ఆ ఏడు కోట్ల నోట్ల కట్టలు బాల సాయివే..!
posted on Nov 9, 2012 @ 11:36AM
నగరంలో కలకలం రేపిన నోట్ల కట్టల కేసు కొత్త మలుపు తిరిగింది. మొదట కథనంలో చెప్పిన ఎమ్మెల్యే పాత్ర ఇప్పుడు మాయమైంది. డీజీపీ కార్యాలయం ఆటోలో దొరికిన రూ.6.70 కోట్ల నగదు కర్నూలు బాల సాయిబాబాకు చెందిన డబ్బుగా తేలింది. సంఘటన జరిగిన ఓ రోజు తరువాత బాలసాయి ట్రస్టు చైర్మన్ రామారావు వచ్చి పోలీసులను కలిశారు. తాము కర్ణాటకలో నిర్మించనున్న బాలసాయి మందిరానికి చెందిన డబ్బు అది అని, దానిని తరలించే బాధ్యత వంశీ అనే వ్యక్తికి ఇచ్చామని, అది అన్సారి అనే వ్యక్తికి చేరాల్సి ఉందని అంతలోనే ఇలా జరిగిందని చెప్పుకొచ్చారు. ఇందులో రూ.4 కోట్లకు పైగా ఆంధ్రా బ్యాంకు నుండి, మిగతా డబ్బులు సన్నిహితుల నుండి తీసుకొచ్చామని తెలిపారు.
అయితే 1.70 కోట్లు ఎక్కడివన్న విషయంలో దర్యాప్తు సాగుతుందని సమాచారం. సంఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే కాకుండా, బాలసాయి ట్రస్టు ఆలస్యంగా ఎందుకు స్పందించిందని అనుమానాలున్నాయి. బాలసాయి కి ముఖ్యుడు అయిన రామారావు బ్యాంకు అకౌంటెంటు ఉద్యోగం వదిలి ఆయన దగ్గర చేరాడు. బాలసాయికి సంబంధించిన అన్ని వ్యవహారాలు ఈయన ఆధ్వర్యంలోనే జరుగుతాయి. ట్రస్టుకు సంబంధించిన డబ్బు అయితే ఇంత భయంగా, అజాగ్రత్తగా ఎందుకు తరలిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రామారావు ఇంతకు ముందు హైదరాబాద్ లో భూ కబ్జా కేసుల్లోనూ ఉన్నారు. బాలసాయి ఈ వ్యవహారాల్లో కోర్టు మెట్లు ఎక్కారు.