రాష్ట్ర పునర్నిర్మాణానికి అంకితం కావలసిన తరుణంలో
posted on Jun 2, 2015 @ 12:13PM
ఈరోజు తెలంగాణా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని తెలంగాణా ప్రజలు, ప్రభుత్వం, రాజకీయ పార్టీలు అందరూ కలిసి చాలా ఘనంగా జరుపుకొంటున్నారు. చిరకాల పోరాటాలు చేసి ప్రత్యేక రాష్ట్రం సాధించుకొన్నారు కనుక తెలంగాణా ప్రజలందరికీ ఈరోజు నిజంగానే చాలా శుభదినమే. కానీ తెలంగాణా ఏర్పాటు కోసమే జరిగిన రాష్ట్ర విభజన కారణంగా ఆంద్రప్రదేశ్ కూడా ఈరోజే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటికీ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని సంతోషంగా నిర్వహించుకోలేని పరిస్థితులు రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రయోజనాలను మాత్రమే చూసుకొంటూ ఆంద్రప్రదేశ్ ప్రజల మీద బలవంతంగా రాష్ట్ర విభజన నిర్ణయాన్ని రుద్దిన కారణంగానే రాష్ట్రం ఏర్పడింది తప్ప తెలంగాణా ప్రజలలా పోరాడి సాధించుకొన్నందున ఏర్పడినది కాదు. కాంగ్రెస్ పార్టీ స్వార్ధానికి, చేసిన తప్పులకి ఆంద్రప్రదేశ్ రాష్ట్రం, ప్రజలు కూడా భారీ మూల్యం చెల్లించుకోవలసివస్తోందిపుడు. కాంగ్రెస్ చేసిన పాపానికి రాష్ట్రం కట్టుబట్టలతో నడిరోడ్డు మీద నిలబడవలసి వచ్చింది. ఇటువంటి పరిస్థితులలో వేడుకలు నిర్వహించుకోవడం అంటే మనల్ని మనమే పరిహసించుకోవడమే. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజుని నవ నిర్మాణ దీక్షా దినంగా పాటిస్తోంది.
ఆంద్రప్రదేశ్ రాష్ట్రం అవతరించిన నాటి ఇంతవరకు రాష్ట్ర అవతరణ దినోత్సవాలని నిర్వహించుకోకుండా మానింది లేదు. కానీ మొట్ట మొదటిసారిగా అవతరణ దినోత్సవాన్ని కూడా జరుపుకోలేకపోతున్నాము. అందుకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీనే నిందించక తప్పదు. ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక గడ్డు సమస్యలని, పరిస్థితులని అధిగమించి మళ్ళీ ఎప్పుడు సగర్వంగా తలలెత్తుకొని నిలబడగలదో అప్పుడే రాష్ట్రానికి నిజమయిన పండుగ రోజు. అటువంటి రోజు కోసం రాష్ట్ర ప్రజలందరినీ కార్యోన్ముఖులను చేసి ఆంద్రప్రదేశ్ పునర్నిర్మాణంలో పాలు పంచుకొనేలా చేసేందుకే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నవ నిర్మాణ దీక్ష మొదలు పెట్టింది.
కానీ దురదృష్టమేమిటంటే, ఇటువంటి మహత్కార్యంలో పాలుపంచుకోవలసిన ప్రతిపక్షాలు దీనిని కూడా రాజకీయం అంటగట్టడం. ప్రజాభీష్టానికి విరుద్దంగా రాష్ట్ర విభజన చేసినందుకు ప్రజలు కాంగ్రెస్ పార్టీని చాలా కటినంగా శిక్షించినప్పటికీ, నేటికీ ఆ పార్టీ నేతల్లో పశ్చాతాపం ఏ కోశాన్న కనబడటం లేదు. తమ పార్టీ చేసిన తప్పుకి రాష్ట్రంలో పార్టీ భవిష్యత్ అంధకారంగా మారినందునే బొత్స సత్యనారాయణ వంటి సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా పార్టీని వీడి వేరే పార్టీలలోకి వెళ్లిపోతున్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా భ్రమలలోనే జీవిస్తూ, ప్రజలను కూడా మభ్యపెట్టే ప్రయత్నాలు చేయడం విచిత్రమే.
ప్రజాభీష్టానికి విరుద్దంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటన చేసి రాష్ట్ర ప్రజలను ఏదో ఉద్దరించినట్లు, తామిచ్చిన ఆ హామీని తెదేపా, మోడీ ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని మొసలి కన్నీళ్లు కార్చుతోందిపుడు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఏనాటికయినా రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే ఆలోచనే ఉంటే ఈవిధంగా మొసలి కన్నీళ్లు కార్చుతూ ప్రత్యేక హోదాపైనో లేదా మరొక అంశమో పట్టుకొని రాజకీయాలు చేయడం మాని రాష్ట్ర పునర్నిర్మాణంలో పాలు పంచుకొంటే ఏదో ఒకనాడు రాష్ట్ర ప్రజల మనసులు కరుగక మానవు. తమ పార్టీ చేసిన ఈ చారిత్రికమయిన తప్పిదానికి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ప్రాయశ్చితం చేసుకోకపోతే వారు ఎన్నిబకెట్లు మొసలి కన్నీళ్లు కార్చినా ప్రజలు కూడా పట్టించుకోరనే సంగతి గ్రహిస్తే మంచిది.
ఇక రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైకాపా అధికార తెదేపాతో ఉన్న రాజకీయ వైరం కారణంగా, ఆంద్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తన శత్రువుగా భావిస్తూ ప్రభుత్వం చేపడుతున్న ప్రతీ కార్యక్రమానికి అవరోధాలు కల్పిస్తుండటం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెరాసకు, తెలంగాణా ప్రభుత్వానికి అనధికార ప్రతినిధిలా వ్యవహరిస్తుండటం రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ఆ పార్టీ తన వంతు సహాయ సహకారాలు అందించకపోయినా పరువాలేదు కానీ అడ్డుపడకుండా ఉంటే అంతే చాలు అని ప్రజలు భావిస్తున్నారు. రాష్ట్రం ఇటువంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు కాంగ్రెస్, వైకాపాలు ఇంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం చాలా శోచనీయం.
రాష్ట్ర ప్రజల, మోడీ ప్రభుత్వ సహాయ సహాకారాలతో రాష్ట్ర ప్రభుత్వం ఏటికి ఎదురీదుతూ మరీ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం శ్రమిస్తోంది. బహుశః రానున్న రెండు మూడేళ్ళలోనే రాష్ట్రం మళ్ళీ స్వయం సంవృద్ది సాధించి తన కాళ్ళ మీద తను నిలబడే రోజు తప్పకుండా వస్తుంది. అప్పుడు రాష్ట్ర ప్రజలందరూ తాము పునర్నిర్మించుకొన్న రాష్ట్రాన్ని చూసుకొని సగర్వంగా పండగ చేసుకోవచ్చును. కానీ అందులో ప్రతిపక్షాలకు కూడా భాగం కావాలనుకొంటే, రాష్ట్రాభివృద్దికి అడుగడుగునా అడ్డం పడటం మాని తమ వంతు కృషి చేస్తూ సహాయ సహకారాలు అందించాల్సి ఉంటుంది.