ప్రవేశపన్నుపై భిన్న వాదనలు
posted on Apr 4, 2015 @ 10:32AM
ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణాలోకి ప్రవేశిస్తున్న ఆంధ్రా వాహనాలపై తెలంగాణా ప్రభుత్వం ప్రవేశపన్ను విధించడంతో రెండు రాష్ట్రాల మధ్య మళ్ళీ కొత్త సమస్య మొదలయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీనిపై అభ్యంతరం తెలుపుతోంది. దీనిపై ఇప్పటికే హైకోర్టులో ఒక పిటిషనుపై దాఖలయింది కనుక హైకోర్టు తీర్పు వెలువడిన తరువాత తదుపరి చర్యలు చేప్పట్టాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణా ప్రభుత్వం మాత్రం తన నిర్ణయాన్ని సమర్ధించుకొంటోంది.
తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత కూడా ఇంకా ఈ షరతులు, ఆంక్షలు విధిస్తుంటే ఇక ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుచేసి ఏమి ప్రయోజనం? తమ రాష్ట్ర ప్రయోజనాలను, హక్కులను కాపాడుకొనే హక్కు తమ ప్రభుత్వానికి లేదా?తమ రాష్ట్ర అవసరాలకు, అభివృద్ధికి అనుగుణంగా చట్టాలు చేసుకొనే హక్కు తమకు లేదా? అని తెలంగాణా ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత కూడా దేశంలో మరే ఇతర రాష్ట్రాలకు లేని ఆంక్షలు తమకే ఎందుకని తెలంగాణా ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. ఆ వాదనలు, ఆవేదన సహేతుకమే. కానీ అటువంటి పరిస్థితి ఎందుకు కలిగిందో తెలంగాణా ప్రభుత్వానికి, దానిని నడుపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కి కూడా తెలుసు.
సార్వత్రిక ఎన్నికలలోగా రాష్ట్ర విభజన జరిగితే చాలన్నట్లు తెరాస పార్టీ వ్యవహరించింది.తెరాస ఒత్తిడి కారణంగా, తరుముకొస్తున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని యూపీఏ ప్రభుత్వం చాలా సంక్లిష్టమయిన రాష్ట్ర విభజనను తూతూ మంత్రంలా హడావుడిగా పూర్తి చేసి చేతులు దులుపుకోనేందుకే ప్రయత్నించింది తప్ప అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏకరువు పెడుతున్న ఏ ఒక్క సమస్యను కూడా పట్టించుకోలేదు.
అయితే గత పదేళ్ళుగా తెలంగాణా కోసం ఉద్యమాలు జరుగుతున్నప్పుడు ఏదో ఒకరోజు రాష్ట్రవిభజన చేయక తప్పదని కాంగ్రెస్ పార్టీకి తెలిసి ఉన్నప్పటికీ రెండు రాష్ట్రాలకు అందుకు తగ్గట్లుగా ముందస్తు ఏర్పాట్లు చేయలేదు. ముందస్తు ఏర్పాట్లు చేసిన తరువాత తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేసి ఉండి ఉంటే ఇటువంటి సమస్యలు ఉత్పన్నం అయ్యేవి కావు.
దేశంలో మిగిలిన రాష్ట్రాల నుండి తెలంగాణాలో ప్రవేశించే వాహనాలపై ప్రవేశపన్ను విధించడంలో ఎవరూ ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయడం లేదనే విషయం గమనిస్తే, ఈ సమస్య కేవలం ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలకు మాత్రమే పరిమితమని, రాష్ట్ర విభజన జరిగినప్పటికీ ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాల మధ్య ఉమ్మడి రాజధాని బంధం ఉన్నందునే ఈ సమస్య ఉత్పన్నం అవుతోందనే సంగతి స్పష్టం అవుతోంది. కనుక ఇది తెలంగాణా రాష్ట్ర హక్కులకు, ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్న సమస్యగా చూడటం సమంజసం కాదు. రెండు రాష్ట్రాలకు మరో తొమ్మిదేళ్ళపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటునప్పుడు ఆంధ్రప్రదేశ్ వాహనాలు తమ రాజధానికి వెళ్ళాలంటే ప్రవేశపన్ను చెల్లించాలని తెలంగాణా ప్రభుత్వం కోరడం సహేతుకం కాదు.
ఆంధ్రప్రదేశ్ వాహనాలపై తెలంగాణా ప్రభుత్వం ప్రవేశపన్ను విధిస్తే అందుకు బదులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తెలంగాణా నుండి వచ్చే వాహనాలపై పన్ను విధించడం మొదలుపెడితే ముందుగా నష్టపోయేది ప్రజలే. కనుక కనీసం ఈ ఉమ్మడి బంధం కొనసాగినంత కాలం ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి అంశాలపై పరస్పరం చర్చించుకొని నిర్ణయాలు తీసుకొంటే ఇటువంటి సమస్యలను నివారించవచ్చును. ఈ అంశంపై హైకోర్టు ఎలాగూ తన తీర్పు వెల్లడించబోతోంది. కనుక ఎవరికి ఎటువంటి అభిప్రాయాలున్నప్పటికీ కోర్టు తీర్పు కోసం వేచి చూడటమే మంచిది.