ప్రజలకు మార్గదర్శనం చేయవలసిన ప్రభుత్వాలే కొట్లాడుకొంటే...
posted on Feb 14, 2015 @ 10:42AM
నాగార్జునసాగర్ డ్యాం వద్ద ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాల పోలీసులు, నీటి పారుదల శాఖ అధికారులకు మధ్య నిన్న చిన్నపాటి యుద్ధమే జరిగిందని చెప్పవచ్చును. ఒకవైపు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నీటి పారుదల శాఖ మంత్రులు, అధికారులు గవర్నర్ సమక్షంలో రాజ్ భవన్ లో నేడు సమావేశామవుతున్న తరుణంలో కూడా సాగర్ డ్యాం వద్ద మళ్ళీ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
హడావుడిగా రాష్ట్ర విభజన చేసినట్లయితే నీళ్ళ కోసం, విద్యుత్ కోసం ఇరు రాష్ట్రాల ప్రజలు, ప్రభుత్వాలు కొట్లాడుకొనే రోజు తప్పకుండా వస్తుందని ఆనాడు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పదేపదే గట్టిగా హెచ్చరించారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆయన హెచ్చరికలను పెడచెవిన పెట్టి, తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాలు మాత్రమే చూసుకొని ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు చేయకుండానే రాష్ట్ర విభజన చేసి చేతులు దులుపుకొంది. “శత్రు దేశాలయిన చైనా, పాకిస్తాన్ లతోనే నదీ జలాలు పంచుకోగలుగుతున్నప్పుడు, తోటి తెలుగువారితో పంచుకోవడంలో కష్టం ఏముంటుంది?” అని ఆనాడు రాష్ట్ర విభజన కోసం పోరాడిన తెరాస, కాంగ్రెస్ నేతలందరూ ప్రశ్నించారు. కానీ వారందరూ ఇప్పుడు ఈ దురదృష్టకర సంఘటనలు నివారించలేకపోగా అందరూ ఆ అగ్నికి ఆజ్యం పోస్తున్నారు. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిన విషపరిణామాలన్నీ ఇప్పుడు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నాయి.
అయితే ఈ సమస్యలు పరిష్కరించలేనివి మాత్రం కావు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ మధ్య, తమ పార్టీల మధ్య ఉన్న వ్యక్తిగత, రాజకీయ వైరాన్ని పక్కనపెట్టి ప్రయత్నిస్తే తప్పకుండా ఈ సమస్య పరిష్కారం అవుతుంది. కానీ ప్రజలకు మార్గదర్శనం చేసి రాష్ట్రాలను అభివృద్ధి పధంలో నడిపించవలసిన ప్రభుత్వాలే ఈవిధంగా పోరాడుకొంటుంటే యధా రాజ తధా ప్రజా అన్నట్లుగా ఇరు రాష్ట్రాల అధికారులు, చివరికి పోలీసులు కూడా శత్రుదేశాల వలే పోరాడుకోవలసిన దుస్థితి ఏర్పడితే అందుకు ప్రభుత్వాలని, వాటిని నడిపిస్తున్న తెదేపా, తెరాస అధినేతలనే తప్పుపట్టవలసివస్తుంది.
కాంగ్రెస్ పార్టీ తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాలను మాత్రమే చూసుకొని రాష్ట్ర విభజన చేసినందుకు ఇరు రాష్ట్రాల ప్రజలు దానిని చాలా నిర్దయగా కటినంగా శిక్షించారు. ఇప్పుడు తెదేపా, తెరాసలు కూడా తమ పార్టీ ప్రయోజనాలను మాత్రమే చూసుకొంటూ ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించడంలో విఫలమయితే అవి కూడా ప్రజాగ్రహానికి గురి కావడం తధ్యం.
కనుక అటువంటి పరిస్థితి చేజేతులా కొనితెచ్చుకోకుండా, ఇరువురు ముఖ్యమంత్రులు తమ పంతాలు, పట్టింపులు, బేషజాలు, రాజకీయ వైరాలను పక్కనబెట్టి కొంత పట్టువిడుపు ధోరణిలో సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకొనే ప్రయత్నాలు చేయడం చాలా అవసరం. అదే వారి పార్టీలకు, ప్రభుత్వాలకి, ప్రజలకీ అందరికీ మంచిది.