రేవంత్ టార్గెట్ గానే జగనన్న బాణం! కేసీఆర్, అమిత్ షా ఉమ్మడి వ్యూహం? 

తెలంగాణలో కొత్త పార్టీ రాబోతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటుకు సిద్దమవుతున్నారని, ఫిబ్రవరిలో ఆమె  పార్టీ పెట్టడం ఖాయమని చెబుతున్నారు. అయితే తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. తన అన్న, ఏపీ ముఖ్యమంత్రి జగన్ తీరుపై కొంత కాలంగా  షర్మిల ఆగ్రహంగా ఉన్నారని... తన అన్నకు షాకిచ్చేందుకే ఆమె కొత్త పార్టీ పెట్టబోతుందని కొందరు చెబుతున్నారు. కాని వైఎస్ షర్మిల కొత్త పార్టీ వెనక సంచలన విషయాలు ఉన్నట్లు తెలుస్తోంది.  తెలంగాణలో కాంగ్రెస్ ను పూర్తిగా బలహీనపరిచే ఎత్తులో భాగంగానే  షర్మిలతో పార్టీ పెట్టిస్తున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా పీసీసీ రేసులో ముందున్న ఫైర్ బ్రాండ్ లీడర్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి టార్గెట్ గానే కొత్త పార్టీకి ప్లాన్ చేశారని తెలుస్తోంది. వైఎస్  షర్మిల పెడతారని చెబుతున్న పార్టీకి కర్త, కర్మ, క్రియ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆరేనని, బీజేపీ అండదండలు కూడా ఉన్నాయని.. ఏపీ సీఎం జగన్ డైరెక్షన్ లోనే ఇదంతా జరుగుతుందని  విశ్వసనీయవర్గాల సమాచారం.    తెలంగాణలో ప్రస్తుతం అధికార టీఆర్ఎస్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. కేసీఆర్ సర్కార్ పై ప్రజా వ్యతిరేకత భారీగా పెరిగింది. సీఎం సొంత గడ్డ సిద్ధిపేట జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో సిట్టింగ్ సీటును కోల్పోవడం, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ అనుకున్న ఫలితాలను సాధించలేకపోవడంతో ఇది రుజువైంది. వరుస ఓటములతో టీఆర్ఎస్ కేడర్ ఢీలా పడగా.. ఇదే అదనగా విపక్షాలు దూకుడు పెంచాయి. ముఖ్యంగా  ఎంపీ రేవంత్ రెడ్డి జనాల్లోకి దూసుకుపోతున్నారు. దీంతో  రోజురోజుకు ఆయన గ్రాఫ్ పెరిగిపోతోంది. గత ఏడేండ్లుగా కేసీఆర్ కుటుంబంపై పోరాడుతున్నారు రేవంత్ రెడ్డి. ఆయన పోరాటానికి ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.  రేవంత్ రెడ్డి ఇంకా బలపడితే తమకు  మరిన్ని కష్టాలు తప్పవని టీఆర్ఎస్ పెద్దలు ఆందోళనగా ఉన్నారట. అందుకే రేవంత్ రెడ్డి బలం పెరగకుండా చూసేందుకే షర్మిలను రంగంలోకి దింపుతున్నారని చెబుతున్నారు. తెలంగాణలోని  రెడ్డి సామాజికవర్గమంతా ఇప్పుడు అధికారం కోసం తహతహలాడుతోంది. వాళ్లందరికి రేవంత్ రెడ్డి ఆశాకిరణంలా మారిపోయారు.  ఈ నేపథ్యంలోనే వైఎస్ షర్మిలతో కొత్త పార్టీ పెట్టిస్తున్నారని తెలుస్తోంది. దివంగత వైఎస్సార్ కు తెలంగాణలో భారీగా అభిమానులున్నాయి. ముఖ్యంగా రెడ్డి సామాజికవర్గంలో వైఎస్సార్ అంటే ఇప్పటికి క్రేజ్ ఉంది. షర్మిల పార్టీ పెడితే.. రెడ్డి సామాజిక వర్గం నుంచి కొత్త మద్దతు ఆమెకు లభిస్తుందని అంచనా. దీంతో రేవంత్ రెడ్డిని కొంత బలహీనం చేయవచ్చన్నది గులాబీ బాస్ వ్యూహమని చెబుతున్నారు. అందుకే తన మిత్రుడైన జగన్ తో మాట్లాడి.. అతని డైరెక్షన్ లోనే షర్మిల పార్టీకి ఏర్పాట్లు చేస్తున్నారని, తెలంగాణలో రాబోయే కొత్త పార్టీకి ఫండింగ్ కూడా కేసీఆరే సమకూర్చనున్నారని  సమాచారం.    ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాలో వైసీపీ గతంలో బలంగా ఉండేది. 2014 ఎన్నికల్లో ఖమ్మం ఎంపీతో పాటు మూడూ అసెంబ్లీ సీట్లను వైసీపీ గెలుచుకుంది. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లోనూ షర్మిల పార్టీ ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. హెచ్ఎండీఏ పరిధిలో 32 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా.. వీటిలోని చాలా నియోజకవర్గాల్లో ముస్లిం, క్రిస్టియన్, సీమాంధ్ర ఓటర్లు కీలకంగా ఉన్నారు.  షర్మిల పార్టీ పెడితే .. ఈ వర్గ ఓట్లను ఆమె దక్కించుకునే అవకాశం ఉందంటున్నారు. షర్మిల పార్టీ ఎన్ని సీట్లు గెలిచినా తమకు ఇబ్బంది ఉండదని.. వచ్చే ఎన్నికల్లో తమకు మెజార్టీ తగ్గినా  ఆ  పార్టీ మద్దతు తీసుకోవచ్చనే యోచనలో కేసీఆర్ ఉన్నారంటున్నారు. అందుకే అన్ని పక్కాగా ఆలోచించాకే  వైఎస్ షర్మిలను రంగంలోకి దించుతున్నారని చెబుతున్నారు.   వైఎస్ షర్మిల కొత్త పార్టీకి బీజేపీ పెద్దల సపోర్ట్ కూడా ఉందంటున్నారు. బీజేపీకి ప్రధాన శత్రువు కాంగ్రెస్. తెలంగాణలో తాము బలపడాలంటే హస్తం బలహీనపడాలని కమలం నేతలు కోరుకుంటున్నారు. దీంతో తమ  ప్రత్యర్థి పార్టీ టార్గెట్ గానే కొత్త పార్టీ పెడుతున్నందున కమలనాధులు కూడా సై అన్నారని చెబుతున్నారు. ఏపీలో ఎలాగూ జగన్ తమ కనుసన్నల్లోనే ఉన్నారు కాబట్టి.. షర్మిల పార్టీ కూడా తమతోనే ఉంటుందని బీజేపీ నేతల ప్లాన్. అందుకే కాంగ్రెస్ ను ఖతం చేసే కేసీఆర్ వ్యూహంలో  బీజేపీ కూడా భాగం పంచుకుందని, అందరూ కలిసి షర్మిలతో పార్టీ పెట్టిస్తున్నారనే చర్చ  రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. కాంగ్రెస్ నేతలు కూడా ఇవే ఆరోపణలు చేస్తున్నారు.  ఇటీవల ఢిల్లీ వెళ్లిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. అమిత్ షా సమావేశంలో షర్మిల పార్టీపై కూడా చర్చించారని హస్తం నేతలు చెబుతున్నారు.  మొత్తంగా  మొదటి నుంచి తమకు కొరకరాని కొయ్యలా మారిన రేవంత్ రెడ్డికి బలం పెరగకుండా చూసేందుకే టీఆర్ఎస్, వైసీపీలు కలిసి ఈ కొత్త వ్యూహం పన్నాయని.. కాంగ్రెస్ బలహీనపడితే తమకు ప్రయోజనమేనన్న రాజకీయ కారణంతో కమలం పార్టీ కూడా వాళ్లకు సపోర్ట్ చేస్తుందని తెలుస్తోంది. ఎంపీ రేవంత్ రెడ్డి  టార్గెట్ గా  మూడు పార్టీల ఆపరేషన్ లో భాగంగానే వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్నారని గాంధీభవన్ వర్గాలు నిర్దారణకు వచ్చాయంటున్నారు.

