పెరుగుతూ ఉంటుంది.
*రూపశ్రీ.