వారి దారులు వేరయినా గమ్యం ఒక్కటే...రాష్ట్రాభివృద్ధి!
posted on Mar 13, 2015 @ 11:59AM
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు మరియు కేసీఆర్ ఇరువురు తమ తమ రాష్ట్రాల అభివృద్ధికి విభిన్న మార్గాలను ఎంచుకొన్నట్లు వారి ప్రభుత్వ కార్య ప్రణాళికలను గమనిస్తే అర్ధమవుతుంది. తెలంగాణాలో భూములు అంత సారవంతమయినవి కావు. పైగా వాటికి నీటి సదుపాయం కూడా లేదు. దానికి తోడు రాష్ట్రంలో విద్యుత్ కొరత కూడా తీవ్రంగా ఉంది. ఈ సమస్యల కారణంగా 65 శాతం గ్రామాలు పేదరికంతో బాధపడుతున్నాయి.
ఈ అంశాలన్నిటినీ దృష్టిలో పెట్టుకొని వాటి పరిష్కారం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్ పధకాలను అమలుచేస్తున్నారు. తద్వారా విద్యుత్ సరఫరాతో సంబంధం లేకుండా గ్రామాలకు త్రాగునీరు, పంటలకు సాగునీరు అందుతుంది. ఒకసారి చెరువులు నిండితే భూగర్భజలాలు కూడా గణనీయంగా పెరుగుతాయి. అదేవిధంగా చెరువులలో తీసిన అత్యంత పోషక విలువలున్న పూడిక మట్టిని పంట భూములపై వేసుకొన్నట్లయితే భూమిలో సారం కూడా పెరుగుతుంది. చెరువులు నిండి పంటలకు సకాలంలో నీళ్ళు అందుతుంటే పంటలు కూడా పండుతాయి. తద్వారా క్రమంగా పేదరికం కూడా తగ్గుతుంది. ఈవిధంగా బహుళ ప్రయోజనాలున్న ఈ ప్రాజెక్టు వల్ల వచ్చే నాలుగేళ్లలో తెలంగాణా రాష్ట్రంలో స్పష్టమయిన అభివృద్ధి కనబడటం తధ్యం. బహుశః కేసీఆర్ చేప్పట్టిన ఈ ప్రాజెక్టు యావత్ దేశానికి ప్రేరణ కలిగించినా ఆశ్చర్యం లేదు. కనుక ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇటువంటి ప్రాజెక్టుని రాష్ట్రంలో అమలు చేసేందుకు ఇప్పటి నుండే ప్రయత్నిస్తే బాగుంటుందేమో ఆలోచించాలి.
ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐ.టి, విద్య, స్కిల్ డెవెలప్ మెంట్, పారిశ్రామిక, వాణిజ్య, మౌలికవసతులపై దృష్టి కేంద్రీకరిస్తున్నట్లున్నారు. అదేవిధంగా రాజధాని నిర్మాణం కూడా అత్యంత ప్రాధాన్య అంశంగా తీసుకొన్నారు. ఆయన అనుకొన్నట్లుగా వచ్చే నాలుగేళ్లలో రాజధాని నగరానికి ఒక రూపు రేఖలు తీసుకురాగలిగి, పైన పేర్కొన్న అన్ని రంగాలలో అభివృద్ధి చేయగలిగితే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి తెలంగాణా కంటే మెరుగయ్యే అవకాశం ఉంది.
రాష్ట్రానికి సువిశాలమయిన సముద్రతీరం ఉంది. కనుక కొత్తగా పోర్టులను నిర్మించి వాటిని రాష్ట్రంలో వివిధ ప్రాంతాలతో అనుసంధానం చేసే విధంగా విశాలమయిన రోడ్లు నిర్మించడం ద్వారా వ్యాపార కార్యక్రమాలు పెరిగి రాష్ట్రానికి ఆదాయం సమకూరుతుందని ముఖ్యమంత్రి భావిస్తున్నారు.
అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా సారవంతమయిన భూములున్నాయి. వాటికి సాగునీరు అందించడానికి కూడా ప్రభుత్వం అనేక పధకాలు సిద్దం చేసింది. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయగలిగినట్లయితే రాజధాని నిర్మాణం వలన 40,000 ఎకరాలలో కోల్పోతున్న పంట దిగుబడి ఇతర ప్రాంతాలలో తిరిగి సృష్టించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఈలోగా వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం ద్వారా కూడా దిగుబడి పెంచి సమతుల్యం సాధించాలని భావిస్తున్నారు.
ఈ విధంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమతమ రాష్ట్రాభివృద్ధికి విభిన్న మార్గాలు, వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. వచ్చేఎన్నికల నాటికి ఇరు రాష్ట్రాలలో జరిగిన అభివృద్ధి వారి చిత్తశుద్ధికి, సమర్ధతకు గీటురాయిగా నిలుస్తుంది.