పప్పు కాదు పవర్ ఫుల్ లీడర్! వైసీపీని షేక్ చేస్తున్న లోకేష్ 

ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చేవారు కొందరు.. సంపాదనే పరమావధిగా పాలిటిక్స్ చేసేవారు మరికొందరు. ప్రస్తుత రాజకీయాల్లో మొదటి రకంలో  కొందరే ఉంటారు. అలాంటి వారిలో టాప్ గా నిలుస్తారు నారా లోకేష్. ప్రజలకు సేవ చేయాలనే ఆశయంతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన లోకేష్.. ఎమ్మెల్సీగా, మంత్రిగా, టీడీపీ ప్రధాన కార్యదర్శిగా అనునిత్యం ప్రజల కోసమే పని చేస్తూ అందరి నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. వైసీపీ నేతలు తనను పప్పు పప్పు అని అవహేళన చేస్తున్నా .. ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రజా సేవలో ముందుంటూ తానొక ఫర్ ఫెక్ట్ లీడరని నిరూపించుకున్నారు.             తండ్రి ఎమ్మెల్యే అయితేనే అక్రమ దందాలు చేస్తూ అతని కుటుంబ సభ్యులు కేసుల్లో చిక్కుకునే కాలమిది.  తండ్రి వైఎస్ సీఎం అయితే ఆ అధికారాన్ని అడ్డుపెట్టుకుని 43 వేల కోట్లు ప్ర‌జాధనం దోచుకుని 31 కేసులు ఎదుర్కొంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్న వ్య‌క్తి వైఎస్ జ‌గ‌న్‌రెడ్డి. కాని తాత, తండ్రి ముఖ్యమంత్రులుగా సుదీర్ఘ కాలం పనిచేసినా.. నారా లోకేష్‌పై ఇప్పటివరకు ఒక్క కేసు లేదు. తాత  తార‌క‌రామారావు ఆరేండ్లు, తండ్రి చంద్ర‌బాబు 14 ఏళ్లు సీఎంగా ఉన్నాప్ర‌భుత్వ వ్య‌వ‌హారాల‌లో త‌ల‌దూర్చ‌లేదు. అందుకే  ఒక్క కేసులేని మిస్టర్ ఫర్ ఫెక్ట్ గా ఉన్నారు చినబాబు. జగ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం వ‌చ్చాక  ఏదో ఒక కేసు పెట్టాల‌ని చూసినా వారి కుట్రలు ఫలించలేదు. ఇసుక సైట్ హ్యాక్ చేశార‌ని, డేటా చోరీ అంటూ చిల్లర ప్ర‌య‌త్నాలు చేసి విఫ‌ల‌మయ్యారు.చివ‌రికి అజాగ్ర‌త్త‌గా ట్రాక్ట‌ర్ న‌డిపార‌ని, కోవిడ్ నిబంధ‌న‌లు ఉల్లంఘించార‌ంటూ  లోకేష్ పై  కేసులు బ‌నాయించి కామెడీ పీసైపోయారు  సర్కార్  రెడ్డి పోలీసులు.   మంత్రిగా  పనిచేసి రూపాయి అవినితి ఆరోప‌ణ‌లు నారా లోకేష్ పై రాలేదు‌. అంతేకాదు తన పనితీరుతో ఏపీని దేశంలోనే టాప్ లో నిలిపారు. పంచాయతీ రాజ్, ఐటీ శాఖలను లోకేష్  నిర్వహించగా.. ఈ రెండు శాఖలకు కేంద్రం నుంచి ఎన్నో అవార్డులు, రివార్డులు లభించాయి. నారా లోకేష్ డైరెక్షన్ లోనే ఈ ఘనత సాధించామని అధికారులే స్వయంగా ప్రకటించారు. ఉపాధి హామీ పథకంలో ఎక్కువ పనిదినాలు కల్పించి పేదలకు బాసటగా నిలిచారు నారా లోకేష్. అవినీతి అంతమే లక్ష్యంగా పని చేస్తూ.. ప్రత్యర్థి పార్టీల వైఫల్యాలను ఏకరవు పెడుతూ వారికి కొరకరాని కొయ్యలా మారారు నారా లోకేష్.  టీడీపీకి కులం రంగు అంటించి విష‌ప్ర‌చారం చేస్తోంది వైసీపీ. అయితే లోకేష్ ను దగ్గరనుంచి చూసిన వారికి తెలుసు అతను ఏమాత్రం క్యాస్ట్ పట్టింపులేని వజ్రమని. ప్రస్తుత సీఎం జగన్ కార్యాలయంలో ఆఫీస్ బాయ్ నుంచి అధికారుల వరకు అంతా ఒకే కులం. సీఎంవో మొత్తం ఆయన  సామాజిక‌వ‌ర్గ‌మే.  నారా లోకేష్ మంత్రిగా ఉన్నప్పుడు మాత్రం ఆయన దగ్గర పనిచేసిన వారంతా ఇతర సామాజిక వర్గాల వారే.  పంచాయ‌తీరాజ్ శాఖ  కార్య‌ద‌ర్శిగా జ‌వ‌హ‌ర్‌రెడ్డి, గ్రామీణ‌నీటిస‌ర‌ఫ‌రా శాఖలో  భ‌ర‌త్‌గుప్తా, స్వ‌చ్ఛ‌భార‌త్ కార్పొరేష‌న్ ఎండీ గా  ముర‌ళీధ‌ర్‌రెడ్డి ఉండేవారు. ఐటీ శాఖలో జ‌య‌చంద్రారెడ్డి, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ రామాంజనేయులు (ఎస్సీ) మంత్రి కార్యాల‌యంలో ఓఎస్‌డీగా  రంజిత్ భాషా(ముస్లిం), శ్రీనివాస్ (బీసీ),  పీఎస్ అర్జున్ (ఎస్సీ) ప్రైవేట్ పీఏ న‌రేష్ (గౌడ‌) పీఆర్వోగా  చైత‌న్య‌రెడ్డి పని చేశారు. లోకేష్ ఐటీ  మేనేజ‌ర్ గా శ్రీనివాస్ (బ్రాహ్మిన్‌). వ్య‌క్తిగ‌త ఫిట్‌నెస్ ట్రైన‌ర్ జిజూ జోసెఫ్ (క్రిస్టియ‌న్ కేర‌ళ‌) ప‌ర్స‌న‌ల్ డ్రైవ‌ర్ స‌తీష్ (ఎస్సీ). ఇలా ప్ర‌భుత్వం ఇచ్చిన  ప్రైవేట్ సెక్యూరిటీలోనూ నారా లోకేష్ కులం వారు ఒక్క‌రూ లేరు.  నారా లోకేష్‌ కు తెలుగు మాట్లాడటం రాదని ఎక్కువగా విమర్శిస్తూ ఉంటారు. తాను చిన్న‌ప్ప‌టి నుంచి ఇంగ్లీషు మీడియం కావ‌డం వ‌ల్ల తెలుగు మాట్లాడేట‌ప్పుడు త‌డ‌బ‌డ‌తాన‌ని నిజాయితీగా ఒప్పుకున్నారు లోకేష్. పదాలు తడబడుతున్నా.. ప్రత్యర్థి పార్టీలు వాటినే వైరల్ చేస్తూ శునకానందం పొందుతున్నా.. ఆయన ప్రజాబాట మరవలేదు. లైవ్‌లో మాట్లాడ‌టం ఆపేయ‌లేదు. మీడియా మిత్రుల‌ని కూడా ఏమైనా ప్ర‌శ్న‌లున్నాయా అంటూ అడిగి మ‌రీ ప్రెస్‌మీట్లు ముగిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డి రాసిచ్చిన స్క్రిప్ట్ చ‌ద‌వ‌లేక  తెలుగుని ఖూనీ చేస్తూనే వున్నాడు. చివ‌రికి లైవుల్లో దొరికిపోతున్నామ‌ని రికార్డెడ్‌కి వెళ్లి అక్క‌డా త‌ప్పుడు లెక్క‌లు, ప‌దాల్ని ప‌ల‌క‌లేక నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. ప‌ప్పు అని జ‌గ‌న్‌రెడ్డి అండ్ కో గేలి చేసిన నారా లోకేష్ ప్ర‌జ‌ల్లో వుంటూ, లైవుల్లో పంచ్ డైలాగులు విసురుతుంటే..  జ‌గ‌న్‌రెడ్డి మాత్రం మీడియా ముందుకి కూడా రాలేక తాడేప‌ల్లి నుంచి రికార్డెడ్ ప్రెస్‌మీట్లు వ‌దులుతూ జీరో అయిపోయారు.    తెలుగుదేశం పార్టీకి స‌మాజ‌మే దేవాల‌యం..ప్ర‌జ‌లే దేవుళ్లు. టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్‌కి తెలుగుదేశం పార్టీ కార్య‌క‌ర్త‌లే కుటుంబం. తమ్ముళ్ల  కోసం లోకేష్‌ ఆలోచ‌న‌ల కార్య‌రూపమే కార్య‌క‌ర్త‌ల సంక్షేమ నిధి. జెండా మోసే కార్య‌క‌ర్త‌కి అండ‌గా నిలిచేందుకు నారా లోకేష్ ఆరంభించిన ఈ విభాగం ఇప్పటికే వేలాది కుటుంబాల‌కు చేయూత‌నిచ్చింది.  టిడిపి స‌భ్య‌త్వం తీసుకున్న 80 ల‌క్ష‌ల‌మంది కార్య‌క‌ర్త‌ల‌కు బీమా ప్రీమియం క‌ట్టి, వారి భ‌ద్ర‌త‌కు భ‌రోసానిచ్చారు నారా లోకేష్‌. ఎటువంటి ఆర్థిక ఆస‌రాలేని సీనియ‌ర్ కార్య‌క‌ర్త‌ల‌కు ప్రతి నెలా  1500 వారి ఖాతాల్లో వేస్తూ చేదోడుగా నిలుస్తున్నారు లోకేష్‌. నిరుపేద టీడీపీ కార్య‌క‌ర్త‌లు, ప్ర‌త్య‌ర్థి పార్టీల దాడుల్లో చ‌నిపోయిన కార్య‌క‌ర్త‌ల పిల్ల‌ల‌కు ఎన్టీఆర్ మోడ‌ల్‌ స్కూల్లో ఉచిత విద్య‌నందిస్తున్నారు. నిరుపేద‌లైన కార్య‌క‌ర్త‌ల వైద్య‌, విద్య‌, వివాహ అవ‌స‌రాల‌కు సంక్షేమ నిధి నుంచి  సాయం అందిస్తున్నారు. ప్రాణాంత‌క క్యాన్స‌ర్ సోకిన పార్టీ కుటుంబ స‌భ్యుల‌కు బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌‌త్రిలో చికిత్స ఇప్పిస్తున్నారు. పేద కార్య‌క‌ర్త‌ల పిల్ల‌ల‌ వివాహాలకు పార్టీ నుంచి పెళ్లికానుక  అందిస్తున్నారు నారా లోకేష్.  పార్టీ కార్య‌క‌ర్త‌ల్ని కుటుంబ‌స‌భ్యుల్లా భావించి వారి సంక్షేమానికి పాటుప‌డుతూ కార్య‌క‌ర్త‌ల పాలిట పెన్నిధిగా నిలుస్తున్న నారా లోకేషే అస‌లు సిస‌లు ప్ర‌జానాయ‌కుడని రాజకీయ అనలిస్టులు చెబుతున్నారు. ప్రజలే దేవుళ్లని భావించే కుటుంబం నుంచి వచ్చిన లోకేష్.. వాళ్ల స్పూర్తిని, వారసత్వాన్ని కొనసాగిస్తూ.. అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు. కొద్ది కాలంలోనే రాజకీయంగా రాటు దేలి, ప్రజా సేవలో ఆదర్శంగా నిలుస్తూ.. అవినీతికి అంతమే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఏపీకి భవిష్యత్ ఆశాకిరణంలా మారిపోయారు చినబాబు.

మేం కేసులు పెడతాం.. మీరు లాగేసుకోండి!  ఏపీలో టీడీపీ టార్గెట్ గా జాయింట్ స్కెచ్

శత్రువుకు శత్రువు మిత్రుడు. ఈ సూత్రం ఎక్కడైనా వర్తిస్తుంది. రాజకీయాలకు అయితే మరింతగా దగ్గరగా ఉంటుంది. అందుకే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు , శత్రువులు ఉండరంటారు. కలిసున్న నేతలు విడిపోతుంటారు.. బద శత్రువులుగా ఉన్నవారు ఏకమవుతుంటారు. తమ ప్రత్యర్థులను దెబ్బ కొట్టడానికి మరో ప్రత్యర్థితో రాజీ చేసుకుంటూ ఉంటారు పొలిటికల్ లీడర్లు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోనూ ఇలాంటి రాజకీయాలే కనిపిస్తున్నాయి. ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ నేతలపై నమోదవుతున్న కేసులు, అరెస్టులు చూస్తున్న వారికి ఇది ఇట్టే అర్ధమవుతోంది. కేంద్రం డైరెక్షన్ లోనే రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ ఇలాంటి చర్యలకు పాల్పడుతుందనే ఆరోపణలు వస్తున్నాయి.     ఆంధ్రప్రదేశ్ లో బలపడాలని చూస్తున్న బీజేపీ..  టీడీపీ బలహీనం అయితేనే అది సాధ్యమని భావిస్తోంది. అంతేకాదు 2019 ఎన్నికల్లో తమతో విభేదించి.. ప్రధాని మోడీ. అమిత్ షాకు వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారం చేయడాన్ని ఇంకా మర్చిపోలేకపోతోంది. అందుకే పార్టీ బలోపేతంతో పాటు చంద్రబాబుపై ప్రతీకారం తీసుకోవాలనే కసితో ఉంది కమలం పార్టీ. అందుకే టీడీపీని టార్గెట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ.. ఇందు కోసం  కొత్త ఎత్తులు వేస్తుందని తెలుస్తోంది. అందుకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ సహకారం తీసుకుంటున్నట్లుగా భావిస్తున్నారు. టీడీపీ నేతలపై రాష్ట్ర ప్రభుత్వం కేసుల పెట్టి వేధించడం.. తర్వాత బీజేపీ ఎంటరై తమ పార్టీలో చేరితే రక్షణ కల్పిస్తామని వారికి హామీ ఇవ్వడం... ఇది ఆ రెండు పార్టీల ఉమ్మడి వ్యూహమని తెలుస్తోంది. టీడీపీని బలహీనం చేయాలని బీజేపీ చూస్తుండగా... టీడీపీ తమకు కూడా ప్రధాన ప్రత్యర్థి కావడంతో వైసీపీ కూడా  అందుకు  సరే అన్నదని తెలుస్తోంది. ఏపీలో టీడీపీని ఖతం చేయడమే లక్ష్యంగా బీజేపీ, వైసీపీలు ఈ తరహా రాజకీయాలకు తెర తీశాయనే చర్చ  జరుగుతోంది.   ఈ రెండు పార్టీల ఉమ్మడి వ్యూహంలో భాగంగానే పోలీసు కేసులు, అరెస్టులు జరుగుతున్నాయన్నది టీడీపీ నేతల మాట.  బీజేపీలోకి వెళతారని ప్రచారం జరుగుతున్న టీడీపీ నేతలే ... ఇటీవల పోలీసు కేసుల బాధితులుగా ఉంటుండటం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది.  అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీ జగన్ రెడ్డి సర్కార్ వచ్చాకా ఎక్కువ టార్గెట్ అయింది. జేసీ ప్రభాకర్ రెడ్డి జైలుకు కూడా వెళ్లివచ్చారు. అయితే జేసీ ఫ్యామిలీ బీజేపీలోకి వెళుతుందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ పెద్దలు జేసీ బ్రదర్స్ తో మాట్లాడారని కూడా చెప్పారు. కాని వాళ్లెవరు బీజేపీలోకి చేరలేదు. అందుకే వాళ్లపై పార్టీ మారేలా ఒత్తిడి పెంచడానికే కేసులు పెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా రాజాంలో టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావును పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. ఇక్కడ కూడా సేమ్ సీన్ కనిపిస్తోంది. కళా వెంకట్రావును బీజేపీలోకి రావాలని సోము వీర్రాజు ఆహ్వానించినట్లు ప్రచారం జరిగింది. అది జరిగిన కొన్ని రోజులకే ఈ అరెస్ట్ జరిగింది. దీంతో కళా వెంకట్రావును టీడీపీ నుంచి బయటికి లాగేందుకే అరెస్టు జరిగిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.   నిజానికి 2019 ఎన్నికల తర్వాత టీడీపీ నుంచి భారీగా త‌మ పార్టీలోకి వ‌ల‌స‌లుంటాయ‌ని భావించారు కమలం పార్టీ నేతలు. అయితే అలాంటేది లేదు. తెలంగాణలో బీజేపీ దూసుకుపోతుండగా ఏపీ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడి లాగానే ఆ పార్టీ పరిస్థితి ఉంది. ఒక‌రిద్ద‌రు పేరున్న నేత‌ల త‌ప్ప మిగిలిన వాళ్లు క‌మ‌లం వైపు క‌న్నెత్తి కూడా చూడలేదు. దీంతో అమిత్ షా ఆదేశాల‌తో  టీడీపీ నుంచి నేత‌ల‌ను ఆక‌ర్షించేందుకు  ఏపీ బీజేపీ నేతలు న‌యా ఆఫ‌ర్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. త‌మ పార్టీలోకి చెరితే వైసీపీ నుంచి వేధింపులుండ‌వ‌ని, పార్టీలో చేరితే చాలు వైసీపీ అస‌లు ప‌ట్టించుకోద‌ని ర‌హాస్య మీటింగ్స్ లో చెబుతున్న‌ట్లు టీడీపీ వ‌ర్గాల స‌మాచారం. 2019 ఎన్నికల తర్వాత ముగ్గురు టీడీపీ రాజ్య‌స‌భ స‌భ్యులు సుజనా చౌదరి, సీఎం రమేశ్, టీదీ వెంకటేష్ తో పాటు ఆదినారాయ‌ణ రెడ్డి, రావేల కిషోర్ బాబు, వ‌ర‌దాపురం సూరి వంటి నేత‌లు బీజేపీలో చేరారు. అప్ప‌టి నుంచి వాళ్లు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నార‌ని బీజేపీ వ‌ర్గాలు ప్ర‌చారం చేస్తోన్న‌ట్లు తెలుస్తోంది. మీరు కూడా పార్టీలోకి వ‌స్తే మీకు ఏ ఇబ్బందులు ఉండ‌వ‌ని అభ‌యం ఇస్తోన్న‌ట్లు చెబుతున్నారు. మాజీ మంత్రులు నారాయణ, పత్తిపాటి పుల్లారావు వంటి నేతలను ఇలాంటి ఆఫర్లతోనే ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు.   మరోవైపు సోమువీర్రాజు   అధ్య‌క్షుడి బాధ్య‌త‌లు తీసుకున్న‌ప్ప‌టి నుంచి చేరిక‌లే లేక‌పోవ‌డంపై పార్టీ పెద్ద‌లు  గుర్రుగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. టార్గెట్స్ సెట్ చేసి మ‌రి పార్టీలోకి అవ‌కాశం ఉన్న నేత‌లంద‌రి చేర్చుకోవాల‌ని వీర్రాజుపై ఒత్తిడి చేస్తోన్న‌ట్లు స‌మాచారం. అందులో భాగంగానే సోమువీర్రాజు కూడా గ్రౌండ్ వ‌ర్క స్టార్ చేశార‌ని ఆయ‌న స‌న్నిహితులు చెబుతున్నారు. ముఖ్యంగా వైసీపీ నుంచి వేధింపులు ఎదుర్కొంటున్న నేత‌ల‌తో నేరుగా ఫోన్ సంభాష‌ణ‌లు కూడా చేస్తున్న‌ట్లు  చెబుతున్నారు.  త‌మ పార్టీ వ‌ద్ద ఉన్న ఆఫ‌ర్స్ వాళ్ల ముందు పెట్టి ఆలోచించుకోమ‌ని చెబుతున్న‌ట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆయన కళా వెంకట్రావుతో నేరుగా మాట్లాడారనే చర్చ కూడా జరుగుతోంది.  

గులాబీ  పార్టీలో కేటీఆర్ సీఎం గోల! రాజకీయ డ్రామాలంటున్న విపక్షాలు 

కేటీఆర్‌ సీఎం కావాలంటూ  టీఆర్‌ఎస్‌లో గొంతులు పెరుగుతున్నాయి.  పోటీపడి మరీ గులాబీ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో పాటు మంత్రులు అదే పాట పడుతున్నారు. కేటీఆర్‌ సీఎం ఐతే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ కు  అనుకూలంగా మూడు రోజుల క్రితం సీనియర్ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడగా..  బుధవారం మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్ కూడా ముఖ్యమంత్రిగా కేటీఆర్ కు  జై కొట్టారు. కేటీఆర్‌ సీఎం అయితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌,  నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌.  వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ కూడా కేటీఆర్‌ ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే కూడా ముఖ్యమంత్రి పదవికి కేటీఆర్ అన్ని విధాలా అర్హుడని మంగళవారం కామెంట్ చేశారు.  నేతల వరుస ప్రకటనలతో టీఆర్‌ఎస్ లో  కేటీఆర్ అంశమే హాట్‌ టాపిక్‌గా మారింది.  తెలంగాణ ప్రభుత్వంలో కీలక మార్పులు ఉంటాయని కొంత కాలంగా ప్రచారం జరుగుతుండటం, తాజాగా టీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రకటనలతో కేటీఆర్ పట్టాభిషేకం ఖాయమే అన్న చర్చ జరుగుతోంది. అయితే కేసీఆర్ కు అత్యంత సన్నిహితుల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం  కేటీఆర్ కు ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం ఇప్పట్లో జరిగే సూచనలు కనిపించడం లేదంటున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో కేటీఆర్ ను సీఎం చేయాలన్న ఆలోచనపై కేసీఆర్ వెనక్కి తగ్గారని చెబుతున్నారు. ఇటీవల కాలంలో కేసీఆర్ పై జనాల్లో వ్యతిరేకత బాగా పెరిగింది. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో ఓటమి, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో పలితం రాకపోవడానికి అదే కారణమని కూడా తేలింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కూడా రివర్స్ అయ్యాయి. తన నైజానికి భిన్నంగా కొన్ని పథకాలను కూడా క్యాన్సిల్ చేశారు కేసీఆర్. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పగ్గాలు కేటీఆర్ కు అప్పగిస్తే... పాలన చేతకాక కేసీఆర్ పారిపోయారని విపక్షాలు ఆరోపణలు చేసే అవకాశం ఉందన్న వాదన కూడా కొందరు గులాబీ నేతల నుంచి వస్తుందట. పోరాడి తెలంగాణ సాధించిన ఉద్యమ నేతగా , రాజకీయ వ్యూహాల్లో దిట్టగా పేరున్న కేసీఆర్ కు.. ఈ తరహా ప్రచారం ఇబ్బందిగా మారుతుందని వారు చెబుతున్నారట. అందుకే కేటీఆర్ ను సీఎం చేయాలన్న అంశంపై కేసీఆర్ ఆలోచిస్తున్నారని తెలుస్తోంది.  కేటీఆర్ విషయంలో కేసీఆర్ వెనక్కి తగ్గడానికి  నిఘా వర్గాల నివేదికలు కూడా ఒక  కారణమని తెలుస్తోంది.  కేటీఆర్ ను సీఎం చేస్తే పార్టీలో ఎలా ఉంటుంది.. రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి స్పందన ఉంటుందన్న దానిపై ఇంటిలిజెన్స్ తో సర్వే చేయించారట కేసీఆర్ . అందులో సంచలన విషయాలు వెల్లడయ్యాయని తెలుస్తోంది. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తే.. టీఆర్ఎస్ చీలిపోయే అవకాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరించాయని చెబుతున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ రెండు వర్గాలుగా ఉందనే ప్రచారం జరుగుతోంది. ఉద్యమ కాలం నుంచి పార్టీలో ఉన్న నేతలంతా హరీష్ రావు కోటరిలో ఉండగా.. బంగారు తెలంగాణ బ్యాచ్ లీడర్లంతా కేటీఆర్ వెంట ఉన్నారనే చర్చ జరుగుతోంది. కేటీఆర్ ను సీఎం చేస్తే... ఉద్యమ నేతలంతా తమ దారి తాము  చూసుకునే అవకాశం ఉందని , హరీష్ రావు కూడా పార్టీ మారే అవకాశం ఉందని నిఘా సంస్థలు కేసీఆర్ కు నివేదిక ఇచ్చాయని తెలుస్తోంది.  కేసీఆర్ పరిధిలో ఉండే రాష్ట్ర సంస్థలే కాదు కేంద్ర నిఘా సంస్థలు కూడా ఇదే విషయాన్ని నివేదించాయని చెబుతున్నారు. కేంద్ర సంస్థల సర్వే ఫలితాలు తెలుసు కాబట్టే.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా మరో మూడేళ్లు ముఖ్యమంత్రిగా కేసీఆరే కొన‌సాగుతార‌ని కచ్చితంగా చెబుతున్నారని రాజకీయ విశ్లేషకులు  అంచనా వేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో దూకుడు పెంచింది బీజేపీ. ఇతర పార్టీల నేతలకు వల వేస్తోంది. కారు పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలను గుర్తించి తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు కమలం నేతలు. ఇలాంటి సమయంలో కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసి.. పార్టీలో అసమ్మతి పెరిగేలా చూసుకోవడం మంచిది కాదనే భావనకు టీఆర్ఎస్ అధినేత వచ్చారంటున్నారు. అందుకే  సర్వే నివేదికలు, పార్టీ ముఖ్యల సూచనలతో కేటీఆర్ ను సీఎం చేసే అంశంలో వెనక్కి తగ్గిన కేసీఆర్.. విపక్షాలను గందరగోళం పరిచేలా  కొత్త డ్రామా  అమలు చేస్తున్నారని చెబుతున్నారు.  కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారాన్ని లైవ్ గా ఉంచుతూనే .. మరికొంత కాలం సాగదీయాలనే  ఎత్తుగడను గులాబీ బాస్ అమలు చేస్తున్నారని చెబుతున్నారు. ఇందులో భాగంగానే పార్టీ ప్రజా ప్రతినిధులు కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలంటూ ప్రకటనలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ రకమైన ప్రచారం వల్ల పార్టీకి కూడా ప్రయోజనాలు ఉంటాయని గులాబీ బాస్ లెక్కలు వేస్తున్నారట. కేటీఆర్ సీఎం అవుతారనే ప్రచారంతో పార్టీ కేడర్ లో  జోష్ వస్తుందని.. అది త్వరలో జరగనున్న ఖమ్మం. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో పార్టీకి ఫ్లస్ అవుతుందని కేసీఆర్ భావిస్తున్నారట. అంతేకాదు పార్టీ  వర్కింగ్ ప్రెసిడెంట్లుగా హరీష్ రావు, ఈటెల రాజేందర్లను నియమిస్తారని జరుగుతున్న ప్రచారం వెనక కూడా  గులాబీ అధినేత ఉన్నారనే చర్చ  పొలిటికల్ సర్కిళ్లలో జరుగుతోంది. హరీష్ రావు, ఈటెలకు ఉద్యమకారుల మద్దతు ఉంది. ఇలా వారిని కూల్ చేయవచ్చన్నది కేసీఆర్ వ్యూహంగా చెబుతున్నారు.  మొత్తంగా చూస్తే మాత్రం కేటీఆర్ ఇప్పట్లో ముఖ్యమంత్రి కావడం ఉండకపోవచ్చన్నదే ప్రగతి భవన్ వర్గాల సమాచారంగా ఉంటోంది.

జగన్ కు జిగ్రీ దోస్త్ షాక్ ! విశాఖపై నిర్ణయం మారేనా? 

మూడు నిర్ణయాలు.. ఆరు కొట్టివేతలు.. తొమ్మిది చివాట్లు. ఇదీ ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ  20 నెలల పాలనా తీరు. అనాలోచిత, అస్తవ్యస్థ, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం.. వాటిని కోర్టులు కొట్టివేయడం.. న్యాయమూర్తుల నుంచి అక్షింతలు తినడం జగన్ రెడ్డి సర్కార్ కు పరిపాటిగా మారిపోయింది. మూడు రాజధానులు.. ఇంగ్లీష్ మీడియం... వైసీపీ రంగులు.. ఇలా అన్ని అంశాల్లోనూ ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బలే తగిలాయి. జగన్ సర్కార్ తీసుకుంటున్న తికమక నిర్ణయాలతో  ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టకు కూడా భంగం కలుగుతుందనే ఆరోపణలు ఏపీ జనాల నుంచి వస్తున్నాయి. అయినా తన తీరు మార్చుకోకుండా ముందుకు పోతున్నారు జగన్ రెడ్డి.  అయితే  తాజాగా సీఎం  జగన్ కు ఆయన జిగ్రీ దోస్త్ కూడా షాకిచ్చారు. జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం సరికాదంటూ ఏకంగా కేంద్రానికి ఫిర్యాదు చేశారు.        ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వంపై కేంద్రానికి తెలంగాణ సర్కార్ ఫిర్యాదు చేసింది. కృష్ణా బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఏపీలోని విశాఖకు తరలించొద్దని తెలంగాణ తేల్చి చెప్పింది. బోర్డు హెడ్‌‌‌‌‌‌‌‌ ఆఫీసును వైజాగ్‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేయాలని ఏపీ చేసిన ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ..  తెలంగాణ ఈఎన్సీ మురళీధర్‌‌‌‌‌‌‌‌ కేఆర్‌‌‌‌‌‌‌‌ఎంబీ మెంబర్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ డీఎం రాయ్‌‌‌‌‌‌‌‌పురేకు లేఖ ‌‌‌‌‌‌‌ రాశారు. 2018 జూన్‌‌‌‌‌‌‌‌లో బోర్డు ప్రధాన కార్యాలయాన్ని విజయవాడకు తరలిస్తామని ఏపీ ప్రతిపాదన పంపిందని లెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్నారు. 2019 అక్టోబరు 9న కేంద్ర హోం శాఖ నిర్వహించిన సమావేశంలోనూ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ నుంచి విజయవాడకు బోర్డు తరలింపు ప్రతిపాదనపై చర్చ జరిగిందన్నారు. గత ఏడాది జనవరి 20న నిర్వహించిన కృష్ణా బోర్డు 12వ మీటింగ్‌‌‌‌‌‌‌‌లోనూ విజయవాడకు తరలిస్తామనే ప్రతిపాదించారని తెలిపారు. గతంలో ఎప్పుడూ వైజాగ్‌‌‌‌‌‌‌‌కు బోర్డు తరలిస్తామని ఏపీ చెప్పలేదని, పోయినేడాది అక్టోబరు 6న నిర్వహించిన రెండో అపెక్స్‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌ మీటింగ్‌‌‌‌‌‌‌‌లో ఏపీకి బోర్డు తరలింపుపై మాత్రమే చర్చ జరిగింది తప్ప, వైజాగ్‌‌‌‌‌‌‌‌కు తరలించాలని కాదని తన లేఖలో తెలిపారు తెలంగాణ ఈఎన్సీ. బోర్డు తరలింపు విషయంలో తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు తెలంగాణ ఇరిగేషన్ అధికారులు.  కృష్ణా బోర్డు ప్రధాన కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారన్న విషయంపై తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి.  కృష్ణా బేసిన్‌కు సంబంధం లేని ప్రాంతంలో  బోర్డు ఏర్పాటు చేయడమేంటనే విమర్శలు వచ్చాయి.  తన నిర్ణయాలతో  పాలనలో  జగన్ రెడ్డి పిచ్చి తుగ్లక్ ను మించిపోయారని కొందరు సెటైర్లు వేశారు. నదీ జలాల పంపకాల బోర్డు ఎక్కడైనా ఆ నది బేసిన్‌లో ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో  కృష్ణా రివర్ బోర్డు ఆ బేసిన్ పరిధిలోనే ఉన్న హైదరాబాదులో  ఉండేది.  రాష్ట్ర విభజన తర్వాత ఈ బోర్డును ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని పునర్విభజన చట్టంలో  పెట్టారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత కూడా హైదరాబాదులోనే కృష్ణానది నీటి యజమాన్య బోర్డును ఉంచడానికి తెలంగాణ  సర్కార్ ప్రయత్నించింది. ఇందుకు అంగీకరించని కేంద్రం.. ఏపీలోనే బోర్డును ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దీంతో కర్నూలులో కేఆర్ఎంబీని ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ ముందుకు వచ్చింది. ఇక్కడి అనుకూలతల గురించి నీటి పారుదల నిపుణులు, రైతు సంఘాల ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు, రాయలసీమ ఉద్యమకారులు పూర్తి వివరాలతో నివేదిక అందజేశారు.  కృష్ణా నది పరివాహక ప్రాంతాలకు కర్నూలు అందుబాటులో ఉంటుంది. కృష్ణా బోర్డును కర్నూలులో ఏర్పాటు చేస్తే నీటి వినియోగంలో, కేటాయింపుల్లో తరచూ వచ్చే వివాదాలను పరిష్కరించుకోడానికి అనుకూలంగా ఉంటుందని మూడు రాష్ట్రాల నీటి పారుదల శాఖ నిపుణుల అభిప్రాయం.  కర్నూలు సరిహద్దుల్లోనే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు ఉండడం వల్ల త్వరలోనే తుంగభద్ర బోర్డును రద్దు చేసి కృష్ణా నది నీటి యాజమాన్య బోర్డులో కలిపేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చన్న వాదన కూడా ఉంది.  అయితే ఇవేమి పట్టించుకోని జగన్ సర్కార్.. విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలన్న తమ ప్రతిపాదనకు బలం చేకూరేలా ఈ నిర్ణయం తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. తాజాగా తెలంగాణ సర్కార్ కూడా విశాఖకు బోర్డును తరలించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేఆర్ఎంబీకి లేఖ రాయడంతో జగన్ సర్కార్ కు షాక్ తగిలినట్లైంది. ముఖ్యంగా జగన్ కు మొదటి నుంచి మద్దతుగా నిలుస్తూ.. అతన్ని తన మిత్రుడిగా బహిరంగంగానే ప్రకటించారు కేసీఆర్. ఈ నేపథ్యంలో కేసీఆర్ సర్కారే వ్యతిరేకిస్తున్నందున కృష్ణా బోర్డు ఏర్పాటును జగన్ ఎక్కడ ఏర్పాటు చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. 

ఇన్ సైడర్ ట్రేడింగ్ కేసులు క్లోజ్!  జగన్ సర్కార్ కు హైకోర్టు షాక్ 

ఇన్ సైడర్ ట్రేడింగ్.. గత 20 నెలలుగా ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న  వైసీపీ నేతలు పదేపదే చెబుతున్న మాట ఇది. టీడీపీపై ఆరోపణలు చేయడానికి వినిపించిన నినాదం ఇది. రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని, టీడీపీ నేతలు బినామి పేర్లతో కారు చౌకగా వందల ఎకరాల భూములు ముందే కొనిపెట్టారని  ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తో పాటు వైసీపీ మంత్రులు, ప్రజా ప్రతినిధులు అదే పనిగా ఆరోపిస్తున్నారు. అప్పటి  టీడీపీ ప్రభుత్వమే అమరావతి భూముల వ్యవహారంలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ ప్రొత్సహించిందని చెబుతూ వస్తున్నారు. వైసీపీ నేతల ఆరోపణలను ఎప్పటికప్పుడు ఖండించారు టీడీపీ నేతలు. మాటలు కాదు ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగితే నిరూపించాలని సవాల్ చేశారు. గత 20 నెలలుగా వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు ఇప్పుడు పుల్ స్టాప్  పడింది. ఇన్ సైడర్ ట్రేడింగ్ విషయంలో జగన్ రెడ్డి  ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాజధాని భూముల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిదంటూ  ఏపీ  ప్రభుత్వం నమోదు చేసిన కేసులను హైకోర్టు కొట్టివేసింది.  రాజధాని ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు కిలారు రాజేష్‌తో పాటుగా మరికొందమందిపై సీఐడీ కేసులు నమోదు చేసింది. దీంతో వాటిని కొట్టివేయాలని కిలారు రాజేష్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై పెట్టిన కేసులు.. కేవలం ప్రభుత్వం కక్ష సాధింపు మాత్రమే అని హైకోర్టులో కిలారు రాజేష్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.  ఈ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ రాజేష్ తరఫున న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. భూములు అమ్మినవారు ఎవరూ ఫిర్యాదు చేయకుండా కేసులు ఎలా నమోదు చేస్తారని? న్యాయవాది వెంకటేశ్వర్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై ఐపీసీ సెక్షన్లు వర్తించవని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం ఈ అంశంలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ లేదని పేర్కొంది. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు ఐపీసీ సెక్షన్లు వర్తించవని హైకోర్టు స్పష్టం చేసింది. అనంతరం కిలారు రాజేష్‌తో పాటు మరికొందరిపై నమోదైన కేసులను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. 2019లో  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పడి నుంచే అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ నేతలు. అంతేకాదు 2019 డిసెంబర్ 28 న  ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారంటూ ఏపీ సర్కార్ కొందరి పేర్లతో జాబితా విడుదల చేసింది. మొత్తం పదకొండు మంది పేర్లలో చంద్రబాబు నాయుడు, లింగమనేని రమేష్, పరిటాల సునీత, పయ్యావుల కేశవ్ లతో పాటూ, యనమల అల్లుడు పుట్టా మహేష్ యాదవ్, ధూళిపాళ్ల నరేంద్ర, కంభంపాటి రామ్మోహన రావు పేర్లు తో పాటూ చాలా మంది పేర్లు ఉన్నాయి. వీరంతా నిబంధనలను తుంగలో తొక్కి వేలాది ఎకరాలు కారుచౌకగా కొన్నట్లు ఆరోపించింది. తెల్లరేషన్ కార్డు దారులకు కూడా  అమరావతిలో  వందలాది ఎకరాలున్నట్లుగా రికార్డుల్లో ఉందని.. వారంతా టీడీపీ నేతల బినామీలేనని కారు డ్రైవర్లు, పనిమనుషుల పేర్లపై కూడా భూములున్నాయని జగన్ సర్కార్ ఆరోపించింది.     ఏపీ రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సీఐడీ విచారణకు ఆదేశిస్తూ జనవరి 23, 2020న ఉత్తర్వులు ఇచ్చింది జగన్ రెడ్డి సర్కార్.  ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సీఐడీ కేసులు కూడా నమోదు చేసింది. మంగళగిరి, తుళ్లూరు రిజిస్ట్రేషన్ ఆఫీసుల నుంచి వారి వివరాలు సేకరించారు అధికారులు. 797 మంది తెల్ల రేషన్ కార్డుదారులు 761 ఎకరాల భూములు కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. అత్యధికంగా తుళ్లూరులో 245 ఎకరాలు కొనుగోలు చేసినట్టు గుర్తించామన్న సీఐడీ అధికారులు.. తెల్ల రేషన్ కార్డుదారులపై చీటింగ్, బినామీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.  2020 ఫిబ్రవరి 29న టీడీపీ నేతలు, మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణలపై కేసులు నమోదు చేసింది. అంతేకాదు గత ప్రభుత్వ పాలనపై నియమించిన సిట్ కూడా అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ పై హడావుడి చేసింది. విజయవాడలోని కొందరు నివాసాల్లో మెరుపు దాడులు నిర్వహించింది.      అయితే జగన్ ప్రభుత్వం విచారణల మీద విచారణలు జరిపిస్తున్నా టీడీపీ నేతలు మాత్రం జంకలేదు. అమరావతిలో  ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని, అలాంటిది ఉంటే ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకునేదని టీడీపీ నేతలు చెప్పారు. ఇప్పుడు వాళ్లు చెప్పిందే నిజమైంది. గత 20 నెలలుగా వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలన్ని ఉట్టివేనని తేలిపోయింది. అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని ఏపీ హైకోర్టు స్పష్టం చేయడంతో వైసీపీకి దిమ్మతిరిగిపోయింది. హైకోర్టు తీర్పుపై స్పందించిన నర్సాపురం ఎంపీ రఘురామరాజు కృష్ణం రాజు.. జగన్ సర్కార్ పై హాట్ కామెంట్స్ చేశారు. సీఐడీ కేసులు పెట్టినప్పుడే అవి చెల్లవని తాను చెప్పానని ఆయన గుర్తు చేశారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ అనేది ఉండదని, అలాంటి వాటిపై కేసులు పెట్టడం కూడా కుదరదని ఆయన మరోసారి స్పష్టం చేశారు. అమరావతిలో  ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందనడానికి ఆధారాలు ఉంటే..  గత 20 నెలలుగా ఎందుకు నిరూపించలేకపోయందని జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు రఘురామకృష్ణం రాజు. 

ఫిబ్రవరిలో సీఎంగా కేటీఆర్!  క్లారిటీ ఇచ్చిన ఈటెల రాజేందర్  

తెలంగాణ ప్రభుత్వంలో మార్పులు ఉంటాయని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా కేటీఆర్ త్వరలోనే బాధ్యతలను స్వీకరించబోతున్నారనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. మార్చి లోపే కేటీఆర్ పట్టాభిషేకం ఉంటుందని పలువురు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు హింట్ కూడా ఇచ్చారు. తన కుమారుడికి పగ్గాలను అప్పగించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రంగాన్ని సిద్దం చేశారని చెప్పారు.  అయితే తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మాత్రం మరో మూడేళ్లు ముఖ్యమంత్రిగా కేసీఆరే ఉంటారని తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం మార్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు  టీఆర్ఎస్ సీనియర్ నేత, మంత్రి ఈటెల రాజేందర్.  కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయన స్పష్టత ఇచ్చారు.   ఓ న్యూస్ ఛానల్ తో మాట్లాడిన రాజేందర్..  కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని... ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియకు కేసీఆర్ ఎందుకు దూరంగా ఉన్నారన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చిన ఈటెల..  ప్రభుత్వంలోని  99 శాతం పనులకు కేటీఆరే హాజరవుతున్నారని... పలు కార్యక్రమాలకు కేసీఆర్ బదులుగా కేటీఆర్ హాజరవుతున్నారని చెప్పారు. వ్యాక్సినేషన్ కార్యక్రమానికి కేసీఆర్ బదులుగా కేటీఆర్ హాజరయ్యారని... దీనిపై విపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు.  కొంత కాలంగా పార్టీతో అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయనే ప్రశ్నకు బదులుగా .. మంత్రిగా తక్కువ మాట్లాడుతూ, ఎక్కువ పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు ఈటెల రాజేందర్.   కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేసే ముందు కేసీఆర్ మరోసారి యాగం కూడా చేయబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ఫిబ్రవరి లేదా మార్చిలో ఆలయాన్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. యాదాద్రి ఆలయం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీలతో పాటు దేశంలోని ప్రముఖులను ఆహ్వానించే యోచనలో కేసీఆర్ ఉన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా సుదర్శన యాగంతో పాటు చండీయాగం, రాజశ్యామలయాగం చేసే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు సమాచారం. ఈ క్రతువు ముగిసిన తర్వాత తన కుమారుడు కేటీఆర్ కి సీఎంగా పట్టాభిషేకం చేసి, ఆ బాధ్యతల నుంచి కేసీఆర్ వైదొలగుతారని విశ్వసనీయంగా తెలుస్తోంది.   జనవరి మొదటి వారంలోనే కేటీఆర్ కు సీఎం బాధ్యతలను అప్పగిస్తారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే సెంటిమెంట్లకు ప్రాధాన్యత ఇచ్చే కేసీఆర్.. యాదాద్రి అలయాన్ని ప్రారంభించడంతో పాటు యాగం చేసిన తర్వాత కేటీఆర్ ను సీఎం చేయడం మంచిదని భావించినట్టు చెబుతున్నారు. అంతేకాదు ముఖ్యమంత్రితో పాటు టీఆర్ఎస్ లోనూ కీలక మార్పులు ఉంటాయని అంటున్నారు. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ సీఎం అయితే... పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా హరీష్ రావు లేదా ఈటెల రాజేందర్ ను నియమించవచ్చని చెబుతున్నారు. ఇద్దరిని కూడా నియమించే ఆలోచనలో గులాబీ బాస్ ఉన్నట్లు టీఆర్ఎస్ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది.  గతంలో టీఆర్ఎల్పీ నేతగా పని చేశారు రాజేందర్.    

ఏపీలో  ఏం జరగబోతోంది? రాజ్యాంగ సంక్షోభం తప్పదా? 

స్థానిక సంస్థల ఎన్నిక అంశం ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర దుమారం రేపుతోంది. పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం.. తన పని తాను చేసుకుపోతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ స్థానిక సంస్థల ఎన్నికలకూ సహకరించేది లేదని చెబుతోంది వైసీపీ ప్రభుత్వం. రాజ్యాంగ బద్ద ఎన్నికల సంఘానికి రాష్ట్ర సర్కార్ సహకరించకపోతే  తీవ్ర పరిణామాలు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో ఎన్నికల కమిషనర్, ఏపీ సర్కార్ వివాదం ఎటు వైపు దారి తీస్తుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.  షెడ్యూల్‌ విడుదలయ్యాక ఎన్నికలను వాయిదా వేసిన సందర్భా లు మన రాష్ట్రంలో తప్ప దేశంగా ఇంతవరకు ఎక్కడా జరగలేదని చెబుతున్నారు. కరోనా కారణంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గత మార్చిలో వాయిదా వేశారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ  జగన్ రెడ్డి సర్కార్ కోర్టుకెళ్లినా.. ఎస్‌ఈసీ నిర్ణయాన్నే సుప్రీంకోర్టు సమర్థించింది. షెడ్యూల్‌ విడుదల చేసిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగమంతా ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తుంది. ఎన్నికలు వాయిదా వేయాలన్నా, నిలిపివేయాలన్నా.. ఎస్‌ఈసీ చేతిలోనే ఉంది. రెండేళ్ల కింద పశ్చిమ బెంగాల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించలేమని ఎస్‌ఈసీకి వ్యతిరేకంగా ఆ రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టు కు వెళ్లింది. అయితే రాజ్యాంగంలోని 73, 74 రాజ్యాంగ సవరణల ప్రకారం స్థానిక ఎన్నికలు సకాలంలో జరగాల్సిందేనని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఇటీవల కేరళ స్థానిక ఎన్నికల విషయంలోనూ జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.    ఏపీలో పంచాయతీ ఎన్నికలకు ఎస్‌ఈసీ  షెడ్యూల్‌ విడుదల చేయడంతో  ఈ నెల 9వ తేదీ నుంచే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. దీంతో రాష్ట్రప్రభుత్వ యంత్రాంగమంతా ఎన్నికల సంఘం పరిధిలోకి వచ్చినట్లయింది. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 23న పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన వెంటనే ప్రభుత్వ యంత్రాంగం ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంది. అయితే జగన్ ప్రభుత్వం  ఇందుకు సహకరించే పరిస్థితి  కనిపించడం లేదు. ఎన్నికల విధుల్లో పాల్గొనవద్దని అధికార యంత్రాంగాన్ని కూడా వారు ఆదేశించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. అదే జరిగితే రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా రాజ్యాంగ సంక్షోభ పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. రాష్ట్ర ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ సంస్థ. కేంద్ర ఎన్నికల కమిషన్‌తో సమాన అధికారాలు కలిగి ఉంది. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో ఎన్నికల ప్రక్రియకు సహకరించని ఉద్యోగులు, అధికారులపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ చర్యలు తీసుకోవచ్చని రాజ్యాంగ  నిపుణులు చెబుతున్నారు.  ఏపీ సర్కార్ తీరుతో  రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా దూకుడుగా వెళ్లే అవకాశాలే కన్పిస్తున్నాయి. గత ఏడాది ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణలో విఫలమయ్యారంటూ  గుంటూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను బదిలీ చేయాలని, ఓ సీఐను సస్పెండ్‌ చేయాలని అప్పట్లో ప్రభుత్వాన్ని ఎస్‌ఈసీ ఆదేశించింది. అయితే రాష్ట్రప్రభుత్వం పట్టించుకోలేదు. గుంటూరు రూరల్‌ ఎస్సీని మాత్రం  ఇటీవల బదిలీ చేశారు. దీంతో  కమిషనర్‌ నిమ్మగడ్డ శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌కు తాజాగా లేఖ రాశారు. ఎస్‌ఈసీ ఆదేశాలను అమలు చేయాలని, ఆ అధికారులను బదిలీ చేయాలని మరోసారి గుర్తుచేశారు. దీనిపై ప్రభుత్వం స్పందించే తీరును బట్టి రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు ఉంటాయని అంటున్నారు. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిన తర్వాత ఉద్యోగ సంఘాల నేతలు కొందరు ఎస్‌ఈసీపై విమర్శలు చేశారు. . ఎన్నికలకు సహకరించబోమని కొంత మంది ఉద్యోగ నేతలు  ప్రకటించారు. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎస్‌ఈసీ వారిపై చర్యలు తీసుకునే అవకాశముందంటున్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఉద్యోగులంతా తన పరిధిలోకి వచ్చినందున.. గీత దాటిన ఉద్యోగ సంఘాల నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఎస్‌ఈసీ పరిశీలిస్తోందని తెలుస్తోంది.   స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ఎస్ఈసీకి  రాష్ట్ర యంత్రాంగం సహకరించకపోతే ఏం జరగబోతుందన్న చర్చ ఏపీలో  జోరుగా జరుగుతోంది. ఎస్‌ఈసీ తనకున్న అధికారాలను వినియోగించి అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తుందని.. ఈ ఆదేశాలను అమలు చేయకుంటే గవర్నర్‌కు, రాష్ట్రపతికి ఎన్నికల సంఘం ఫిర్యాదు చేసే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. అదే జరిగితే రాజ్యాంగ బద్ధ విధుల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైనట్లు అవుతుందని.. రాజ్యాంగ సంక్షోభం తలెత్తుతుందని చెబుతున్నారు.

ముఖ్యమంత్రి సీటుపై పంచాయితి! కుటుంబ సభ్యులతో  కేసీఆర్ కు తలనొప్పి? 

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట్లో కోల్డ్ వార్ నడుస్తుందా ? పదవుల విషయంలో కేటీఆర్, కవిత ఢీ అంటే ఢీ అంటున్నారా? పాలనలో మార్పులకు సిద్దమైన కేసీఆర్ వెనక్కి తగ్గడానికి కారణం ఏంటీ? ఇవే ఇప్పుడు తెలంగాణతో పాటు టీఆర్ఎస్ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. పదవుల విషయంలో కేటీఆర్, కవిత మధ్య విభేదాలు తీవ్రమయ్యాయని చెబుతున్నారు. ఇద్దరిలో ఎవరూ వెనక్కి తగ్గే పరిస్థితి లేకపోవడంతో కేసీఆర్ కూడా ఏమి చేయలేకపోతున్నారని చెబుతున్నారు. అందుకే పాలనలో ప్రక్షాళనకు సిద్దమైన గులాబీ బాస్.. ఇప్పుడా ప్రయత్నాలను విరమించుకున్నారని సమాచారం. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్.. కేసీఆర్ కేబినెట్ లో మంత్రిగా కూడా ఉన్నారు. కీలకమైన మున్సిపల్, కమర్షియల్, ఐటీ శాఖల మంత్రిగా ఉన్న కేటీఆర్.. పాలనలో అంతా తానే వ్యవహరిస్తున్నారనే చర్చ ఎప్పటి నుంచో ఉంది. విదేశీ రాయబారులు, పెట్టుబడిదారులు, ఇతరత్రా ప్రముఖులు కూడా ప్రగతి భవన్ లో కేటీఆర్ తోనే సమావేశమై చర్చిస్తున్నారు. బదిలీలు, ప్రమోషన్లు, పోస్టింగులన్ని కేటీఆర్ చెప్పినట్లే సాగుతుండటంతో ఉన్నతాధికారులంతా కేసీఆర్ కంటే కేటీఆర్ కే ఎక్కువ సన్నిహితంగా ఉంటున్నారు. షాడో ముఖ్యమంత్రిగా విమర్శలు ఎదుర్కొంటున్న కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేయాలని కేసీఆర్ భావించారట. అయితే తన పదవిపై క్లారిటీ ఇవ్వాలని కవిత కోరుతుండటంతో ఇంట్లో గొడవ జరుగుతుందని తెలుస్తోంది.   2014లో నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు కల్వకుంట్ల కవిత. ఆ సమయంలోనే మోడీ ప్రభుత్వంలో టీఆర్ఎస్ చేరుతుందని, కవితకు కేంద్ర మంత్రి పదవి వస్తుందని  ప్రచారం జరిగింది. కాని ఎందుకో అది జరగలేదు. 2019  ఎన్నికల తర్వాత కేంద్రంలో ఎవరొచ్చినా కవితకు కేబినెట్ బెర్త్ ఖాయమనుకున్నారు. కాని అనూహ్యాంగా ఆమె ఎంపీగా ఓడిపోయారు. దీంతో షాకైన కవిత.. దాదాపు ఏడాది పాటు రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనలేదు. దీంతో కవితను రాజ్యసభకు పంపించి మళ్లీ యాక్టివ్ చేస్తారని, అవసరమైతే కేంద్ర కేబినెట్ లో చేరుస్తారని  చర్చ జరిగినా.. అది కూడా జరగలేదు. కేటీఆర్ వ్యతిరేకించడం వల్లే కవితను రాజ్యసభకు పంపలేదని టీఆర్ఎస్ లోనే చర్చ జరిగింది. కవిత కేంద్ర మంత్రి అయితే .. తర్వాత సీఎం రేసులో ఆమె తనకు పోటీగా వస్తారని భావించడం వల్లే కేటీఆర్ ఆమెకు మద్దతు ఇవ్వలేదనే ప్రచారం జరిగింది. అప్పటి నుంచి కేటీఆర్ ,కవిత మధ్య గ్యాప్ వచ్చిందంటున్నారు.               ఇటీవలే నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగి విజయం సాధించింది కవిత. ఆమె ఎమ్మెల్సీగా గెలిచినప్పటి నుంచి  రాష్ట్ర మంత్రివర్గంలో చోటు ఖాయమన్న చర్చ మొదలైంది. ఇక్కడే కేసీఆర్ కుటుంబలో అసలు సమస్య వచ్చిందంటున్నారు. ఇప్పటికే కేసీఆర్ కుటుంబానికి పదవులన్ని ఇచ్చారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. జనాల్లోనూ అలాంటి చర్చే జరుగుతోంది. ఈ సమయంలో కవితను కేబినెట్ లోకి తీసుకుంటే మరిన్ని ఇబ్బందులు వస్తాయని కేసీఆర్ తో కేటీఆర్ వాదిస్తున్నారని చెబుతున్నారు. దీంతో కవితకు మంత్రివర్గంలో చోటుపై ఎటూ తేల్చుకోలేకపోతున్న కేసీఆర్.. కేబినెట్ ప్రక్షాళనకు వెనుకంజ వేస్తున్నారని భావిస్తున్నారు. ఇద్దరు, ముగ్గురు మంత్రులను తొలగించి కొత్త వారిని తీసుకోవాలని దాదాపుగా నిర్ణయించినా.. కవిత విషయం తేలకపోవడం వల్లే మంత్రివర్గ ప్రక్షాళన విషయాన్ని కేసీఆర్ పక్కన పెట్టారని టీఆర్ఎస్ నేతలే చెబుతున్నారు. తనకు మంత్రిపదవి రాకుండా కేటీఆరే అడ్డుకుంటున్నారన్న భావనలో ఉన్న కవిత.. ఇప్పుడు ముఖ్యమంత్రి సీటుపైనా పేచీ పెడుతున్నారని చెబుతున్నారు. కేటీఆర్ కు పాలనా పగ్గాలు ఇవ్వడానికి ఆమె అంగీకరించడం లేదని తెలుస్తోంది. అందుకే మార్చిలోపు కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే చెబుతున్నా.. అలాంటిదేమి ఉండకపోవచ్చని తెలుస్తోంది. నిఘా సంస్థలు, సర్వేల పేర్లతో కొంత కాలం కేసీఆర్ సాగదీస్తారని చెబుతున్నారు. ఈ విషయాలన్నీ తెలుసు కాబట్టే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సహా కమలం కీలక నేతలు.. కేటీఆర్ కు ఇప్పట్లో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎంత మాత్రం లేదని బల్లగుద్ది మరీ చెబుతున్నారని రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. మొత్తంగా పదవుల విషయంలో కేసీఆర్ ఫ్యామిలీలో పెద్ద పంచాయతీ జరుగుతున్నట్లు కనిపిస్తోంది. మరీ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి మరీ.. 

