జగన పంచ్ కు రివర్స్ పంచ్.. టీడీపీలోకి భూమా..?
posted on Feb 19, 2016 @ 3:42PM
రాజకీయ పార్టీల్లో ప్రస్తుతం వలసల పర్వం సాగుతోంది. ఏ పార్టీ నుండి ఎప్పుడు ఏనేత.. ఏ పార్టీలోకి జంప్ అవుతారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే తెలంగాణలో ఉన్న పార్టీల్లో సగానికి పైగా నేతలు అధికార పార్టీ అయిన టీఆర్ఎస్లోకి చేరడానికే సముఖత చూపిస్తున్నారు. ఇప్పటికే అక్కడ ఉన్న టీడీపీ దాదాపు ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చింది. దీంతో తెలంగాణలో టీడీపీ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అయితే ఏపీలోకి వచ్చేసరికి కాస్త పరిస్థితి బానే ఉంది. ఇక్కడ అధికార పార్టీ టీడీపీ కావడంతో కొంతమంది నేతలు టీడీపీ లోకి వలస వస్తున్నారు.
ఇక ఈనేపథ్యంలో వైసీపీ పార్టీ అధినేత జగన్ కు పెద్ద షాకే ఎదురైంది. రెండు రోజుల క్రితమే మా పార్టీలో ఎవరూ టీడీపీలోకి వెళ్లడం లేదు.. ఇది టీడీపీ ఆడుతున్న మైండ్ గేమ్.. ఇంకా చెప్పాలంటే టీడీపీ నేతలే మాతో టచ్ లో ఉన్నారు అని అన్నారు. దీంతో అందరూ చంద్రబాబుకి జగన్ ఝలక్ ఇచ్చారు అని అనుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తుంటే జగన్ కే దిమ్మతిరిగే షాక్ ఎదురైందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఎందుకంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు భూమా అఖిల ప్రియ త్వరలో టిడిపిలో చేరుతారని కర్నూలు జిల్లాలో జోరుగా వార్తలు వస్తున్నాయి. భూమా నాగిరెడ్డి ప్రస్తుతం పిఎసి చైర్మన్‌గా ఉండగా.. ఆయన కూతురు భూమా అఖిల ప్రియ కూడా ఇప్పుడు ఎమ్మెల్యే. అయితే వీరిద్దరికి టీడీపీ నుండి మంచి ఆఫరే వచ్చినట్టు చెబుతున్నారు. వీరిద్దరు టీడీపీలోకి చేరితే ఓ మంత్రి పదవిని చంద్రబాబు ఇస్తారని చెప్పినట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు దీనికి సంబంధించిన చర్చలు కూడా జరిగాయని అంటున్నారు.
ఇదిలా ఉండగా భూమాతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా టీడీపీలో చేరే అవకాశం ఉందంటున్నారు. అయితే ఈ రోజు కార్యకర్తలతో భేటీ అనంతరం అసలు విషయాలు తెలుస్తాయి అని అంటున్నారు రాజకీయ పెద్దలు. మొత్తానికి చంద్రబాబుకి షాకిచ్చానని సంతోషపడే లోపులోనే జగన్ కు రివర్స్ షాక్ ఎదురైనట్టుంది.