డైలీ అందరూ తాగుతున్న కూల్ డ్రింక్స్ తో టాయిలెట్ సీట్ మురికి ఇట్టే వదులుతుంది..
posted on Aug 7, 2025 @ 9:30AM
టాయిలెట్ సీట్.. వెస్ట్రన్ టాయిలెట్స్ వచ్చాక ఇంట్లో అందరూ ఒకే సీటు మీద కూర్చుని టాయిలెట్ వెళ్లడం తప్పనిసరి. అయితే ఎంత జాగ్రత్త తీసుకున్నా, ఎంత శుభ్రం చేస్తున్నా టాయిలెట్ సీట్ తొందరగా మురికిగా మారుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఇలా టాయిలెట్ శుభ్రంగా లేకపోతే వచ్చినవారు చాలా అసహ్యించుకుంటారు. అయితే టాయిలెట్ ను, టాయిలెట్ సీట్ ను కేవలం 10 రూపాయల విలువ చేసే పానీయంతో సులువుగా శుభ్రం చేయవచ్చు. దీనికి కావాల్సిందల్లా కూల్ డ్రింక్ అంటే షాకయ్యేవారు ఎక్కువ. కానీ దీని వెనుక నిజాలు తెలుకుంటే..
కూల్ డ్రింక్..
వేసవి కాలంలో చాలామంది కూల్ డ్రింక్స్ తాగడానికి ఇష్టపడతారు. కూల్ డ్రింక్స్ ఆరోగ్యానికి ఏమాత్రం మేలు చేస్తాయి అనే విషయం పక్కన పెడితే.. టాయిలెట్ ను, టాయిలెట్ సీట్ ను మాత్రం అద్భుతంగా క్లీన్ చేస్తాయి.
నిజానికి కూల్ డ్రింక్స్ లో కార్బోనిక్ ఆమ్లం, ఫాస్పోరిక్ ఆమ్లం ఉంటాయి. ఈ ఆమ్లాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. అవి టాయిలెట్ సీటుపై ఉన్న మొండి మరకలు, ధూళిని సులువుగా కరిగిస్తాయి . దీని కారణంగా మురికిగా ఉన్న టాయిలెట్‌ను శుభ్రం చేయడం సులభం. దీన్ని ఉపయోగించడం వల్ల శుభ్రపరిచేటప్పుడు ఎక్కువ శ్రమ పడనవసరం లేదు.
ఎలా క్లీన్ చేయాలి..
కూల్ డ్రింక్స్ ను ఉపయోగించి టాయిలెట్ ను క్లీన్ చేయడానికి కూడా పెద్ద యుద్దం చేయాల్సిన పని లేదు. టాయిలెట్ సీట్ పైన ఎక్కడెక్కడ మురికి ఎక్కువ కనిపిస్తోందో.. అక్కడ కూల్ డ్రింక్ ను కాస్త ఎక్కువ పోయాలి. మిగిలిన ప్రాంతంలో సాధారణంగా వేస్తే సరిపోతుంది. ఇలా పోసిన తరువాత దాన్ని ఒక 15 లేదా 20 నిమిషాలు అలాగే వదిలేయాలి. కూల్ డ్రింక్ లో ఉండే ఆమ్లం చర్య జరిపి మురికి, మరకలు మొదలైనవాటిని కరిగిస్తుంది. 15 నిమిషాల తరువాత టాయిలెట్ బ్రష్ తీసుకుని స్ర్కబ్ చేస్తే సరిపోతుంది. ఇలా చేశాక నీళ్ళు పోసి కడిగితే సరిపోతుంది. ఇలా చేస్తే టాయిలెట్ కొత్త దానిలా మెరిసిపోతుంది కూడా. అయితే కూల్ డ్రింక్ లోని తీపి బాగా పోయేలా కాస్త నీరు ఎక్కువ వినియోగిస్తే సరిపోతుంది.
టాయిలెట్ శుభ్రంగా, దుర్గంధం లేకుండా ఉండటానికి, నిమ్మ తొక్క, ఉప్పు, నీటిని కలిపిన ద్రావణాన్ని టాయిలెట్‌లో పోయాలి.
ఓడోనిల్ వంటి ఉత్పత్తులకు బదులుగా, మీరు నిమిషాల్లో దుర్వాసనను తొలగించడానికి డిఫ్యూజర్‌ను ఉపయోగించవచ్చు.
అన్నింటికంటే ముఖ్యంగా.. టాయిలెట్ లో వెంటిలేషన్ ఉండేలా చూసుకోవడం, టాయిలెట్ లో వివిధ రకాల ఉత్పత్తులు, వస్తువులు ఉంచడం వంటివి చేయకూడదు. ఇలా చేస్తే టాయిలెట్ శుభ్రంగా, దుర్గంధం లేకుండా ఉంటుంది.
*రూపశ్రీ.