50 వేల కోట్ల విలువైన భూ వివాదానికి 80 ఏండ్ల చరిత్ర! 

8 దశాబ్దాలు... 12 హత్యలు.. 80 సర్వే నెంబర్ .. 867  ఎకరాల ల్యాండ్ .. 50,000 కోట్ల రూపాయలు. హైదరాబాద్ లో సంచలనం బోయినపల్లి కిడ్నాప్ కేసుకు కారణమైన న్యూహఫీజ్‌పేట భూ వివాదం చరిత్ర ఇది. హఫీజ్‌పేట్‌ సర్వే నంబర్‌ 80లోని భూమి  దశాబ్దాలుగా  వివాదాల్లో ఉంది. కోర్టు కేసులతో  కొనసాగుతూనే ఉంది.  హత్యలు-ప్రతి హత్యలతో దాదాపు డజను మందిని ఈ భూమి బలిగొన్నది. దశాబ్దాల క్రితం రూ. వేలల్లో విలువ ఉన్నప్పుడు ప్రారంభమైన వివాదం.. ఇప్పుడు ఆస్తి విలువ వేల కోట్లకు చేరుకున్నా కొలిక్కి రాలేదు.  శేరిలింగంపల్లి మండలం న్యూహఫీజ్‌పేట సర్వే నంబర్‌ 80లోని భూములపై ప్రభుత్వానికి, ప్రైవేట్‌ వ్యక్తులకు మధ్య  మొదట  వివాదం కొనసాగింది. మార్తాండ్‌నగర్‌ వెనుకవైపు, కొండాపూర్‌ అంతర్గత రహదారి మధ్యలో ఉన్న ఓ 40 నుంచి 50 ఎకరాల  భూమి తమదేనంటూ దివంగత మాజీ మంత్రి భూమా నాగిరెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి గతంలో చుట్టూ ప్రహరీ నిర్మించి రేకులతో ఫెన్సింగ్‌ వేశారు. భూముల చుట్టూ వేసిన ఫెన్సింగ్‌ రేకులపై తొలుత ఏవీ ఎస్టేట్స్‌ అని బోర్డులు పెట్టారు. ఆ తరువాత కొన్నేళ్లకు ఆ బోర్డులు తొలగించి కేపీ ఎస్టేట్స్‌ అని పేరు మార్చారు. ఈ బోర్డుల ప్రకారం ప్రస్తుతం కిడ్నాపునకు గురైన కె.ప్రవీణ్‌రావు పొజిషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. భూమా నాగిరెడ్డి బతికి ఉన్నప్పుడు ఏవీ ఎస్టేట్స్‌గా ఉన్న పేరు ఆయన చనిపోయాక కేపీ ఎస్టేట్స్‌గా మారిందని స్థానికులు అంటున్నారు.  హఫీజ్‌పేట్‌లోని 50 ఎకరాల భూమి తమదేనని మాజీ మంత్రి భూమా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. భూమా కుటుంబాన్ని ఆర్థికంగా, రాజకీయంగా దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమపై ఏపీ, తెలంగాణలో అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని చెబుతున్నారు. తమ భూమిని కబ్జా చేసి మైహోమ్స్‌కు లీజ్‌కు ఇచ్చారని భూమా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం వివాదం జరుగుతున్న హఫీజ్‌పేట స్థలంలో తనకు 40 శాతం వాటా ఉన్నట్లు పోలీసుల విచారణలో భూమా అఖిలప్రియ  చెప్పినట్లు తెలిసింది. మిగతా భూమిలో 30 శాతం సుబ్బారెడ్డికి, మిగతా 30 శాతం ప్రవీణ్‌కు చెందుతుందని ఆమె వివరించినట్లు సమాచారం.  నిజాం రాష్ట్ర రైల్వే నిర్మాణ సమయంలో ఇబ్రహీంపట్నం, పటాన్‌చెరు ప్రాంతాల్లో ఖుర్షీద్‌ జాహీ పాయ్‌గా, చావూస్‌, నవాబ్‌ వంశీయులకు చెందిన భూములను నిజాం ప్రభుత్వం సేకరించింది. ఆ ఆస్తులకు ప్రత్యామ్నాయంగా.. హఫీజ్‌పేట్‌ సర్వేనంబర్‌ 80, హైదర్‌నగర్‌లో  భూములను కేటాయిస్తూ.. 1929లో ఏడో నిజాం మీర్‌-ఉస్మాన్‌ అలీఖాన్‌ ఫర్మాన్‌ జారీ చేశారు. జాగీర్దారీ వ్యవస్థ రద్దయ్యాక ఈ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీనిపై 1958లో పాయ్‌గా వారసుల్లో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇంకొందరు తమ వాటా భూములను గ్రేటర్‌ గోల్కొండ వారసులకు అగ్రిమెంట్‌ చేశారు. ఆ సమయంలో నిజాం ప్రభువే ఈ భూమిని కొనుగోలు చేసినట్లు ఉన్న లింక్‌ డాక్యుమెంట్‌ను జత చేశారు. అప్పటినుంచే  ఈ భూమిపై సీఎస్‌-14/1958 కేసు న్యాయస్థానంలో మొదలైంది. 1968 జూన్‌ 28న హైకోర్టు ఈ భూములపై ప్రిలిమినరీ డిక్రీని ఇచ్చింది.  అయితే ప్రిలిమినరీ డిక్రీ వచ్చాక.. హక్కుదారులెవరూ భూములను స్వాధీనం చేసుకోవడానికి ముందుకు రాలేదు. కొండలు, గుట్టలు, అడవి మాదిరిగా ఉన్న ఈ భూముల్లో అసైన్‌మెంట్‌ డీడ్‌ చేసుకునేందుకూ ఆసక్తి చూపలేదు. దాంతో. ఆ సర్వే నంబర్‌-80లోని భూములన్నీ సర్కారువేనని ప్రభుత్వం వాదిస్తూ వచ్చింది. ఈ మేరకు పలు కోర్టుల్లో అఫిడవిట్లు దాఖలు చేసింది. ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌లో కూడా ఈ భూములన్నీ సర్కారువేనని పేర్కొంటూ వాటిని నిషేధిత జాబితాలో పెట్టింది.  పాత ముంబై జాతీయ రహదారి, కొత్త ముంబై జాతీయ రహదారికి మధ్య ఈ ప్రాంతం వారధిగా ఉండడం.. కొండాపూర్‌లో 8వ బెటాలియన్‌ ప్రత్యేక పోలీసు బెటాలియన్‌ ఏర్పాటవడంతో పాయ్‌గా, చావూస్‌ వారసులు సర్వే నంబర్‌-80లోని భూముల్లో ఎవరికి వారుగా కాలనీలు, ప్లాట్లు ఏర్పాటు చేసి, విక్రయాలు సాగించారు. అలా 1983-84లో సుభాష్‌ చంద్రబోస్‌ నగర్‌ పేరుతో వెంచర్‌ను అభివృద్ధి చేసిన కబీరుద్దీన్‌ ఖాన్‌  రూ. 15లకు గజం చొప్పున భూములను విక్రయించారు. అదే సమయంలో.. ప్రేమ్‌నగర్‌, మార్తాండనగర్‌ పేరుతో ఇస్మాయిల్‌, పాయ్‌గా కాలనీ పేరుతో పాయ్‌గా వారసులు, మరికొన్ని పేర్లతో చావూస్‌ వారసులు ప్లాట్లను విక్రయించారు. 30.31 ఎకరాలను ఓ 30 మంది వ్యక్తులు  క్లెయిమ్‌ చేస్తూ రాగా.. 116 ఎకరాలను బి.శివరామకృష్ణ, సి.కల్యాణ్‌, మరో వ్యక్తి, ముంబైకి చెందిన సైరస్‌ ఇన్వె్‌స్టమెంట్స్‌ క్లెయిమ్‌ చేస్తూ వచ్చింది. కొన్ని భూములు చేతులు మారుతూ వచ్చాయి.  కొండాపూర్‌ ప్రాంతంలో 1990 తొలినాళ్లలో శిల్పారామం రావడం.. ఆ తర్వాత హైటెక్‌సిటీ నిర్మాణానికి శంకుస్థాపన జరగడంతో ఇక్కడి భూములకు డిమాండ్‌ పెరిగింది. దీంతో కోర్టుల్లో వివాదాలకు పరిమితమైన ఈ భూమి.. హత్యలు-ప్రతి హత్యలకు వేదికగా మారింది. ఆ పార్టీ.. ఈ పార్టీ అని కాకుండా.. అధికార, ప్రతిపక్షాల నేతలు కబ్జాలకు పాల్పడ్డారు. 1989లో సాబేర్‌ చావూ్‌సను అతడి ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. సాబేర్‌ తండ్రి.. తన ప్రత్యర్థులపై బేగంబజార్‌లో బాంబుతో దాడి చేయించాడు. తుపాకీతో ఫైర్‌ చేయించారు. 1997లో రియల్టర్‌ హరిబాబు హత్యకు గురయ్యాడు. ఆ తర్వాత మాదాపూర్‌లో అబూబకా్‌సను ప్రత్యర్థులు దారుణంగా చంపారు. ఇప్పుడు భూమా అఖిలప్రియ-ప్రవీణ్‌కుమార్‌ మధ్య వివాదంలో ఉన్న భూమిలో.. శేఖర్‌నాయుడు అనే రియల్టర్‌ను ప్రభాకర్‌రాయుడు అనే వ్యక్తి 2005లో హత్య చేయించాడు. ఆ తర్వాత ప్రభాకర్‌ రాయుడు పంజాగుట్టలో హత్యకు గురయ్యాడు. తాజాగా ప్రవీణ్‌కుమార్‌, అతడి సోదరుల కిడ్నా‌పయ్యారు. కొందరు రియల్టర్లల ఈ భూములను క్లెయిమ్‌ చేసుకోవడానికి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారు. తప్పుడు కేసులతో.. సెటిల్మెంట్‌ డిక్రీలు పొంది.. వాటి ఆధారంగా మ్యుటేషన్లు చేయించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ భూమి ప్రైవేట్‌ వ్యక్తులకు చెందినదని 2003లో సుప్రీంకోర్టు తేల్చిచెప్పడంతో వివాదం రాజుకుందంటున్నారు.   ప్రవీణ్ రావు కిడ్నాప్ తో హఫీజ్ పేట భూములు మళ్లీ తెరపైకి రావడంతో కొత్త కొత్త విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య సంచలన ఆరోపణలు చేశారు. మియాపూర్, హఫీజ్ పేటలోని వేల కోట్ల రూపాయల విలువైన భూములు రాజకీయ నేతల కబ్జాల్లో ఉన్నాయన్నారు. గోల్డ్ స్టోన్ ప్రసాద్. సినీ నిర్మాత సీ కల్యాణ్, ఐ సుదర్శన్ రావులు ఈ భూముల కబ్జా వెనక ఉన్న పెద్దలని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వంలోని ఓ కీలక మంత్రికి భూకబ్జాల్లో పాత్ర ఉందని గాదె ఇన్నయ్య ఆరోపించారు. మెదక్, మహబూబ్ నగర్ , రంగారెడ్డి జిల్లాలకు చెందిన 30 మంది వెలమ దొరలు.. 50 వేల కోట్ల విలువైన భూములను తమ చేతుల్లో ఉంచుకున్నారని గాదె ఇన్నయ్య సంచలన ఆరోపణలు చేశారు. 

