రాజకీయ ప్రయోజనాల కోసం నేరస్తులను వెనకేసుకు వస్తే...
posted on Apr 10, 2015 @ 12:18PM
తమిళనాడుకు చెందిన 20 మంది ఎర్రచందనం స్మగ్లర్ల ఎన్కౌంటర్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉంది కనుక రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు అదొక మంచి ఆయుధంగా దొరికింది. ఈ అంశాన్ని పట్టుకొని తమిళనాడులో రాజకీయపార్టీలు కూడా రాజకీయాలు సాగిస్తున్నాయి. అధికార అన్నాడీఎంకే పార్టీ కంటే ముందుగా కరుణానిధికి చెందిన డీయంకె పార్టీ ఈ అంశం మీద స్పందించుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు నిర్వహించింది. తమ రాష్ట్రానికి చెందిన అమాయకులయిన కూలీలను ఆంధ్రప్రదేశ్ పోలీసులు పొట్టనబెట్టుకొన్నారని ఘాటుగా విమర్శలు చేసింది. అంతే కాదు చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.2లక్షల పరిహారం కూడా అందజేసింది.
ఇది చూసి అధికార పార్టీ కూడా వారికి నష్టపరిహారం చెల్లించకతప్పలేదు. రాష్ట్ర మంత్రులు, యం.యల్యే.ల ద్వారా భాదిత కుటుంబాలకు చెక్కులు అందజేసింది. అక్రమాస్తుల కేసులో ముఖ్యమంత్రి పదవి పోగొట్టుకొని జైలుకి వెళ్లివచ్చిన అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత కూడా మీడియా ముందుకు వచ్చి ఈ ఎన్కౌంటర్ ని ఖండిస్తూ మాట్లాడవలసివచ్చింది. “మీడియాలో వచ్చిన ఫోటోలను చూస్తే ఈ ఎన్కౌంటర్ పై అనుమానాలు కలుగుతున్నాయి. ఒకవేళ చనిపోయిన వారందరూ స్మగ్లర్లే అనుకొన్నప్పటికీ వారిపై అంతమంది పోలీసులు దాడి చేయడం చాలా అనుమానాలను రేకెత్తిస్తోంది,” అని ఆమె అన్నారు. తమిళనాట మిగిలిన చిన్నా చితకా రాజకీయ పార్టీలు కూడా ఈ అంశంపై చేయగలిగినంతా హడావుడి చేసాయి.
ఈ ఎన్కౌంటర్ లో మానవ హక్కుల ఉల్లంఘన అనే అంశాన్ని వేరుగా చూసినట్లయితే, ఎర్రచందనం స్మగిలింగ్ వ్యవహారం చట్ట విరుద్దమయిన పని అందరూ అంగీకరించకమానరు. చట్ట విరుద్దమయిన అటువంటి పనులను అరికట్టవలసిన బాధ్యత ఉన్నందునే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం దానిని అరికట్టేందుకు చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నమే చేసింది. కానీ ఈసారి ఆ ప్రయత్నంలో 20మంది చనిపోవడంతో రాష్ట్రంలో ప్రతిపక్షపార్టీలు, తమిళనాడులో అధికార ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని తప్పు పడుతున్నాయి. కానీ అటువంటి పనులకు పాల్పడినవారిని రాజకీయ పార్టీలు సమర్ధించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఒక ప్రభుత్వానికి చట్ట విరుద్దమయినది మరొక ప్రభుత్వానికి ఆమోదయోగ్యంగా భావించడం ఎలా సాధ్యమో దానికే తెలియాలి. రాజకీయ పార్టీలు తమ ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో ఉంచుకొని ఇటువంటి చట్టవిరుద్దమయిన పనులకు పాల్పడిన వారికి మద్దతు ఇవ్వడం, వారి కుటుంబాలకు పోటాపోటీలుగా నష్టపరిహారాలు చెల్లించడం వలన, అటువంటి పనులకు పాల్పడటం తప్పు కాదని చెపుతున్నట్లుంది. ఇదంతా చూసి మరింత మంది అటువంటి చట్ట విరుద్దమయిన పనులకు పాల్పడే అవకాశం కూడా ఉంది.
ఇప్పుడు ఈ సంఘటన ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది కనుక తమిళనాడు ప్రభుత్వం, రాజకీయ పార్టీలు వారినందరినీ వెనకేసుకు రావచ్చును. కానీ రేపు ఇదే పని తమిళనాడు రాష్ట్రంలోనే చేసినట్లయితే అప్పుడు కూడా రాజకీయ పార్టీలు వారిని ఇదేవిధంగా వెనకేసుకు రాగలరా? అప్పుడు కూడా ఇదేవిధంగా వారి కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించగలరా?
ఇటువంటి చట్ట వ్యతిరేక పనులకు పాల్పడిన వారి కుటుంబాలకు ప్రభుత్వాలు నష్టపరిహారం చెల్లించడమే ఒక కొత్త సంప్రదాయం సృష్టిస్తే, వికారుద్దీన్ వంటి ఉగ్రవాదుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించవలసిన అగత్యం ఏర్పడినా ఆశ్చర్యం లేదు. ఆ తరువాత క్రమంగా రకరకాల నేరస్తుల కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించవలసివచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. చట్టవిరుద్దమయిన పనులకు పాల్పడినందుకు రామలింగ రాజు అంతటివాడినే జైలుకి పంపారు తప్ప ఈవిధంగా జాలి చూపలేదు. కానీ ఆంద్ర, తెలంగాణాలలో ప్రతిపక్ష పార్టీలు, తమిళనాట అధికార ప్రతిపక్ష పార్టీలు మాత్రం అటువంటి వారిని వెనకేసుకురావడం చాలా శోచనీయం. రాజకీయ పార్టీలు తమ ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో ఉంచుకొని ఇటువంటి నేరస్తులకు మద్దతు పలకడం, ప్రభుత్వాలపై ఒత్తిడి చేయడం ఎంతవరకు సమంజసమో వారూ ఆలోచించుకోవాలి.