ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదో విచిత్ర వాతావరణం
posted on Oct 19, 2015 @ 1:18PM
ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి సమయం దగ్గరపడుతుండటంతో ఏర్పాట్లన్నీ చాలా చాలా వేగంగా చేస్తున్నారు. శంఖుస్థాపన జరిగే ప్రదేశంలో యాగం చేయడానికి యాగశాల నిర్మాణం, వి.వి.ఐ.పీ.ల కోసం వేర్వేరుగా వేదికల నిర్మాణం, వాటి సమీపంలో హెలీ ప్యాడ్ల నిర్మాణం, సామాన్య ప్రజలు, రైతులు, రాజకీయ నాయకులు, వేదికలు గ్యాలరీలు నిర్మాణం వంటి పనులు దాదాపు పూర్తయిపోయాయి. ఒకవైపు అక్కడ ఆ ఏర్పాట్లు చకచకా జరుగుతుంటే, మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరికీ ఆహ్వానపత్రాలు ఇస్తూ ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు, దేశంలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయపార్టీల నేతలను, సినీ, పారిశ్రామిక, వ్యాపార మరియు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించడం పూర్తయింది. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, తెరాస మంత్రులు, నేతలు, తెలంగాణాలో మజ్లీస్, బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాల నేతలను ఆహ్వానించడం పూర్తయింది. వారిలో ఒక్క సీపీఎం పార్టీ నేతలు తప్ప మిగిలినవారు అందరూ ఈ కార్యక్రమానికి హాజరవుతామని తెలిపారు.
ఈ శంఖుస్థాపన కార్యక్రమం కోసం ప్రభుత్వం అన్ని గ్రామాల నుంచి మట్టి నీరు సేకరించే కార్యక్రమం కూడా పెట్టుకోవడంతో అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులు అదే పనిమీద దృష్టి పెట్టడంతో అన్ని జిల్లాలలో సమస్యలు పేరుకుపోతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దసరా పండుగ దగ్గర పడుతున్న సమయంలో కందిపప్పు ధర రూ.200 దాటేయడం, ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం మిగిలిన పప్పొప్పులు, కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయని, అయినా ఎవరూ పట్టించుకొనేవారే లేరని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. రాష్ట్రంలో అధికారులు అందరూ ఇదే పని మీద ఉండటంతో రాష్ట్రంలో పరిపాలన దాదాపు స్తంభించిపోయిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయంలోనే వివిధ శాఖలకు చెందిన సుమారు 19,000 ఫైళ్ళు పేరుకుపోయాయని సమాచారం.
ఇక రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి ముమ్ముర ప్రయత్నాలు సాగిస్తుంటే, మరో పక్క రాయలసీమకు చెందిన కొందరు నేతలు, రాష్ట్ర ప్రభుత్వం తమ ప్రాంతాన్ని పట్టించు కోకుండా అభివృద్ధి మొత్తం కృష్ణా, గుంటూరు జిల్లాలలోనే కేంద్రీకరిస్తున్నందుకు నిరసనగా ఈ శంఖుస్థాపన కార్యక్రమాన్ని బహిష్కరించే ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. తెదేపా నేత టీజీ. వెంకటేష్ కూడా వారికి నేతృత్వం వహిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ పోరాడుతున్న సీపీఐ కర్నూలు నుండి అమరావతికి 22వ తేదీకి చేరుకొనే విధంగా ఒక నిరసన ర్యాలీ చేప్పట్టబోతున్నట్లు సమాచారం. వైకాపా కూడా 21వరకు రకరకాలుగా నిరసన కార్యక్రమాలు చేయాలనుకొంటున్నప్పటికీ ప్రస్తుతం ప్రజలందరి దృష్టి అమరావతి, దసరా పండుగపైనే ఉండటంతో ప్రజల నుండి ఆశించినంతగా స్పందన కనబడకపోవడంతో చాలా నిరాశ చెందుతోంది.
రాష్ట్రంలో ఒకవైపు ఈ శంఖు స్థాపన హడావుడి, దసరా పండుగ హడావుడి, అదే సమయంలో ప్రతిపక్షాల నిరసనలు, ధరలు పెరిగిపోతున్నందుకు సామాన్య ప్రజల రుసరుసలు...ఇలాగ పరస్పర విరుద్దమయిన పరిణామాలు, ప్రయత్నాలు, హడావుడి అన్నిటినీ చూస్తుంటే రాష్ట్రంలో ఇంతకు ముందు ఎన్నడూ కనీవినీ ఎరుగని ఒక విచిత్రమయిన వాతావరణం నెలకొన్నట్లు అనిపిస్తోంది. బహుశః అమరావతి శంఖుస్థాపన కార్యక్రమం తరువాత మళ్ళీ క్రమంగా పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని భావించవచ్చును.