బూతు పదాలే పదవులకు సోపానం!  తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పతనం?  

పాలకులు హుందాగా ఉండాలి. శత్రుభావన లేకుండా ప్రేమపూర్వక, స్నేహపూర్వక రాజకీయాలుండాలి. పాలకపక్షం ప్రతిపక్షం పట్ల ప్రేమగా ఉండాలి. గతంలో మన  నాయకులు అలాంటి ఆదర్శ రాజకీయాలు చేసేవారు. హుందాతనంతో చట్టసభ్యలకు గౌరవం తెచ్చేవారు.  ప్రజా సమస్యలపై చక్కగా చర్చించేవారు. ముఖ్యమైన అంశాల్లో ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకునేవారు. రాజకీయ భేదాభిప్రాయాలు ఉన్నా  గౌరవ మర్యాదలు పాటించేవారు. విపక్ష నేతల వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లే వారు కారు. పొరపాటున ఎవరినైనా ఏకవచనంతో సంబోంధించినా వెంటనే క్షమాపణలు కోరేవారు. మరోసారి అలాంటి తప్పు జరగకుండా చూసుకునేవారు మన పాత తరం నాయకులు. కాని ఇప్పుడు బూతు పదాలే పదవులకు సోపానంగా మారినట్లుగా కనిపిస్తున్నాయి. పాలకులే ''వాడు-వీడు'' అంటూ రెచ్చగొట్టేలా  మాట్లాడుతున్నారు. ప్రజల మధ్య శతృత్వం పెంచేలా అసహ్య రాజకీయాలు చేస్తున్నారు. సంస్కార హీనంతో చిల్లర మాటలు మాట్లాడుతూ రాజకీయాలంటేనే  రోత పుట్టిస్తున్నారు.     ప్రస్తుతం రాజకీయ విలువలు పూర్తిగా పతనమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో అయితే మరీ దిగజారిపోయాయి. వాడు.. వీడు అనే పదం లేకుండా మాట్లాడటం లేదు కొందరు నాయకులు. ముఖ్యంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు  బరి తెగిస్తున్నారు. ఎక్కడైనా అధికారంలో ఉన్నవారు కొంత సంయమనంతో ఉంటారు. ప్రజా సమస్యలపై పోరాడుతారు కాబట్టి విపక్ష సభ్యులు కొంత ఆవేశంగా మాట్లాడుతుంటారు. కాని ఏపీలో మాత్రం అధికార వైసీపీ నేతలే దిగజారి ప్రవర్తిస్తున్నారు. నరుకుతా.. చంపుతా.. అమ్మ మెగుడు , వెధవ లాంటి పదాలే మంత్రులు కొడాలి నాని, అనిల్ కుమార్ , వెల్లంపల్లి శ్రీనివాస్ లాంటి వారికి ఊతపదాలయ్యాయి. మంత్రులు మాట్లాడగా తమకేంటని అనుకుంటున్నారో ఏమో రోజారెడ్డి, అంబటి రాంబాబు, జోగి రమేష్ వంటి వారు మరింతగా  రెచ్చిపోతున్నారు. మాజీ ముఖ్యమంత్రులు. మంత్రులతో  సీనియర్ నేతలను కూడా ఏకవచనంతో సంభోదిస్తూ వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. నీచంగా మాట్లాడే నేతలకు పదవులు, పార్టీ పెద్దల నుంచి ప్రశంసలు వస్తుండటంతో మరింతగా బూతు సాహిత్యం వినిపిస్తున్నారు ఫ్యాన్ పార్టీ ప్రజా ప్రతినిధులు.  ఏపీ వైసీపీ నేతలను చూసి తామేమి తక్కువ కాదనుకున్నారో ఏమో తెలంగాణ ప్రజా ప్రతినిధులు కూడా తమ నోటికి పని చెబుతున్నారు. వ్యక్తిగత దూషణలకు దిగుతూ కుటుంబ సభ్యులను గొడవలోకి లాగుతున్నారు. తెలంగాణ బీజేపీ చీఫ్ గా బండి సంజయ్ పగ్గాలు చేపట్టాకా తెలంగాణ రాజకీయాల్లో మాటల తీవ్రత పెరిగింది. కేసీఆర్ కుటుంబ సభ్యులపై బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తుండగా.. టీఆర్ఎస్ నేతలు కూడా అదే స్థాయిలో కౌంటరిస్తున్నారు. దీంతో తాగుబోతు, బడా చోర్, దగుల్బాజీ, చిప్పకూడు, బట్టలూడదీసి కొడతా, నాలుక చీరేస్తా , నరికేస్తా వంటి పదాలు కామన్ గా మారిపోయాయి.  తెలుగు రాష్ట్రాల్లోని కొందరు నేతల ప్రకటనలు వింటుంటే..  వీరు ప్రజలు ఎన్నుకొన్న వారేనా? అన్న అనుమానం వస్తోంది.  ఇంత సంస్కారహీనంగా మాట్లాడే వారిని ప్రజలు ఎలా ఎన్నుకోగలిగారు?  అన్న ఆందోళన వస్తోంది. రాజకీయ వ్యవస్థ  ఇంతగా దిగజారిపోయిందా అన్న ఆవేదన కూడా కల్గుతోంది.   గతంలో  దేశ రాజకీయాలు, మన చట్టసభలు ప్రజాస్వామ్య స్పూర్తికి సాక్ష్యంగా నిలిచేవి. రాజీవ్ గాంధీ హయాంలో 1988లో  దేశాన్ని కుదిపేసిన బోఫోర్స్ కుంభకోణంలో సంయుక్త పార్లమెంటరీ కమిటీ నియమించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసినప్పుడు బీజేపీ బలం లోక్ సభలో కేవలం ఇద్దరు సభ్యులే. అందులో ఒకరు తెలుగుదేశం మద్దతుతో హన్మకొండ నుండి గెలిచిన చందుపట్ల జంగారెడ్డి. అయినా విపక్షాన్ని గౌరవించింది అప్పటి పాలకపక్షం. రాజ్యసభలో వాజపేయి ప్రధాని రాజీవ్ గాంధీని బోఫోర్స్ అవినీతిపై తూర్పారపట్టేవారు. అలాంటి వాజపేయి కిడ్నీ చెడిపోయిందని తెలుసుకొన్న రాజీవ్ గాంధీ..  అమెరికాలో జరిగే ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొనే భారతీయ బృందంతో పాటు తన వెంట వాజపేయిని కూడా తీసుకు వెళ్ళి అక్కడ ప్రభుత్వ ఖర్చులతో చికిత్స చేయించారు.  తాను జీవించి ఉన్నానంటే దానికి రాజీవ్ గాంధీయే కారణమని వాజపేయి బహిరంగంగానే వెల్లడించారు. అయినా వాజపేయి రాజకీయంగా చివరి క్షణం వరకూ రాజీవ్‌తో విభేదించారు. ఇవన్ని పాత తరం రాజకీయ నాయకుల హుందాతనానికి, గొప్పతనానికి ప్రతీకలు.  ఉమ్మడి అంధ్రప్రదేశ్ లోనూ ఎంతో మంది ఆదర్శ రాజకీయ నాయకులు చట్టసభలకు ఎన్నికయ్యారు. నిరాండబర జీవితంతో ప్రజా సంక్షేమం కోసం పాటు పడ్డారు. పుచ్చలపల్లి సుందరయ్య, గౌతు లచ్చన్న, ఆచార్య, ఎన్జీ రంగా, గరిమెల్ల నాగిరెడ్డి, చెన్నమనేని రాజేశ్వరరావు, వెంకయ్య నాయుడు, ఓంకార్, నర్రా రాఘవరెడ్డి  లాంటి నాయకుడు చట్టసభలకు మరింత వన్నె తెచ్చారు. తమ అద్బుత ప్రసంగాలతో ప్రజల్లో అభిమానం చూరగొన్నారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ హయాంలో చట్ట సభ ఎంతో హుందాగా సాగేది.  ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేసినా ఎన్టీఆర్ శ్రద్దగా వినేవారు. అంతేకాదు మద్దికాయల ఓంకార్, నర్రా రాఘవరెడ్డి, సిహెచ్ విద్యాసాగర్ రావు చేసే అభ్యర్థనలను ఎన్టీఆర్‌ కాదనకుండా మన్నించేవారు. అందుకే ఎన్టీఆర్ హయాం వరకు రాజకీయాలంటే ఓ గౌరవం ఉండేది. ప్రజలు ప్రజాప్రతినిధులను ఆదరించేవారు. చంద్రబాబు పాలనలో కొంత రాజకీయ వేడి పెరిగినా.. మరీ దిగజారి పోలేదు. తెలంగాణ ఉద్యమం నుంచి తిట్లు రాజకీయాల్లో భాగంగా కాగా.. ఇప్పుడు పీక్ స్టేజీకి చేరాయి.   బహిరంగంగా ''వాడు'' ''వీడు'' అనటం... ''నరుకుతాను'' ''చంపుతాను'' అనటం రాజకీయ సంస్కారానికి నిదర్శనమా? పతనమౌతున్న విలువలకు నిదర్శనమా? ఏమి మాట్లాడుతున్నారో, ఎంతగా తెగిస్తున్నారో ఇప్పటి నేతలు. వాళ్ల మాటల పర్యవసానాలేమిటో, సమాజం తమ మాటలను ఎలా స్వీకరిస్తుందో ఒక్కసారైనా వీరు ఆలోచిస్తున్నారా? సమాజానికి  మార్గదర్శకులుగా ఉండాల్సిన ప్రజా ప్రతినిధులు  ప్రజల దారిలో తమ మాటల ద్వారా ముళ్లు.. రాళ్లు పరుస్తున్నారు. సంస్కార హీన మాటలన్నీ భయానికి నిదర్శనంగా చెబుతారు.  వీరుడు ఎప్పుడూ విమర్శలకు అసహనానికి గురికాడు. నవ్వుతూ స్వీకరిస్తాడు. పదవి పోతుందనే భయంతో.. మాట్లాడటం. అసహనానికి గురికావటం, అసహనం నియంతృత్వానికి దారితీస్తాయి. నియంతృత్వం వ్యక్తి పతనానికి దారితీస్తుంది. విమర్శలను నవ్వుతూ... సహృదయతతో స్వీకరించినవాడే రాజకీయాలలో ఓటమి ఎరుగనివాడు.    

బేసిన్ బయట కృష్ణా రివర్ బోర్డు! తుగ్లక్ ను మించిపోయారంటూ సెటైర్లు! 

