బ్రిటన్ లోనూ వలస వ్యతిరేక ఉద్యమం.. ట్రంప్ కు పట్టపగ్గాలుండవుగా?
posted on Sep 15, 2025 @ 10:48AM
ఈ వలస వ్యవహారం అమెరికాకే పరిమితం అనుకున్నాం. కట్ చేస్తే ఈ ట్రంప్ రగిల్చిన చిచ్చు మేక్ అమెరికా గ్రేట్ అగైన్.. అనేది యూకేకి కూడా పాకింది. అక్కడ యునైట్ ద కింగ్ డమ్ అంటూ ఒక కొత్త నినాదం పురుడు పోసుకుని లండన్ వీధులను ముంచెత్తింది. గతంలో ఎన్నడూ లేని విధంగా.. 1.5 లక్షల మంది జనం వలస దారులను తరిమి కొట్టాల్సిందే అన్న నినాదంతో రోడ్లపైకి వచ్చారు. దీనంతటికీ టామీ రాబిన్సన్ నాయకత్వం వహిస్తున్నారు. ఈయనకు ఎలాన్ మస్క్ మద్దతు ఉందని అంటున్నారు. మరి ఎలాన్ మస్క్ సైతం ఎక్కడో దక్షిణాఫ్రికా నుంచి అమెరికా వచ్చి వచ్చిఅక్కడ ట్రిలియన్ డాలర్ల సంపద మూటగట్టుకునే యత్నం చేస్తున్నారు. అలాంటి మస్క్ సైతం ఇలాంటి వలస వ్యతిరేక ఉద్యమాలకు మద్దతుగా నిలుస్తుంటే ఏం చేయాలో పాలు పోవడం లేదంటారు కొందరు బ్రిటన్ వలసదారులు.
శనివారంసెప్టెంబర్ 14) సెంట్రల్ లండన్లో జరిగిన ఈ ర్యాలీ బ్రిటన్ చరిత్రలోనే అతి ర్యాలీగా మెట్రో పాలిటన్ పోలీసులు అభివర్ణిస్తున్నారు. వలసలు, ఇస్లామీకరణపై పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్న సామాజిక కార్యకర్త టామీ నేతృత్వంలో యునైట్ ది కింగ్ డమ్ అనే ఈ ప్రదర్శన జరిగింది. మరో వైపు జాత్యహంకారానికి వ్యతిరేకంగా స్టాండ్ అప్ టు రేసిజమ్ అనే నిరసన కూడా చేపట్టారు. ఇందులో కేవలం 5వేల మంది మాత్రమే పాల్గొన్నారు.
ఒకరేమో ఇక్కడి నుంచి మీరు వెళ్లిపోండని కోరుతుంటే.. మరొక బృందం సమాజంలో సమానత్వం, సమైక్యత అవసరం అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇరు పక్షాల మధ్య ఎలాంటి గొడవా రాకుండా పోలీసులు పెద్ద ఎత్తున మొహరించారు. నిరసన కారులను చెదరగొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. నిరసన కారులు సైతం పోలీసులపై నీళ్ల సీసాల వంటి వస్తువులను విసిరారు. ఈ ఘటనల్లో పలువురు పోలీసులు గాయపడ్డట్టు తెలుస్తోంది. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో పాతిక మందిని అరెస్టు చేశారు పోలీసులు. ఈ అల్లర్లలో పాల్గొన్నవారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని అంటున్నారు. తాజా పరిణామాలను బ్రిటన్ అంతర్గత వ్యవహారాల మంత్రి షబానా మహమూద్ తీవ్రంగా ఖండించారు.
ఇందులో మరో విశేషం ఏంటంటే.. ఈ వలస వ్యతిరేక ప్రదర్శనల్లో అమెరికా ఇజ్రాయెల్ జెండాల ప్రదర్శన. వారిని తిరిగి పంపించండి. మా దేశాన్ని తిరిగి మాకివ్వండీ అంటూ బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ని డిమాండ్ చేశారు. మరికొందరు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ టోపీలు ధరించి వచ్చారు. దీంతో ట్రంప్ మనల్ని యూకేలో కూడా ఫాలో అవుతున్నారు చూడమంటూ కాలరెగరేస్తున్నారు.
