ఉద్యోగులూ ఓ చెయ్యి వేయాలి
posted on Feb 4, 2015 9:20AM
రాష్ట్ర విభజన జరిగినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకపోవడంతో హైదరాబాద్ నుండే పరిపాలన కొనసాగించవలసి వస్తోంది. చట్ట ప్రకారం మరో తొమిద్దినరేళ్ళపాటు అక్కడి నుండే పరిపాలించుకొనే వెసులుబాటు కూడా ఉంది. కానీ ప్రభుత్వం, పరిపాలనా, శాసనసభ సమావేశాలు అన్నీ కూడా పొరుగు రాష్ట్రం నుండే నిర్వహించడం పట్ల రాష్ట్ర ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. తమ ప్రభుత్వం తమకు అందుబాటులో లేదనే భావన వారిలో నెలకొని ఉంది. కానీ పరిస్థితులను చూసి ప్రజలు కూడా ఏమీ అనలేకపోతున్నారు. ప్రజలలో నెలకొన్న ఈ అసంతృప్తిని గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారానికి రెండు రోజుల చొప్పున అన్ని జిల్లాల పర్యటనలు చేయవలసి వచ్చింది. కానీ అది ఈ సమస్యకు శాశ్వితపరిష్కారం కాదని ఆయనకీ తెలుసు. అందుకే ఆయన అమరావతి వద్ద తాత్కాలిక రాజధాని నిర్మించుకొని జూన్-జూలై నెలాఖరులోగా హైదరాబాద్ లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వప్రధాన కార్యాలయాలను అక్కడికి తరలించాలని భావిస్తున్నారు.
పొరుగు రాష్ట్రంలో ఉంటూ పరిపాలన చేయడంలో ఉండే పరిపాలనాపరమయిన సమస్యలు, ఇబ్బందులు అందరికీ తెలుసు. ముఖ్యంగా ఆంద్ర, తెలంగాణా ఉద్యోగుల మధ్య నిత్యం ఏదో ఒక విషయంలో ఘర్షణలు జరుగుతుండటంతో ఉద్యోగులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ దుస్థితి నుండి బయటపడాలంటే విజయవాడకు తరలిరావడం ఒక్కటే పరిష్కారం. తెలంగాణా ప్రభుత్వం త్వరలో సెక్రటరియేట్ భవనాన్ని ఎర్రగడ్డ వద్ద నిర్మించబోయే కొత్త భవనంలోకి తరలించాలని భావిస్తోంది. అదే జరిగితే ఆంద్ర ఉద్యోగులు ఇంకా ఇబ్బందులు పడవవచ్చును. ఆ కారణంగా ఉద్యోగుల మధ్య, ప్రభుత్వాల మధ్య కూడా ఘర్షణ వాతావరణం ఏర్పడవచ్చును.
కానీ పూర్తి ఏర్పాట్లు, సౌకర్యాలు లేకుండా ఒకేసారి వేలాదిమంది ఉద్యోగులను, ప్రభుత్వ కార్యాలయాలను తాత్కాలిక రాజధానికి తరలిస్తే కూడా ఊహించని అనేక కొత్త ఇబ్బందులు ఎదుర్కోవలసి రావచ్చును. మళ్ళీ అంతా సర్ధుకొనే వరకు పరిపాలనకు కూడా కొంత ఇబ్బంది కలగవచ్చును. ముఖ్యంగా హైదరాబాద్ లో చిరకాలంగా స్థిరపడిన ఉద్యోగులు అకస్మాత్తుగా విజయవాడకు తరలిరావాలంటే చాలా ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే ఎన్జీవో సంఘాల నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేసారు. తమపై ఒత్తిడి చేస్తే ప్రతిఘటిస్తామని హెచ్చరించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారితో నిన్న రాత్రి సమావేశమయ్యి వారి సమస్యలన్నిటినీ వారం రోజుల్లో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. తాత్కాలిక రాజధాని ప్రాంతంలోనే 3000 మంది ఉద్యోగులు, అధికారులకు గృహ సముదాయాలు నిర్మిస్తామని చెప్పారు. పొరుగు రాష్ట్రం నుండి పరిపాలన చేయడంలో ఇబ్బందులను వారికి వివరించి, ప్రభుత్వంతో సహకరించవలసిందిగా కోరారు. వారు ఆయనకి స్పష్టమయిన హామీ ఇవ్వనప్పటికీ, ఆయన వారికి ఇచ్చిన హామీని నిలబెట్టుకొంటే సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. కనుక జూన్ నెలాఖరుకల్లా తాత్కాలిక రాజధానికి ప్రభుత్వం తరలివచ్చే అవకాశాలున్నాయని భావించవచ్చును.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ప్రభుత్వోద్యోగులు రెండున్నర నెలల పాటు చేసిన అనన్య సామాన్యమయిన పోరాటంలో వారు అనేక త్యాగాలు చేసారు. దానిని రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ మరిచిపోలేరు. రాష్ట్ర పునర్నిర్మాణం కూడా వారి చేతుల మీదుగానే జరుగవలసి ఉంది. వారి సహకారం లేనిదే ఈ పరిస్థితుల నుండి రాష్ట్రం తేరుకోలేదు. రాజధాని నిర్మాణం కోసం తుళ్ళూరు మండలంలో రైతులు తమ జీవనాధారమయిన వ్యవసాయ భూములను ప్రభుత్వానికి అప్పగించి అపూర్వమయిన త్యాగాలు చేస్తున్నారు. కనుక ఉద్యోగులు కూడా రాష్ట్ర హితాన్ని దృష్టిలో పెట్టుకొని కొంత త్యాగాలు చేయక తప్పదు. వారు తాత్కాలికంగా ఒకటి రెండేళ్ళు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి రావచ్చునేమో గానీ వారిప్పుడు ప్రభుత్వానికి సహకరిస్తే వేగంగా రాజధాని నిర్మాణం పూర్తవుతుంది. అప్పుడు అందరి కంటే ముందుగా ప్రయోజనం పొందేది వారే.
ప్రభుత్వానికి అందులో పనిచేసే ఉద్యోగులకి మధ్య చక్కటి సమన్వయము ఉన్నప్పుడే రాష్ట్రాభివృద్ధి జరుగుతుంది. వేగంగా రాష్ట్రాభివృద్ధి జరిగితేనే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. అప్పుడే ప్రభుత్వం కూడా వారి జీతభత్యాలు పెంచగలదు. ఇవ్వన్నీ ఉద్యోగులకు తెలియని విషయాలు కాదు.
ఇది చంద్రబాబుకో లేక రాష్ట్ర ప్రభుత్వానికో తెదేపాకో చెందిన సమస్య కాదిది. ఉద్యోగులతో సహా రాష్ట్ర ప్రజలందరికీ సంబందించిన సమస్య. రాజధాని లేకుండా, రాష్ట్రం ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే అది ఎవరికీ గౌరవంగా ఉండదు. కనుక ఉద్యోగులు కూడా తమ వ్యక్తిగత సమస్యల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమనే దృక్పధంతో ఉడతాభక్తిగా తమవంతు కర్తవ్యం, బాధ్యతలు నెరవేర్చవలసి ఉంటుంది. ఉద్యోగులు కూడా ప్రభుత్వానికి సహకరించి రాష్ట్ర పునర్నిర్మాణంలో కీలక పాత్ర వహిస్తే అది వారికీ ఎంతో గౌరవంగా, గర్వంగా ఉంటుంది. రాష్ట్ర ప్రజలు కూడా హర్షిస్తారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగుల సమస్యలను, ఈవిషయంలో వారి సలహాలను కూడా పరిగణనలోకి తీసుకొని ఎవరికీ ఇబ్బంది కలగని విధంగా మధ్యే మార్గంలో అడుగులు ముందుకు వేసినట్లయితే వారు కూడా చాలా సంతోషిస్తారు.