ఘరానా మేనేజ్‌మెంట్!
posted on Oct 28, 2012 @ 9:35AM
ఎలాంటి గుర్తింపు, నియమనిబంధనలను పాటించకుండా ఘరానాగా మేనేజ్‌మెంట్ విద్యను ఆఫర్ చేస్తున్న 332 కాలేజీలను అఖిల భారత సాంకేతిక విద్యామండలి బ్లాక్‌లిస్టులో పెట్టింది. బ్లాక్‌లిస్టును గత జూలై 16వ తేదీ వరకూ అప్‌డేట్ చేసినా, జాబితాను శుక్రవారం నాడు బహిర్గతం చేసింది. బ్లాక్‌లిస్టులో ఉన్న కాలేజీల్లో ఆంధ్రప్రదేశ్‌వే అత్యధికంగా 43 వరకూ ఉండటం ఒక ప్రత్యేకత అయితే దేశవ్యాప్తంగా రద్దయిన కాలేజీల్లో ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా పనిచేస్తున్న ఇక్ఫాయి సంస్థలు అనేకం ఉండటం మరో విశేషం.
ఐఐపిఎం, ఇక్ఫాయి, అమిటీ, నొయిడా ఐఐబిఎస్, రాయ్ బిజినెస్ స్కూల్, ఇక్ఫాయి చెన్నై విద్యాసంస్థలు మరో మూడు, ఐఐపిఎం ముంబై కాలేజీలు మరో రెండు, ఐటిఎం, ముంబైలోని ఇక్ఫాయి బిజినెస్ స్కూళ్లు, ఇక్ఫాయి బెంగళూరు విద్యాసంస్థలు, గూర్గావ్‌లోని ఇక్ఫాయి బిజినెస్ స్కూల్, ఇక్ఫాయి నేషనల్ కాలేజీ (గూర్గాన్), ఇక్ఫాయి బిజినెస్ స్కూల్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఆధీనంలోని ఐఎస్‌బి, ఇక్ఫాయి బిజినెస్ స్కూల్ (ఛండీఘర్) తోపాటు చాలా బ్లాక్ లిస్టులో చేరాయి.
రాష్ట్రంలో గుర్తింపు పొందిన 70 శాతం కాలేజీల్లోనే సౌకర్యాలు లేవని సర్వేలు తేల్చిచెబుతున్న సమయంలో అసలు గుర్తింపులేకుండానే వేలాది మందికి అడ్మిషన్లు ఇచ్చేసి, పెద్ద ఎత్తున డబ్బుసంపాదిస్తున్న విద్యాసంస్థలపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరించడంపై తీవ్రమైన విమర్శలే వస్తున్నాయి.
చాలా కాలంగా అనేక మంది విద్యార్థులు ఫిర్యాదు చేయడంతోపాటు ఈ వ్యవహారాలు రాష్ట్ర హైకోర్టు వరకూ వెళ్లినా ప్రభుత్వ అధికారులు మాత్రం మాకు సంబంధించింది కాదు అన్నట్టు వ్యవహరించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.