ఈ వలస వ్యతిరేక ర్యాలీకి సపోర్ట్ గా నిలుస్తోన్న మస్క్ సైతం ఏమంత తక్కువగా మాట్లాడ్డం లేదు. వలసను వ్యతిరేకించి పోరాడండీ లేకుంటే మీరు చనిపోతారని రెచ్చగొట్టుడు ధోరణిలో చేస్తున్న వ్యాఖ్యలు సైతం చర్చనీయాంశమయ్యాయి. మస్క్ తో పాటు ఫ్రాన్స్ కి సంబంధించిన ఎరిక్ జెమ్మార్, జర్మనీకి చెందిన బై స్ట్రోన్ సైతం ఈ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. వీరంతా ఇటీవల సంభవించిన చార్లీ కిర్క్ ఉదంతాన్ని ప్రస్తావిస్తున్నారు. తెల్లజాతీయులను వలసవాదులు భర్తీ చేస్తున్నారంటూ తమ తమ వాదనలు వినిపిస్తున్నారు.
బ్రిటన్ లో ఉండే జనాభా సంఖ్య సుమారు ఆరు కోట్లు మాత్రమే. సంపన్న దేశాల్లో ఇది కూడా ఒకటి. ఈ మాత్రం వలస జనాభాకు ఇంత పెద్ద ఎత్తున నిరసన అవసరమా? అన్నదొక ప్రశ్న. అయితే ఇదంతా ఎందుకని చేశారో చూస్తే.. ఈఏడాది పది నెలలు కూడా గడవక ముందే ఏకంగా 28 వేల మందికి పైగా వలసదారులు పడవలపై బ్రిటన్ చేరుకున్నారు. ఈ అక్రమ వలస రికార్డు స్థాయికి చేరడంతోనే స్థానికుల్లో అసంతృప్తి పెరిగిందని అంటున్నారు. ప్రభుత్వం వీరిని తాత్కాలికంగా హోటళ్లలో ఉంచుతోందని.. అందుకే ఇదంతా జరుగుతోందని అంటున్నారు. అందుకే మస్క్ ఈ పార్లమెంటును రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లడం మంచిదని వీరికి సలహా ఇస్తున్నారు. స్టార్మర్ ప్రభుత్వం ఏమంత గొప్పగా లేదని అంటున్నారు వీరు.
వలసదారులు దేశ వనరుల వాడకంతో పాటు స్థానికుల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని ఆరోపిస్తున్నారు నిరసన కారులు. ఇప్పటికే బ్రిటన్ ఆర్ధిక వ్యవస్థ అంతంత మాత్రం. ఈ అక్రమ వలస కూడా ఇందుకు తోడైతే, దేశ ఆర్ధిక పరిస్థితి మరింత భారంగా మారే అవకాశముందని అంటారు వీరంతా. వీరి వల్ల తమ జాతీయ గుర్తింపు, సాంస్కృతిక వైభవం ప్రమాదంలో పడుతుందన్న ఆందోళన సైతం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఆందోళనలకు తాము తలొగ్గమనీ.. హింస చోటు చేసుకోడాన్ని ఎట్టి పరిస్థితుల్లో చూస్తూ ఊరుకోమన్నారు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్.
ఈ వలస వ్యతిరేక ర్యాలీ వెనకున్న టామీ రాబిన్సనన్ ఎవరంటే.. ఇతడి అసలు పేరు స్టీఫెన్ యాక్స్ లీ లెన్నాన్. జర్నలిస్టుగా పని చేసే రాబిన్సనన్.. యూకే గవర్నమెంటులోని అవినీతి బయట పెడతానంటూ పలు మార్లు హెచ్చరించారు. ఈయనకు మస్క్ తో సహా పలువురి ప్రముఖుల మద్దతుండటంతో.. ఈ మొత్తం గ్యాదరింగ్ సాధ్యపడినట్టు తెలుస్తోంది.
ఇటీవల ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లో కూడా ఇలాంటి వలస వ్యతిరేక ప్రదర్శనలు జరిగిన సంగతి తెలిసిందే. ఇక భారత్ లోనూ.. ఎన్నార్సీ వంటి ప్రోగ్రామ్స్ పై కాంగ్రెస్, దాని వెనకున్న శక్తులు వ్యతిరేకించడం చూస్తూనే ఉన్నాం అంటారు మరికొందరు. ఇపుడీ వలస వ్యతిరేక ఉద్యమం ఎక్కడి వరకూ వెళ్తుంది? అమెరికా నుంచి ఇతర దేశాలకు పాకుతున్న ఈ యాంటీ ఇమ్మిగ్రెంట్ మూమెంట్ టార్గెట్ ఏమిటి? తేలాల్సి ఉంది.