ఉద్యోగులు ఆంధ్రాకి తరలివచ్చేందుకు అడ్డుపడుతున్న ఆర్టికల్ 371 (డి)
posted on Mar 15, 2015 @ 11:09AM
ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుండి కొనసాగుతున్న ఆంద్రప్రదేశ్ ప్రభుత్వపరిపాలనా వ్యవస్థను విజయవాడకు తరలించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలకు ఉద్యోగుల సహకారం లేకపోవడంతో ఫలించడం లేదు. ఉద్యోగులు చెపుతున్న ఇతరత్రా కారణాలతో బాటు మరో బలమయిన కారణం కూడా ఉంది.
రాష్ట్ర విభజన తరువాత కూడా ఆర్టికల్ 371(డి)ని రెండు రాష్ట్రాలలో యధాతధంగా కొనసాగించబడుతోంది. కనుక ఒకవేళ ఏపీ ఉద్యోగులు విజయవాడకు తరలివచ్చినట్లయితే వారి పిల్లలు స్థానికేతరులుగా పరిగణింపబడుతారు. కనుక వారు రాష్ట్రంలో ఉన్నత విద్యా, ఉద్యోగావకాశాలు కోల్పోతారు.
ఆర్టికల్ 371 (డి) లో సిక్స్ పాయింట్ ఫార్ములా ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోస్తా ఆంధ్రా జిల్లాలు 1,2,3 జోన్లుగాను, రాయలసీమ జిల్లాలు 4వ జోన్ గాను విభజించబడ్డాయి. మిగిలిన 5 మరియు 6 జోన్లు తెలంగాణాలో ఉన్నాయి. హైదరాబాద్ లో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులు జోన్-5 లో ఉన్నారు. ఈ సిక్స్ పాయింట్ ఫార్ములా ప్రకారం ఒక జోన్ లో ఉద్యోగులు మరో జోన్ లోకి పదోన్నతులతో బదిలీలపై వెళ్ళడానికి కానీ లేదా రిక్రూట్మెంట్లు చేయడానికి వీలులేదు. ఇది కూడా ఉద్యోగుల అభ్యంతరాలకు ఒక ప్రధాన కారణంగా ఉంది. కనుక మరో రెండు మూడేళ్ళలో తుళ్ళూరు వద్ద నూతన రాజధాని నిర్మించినప్పటికీ, ఈ ఆర్టికల్ 371(డి)ని పార్లమెంటులో సవరించి వారికి వెసులుబాటు కల్పిస్తే తప్ప హైదరాబాద్ లో పనిచేస్తున్న ఉద్యోగులు అక్కడికి తరలివెళ్ళలేని పరిస్థితి నెలకొని ఉంది. ఇదే విషయాన్ని ఏపీ ఎన్జీవోలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తెలియజేసారు. బహుశః ఈ కారణంగానే అమరావతి వద్ద తాత్కాలిక రాజధాని నిర్మించి అక్కడికి ప్రభుత్వాన్ని తరలించాలనే ఆలోచనను ఆయన విరమించుకొని ఉండవచ్చును.
కానీ ఇప్పుడు కాకపోయినా రెండేళ్ళ తరువాత అయినా ఉద్యోగులు నూతన రాజధానికి తరలి రావలసి ఉంటుంది కనుక, ఈ అంశంపై అధ్యయనం చేసి ఈ సమస్యను పరిష్కరించేందుకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్ధిక, న్యాయ మరియు మునిసిపల్ శాఖ మంత్రులతో కూడిన ఒక సబ్ కమిటీని నియమించారు. వారు ఏప్రిల్ 15 వ తేదీలోగా తమ నివేదికను సమర్పిస్తారు. దాని ఆధారంగా ఆర్టికల్ 371(డి)వల్ల తమకు ఎదురవుతున్న ఈ ఇబ్బందుల గురించి వివరిస్తూ వాటిని సవరించమని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఒక లేఖ వ్రాస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ విషయాన్ని సంబంధిత కేంద్ర మంత్రులు, ప్రధాన మంత్రి దృష్టికి తీసుకువెళతారు.
ఆర్టికల్ 371(డి)ని సవరించాలంటే పార్లమెంటులో 2/3వ మంది సభ్యులు ఆమోదించవలసి ఉంటుంది. అంటే ఈ సమస్య చాలా జటిలమయినదేనని స్పష్టం అవుతోంది. మరి దీనిని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఏవిధంగా ఎప్పటిలోగా పరిష్కరిస్తాయో చూడాలి.