ఆటోలో రూ.7 కోట్లు
posted on Nov 8, 2012 @ 9:52AM
హైదరాబాద్ నడిబొడ్డున..రాష్ట్ర డీజీపీ కార్యాలయం ముందు ఓ ఆటోలో రూ.6.70 కోట్లు పట్టుబడ్డాయి. నిన్న జరిగిన ఈ సంఘటన ఇప్పుడు హైదరాబాద్ లో చర్చానీయాంశంగా మారింది. డబ్బు తరలిస్తున్న ఆటో డీజీపీ కార్యాలయం ముందుకు రాగానే గ్యాస్ అయిపోవడంతో ఆగిపోయింది. దాంతో ఆ ఆటో డ్రైవర్ దిగి వెళ్లాల్సిన చోటుకు మరో ఆటో మాట్లాడాడు. బ్యాగులను ఒక దానిలోంచి మరో ఆటోలోకి మార్చే క్రమంలో వాటిలో ఏముందనే దానిపై గొడవ ప్రారంభమైంది. డీజీపీ కార్యాలయం ముందు విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ సంజీవరెడ్డి వారివద్దకొచ్చాడు. బ్యాగులో ఏముందని ప్రశ్నించాడు. ఇంతలో రెండో ఆటోలోకి బ్యాగులను మార్చడం పూర్తయింది. చివరికి బ్యాగులు తెరచి చూసిన సంజీవరెడ్డికి కళ్లు తిరిగిపోయాయి.
మూడు బ్యాగులలో వెయ్యి నోట్ల కట్టలుగా కట్టిన బండిల్స్ తరలిస్తున్నారు. ఆ బ్యాగులను మాసాబ్‌ట్యాంక్ వద్ద గల ఆదాయపు పన్ను శాఖ కార్యాలయానికి తరలించి లెక్కించారు. మూడు బ్యాగుల్లో కలిపి మొత్తం రూ.6,70,50,000 ఉన్నట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులు, పోలీసులు నిర్ధారించారు. పట్టుబడిన డబ్బుకు సంబంధించి పోలీసులకు ఎటువంటి ఆధారం లభించలేదు. వారిలో చేతిలో ఉన్న ఒకే ఒక్క ఆధారం రెండో ఆటో డ్రైవర్ మాత్రమే. డబ్బుకు సంబంధించిన పూర్తి వివరాలు అతడికి తెలియవు. ఇదంతా ఒక ఎత్తైతే.. డబ్బు తరలిస్తున్న వ్యక్తితోపాటు, అంత కిక్కిరిసిన ట్రాఫిక్‌లో గ్యాస్ అయిపోయిన ఆటోతో సహా మొదటి ఆటో డ్రైవర్ ఎలా పరారయ్యాడన్నది ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది!