Read more!

కేంద్రం కరుణిస్తేనే జీతాలు, పెన్షన్లు ...

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి అర్జెంటుగా వైద్యులు కావాలి ... వైద్యులంటే డాక్టర్లు కాదు. సుమతీ శతకకారుడు చెప్పిన, అప్పిచ్చు వైద్యులు కావాలి. అవును, రాష్ట్ర ఆర్ధికఆరోగ్య పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. అప్పు పుట్టందే పూట గడిచే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులను వెంట పెట్టుకుని ఢిల్లీకి పయనమై వెళ్ళారు. ఎసరు పోయి మీద పెట్టి బియ్యం అప్పు కోసం ఇరుగుపొరుగు ఇళ్లకు పరుగులు తీసినట్లు,మరో వారం రోజుల్లో ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు చెల్లించవలసి ఉండగా ఆర్థిక మంత్రి బుగ్గన ‘అప్పు ప్లీజ్’ అంటూ హస్తినకు పరగులు తీశారని అంటున్నారు.  జీతాలు, పెన్షన్లు చెల్లించేందుకు కూడా ఖజానాలో కాసులు లేని పరిస్థితి. అందుకే, ఆర్థిక మంత్రి బుగ్గన, అధికారులను వెంట పెట్టుకుని ఢిల్లీకి వెళ్ళారని, అధికార వర్గాల సమాచారం.  

నిజానికి  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్ళ నుంచి ఇదే పరిస్థితి. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మీటలు నొక్కి ఖాజానా ఖాళీ చేయడం,అవసరానికి ఆర్థిక మంత్రి బుగ్గన అక్కడా ఇక్కడా తిరిగి అప్పులు తెచ్చి అవసరాలకు సర్దుబాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అందుకే అర్హిక మంత్రిని అయిన వాళ్ళే ముద్దుగా అప్పుల మంత్రి అంటుంటారు, అలాగే, మంత్రివర్గ విస్తరణలో బుగ్గన వద్దంటున్నా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పట్టుపట్టి మళ్ళీ బుగ్గనకే ఆర్థిక శాఖను అప్పగించింది కూడా, అందుకే అంటారు. అప్పులు చేయడంలో ఆయనకున్న అనుభవ, సామర్ధ్యాలను గుర్తించే ముఖ్యమంత్రి బుగ్గనకు మళ్ళీ ఆర్థిక శాఖను ఇచ్చారని అంటారు.  

అయితే, ఇప్పడు ఇక అప్పులు పుట్టే పరిస్థితి లేదు సరికదా, రాష్ట్ర అప్పులు ఎఫ్ఆర్బీఎం గీత దాటిన నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం, అప్పులపై ఆంక్షలు విధించింది. కేంద్రం అనుమతి ఇస్తేనేగానీ, కొత్త అప్పులు చేసేందుకు లేకుండా కేంద్ర ప్రభుత్వం,ఎఫ్ఆర్బీఎం చట్టానికి సవరణలు చేసింది. ఈ సవరణలు అన్ని రాష్ట్రాలకు వర్తించేవే అయినా, ఇతర రాష్టాలు అంతో ఇంతో ఆర్థిక క్రమశిక్షణతో బండి లాగిస్తున్నాయి.కానీ, ఏపీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడోనే, 175కు 175 యావలోపడి  ఆర్థిక క్రమ శిక్షణను పక్కకు తప్పించారు.  

మీటలు నొక్కడమే తప్ప మరో ఆర్థిక సూత్రం ఏదీ తెలియదని ముఖ్యమంత్రి తేల్చేశారు.  ఇక అక్కడినుంచి బుగ్గనకు కొత్త తిప్పలు మొదలయ్యాయి. ముందు అప్పిచ్చు వాడిని వెతుక్కోవాలి,ఆ తర్వాత కేంద్రం అనుమతి తీసుకుని అప్పు తెచ్చుకోవలసిన పరిస్థితి వచ్చింది.  అందుకే కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకుని, వచ్చే మంగళవారం, ఆర్బీఐ బాండ్లు వేలం వేసి జీతాల గండం గట్టేక్కేందుకు బుగ్గన ఢిల్లీ యాత్ర పెట్టుకున్నారని అంటున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కరుణించి వేలంలో ఆర్బీఐ బాండ్లు పాడుకునేందుకు అనుమతివ్వాలని వేడుకునేందుకే బుగ్గన బృందం ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది.

నిజానికి, కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా జగన్ రెడ్డి పభుత్వం పట్ల కొంత సానుకూల వైఖరినే అవలబిస్తూ వస్తోంది. పొరుగు రాష్ట్రం తెలంగాణ ఎంతగా మొర పెట్టుకున్నా, కొత్త అప్పులకు ససేమిరా అంటున్న మోడీ ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ విషయంలో మాత్రం కొంచెం చాల ఎక్కువ వెసులుబాటు కలిపిస్తోందని తెలంగాణ మంత్రులు, అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం కక్ష కట్టి, వివక్ష చూపుతోందని, తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు సహా పలువురు మంత్రులు ఆరోపిస్తున్నారు. ఈ నేపధ్యంలో, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, బుగ్గన అభ్యర్ధను ఓకే చేస్తారా లేక,  లేదు పొమ్మంటారా, అనే దానిపై, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల చెల్లింపు ఆధారపడి ఉంటుంది. 

అదలా ఉంటే, కేంద్ర ప్రభుత్వం, బీజేపీఫై  ప్రత్యక్ష యుద్ధం సాగిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసేఆర్ తాజాగా కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం చట్టానికి చేసిన సవరణలకు వ్యతిరేకంగా కేంద్రాన్నిఅసెంబ్లీ వేదికగా కడిగి పారేసేందుకు సిద్దమవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కుట్ర పూరితంగా ఆర్థిక దిగ్భందనం సృష్టించి రాష్ట్ర ప్రగతిని అడ్డుకుంటోందని, ముఖ్యమంత్రి ఆరోపించారు. వచ్చె నెల ( డిసెంబర్) లో జరిగే అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో, ఇదే విషయంపై కేంద్రాన్ని  ఎండగడతామని  ప్రకటించారు. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అభ్యర్ధనను ఏ మేరకు అనుమతిస్తుంది అనేది అనుమానమే అంటున్నారు.

అదే నిజమై, బుగ్గన బృందం వట్టి చేతులతో వెనక్కి వస్తే, డిసెంబర్ నెల జీతాలు, పెన్షన్లు అనుమానమే అంటున్నారు. అయితే, ఇలా జీతాలు, పెన్షన్లు ఆలస్యం కావడం కొత్తమే కాదు, ఒక విధంగా జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన  తర్వాత, గత సంవత్సరం సంవత్సరంన్నర కాలంగా  ఉద్యోగుల జీతాలు సకాలంలో వస్తాయనే నమ్మకం ఉద్యోగులకు లేకుండా పోయిందని అంటున్నారు. జీతాలు, పెన్షన్లు ఎప్పుడొస్తాయో, ఎవరికీ తెలియని పరిస్థితే ఉందని అంటున్నారు.