రాజధాని శంఖుస్థాపనకి ఇంత హడావుడి ఎందుకు చేస్తున్నట్లు?
posted on Oct 14, 2015 8:53AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ఇవ్వాళ్ళ డిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి రాజ్ నాద్ సింగ్, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసి వారికి అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించబోతున్నారు. ఇప్పటికే ఒకసారి వారిని ఆహ్వానించినప్పటికీ ఇవ్వాళ్ళ వారికి ఆహ్వాన పత్రికలు అందించి మరోసారి ఆహ్వానించబోతున్నారు. అయితే రాజధాని నిర్మాణానికి భూమిపూజ చేసిన చంద్రబాబు నాయుడు, శంఖుస్థాపన కార్యక్రమాన్ని కూడా తనే స్వయంగా చేసుకొనే అవకాశం ఉన్నపటికీ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరిపించాలనుకోవడం ఆయన దూరదృష్టికి అద్దం పడుతోంది. పైకి ఇది చాలా మామూలు విషయంగానే కనబడుతునప్పటికీ అందుకు చాలా కారణాలు కనబడుతున్నాయి.
గత ఏడాది ఎన్నికల ప్రచార సమయంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే డిల్లీ కంటే గొప్ప రాజధాని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాల సహాయసహకారాలు అందిస్తానని నరేంద్ర మోడి హామీ ఇచ్చారు. ఆ సమయంలో ఆయన ఇంకా చాలా హామీలు ఇచ్చారు. ఇప్పుడు రాజధానికి ఆయన చేతే శంఖుస్థాపన చేయించడం ద్వారా అది వేగంగా నిర్మాణం జరిపించే బాధ్యతని ఆయనకే అప్పగిస్తున్నట్లవుతుంది. ప్రదాని స్వయంగా శంఖుస్థాపన చేసిన ఒక ప్రాజెక్టుకి కేంద్రప్రభుత్వంలో ఏ శాఖలు అవరోధాలు సృష్టించే సాహసం చేయలేవు.
ఎన్నికల ప్రచార సమయంలో నరేంద్ర మోడి ఇచ్చిన అనేక హామీలలో ప్రత్యేక హోదా కూడా ఒకటి. కానీ అదిప్పుడు ఇచ్చే పరిస్థితిలో లేదు. రాష్ట్రంలో దాని కోసం జగన్ వంటివారు దీక్షలు చేస్తూ ఉద్యమాన్ని రాజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పరిస్థితిలో రాష్ట్రానికి వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ అందుకు ప్రత్యామ్నాయంగా రాష్ట్రానికి ఇస్తామని చెపుతున్న ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీని ప్రకటించే అవకాశం ఉందని తెదేపా వర్గాలు చెపుతున్నాయి.
సింగపూర్, జపాన్ దేశాల ప్రధానులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఆ రెండు దేశాల సంస్థలు రాజధాని నిర్మాణ కార్యక్రమం చేపట్టబోతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా అమరావతికి శంఖుస్థాపన చేయడం వలన, రాజధాని నిర్మాణానికి కేంద్రప్రభుత్వం చాలా ప్రాధాన్యత ఇస్తోందనే సంకేతం, దానికి కేంద్ర సహకారం ఉంటుందనే విషయం వారిరువురికి తెలియజేసినట్లవుతుంది. కనుక వారు కూడా సంకోచించకుండా రాజధాని నిర్మాణం కోసం భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావచ్చును.
ఏదయినా ఒక వస్తువును అమ్ముకోవాలంటే దానిని అందంగా, గొప్పగా ప్రెజంట్ చేయడం అవసరం. ఆవిధంగానే అమరావతికి కూడా మొదటి నుండే ఒక ప్రత్యేక గుర్తింపు, బ్రాండ్ ఇమేజ్ సృష్టించే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నట్లు కనబడుతోంది. భారత్, సింగపూర్, జపాన్ దేశ ప్రధానులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పేరుమోసిన పారిశ్రామికవేత్తలు హాజరవుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రపంచ దేశాలన్నీ వీక్షిస్తాయి. అందుకే ఈ కార్యక్రమాన్ని చాలా అట్టహాసంగా నిర్వహించాలని చంద్రబాబు నాయుడు సంకల్పించారు. ఈ కార్యక్రమం ద్వారా యావత్ ప్రపంచ దేశాల దృష్టిని ఆకట్టుకోగలిగితే తద్వారా రాష్ట్రానికి దేశ విదేశాల నుండి భారీ పెట్టుబడులు ఆకర్షించాలని చంద్రబాబు నాయుడు ఆలోచన కావచ్చును.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరినీ, ముఖ్యంగా స్థానిక రైతులని కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనేలా చేయడం ద్వారా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా రాజధాని నిర్మాణానికి ఎవరూ వ్యతిరేకించడం లేదనే సంకేతం కేంద్రానికి ఇవ్వడమే కాక రాజధాని నిర్మాణం కోసం రాష్ట్ర ప్రజల బలమయిన ఆకాంక్షని కూడా ప్రధాని మోడీకి తెలియజేసినట్లవుతుంది. అందుకే చంద్రబాబు నాయుడు ఇంత హడావుడి చేస్తున్నారని భావించవచ్చును. దాని ఫలితాలు ఏవిధంగా ఉంటాయో మున్ముందు తెలుస్తాయి.