Read more!

డీజిల్ అయిపోయింది..అంబులెన్స్ ఆగిపోయింది.. రోగి ప్రాణం పోయింది!

ఆరోగ్య సేవల విషయంలో నిర్లక్ష్యం కారణంగా రోగి నిండు ప్రాణం బలైపోయిన సంఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. అనారోగ్యంతో ఉన్న రోగిని ఆసుపత్రికి తరలించడానికి వచ్చిన అంబులెన్స్ లో మార్గ మధ్యంలో డీజిల్ అయిపోయి ఆగిపోయింది. దీంతో రోగి బంధువులు అంబులెన్సును దాదాపుకిలో మీటర్ దూరం తోసుకుని వెళ్లి డీజిల్ కొట్టించారు. అయినా ఆ అంబులెన్స్ కదల లేదు. దీంతో మరో అంబులెన్స్ కు ఫోన్ చేసి అది వచ్చి ఆసుపత్రికి తరలించేసరికి పుణ్యకాలం కాస్తా గడిచిపోయింది.

రోగి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. రాజస్థాన్ లోని దానాపూర్ గ్రామానికి చెందిన తేజియా పొలంలో పని చేస్తుండగా ఒక్కసారిగా అనారోగ్యంతో కుప్పకూలిపోయాడు. దీంతో  బంధువులు అంబులెన్సుకు కాల్ చేసి దానిలో జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో డీజిల్ అయిపోయి అంబులెన్స్ ఆగిపోయింది.

అక్కడికి  కిలోమీటర్ దూరంలో ఉన్న పెట్రోల్ బంక్ వరకూ అంబులెన్సును బంధువులు తోసుకుంటూ తీసుకెళ్లారు. అక్కడ డీజిల్ కొట్టించినా అంబులెన్స్ కదలలేదు. మొరాయించింది. దీంతో చేసేది లేక మరో అంబులెన్స్ ను పిలిపించుకుని ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు తేజను పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.

తేజ బంధువులు అంబులెన్స్ ను తోసుకువెళుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి.  ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. అత్యవసర వైద్య సేవలు అవసరమైన రోగులను ఆసుపత్రికి తీసుకువెళ్లే అంబులెన్స్ లో డీజల్ ఉందో లేదో చూసుకోనంత అధ్వానంగా వాటి సేవలు ఉన్నాయని నెటిజన్లు మండి పడుతున్నారు. ప్రాణాలు కాపాడాల్సిన అంబులెన్సులే నాణ్యతా లోపాలతో, సేవా లోపాలతో రోగుల ప్రాణాలు తీస్తున్నాయని మండిపడుతున్నారు. అంబులెన్స్ మార్గమధ్యంలో మెరాయించకుండా ఉంటే రోగి బతికేవాడని అంటున్నారు.