Read more!

శ్రద్ధావాకర్ హత్య కేసు నిందితుడిపై తల్వార్లతో దాడి

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన శ్రద్ధా వాకర్ హత్యకేసు నిందితుడు అఫ్తాబ్ ను తీహార్ జైలుకు తరలిస్తుండగా.. అతడిపై కత్తులతో దాడికి యత్నించడం కలకలం రేపింది. రోహిణిలోని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ బయట ఈ ఘటన జరిగింది. కొందరు వ్యక్తులు పోలీసు వాహనాన్ని అడ్డగించి తల్వార్లతో దాడికి యత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. వారిని అడ్డుకునే క్రమంలో గాల్లోకి కాల్పులు జరిపారు. అఫ్తాబ్ ను అక్కడి నుండి సురక్షితంగా తరలించారు.

తనతో సహజీవనం చేస్తున్న శ్రద్ధావాకర్ ను అప్తాబ్ మే 18న హత్య చేసి ఆ తరువాత ఆమె మృతదేహాన్ని 35 ముక్కుల చేసి ఆ ముక్కలను అటవీ ప్రాంతంలో పడేసిన సంఘటన సంచలనం సృష్ఠించిన సంగతి విదితమే. శ్రద్ధావాకర్ తండ్రి ఆమె కనిపించడం లేదంటూ నవంబర్ 10న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి రావడంతో అప్తాబ్ ను ఉరి తీయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ తెరమీదకు వచ్చింది.

సహజీవనంలో ఉన్నంత కాలం శ్రద్ధావాకర్ ను అప్తాబ్ చిత్ర హింసలకు గురి చేశాడనీ దర్యాప్తులో వెలుగు చూసింది.  శ్రద్ధా వాకర్ 2019 నుంచి తనకు నచ్చిన అప్థాబ్ తో లివ్ ఇన్ రిలేషన్ లో ఉంది. ఏడాది పాటు వారి సహజీవనం సంతోషంగానే సాగింది. అయితే 2020 నుంచి అప్తాబ్ ఆమెకు నిత్యం నరకం చూపేవాడని విచారణలో వెలుగులోకి వచ్చింది.

అప్తాబ్ తనను చిత్రహింసలు పెడుతున్నాడంటూ శ్రద్ధావాకర్ 2020లోనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను హత్య చేయడానికి ప్రయత్నించాడని కూడా ఆ లిఖిత పూర్వక ఫిర్యాదులో పేర్కొంది. ఒక డేటింగ్ యాప్ ద్వారా 2019లో దగ్గరైన శ్రద్ధ, అఫ్తాబ్‌లు అప్పటి నుంచి సహజీవనం సాగిస్తున్నారు.   శ్ర‌ద్ధావాకర్ పెళ్లి కోసం ఒత్తిడి చేయడం ప్రారంభించినప్పటి నుంచీ అంటే వారి సహజీవనం మొదలైన ఏడాది తరువాత నుంచి అప్తాబ్ చిత్రహింసలు మొదలయ్యాయని ఆమె ఫిర్యాదును బట్టి అర్ధమౌతుంది.  

అప్తాబ్ తనను చిత్రహింసలకు గురి చేస్తున్న విషయం అతని తల్లిదండ్రులకూ తెలుసునని శ్రద్ధావాకర్ తన ఫిర్యాదులో పేర్కొంది. ఆ విషయాలన్నీ స్నేహితులకు చెప్పుకుని బాధపడేదని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆ క్రమంలోనే అప్తాబ్ శ్రద్ధాను ఈ ఏడాది మేలో హత్య చేశాడు. ఒక పక్కా ప్రణాళిక మేరకే అప్తాబ్ శ్రద్ధావాకర్ ను హత్య చేశాడని  పోలీసులు అనుమానిస్తున్నారు.

అయితే ఆఫ్తాబ్ మాత్రం ఆవేశంలో శ్ర‌ద్ధాను హ‌త్య‌చేసిన‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో, ఇటీవ‌ల కోర్టులో చెప్పాడు. ఆఫ్తాబ్ నుంచి అస‌లు నిజాలు రాబ‌ట్టేందుకు కోర్టు నార్కో పరీక్షలకు  కూడా అనుమ‌తినిచ్చింది. కాగా న‌మ్మి వ‌చ్చిన ప్రియురాలిని అతి కిరాత‌కంగా హ‌త్య‌చేసిన ఆఫ్తాబ్‌ను ఉరితీయాల‌ని దేశ‌వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది.