ఏపీ బీజేపీకి గుండెదడ
posted on Feb 11, 2015 @ 2:27PM
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించడంతో కేంద్రంలో బీజేపీకే గుండెదడ మొదలైంది. ఆత్మ పరిశీలన ప్రారంభమైంది. మొన్నటి వరకూ మోడీ హవా అని అంటున్నవాళ్ళు ఇక ఆ మాట మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. ఢిల్లీలో ఓటమి నరేంద్రమోడీ పరిపాలనకు రెఫరెండం కాదు అని సర్ది చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఢిల్లీలో ఓటమికి మోడీ కారణం కాదు.. నేనే కారణం అని కిరణ్ బేడీ ఒకటికి నాలుగుసార్లు నేరాన్ని తన నెత్తిమీద వేసుకోవాల్సి వచ్చింది. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు... కేంద్రంలోనే బీజేపీకి గుండెదడ మొదలైతే, రాష్ట్రాల్లో వున్న బీజేపీ నాయకత్వానికి గుండె దడ మొదలవకుండా వుంటుందా? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బీజేపీ నాయకత్వానికి ఆల్రెడీ గుండె దడ మొదలైపోయింది.
ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ అధికారంలో భాగస్వామిగా వుంది. కొంతమంది ఎంపీలు, కొంతమంది ఎమ్మెల్యేలు ఆ పార్టీకి వున్నారు. అయితే ఇదంతా రాష్ట్రంలో బీజేపీకి ఉన్న బలానికి నిదర్శనమా అంటే... లేదనే సమాధానం వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించినంత వరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకు ఎంత కారణమో, భారతీయ జనతా పార్టీ కూడా అంతే కారణం. అయితే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి సమాధి కట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీజేపీని ఎందుకు ఆదరించారంటే అది బీజేపీ గొప్పతనం కాదు... తెలుగుదేశం పార్టీతో స్నేహం చేయడం వల్ల అబ్బిన పరిమళం.
ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీతో స్నేహం చేస్తూనే బీజేపీ రాష్ట్ర నాయకత్వం రాష్ట్రంలో బలపడే ప్రయత్నాలు మొదలుపెట్టింది. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌లో కూడా అధికారం కోసం తెలుగుదేశంతో పోటీ పడగలదన్న సంకేతాలు ఇచ్చింది. తెలుగుదేశం మినహా ఇతర పార్టీలకు చెందిన నాయకులను బీజేపీలోకి ముమ్మరంగా చేర్చుకుంది. అయితే బీజేపీ ఏపీలో బలపడేందుకు ప్రయత్నాలు చేస్తోందే తప్ప రాష్ట్రానికి కేంద్రం నుంచి రావలసిన నిధుల విషయంలోగానీ, తెలంగాణతో వున్న వివాదాల విషయంలోగానీ, ప్రత్యేక హోదా విషయంలోగానీ సహకరించడం లేదన్న అభిప్రాయం ఏపీ ప్రజల్లో ఏర్పడింది. మొన్న కేంద్రం విదిల్చిన ప్యాకేజీ కూడా ఏపీ ప్రజలకు ఆగ్రహాన్ని తెప్పించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఫలితాలు వెలువడటం, ఆ ఫలితాలు బీజేపీకి పూర్తి వ్యతిరేకంగా వుండటం బీజేపీ కేంద్ర నాయకత్వంతోపాటు రాష్ట్ర నాయకత్వానికి కూడా షాకిచ్చింది. అతి కొద్దికాలంలోనే బీజేపీ ఢిల్లీ ప్రజలకు ఎలా దూరమైపోయిందో, తమ వ్యవహార శైలిని ఇలాగే కొనసాగిస్తే ఏపీలో కూడా తమ పరిస్థితి ఢిల్లీ తరహాలోనే అయ్యే ప్రమాదం వుందన్న గుండెదడ బీజేపీ ఏపీ నాయకత్వంలో మొదలైంది. గతంలో మాదిరిగా అలసత్వం వహించకుండా ఏపీకి అందాల్సిన ప్రయోజనాల గురించి కాస్త సీరియస్‌గా ఆలోచించాలని కేంద్ర నాయకత్వాన్ని హెచ్చరించాన్న ఆలోచనలో ఏపీ బీజేపీ నాయకత్వం ఉన్నట్టు తెలుస్తోంది.