రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి షేమ్ టు షేమ్!
posted on Jul 11, 2015 @ 10:50AM
రాష్ట్ర విభజన చేసినందుకు కాంగ్రెస్ పార్టీ ఆంద్రప్రదేశ్ లో క్రమంగా తుడిచిపెట్టుకుపోతోంది. ఎన్నికలకు ముందే ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు ఇతర పార్టీలలోకి వెళ్లిపోగా, ఉండవల్లి, లగడపాటి, హర్షకుమార్ వంటి మరి కొంతమంది తమ పార్టీ అధిష్టానం కొట్టిన దెబ్బకి రాజకీయ సన్యాసం తీసుకోవలసి వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంటే పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి మాత్రమే ప్రధానంగా కనబడుతున్నారు. ఇక మిగిలిన వారు ఎక్కడున్నారో...ఏమి చేస్తున్నారో...అసలు పార్టీలోనే ఉన్నారో లేదో...అనే విషయం ఎవరికీ తెలియదు. పదేళ్ళ పాటు దేశాన్ని, రాష్ట్రాన్ని ఏకచత్రాధిపత్యంగా పరిపాలించిన కాంగ్రెస్ పార్టీకి అకస్మాత్తుగా ఇటువంటి దుస్థితి కలగడం ఆశ్చర్యంగానే ఉన్నా అది స్వయంకృతాపరాధమే కనుక ఎవరినీ నిందించవలసిన అవసరం లేదు. దానికి ఆ అవకాశం లేదు కూడా.
అగమ్యగోచరంగా ఉన్న తమ పార్టీ పరిస్థితి చూసి మాజీ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అంతటివాడు పార్టీలో నుండి బయటకి దూకేసి వైకాపాలో చేరిపోతే ఇక మిగిలిన నేతల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో ఊహించుకోవచ్చును. ఆయన తరువాత తాజాగా మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు. ఆయన సోమవారం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైకాపాలో చేరబోతున్నట్లు తాజా సమాచారం. బొత్స సత్యనారాయణ వైకాపాలో చేరడాన్ని ఆ పార్టీలో నేతలు చాలా మంది వ్యతిరేకించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ వ్యతిరేకతని అధిగమించడానికే కాంగ్రెస్ పార్టీలో తనకు సన్నిహితులుగా ఉన్నవారిని వైకాపాలో చేర్చేందుకు ఆయన గట్టిగా ప్రయత్నించవచ్చును. బహుశః ఆ ప్రయత్నంలో భాగంగానే డొక్కాను కాంగ్రెస్ పార్టీలోకి రప్పించారేమో కూడా. అదే నిజమయితే బహుశః ఇక మున్ముందు కాంగ్రెస్ పార్టీ నుండి వైకాపాలోకి వలసలు జోరందుకొంటాయేమో?
ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ అగమ్యగోచరంగా ఉన్నందున కాంగ్రెస్ నేతలు ఇతర పార్టీలలోకి వెళ్లిపోతుంటే, తెలంగాణా రాష్ట్రంలో తెరాస ధాటిని తట్టుకొని నిలబడలేమనే నిశ్చితాభిప్రాయంతోనో లేక తెరాస వేస్తున్న ఎరలకు ఆశపడో కాంగ్రెస్ నేతలు తెరాసలోకి వెళ్లిపోతున్నారు. ఇంతకు ముందు చాలా మంది కాంగ్రెస్ నేతలు తెరాసలోకి వెళ్లిపోయారు. తాజాగా మాజీ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ వెళ్లిపోవడంతో రెండు రాష్ట్రాలలో పీసీసీ అధ్యక్షులే స్వయంగా కాంగ్రెస్ పార్టీకి సమాధి కట్టడానికి నడుం బిగించినట్లయింది.
కాంగ్రెస్ పార్టీ దేశానికి, రాష్ట్రానికి చాలా నష్టం, అపకారం కలిగించి ఉండవచ్చును. కానీ ఆ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం తన పార్టీ నేతలకి అపారమయిన స్వేచ్చ, పదవులు, అధికారం, సమాజంలో గౌరవం కల్పించింది. అందుకు బదులుగా రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ నేతలు పార్టీని బలోపేతం చేసుకొనే ప్రయత్నాలు చేయకపోగా పార్టీని విడిచి వేరే పార్టీలలోకి తరలివెళ్లిపోతున్నారు. అందుకు కూడా కాంగ్రెస్ అధిష్టానం తనను తానే నిందించుకోవలసి ఉంటుంది. బహుశః రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ఎన్నికలు అయ్యేవరకు వాయిదా వేసి ఉండి ఉంటే రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ పరిస్థితి మరోలా ఉండేదేమో? అంతేకాక రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రా, తెలంగాణా కాంగ్రెస్ నేతలను పక్కనబెట్టి వేరేవరినో చంకనెక్కించుకోవడం చేతనే వారి నమ్మకాన్ని కోల్పోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని బయటకి పోతున్ననేతలు, వారిని కాంగ్రెస్ పార్టీ నిందించుకొంటున్నాయి. కానీ తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితికి పై నుండి క్రింద వరకు అందరూ బాధ్యులేనని చెప్పక తప్పదు. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకోవడం అంటే ఇదేనేమో? కానీ ఇప్పటికయినా కాంగ్రెస్ అధిష్టానం (రాహుల్? సోనియా?) మేల్కొని పార్టీని కాపాడుకొనే ప్రయత్నాలు చేయకపోతే వచ్చే ఎన్నికల నాటికి రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ కనబడకుండాపోవడం తధ్యం.