కేంద్రానికి రెండు కళ్ళు సమానమే
posted on Feb 5, 2015 @ 11:21AM
ఎట్టకేలకు కేంద్రం ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.850కోట్ల నిధులు మంజూరు చేసింది. దీనిలో రాష్ట్ర బడ్జెట్ లో ఆర్ధికలోటు భర్తీకి గాను రూ.500 కోట్లు, రాయలసీమ మరియు ఉత్తరాంధ్రాలో వెనుకబడిన ఏడు జిల్లాల అభివృద్ధికి రూ.350 కోట్లు మంజూరు చేసింది. రాష్ట్ర బడ్జెట్ లోటు రూ. 16,000 కోట్లని ఇదివరకు రాష్ట్ర ప్రభుత్వమే ప్రకటించింది. దానిలో రూ.500కోట్లు అంటే చాలా చిన్న మొత్తమే. కానీ అది తాత్కాలిక సహాయం క్రిందే పరిగణించాలని కేంద్రం ప్రకటించింది. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని అంచనా వేసేందుకు కేంద్ర మంత్రులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని కేంద్రం నియమించింది. ఆ కమిటీ నివేదికను బట్టి రాష్ట్రానికి అవసరమయినంతా ఆర్ధిక సహాయం చేస్తానని కేంద్రం హామీ ఇవ్వడం ద్వారా తను కాంగ్రెస్ పార్టీలా చేతులు దులుపుకొని వెళ్ళిపోవడం లేదని చాలా విస్పష్టంగా తెలియజేసింది.
ఇక ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించేందుకు కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఎదురవడంతో దానికి ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రలో ఏడూ జిల్లాలకు ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ మరియు ఆ ప్రాంతాలలో పరిశ్రమల స్థాపనకు కొన్ని పన్ను రాయితీలు కూడా ప్రకటించింది. కేంద్రప్రభుత్వం తెలంగాణా రాష్ట్రం పట్ల వివక్ష ప్రదర్శిస్తోందనే తెరాస వాదనలు అర్ధరహితమని నిరూపిస్తూ, తెలంగాణాలో వెనుకబడిన జిల్లాలలో పారిశ్రామిక అభివృద్ధికి కూడా ఇవే రాయితీలను వర్తింపజేసింది.
విభజన చట్టంలో హామీ ఇచ్చిన విధంగానే ఆంద్రప్రదేశ్, తెలంగాణా రెండు రాష్ట్రాలకు పూర్తి న్యాయం చేస్తానని కేంద్రం పదేపదే చెపుతున్నప్పటికీ, రెండు రాష్ట్రాలలో ప్రతిపక్ష పార్టీలు కేంద్రం మీద విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. వాటి విమర్శలకు నిన్న ప్రకటించిన ఈ భారీ నిధులు, రాయితీలతో కేంద్రం సరయిన సమాధానం చెప్పింది. అంతే కాదు తెలంగాణాలో ఎయిమ్స్ ఆసుపత్రి స్థాపించేందుకుకు తను పంపించిన ప్రతిపాదనలపై తెలంగాణా ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించడం గమనిస్తే కేంద్రం అన్ని రాష్ట్రాలను సమానదృష్టితోనే చూస్తోందని అర్ధమవుతోంది.
ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి హామీ ఇచ్చిన విధంగా ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయినప్పటికీ, అంతకు ఏ మాత్రం తీసిపోని విధంగా రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి మున్ముందు అనేక రాయితీలను, ప్రోత్సాహకాలను ఇవ్వబోతున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈనెల పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే రైల్వే బడ్జెట్ లో ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయబోతున్నట్లు ఇదివరకే కేంద్రం ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తెలియజేసింది. అదేవిధంగా రాష్ట్ర రాజధానిలో ప్రధాన ప్రాంత నిర్మాణానికి కేంద్రం నిధులు విడుదల చేసేందుకు సిద్దంగా ఉందని కేంద్రమంత్రి సుజన చౌదరి కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు.
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఎయిమ్స్ ఆసుపత్రి, ఐ.ఐ.యం. మరియు ఐ.ఐ.టి.లకు కేంద్రం ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ ఇంతకాలం నిధుల విడుదలలో జాప్యం వలన ప్రతిపక్షాల నుండి కొన్ని విమర్శలు మూటగట్టుకోవలసి వచ్చింది. అయితే ఆంద్ర, తెలంగాణా రాష్ట్రలలో బీజేపీ నేతలు చొరవ తీసుకొని ప్రజలలో నెలకొన్న అపోహలు దూరం చేసి ఉంటే విమర్శలకు అవకాశం ఉండేది కాదు. కొంచెం ఆలశ్యం అయినప్పటికీ కేంద్రం తెలుగు రాష్ట్రాలకు ఈవిధంగా చేయూతనీయడం హర్షణీయమే.