బాలీవుడ్ వెళ్లనున్న 'బాద్ షా'
posted on Mar 23, 2013 @ 12:47PM
బాలివుడ్, టాలివుడ్, కోలీవుడ్ మూడూ కూడా ఒక దాని నుండి మరొకటి సినిమాలు అరువు తెచ్చుకొని రీమేక్ చేసుకొంటూ ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు వెరైటీ సినిమాలు ఇవ్వాలని తిప్పలు పడుతుండటం అందరికీ తెలిసిందే. ఒక చోట హిట్టయిన సినిమా మరొక చోట రీమేక్-అవతారం వేసుకొని ప్రేక్షకులను పలకరిస్తుంది.
ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో జు.యన్టీఆర్ నటిస్తున్న ‘బాద్షా’ సినిమా ఇంకా విడుదల కాక మునుపే, ఆ సినిమాను తామే స్వయంగా హిందీలో రీమేక్ చేయాలనీ ఆలోచిస్తున్నట్లు ఆ సినిమా నిర్మాత బండ్ల గణేష్ మీడియాకు తెలిపారు. హిందీ సినిమాకు కూడా శ్రీను వైట్లే దర్శకుడిగా వ్యవహరిస్తారని తెలిపారు. అయితే హిందీ లో సినిమాను బాలివుడ్ లో ప్రముఖహీరోహీరోయిన్లను పెట్టి తీయలను కొంటున్నట్లు ఆయన తెలిపారు. అందుకొరకు ఇప్పటికే బాలివుడ్ లో కొన్ని ప్రముఖ సినిమా సంస్థలను తాము సంప్రదించినట్లు తెలిపారు. త్వరలోనే తమ హినీ సినిమా వివరాలను కూడా తెలియజేస్తామని ఆయన మీడియాకు తెలిపారు.
ఇక, మన టాలివుడ్ నిర్మాతలు హిందీ సినిమాలు చేయడానికి బాలివుడ్ వైపు అడుగులు వేస్తుంటే, మరో వైపు ప్రముఖ బాలివుడ్ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ వారు మన తెలుగు హీరో నానిని పెట్టి త్వరలో హిందీలో సూపర్ హిట్టయిన ‘బ్యాండ్ బాజా బారాత్’ అనే సినిమాను తెలుగులోకి రీమేక్ చేయనున్నారు.
అదే విధంగా హిందీలో సూపర్ హిట్టయిన ‘బోల్ బచ్చన్’ తెలుగు రీమేక్ సినిమాలో విక్టరీ వెంకటేష్, రామ్ కలిసి నటించనున్నారు.