ఆంద్ర, తెలంగాణా స్పీకర్లపై అవిశ్వాస తీర్మానాలు?
posted on Mar 20, 2015 @ 10:30AM
ఆంద్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్ర శాసనసభల స్పీకర్లిరువురుపై ఆయా రాష్ట్రాలలో ప్రతిపక్ష పార్టీ సభ్యులు అవిశ్వాస తీర్మానాలు పెట్టడం చాలా ఆశ్చర్యం, బాధ కలిగిస్తోంది. ఆంధ్రా శాసనసభలో వైకాపా సభ్యులలో కేవలం 8 మందిని మూడు రోజులు సభ నుండి సస్పెండ్ చేసినందుకు వారి అధినేత జగన్మోహన్ రెడ్డి సభ నుండి వాకవుట్ చేసారు. స్పీకర్ కు వ్యతిరేకంగా తామిచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు చేపడితేనే సభకు తిరిగి వస్తామని లేకుంటే సమావేశాలను బహిష్కరిస్తామని ప్రకటించారు. బడ్జెట్ పై తన అభిప్రాయాలను మీడియా ద్వారా తెలియజేస్తానని జగన్మోహన్ రెడ్డి ప్రకటించి అందరూ నివ్వెరపోయేలా చేసారు.
వైకాపాకున్న 67మంది సభ్యులలో కేవలం 8 మందిని మాత్రమే సస్పెండ్ చేయబడ్డారు. అది కూడా కేవలం మూడు రోజులకోసం మాత్రమే. కనుక జగన్మోహన్ రెడ్డితో సహా మిగిలినవారందరూ సభా కార్యక్రమాలలో పాల్గొని ప్రభుత్వాన్ని నిలదీయవచ్చును. కానీ ఆవిధంగా చేయకుండా ఏవో కుంటిసాకులు చూపిస్తూ సమావేశాలకు హాజరుకాకపోవడం భాద్యతారాహిత్యమే కాకుండా అధికార పార్టీకి భయపడి సభ నుండి పారిపోయినట్లే అవుతుంది. పైగా బడ్జెట్ తన అభిప్రాయాలను మీడియాలో చూసుకోమని జగన్మోహన్ రెడ్డి చెప్పడం ఆయన అహంకారానికి అద్దం పడుతోందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
శాసనసభలో వేరే ఇతర పార్టీలు ప్రతిపక్ష స్థానంలో ఉండి ఉంటే, వైకాపా ఈవిధంగా చేసినా బహుశః ఎవరూ పట్టించుకొనేవారు కారు. కానీ సభలో వైకాపా తప్ప మరో ప్రతిపక్ష పార్టీ లేనప్పుడు వైకాపా ఈవిధంగా సభ నుండి పారిపోవడం బాధ్యతారాహిత్యమేనని చెప్పక తప్పదు. శాసనసభకు హాజరు కాకూడదనే జగన్మోహన్ రెడ్డి నిర్ణయం వలన రాష్ట్రంలో 67 నియోజక వర్గాలకు సభలో ప్రాతినిధ్యం లేకుండా చేసారు. చట్టసభలలో ప్రజా సమస్యలు, ప్రయోజనాల గురించి చర్చిస్తారని ప్రజలు ఆశిస్తారే తప్ప ఈవిధంగా పార్టీ ప్రయోజనాల కోసం పోరాటాలు చేస్తారని ఎవరూ ఊహించి ఉండరు. అటువంటి ప్రజాప్రతినిధులను ఎన్నుకొన్నందుకు ప్రజలు కూడా పశ్చాత్తాపపడేలా చేస్తున్నారు.
ఇక వైకాపా సభ్యులు కుంటిసాకులతో శాసనసభకు వెళ్ళకుండా తప్పించుకోవాలని ప్రయత్నిస్తుంటే, తెలంగాణా శాసనసభ నుండి సస్పెండ్ అయిన తెదేపా సభ్యులు ఏదో విధంగా మళ్ళీ సభకు హాజరవ్వాలని ప్రయత్నిస్తుండటం విశేషం.
వారు స్పీకర్ ని కలిసి తాము క్షమాపణ చెప్పేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపారు. ప్రతిపక్ష నేతలు జానారెడ్డి, కిషన్ రెడ్డి తదితరులను కలిసి తమను సభలోకి అనుమతించమని ప్రభుత్వంపై ఒత్తిడి చేయమని కోరారు. కానీ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ వారిని సభలోకి అనుమతించకపోవడంతో తెదేపా సభ్యులు స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ఆలోచిస్తున్నారు.
తెలంగాణా శాసనసభలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా కాక తెరాసకు అనుబంధ పార్టీగా వ్యవహరిస్తోందనే అపవాదు మూటగట్టుకొంది. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి గనుకనే ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు తెరాస మంత్రులు తమతో ఇంత వినమ్రంగా వ్యవహరిస్తున్నారని, సమావేశాలు ముగియగానే మళ్ళీ కాంగ్రెస్ నుండి తెరాసలోకి వలసలు, జి.హెచ్.యం.సి. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై తెరాస నేతల ఆరోపణలు, విమర్శలు అన్నీ ఎదుర్కోక తప్పదని గ్రహించిన కాంగ్రెస్ నేతలు, అవిశ్వాస తీర్మానంలో తెదేపాకు సహకరించడం మంచిదా లేక తామే స్వయంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం మంచిదా అనే సందిగ్దంలో పడ్డారు. కాంగ్రెస్, తెదేపాల ఉద్దేశ్యాలు ఏవయినప్పటికీ తెలంగాణా స్పీకర్ లేదా ప్రభుత్వం మీద సోమవారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది.