అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి శరవేగంగా ఏర్పాట్లు
posted on Oct 20, 2015 @ 12:43PM
ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి సమయం దగ్గర పడుతుండటంతో అధికారులు శరవేగంగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. నిజానికి ఈరోజు నిన్న సాయంత్రానికే ఏర్పాట్లన్నీ పూర్తి చేసి శంఖుస్థాపన కార్యక్రమం జరిగే ప్రాంతాన్ని ప్రధాని భద్రతా సిబ్బందికి అప్పగించవలసి ఉంది. కానీ కొన్ని పనులు ఇంకా పూర్తవకపోవడంతో అప్పగించలేకపోయారు. ఇవ్వాళ్ళ సాయంత్రానికల్లా అన్ని పనులు పూర్తయిపోతాయని అధికారులు తెలిపారు.
రాజధాని నిర్మాణం నిర్విఘ్నంగా పూర్తవ్వాలని కోరుతూ శంఖుస్థాపనకు ముందు హోమం చేస్తారు. దాని కోసం తెలుగుదనం ఉట్టిపడేలా ఒక యాగశాలను నిర్మిస్తున్నారు. శంఖుస్థాపన జరిగే ప్రదేశం పక్కనే శిలాఫలకం, దాని ఎదురుగా యాగశాల, దాని చుట్టూ వేదికలు నిర్మిస్తున్నారు. ప్రధాన వేదికకు ఇరు వైపులా మరో రెండు వేదికలు నిర్మిస్తున్నారు. వాటిల్లో దేశ విదేశాల నుంచి వచ్చే వి.వి.ఐ.పి. మరియు వి.ఐ.పి.లు కూర్చోంటారు. ఆ పక్కనే రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల కోసం మరో వేదిక నిర్మిస్తున్నారు. ప్రధాన వేదికపై ప్రధాని నరేంద్ర మోడీ, సింగపూర్, జపాన్ ప్రధానమంత్రులు, గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరికొందరు కేంద్రమంత్రులు మాత్రమే కూర్చోంటారు.
ఈ కార్యక్రమానికి మొత్తం 12 దేశాల నుంచి రాయబారులు, పారిశ్రామికవేత్తలు వస్తున్నట్లు సమాచారం. దేశ విదేశాల నుంచి గన్నవరం విమానాశ్రయంలో దిగే ఆ ప్రత్యేక అతిధులను హెలికాఫ్టర్స్ లో శంఖుస్థాపన జరిగే ప్రాంతానికి తీసుకువస్తారు. ప్రత్యేక అతిధుల కోసం ప్రత్యేక భద్రతా సిబ్బంది, హెలికాఫ్టర్లు, ఎస్కార్ట్స్ వాహనాలు, విశ్రాంతి మందిరాలు అన్నీ సిద్దం చేస్తున్నారు. శంఖుస్థాపన జరిగే ప్రదేశానికి కొద్ది దూరంలోనే వేదికల వెనుక భాగాన్న రెండు హెలీ ప్యాడ్స్ నిర్మిస్తున్నారు. రోడ్డుమార్గం గుండా వచ్చే రాజకీయ నేతలు, ప్రముఖులు కోసం శంఖుస్థాపన జరిగే ప్రాంతం వరకు కొత్తగా రోడ్లు నిర్మించారు. ఆ ప్రాంతానికి సమీపంలోనే వేర్వేరు ప్రాంతాలలో వారి వాహనాలు పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేసారు. ప్రధానితో సహా ప్రముఖులు అందరికీ భద్రత కల్పించేందుకు ప్రత్యేకంగా వెయ్యి మంది మెరికల్లాంటి పోలీసులను ఎంపిక చేసి సిద్దంగా ఉంచారు. రేపు ఎస్కార్ట్ సిబ్బంది గన్నవరం విమానాశ్రయం నుండి వేదిక వరకు ట్రయల్ రన్స్ నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుండి కనీసం లక్షమందికి పైగా ప్రజలు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మధ్యాహ్నం 12.45 గంటలకి ప్రధాని శంఖుస్థాపన చేస్తారు. కానీ ఉదయం నుండే భారిగా జనాలు తరలి రావడం మొదలుపెడతారు కనుక వారి కోసం నీళ్ళు, మజ్జిగ ప్యాకెట్లు, అరటిపండ్లు ప్యాక్డ్ ఆహారం వగైరా అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. వారిని అలరించేందుకు సుమారు మూడు గంటల పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. డైలాగ్ కింగ్ గా పేరు పొందిన ప్రముఖ నటుడు సాయి కుమార్ మరియు గాయని సునీత ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించబోతున్నారు. ప్రముఖ డ్రమ్ మాష్టర్ శివమణి కూడా ఈ సందర్భంగా తన డ్రమ్ బీట్స్ తో ప్రజలను అలరించబోతున్నారు.
ఈ శంఖుస్థాపన కార్యక్రమంలో రాజకీయ నేతల ప్రసంగాలు చాలా క్లుప్తంగా ఉంటాయని తెలుస్తోంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి వారాల జల్లు కురిపించే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.