అమరావతికి భూమిపూజతో ఒక చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం
posted on Jun 6, 2015 @ 12:25PM
ఆంద్రప్రదేశ్ చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోయే రాజధాని అమరావతి నిర్మాణానికి ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. రాష్ర్ట విభజన తరువాత రాజధాని లేకపోయినందుకు రాష్ట్ర ప్రజలు అందరూ బాధపడుతుంటే కాంగ్రెస్, వైకాపాలు మాత్రం అందుకు ఏమాత్రం చింతించకపోగా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఈ మహాయజ్ఞానికి అడుగడుగునా అడ్డుపడుతూ అవరోధాలు సృష్టించడం చాలా శోచనీయం. ఒక మహత్కార్యానికి వారు ఈవిధంగా అవరోధాలు సృష్టించడం వలన చరిత్రహీనులుగా మిగిలిపోతే, వారు సృష్టిస్తున్న ఆ అవరోధాలన్నిటినీ దాటుకొంటూ రాజధాని నిర్మాణం చేయగలిగితే చంద్రబాబు నాయుడు పేరు చరిత్రలో శాస్వితంగా సువర్ణాక్షరాలతో లిఖించబడటం ఖాయం. అందుకే ఆయన ఇటువంటి సువర్ణావకాశం తనకే దక్కినందుకు చాలా గర్వపడుతున్నానని తెలిపారు.
ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటినన్నిటినీ దాటుకొంటూ ముందుకు సాగి ఆయన ఈరోజు భూమి పూజ కార్యక్రమం నిర్విగ్నంగా పూర్తి చేసారు. సంకల్పం మంచిది, గొప్పది అయితే పైనున్న భగవంతుడు కూడా తోడ్పడతాడని నిరూపిస్తూ భూమి పూజ జరుగుతున్న ప్రాంతంలో తేలికపాటి వర్షం పడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా మారింది. రాజధాని నిర్మాణ పనులు అక్టోబర్ 22నుండి మొదలుపెట్టి ఆపకుండా కొనసాగిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇదే దీక్ష, పట్టుదలతో ఆంద్రప్రదేశ్ ప్రజలందరూ గర్వపడే విధంగా రాజధాని నిర్మించి చూపుతానని అన్నారు. సైబరాబాద్, హైటెక్ సిటీలను నిర్మించి అక్కడి ప్రజలకు అక్షయపాత్ర వంటి ఆర్ధిక వనరును సృష్టించినట్లే, ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా రాజధానిని నిర్మించి, అందుకోసం భూములు ఇచ్చిన రైతులకు, రాష్ట్ర ప్రజలకు అందరికీ ప్రయోజనం కలిగించే విధంగా ఒక అద్భుతమయిన రాజధానిని నిర్మిస్తానని ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అన్నివిధాల సహాయ సహకారాలు అందజేస్తుందని, ఈ విషయంలో ప్రజలు ఎటువంటి అపోహలు, అనుమానాలు పెట్టుకొనవసరం లేదని కేంద్రమంత్రి నిర్మాలా సీతారామన్ హామీ ఇచ్చారు.
రాష్ట్ర రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరవడమే కాకుండా కొంతమంది వెండి కలశాన్ని, వెండి పూత పూసిన తాపీనీ, గమేళాని బహూకరించగా, కొంతమంది రైతులు రాజధాని నిర్మాణం కోసం విరాళాలు ఇచ్చారు. అనేకమంది స్థానిక రైతుల పిల్లలు సైతం తాము దాచుకొన్న డబ్బుని రాజధాని నిర్మాణానికి విరాళంగా అందించడం చూస్తే ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు ఎంత అర్ధరహితమో తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మొదలుపెట్టిన ఈ మహాయజ్ఞంలో ప్రతిపక్షాలు పాలుపంచుపోకపోయినా పరువాలేదు కానీ రాజధాని నిర్మాణం జరగకుండా అడ్డుకోవాలని ప్రయత్నిస్తే తమను రాష్ట్ర ప్రజలు క్షమించబోరనే సంగతి గ్రహిస్తే వారికే మంచిది.
ఇంతవరకు ఎదురయిన అవరోధాలు ఒకటొకటిగా తొలగిపోతున్నాయి. వచ్చే నాలుగేళ్ళలోనే ప్రధాన రాజధాని నగరమయిన అమరావతికి రూపు రేఖలు కల్పిద్దామని ముఖ్యమంత్రి చాలా పట్టుదలగా ఉన్నారు. కానీ రాజధానికి పూర్తిగా రూపురేఖలు రావడానికి కనీసం మరొక రెండు దశాబ్దాలు పట్టవచ్చును. కనుక మున్ముందు అనేక సవాళ్ళను ఎదుర్కొనవలసి ఉంటుంది. అప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇదే అకుంఠీత దీక్షతో, పట్టుదలతో తనకు ఎదురయిన సమస్యలను పరిష్కరించుకొంటూ ముందుకు సాగగలిగినప్పుడే ఆంధ్రుల కల అమరావతి సాకారమవుతుంది.