మళ్ళీ నోరు జారిన మణి శంకర్ అయ్యర్
posted on Nov 18, 2015 7:27AM
పారిస్ నగరంపై ఐసిస్ ఉగ్రవాదులు దాడి చేసి అనేకమంది ప్రజలను అతి క్రూరంగా హతమార్చినందుకు యావత్ ప్రపంచం కంట కన్నీరు చిందుతుంటే, సీనియర్ కాంగ్రెస్ నేత మణి శంకర్ అయ్యర్ మాత్రం “యూరోప్ దేశాలలో నానాటికి పెరుగుతున్న ముస్లిం వ్యతిరేకతను అరికట్టాల్సి ఉంది. అలాగే ఫ్రాన్స్ దేశ ముస్లిం పౌరులకు వారు కూడా మిగిలిన పౌరులతో సమానమనే నమ్మకం కల్పించాలి. అసలు ఉగ్రవాదులు పారిస్ నగరంపై ఎందుకు దాడులు చేసారో అందరూ ఆలోచించాలి,” అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలు మూటగట్టుకొన్నారు.
మళ్ళీ నిన్న పాకిస్తాన్ కి చెందిన ‘దునియా టీవీ’ నిర్వహించిన ఒక చర్చా కార్యక్రమంలో పాల్గొన్న మణి శంకర్ అయ్యర్ ని “భారత్-పాక్ దేశాల మధ్య మళ్ళీ సంబంధాలు మెరుగుపడాలంటే ఏమి చేయవలసి ఉంటుంది?” అని ప్రశ్నించినప్పుడు “అన్నిటి కంటే ముందుగా భారత ప్రధాని నరేంద్ర మోడిని పదవిలో నుండి తప్పించవలసి ఉంటుంది. అప్పుడే ముందుకు వెళ్ళగలుగుతాము. కానీ అందుకోసం మరో నాలుగేళ్ళు వేచి చూడవలసి ఉంటుంది. ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్న కొందరు మోడీ సాబ్ అధికారంలో ఉన్నప్పటికీ ముందుకు వెళ్ళగలమని అనుకొంటున్నారు. కానీ నేను అలాగా భావించడం లేదు. కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలి. అప్పుడే మళ్ళీ ఇరు దేశాల మధ్య చర్చలు మొదలవుతాయి. దీనికి అంతకంటే వేరే పరిష్కార మార్గం లేదు. మోడీ ప్రభుత్వాన్ని మేము అధికారంలో నుండి దించగలము. కానీ పాకిస్తాన్ అంతవరకు ఓపికగా వేచి ఉండాలి,” అని మణి శంకర్ అయ్యర్ జవాబిచ్చారు.
మణి శంకర్ అయ్యర్ వంటి పరిణతి చెందిన రాజకీయ నాయకుడు భారత్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పాకిస్తాన్ కి చెందిన ఒక మీడియా ఈవిధంగా మాట్లాడటం చాలా విస్మయం కలిగిస్తోంది. భారత్ తో తాము శాంతినే కోరుకొంటున్నప్పటికీ, భారత్ వైఖరి కారణంగానే శాంతి చర్చలలో ప్రతిష్టంభన ఏర్పడిందని పాక్ అంతర్జాతీయ వేదికలపై ప్రచారం చేస్తోంది. ఇప్పుడు మణి శంకర్ అయ్యర్ మాట్లాడిన ఈ మాటలు పాక్ వాదనలను బలపరిచేవిగా ఉన్నాయి. భారత్-పాక్ చర్చలకు మోడీయే ప్రధాన అవరోధంగా ఉన్నారని, ఆయనని గద్దె దించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని అందుకు పాక్ ప్రభుత్వం కూడా సహకరించాలని మణి శంకర్ అయ్యర్ చెపుతున్నట్లుంది.
దేశంలో రాజకీయ పార్టీలు, నేతలు ఒకరితో మరొకరు ఎంతగా అయినా విభేధించుకోవవచ్చును కానీ విదేశాలతో ముఖ్యంగా భారత్ ని శత్రుదేశంగా భావిస్తూ, పరోక్ష యుద్ధం చేస్తున్న పాకిస్తాన్ తో మాట్లాడేటప్పుడు చాలా ఆచి తూచి మాట్లాడవలసి ఉంటుంది. మణి శంకర్ అయ్యర్ ఒక కాంగ్రెస్ నేతగానో లేక ఒక రాజకీయ నాయకుడిగానో కాకుండా ఒక భారతీయుడిలాగ మాట్లాడాలి. కానీ ఆయన తన దేశ ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తున్నట్లున్నారు.
మణి శంకర్ అయ్యర్ వివాదాస్పద మాటలపై కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ స్పందిస్తూ “మణి శంకర్ అయ్యర్ కి వృద్దాప్యం వలన మతి స్థిమితం కోల్పోయినట్లున్నారు. లేకుంటే ఒక పాకిస్తానీ టీవీ ఛానల్ తో ఆవిధంగా మాట్లాడి ఉండేవారు కాదు. ఆయన మాట్లాడిన మాటలు కేవలం భారత ప్రధాని నరేంద్ర మోడినే కాదు యావత్ దేశ ప్రజలను అవమానిస్తున్నట్లుంది. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం తక్షణమే స్పందించాలి,” అని అన్నారు. ఆయన మాట్లాడిన ఈ వివాదస్పద మాటలపై బీజేపీతో సహా అనేక పార్టీలు విమర్శలు గుప్పించడం మొదలుపెట్టగానే, తను ఆవిధంగా మాట్లాడలేదని మణి శంకర్ అయ్యర్ బుకాయించారు. ఆయన మాటలను ఖండించకపోగా కాంగ్రెస్ పార్టీ ఆయననే వెనకేసుకు వస్తోంది.
ఈ సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా రెండు మూడు రోజుల క్రితం అన్న మాటలను గుర్తు చేసుకోక తప్పదు. “రాజకీయ నాయకులు ఒక వయసు రాగానే స్వచ్చందంగా రాజకీయాల నుండి తప్పుకొని, సమాజసేవ, మానవసేవ కార్యక్రమాలలో పాల్గొంటే బాగుంటుంది,” అని అన్నారు. మణి శంకర్ అయ్యర్ మాటలు వింటే అది నిజమేననిపిస్తుంది. రాహుల్ గాంధీ కూడా కాంగ్రెస్ పార్టీలో వృద్ధ నేతల స్థానంలో యువతను తీసుకు రావాలని భావిస్తున్నారు కనుక ఇటువంటి వృద్ద నేతలను అందరినీ పక్కనపెడితేనే కాంగ్రెస్ పార్టీకి కూడా మేలు జరుగుతుంది.