పంజాబ్ లో ఎవరైనా  సెలూన్ షాపులు పెడతారా? థార్ ఏడారి పరిసరాల్లో విత్తనాలు విక్రయించే సాహసం చేస్తారా?  ఆంధ్రప్రదేశ్ సర్కార్ మాత్రం నలుగురు నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లుగా.. అలాంటి  అక్కరకు రాని పనులు కూడా చేసేలా కన్పిస్తోంది. ఏడాదిన్నరగా అస్తవ్యస్థ విధానాలు, అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రం పరువు తీస్తున్నారనే విమర్శలు జగన్ సర్కార్ పై ఉన్నాయి. తాజాగా కృష్ణా రివర్ బోర్డు కార్యాలయాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలన్న నిర్ణయంతో అది మరోసారి రుజవైందంటున్నారు. కృష్ణా బేసిన్‌కు సంబంధం లేని ప్రాంతంలో  బోర్డు ఏర్పాటు చేయడమేంటని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఇది కదా పాలన అంటూ నవ్వుకుంటున్నారు. తన నిర్ణయాలతో  పాలనలో  జగన్ రెడ్డి పిచ్చి తుగ్లక్ ను మించిపోయారని కొందరు సెటైర్లు వేస్తున్నారు. నదీ జలాల పంపకాల బోర్డు ఎక్కడైనా ఆ నది బేసిన్‌లో ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో  కృష్ణా రివర్ బోర్డు ఆ బేసిన్ పరిధిలోనే ఉన్న హైదరాబాదులో  ఉండేది.  రాష్ట్ర విభజన తర్వాత ఈ బోర్డును ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని పునర్విభజన చట్టంలో  పెట్టారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత కూడా హైదరాబాదులోనే కృష్ణానది నీటి యజమాన్య బోర్డును ఉంచడానికి తెలంగాణ  సర్కార్ ప్రయత్నించింది. ఇందుకు అంగీకరించని కేంద్రం.. ఏపీలోనే బోర్డును ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దీంతో కర్నూలులో కేఆర్ఎంబీని ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ ముందుకు వచ్చింది. ఇక్కడి అనుకూలతల గురించి నీటి పారుదల నిపుణులు, రైతు సంఘాల ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు, రాయలసీమ ఉద్యమకారులు పూర్తి వివరాలతో నివేదిక అందజేశారు. కృష్ణా బోర్డు కర్నూలులో ఏర్పాటు చేయాలని రాయలసీమ ఉద్యమకారులు ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నారు. కృష్ణా నది పరివాహక ప్రాంతాలకు కర్నూలు అందుబాటులో ఉంటుంది. గతంలో దీన్ని విజయవాడలో పెట్టాలనే ఆలోచన చేసినప్పుడే తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. కృష్ణానది సముద్రంలో కలిసే చోట యాజమాన్య బోర్డు పెట్టడం అర్థరహితం అన్నారు. కృష్ణా బోర్డును కర్నూలులో ఏర్పాటు చేస్తే నీటి వినియోగంలో, కేటాయింపుల్లో తరచూ వచ్చే వివాదాలను పరిష్కరించుకోడానికి అనుకూలంగా ఉంటుందని మూడు రాష్ట్రాల నీటి పారుదల శాఖ నిపుణుల అభిప్రాయం.  కర్నూలు సరిహద్దుల్లోనే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు ఉండడం వల్ల త్వరలోనే తుంగభద్ర బోర్డును రద్దు చేసి కృష్ణా నది నీటి యాజమాన్య బోర్డులో కలిపేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చన్న వాదన కూడా ఉంది.   కృష్ణా జలాల పంపిణీలో రాయలసీమకు అన్యాయం జరుగుతోందనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో యాజమాన్య బోర్డు కర్నూలులో ఏర్పాటు చేయడం న్యాయమనే అభిప్రాయం కూడా ఉంది. ప్రాంతీయ సమానత్వానికి కృషి చేయాలనే సదుద్దేశానికి ఊతం ఇస్తుందని అనేక మంది అభిప్రాయపడుతూ వచ్చారు. దీంతో రాయలసీమ ప్రాంతానికి చెందిన వైఎస్‌ జగన్‌ సీఎంగా ఉండటం, ఎన్నికలకు ముందు వైసీపీ నాయకులు కూడా దీన్ని బలపరచడంతో..  కర్నూల్ లో కృష్ణా రివర్ బోర్డు ఏర్పాటుకు ఎలాంటి ఆటంకాలు ఉండవని అంతా భావించారు. కాని అందుకు భిన్నంగా ఇప్పుడు ఏకంగా కృష్ణా బేసిన్‌కు సంబంధం లేని విశాఖపట్టణంలో పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది జగన్ సర్కార్. ఇది కేవలం వైజాగ్‌లో రాజధాని ఏర్పాటు చేయాలనే వ్యూహానికి అనుకూలంగానే  జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.          ప్రస్తుతం గ్రేటర్ రాయలసీమ  డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చింది. కర్నూల్ ను రాజధాని చేయాలనే డిమాండ్ అలాగే ఉంది. ఇలాంటి తరుణంలో  అన్ని అనుకూలంగా ఉన్న కర్నూల్ కాకుండా.. కృష్ణా బేసిన్ కు ఏమాత్రం సంబంధం లేని విశాఖలో కృష్ణా రివర్ యాజమాన్య బోర్డు ఏర్పాటు చేయలని నిర్ణయం తీసుకోవడం అందరిని విస్మయ పరుస్తోంది. కొత్త వివాదాన్ని రగిలించేందుకే జగన్ సర్కార్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తుందా అన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. కృష్ణా బోర్డును తన రాజకీయ ప్రయోజనాల కోసం సీఎం జగన్ వైజాగ్‌ తీసికెళ్లాలని చూస్తున్నారని రాయలసీమ వాసులు మండిపడుతున్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతానికి సంబంధం లేని విశాఖ పట్టణంలో ఈ బోర్డును ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నిస్తున్నారు.  కృష్ణానది యాజమాన్యం బోర్డును రాయలసీమలో ఏర్పాటు చేయాలని ఆర్‌వీఎస్‌, ఆర్‌వైపీఎస్‌, ఆర్‌వీపీఎస్‌ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. లేదంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

తిరుపతి కింగ్ టీడీపీనే.. తేల్చేసిన ప్రీ పోల్ లెక్కలు!!

రాజకీయాల్లో గెలుపోటములు శాశ్వతం కాదు. 'ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలు అవుతాయి' అనే ఫార్ములా రాజకీయాలకు కరెక్ట్ గా సెట్ అవుతుంది. బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన పార్టీ తదుపరి ఎన్నికల్లో బొక్కబోర్లా పడొచ్చు.. అబ్బే ఈ పార్టీ పనైపోయిందనుకున్న పార్టీ అనూహ్యంగా పుంజుకొని గెలుపు జెండా ఎగరవేయొచ్చు. అందుకే అంటారు.. రాజకీయాల్లో వాపులు ఉంటాయి కానీ బలుపులు ఉండవు. ఇక్కడ గెలుపు.. వాపు లాంటిది. ఆ వాపు ఎప్పుడైనా కరిగిపోవచ్చు. గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ, 22 లోక్ సభ సీట్లతో తిరుగులేని విజయాన్ని అందుకున్న వైసీపీకి.. గెలుపు వాపు కరిగిపోయే పునాది తిరుపతిలో పడుతుందా అంటే? పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది.   వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద రావు మరణంతో ఖాళీ అయిన తిరుపతి లోక్ సభకు త్వరలో ఉప ఎన్నిక జరగబోతోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ..తన సిట్టింగ్ సీటును నిలబెట్టుకుంటామనే ధీమా వ్యక్తం చేస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. తెలంగాణలో జరిగినట్లే సంచలనం చేయబోతున్నామని, దుబ్బాక ఫలితం తిరుపతిలో రిపీట్ కాబోతుందని ప్రకటిస్తోంది. కాని క్షేత్రస్థాయిలో మాత్రం సీన్ వేరేలా ఉంది. తిరుపతిలో టీడీపీ విజయం ఖాయమని తెలుస్తోంది. వైసీపీ ఓడిపోవడానికి 10 బలమైన కారణాలు కనిపిస్తున్నాయి.   తిరుపతి ఎస్సీ రిజర్వ్ లోక్ సభ నియోజకవర్గం 2019 లెక్కల ప్రకారం తిరుపతిలో మొత్తం ఓటర్లు 15 లక్షల 74 వేల 161 2019 ఎన్నికల్లో 79.76 శాతం ఓటింగ్ తో 13,16,473 ఓట్లు పోల్ 55.3 శాతం ఓట్లతో వైసీపీకి 7 లక్షల 22 వేల 877 ఓట్లు 37.65 శాతంతో టీడీపీకి 4 లక్షల 94 వేల 501 ఓట్లు అనూహ్యంగా 1.96 శాతం ఓట్లతో నోటాకు మూడో స్థానం నాలుగో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ కు 1.83 శాతం ఓట్లు జనసేన మద్దతుతో బరిలో ఉన్న బీఎస్పీకి 1.6 శాతం పోల్ కేవలం 1.2 శాతం ఓట్లతో బీజేపీకి ఆరో స్థానం   2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద రావు 2 లక్షల 40 వేల పై చిలుకు ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిపై విజయం సాధించారు. టీడీపీ కంటే వైసీపీకి దాదాపు 17 శాతం ఓట్లు ఎక్కువగా పోలయ్యాయి. తిరుపతిలో 2019లో ఘనవిజయం సాధించిన వైసీపీకి రెండేళ్లు కూడా తిరగకుండానే సీన్ రివర్స్ అయింది. తిరుపతి ఉపఎన్నికలో వైసీపీ ఓడిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు 10 బలమైన కారణాలు ఉన్నాయి.   కారణం1.. డ్వాక్రా మహిళలు... ఏపీ ఓటర్లలో 95 లక్షల మంది అంటే దాదాపు 27 శాతం మంది డ్వాక్రా మహిళలు ఉన్నారు. తిరుపతి వరకే చూస్తే 3 లక్షల 55 వేల 428 మంది మహిళలు 2019 ఎన్నికల్లో ఓటేశారు. గతంలో చంద్రబాబు పసుపు కుంకుమ పథకం కింద 95 లక్షల మంది మహిళలకు ఒక్కొక్కరికి 10 వేల రూపాయల నగదు సాయం అందించారు. ఇందుకోసం 9 వేల 5 వందల కోట్లు ఖర్చు చేసింది టీడీపీ ప్రభుత్వం. అయితే మహిళలను లక్షాధికారిని చేస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన జగన్.. అధికారంలోకి వచ్చాకా కేవలం 6 వేల 7 వందల కోట్లు ఇచ్చారు. దాదాపు 13 లక్షల మందికి రూపాయి కూడా సాయం అందలేదని జగన్ సర్కార్ లెక్కలే చెబుతున్నాయి. మరో 22 లక్షల మంది డ్వాక్రా మహిళలకు కేవలం రెండు నుంచి ఐదు వేల సాయమే అందిందట. కొందరికి మాత్రం 15 వేలు రూపాయలు ఇచ్చారు. ఇదే ఇప్పుడు వైసీపీకి గండంగా మారిందంటున్నారు.  తక్కువ సాయం అందిన మహిళలంతా "ఆ దొంగముండకి అన్ని డబ్బులు ఇచ్చారు. మాకు ఇవ్వలేదని కొందరు, తక్కువ ఇచ్చారని కొందరు" అసూయతో  రగిలిపోతున్నారట. వీళ్లంతా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప ఎన్నికలో వైసీపీకి ఓటు వేసే అవకాశం లేదు. ఇటీవల జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఇదే జరిగింది. ప్రభుత్వం వరద సాయంగా కొందరికి 10 వేల రూపాయలు ఇచ్చింది. అయితే సాయం అందని వారంతా కసిగా టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓటేశారు. తిరుపతిలోనూ డ్వాక్రా మహిళల విషయంలో ఇదే సీన్ రిపీట్ కాబోతుందని తెలుస్తోంది. తిరుపతి లోక్ సభ పరిధిలో 3 లక్షల 55 వేల డ్వాక్రా మహిళల్లో దాదాపు లక్ష 15 వేల మందికి సాయం అందలేదు, వీరిలో కొందరికి తక్కువ సాయం అందింది. వీరంతా వైసీపీపై గుర్రుగా ఉన్నారు. వీరంతా ఉపఎన్నికలో వైసీపీకి వ్యతిరేకంగా ఓటేస్తే.. గత ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన 2 లక్షల 40 వేల మెజారిటీలో లక్షా 15 వేల ఓట్లు తగ్గనున్నాయి. ఆ లక్ష 15 వేల మందిలో.. లక్షమంది టీడీపీకి, 15 వేల మంది బీజేపీకి ఓటేసే అవకాశాలున్నాయి. అలా డ్వాక్రా అక్కచెల్లెమ్మలా పుణ్యమా అని.. వైసీపీ మెజారిటీలో లక్షా 15 వేల ఓట్లు కోత పడనుంది అన్నమాట.   కారణం 2.. మందుబాబులు ఏపీలో సగటున 17 శాతం మంది డ్రింకర్లు ఓటర్లుగా ఉన్నారు. ఆరోగ్యాన్ని పాడుచేసుకొని మరీ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుతున్న మందుబాబులు.. తిరుపతి ఉప ఎన్నికలో కీ రోల్ పోషించబోతున్నారు. బ్రాండెడ్ మద్యాన్ని కాకుండా.. వింత వింత పేర్లున్న నాసిరకం మద్యాన్ని.. భారీ రేట్లకు అమ్ముతుండటం పట్ల జగన్ సర్కార్ పై మందుబాబులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. మొత్తం 17 శాతం ఉన్న మందుబాబుల్లో మూడు శాతం రిచ్ డ్రింకర్లు. వీరు ఓటింగ్ కు వస్తారన్నది డౌటే. ఒకవేళ ఎంతో కొంతమంది వచ్చినా వైసీపీకి వ్యతిరేకంగా ఓటేస్తారు. ఎందుకంటే వీరు పేరుకి రిచ్ అయినా.. నచ్చిన బ్రాండ్ తాగలేని పూర్ డ్రింకర్స్ అయిపోయారు. ఇక ఐదు శాతం మందుబాబులు పార్టీ వర్కర్లు ఉంటారు. వీరికి మద్యం క్వాలిటీ, రేట్లతో సంబంధం ఉండదు. ఎన్నికలు వస్తే చాలు.. వీళ్లు ఎవరి పార్టీకి వాళ్లే వేసుకుంటారు. వీళ్లలో వైసీపీకి 3 శాతం, టీడీపీకి రెండు శాతం ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. ఇక, మిగతా 9 శాతం మందుబాబులు జగన్ సర్కార్ పై ఆగ్రహంగా ఉన్నవారే. నాసిరకం మద్యం.. ధరల భారంతో.. వీరంతా వైసీపీపై గుర్రుగా ఉన్నారు. గతంలో తిరుపతిలో వైసీపీకి ఓటేసిన మందుబాబుల్లో దాదాపు 20 వేల మంది.. ఇప్పుడు వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ, బీజేపీలకు ఓటేసే అవకాశముంది.   కారణం 3.. బీజేపీ దెబ్బ 2019లో తిరుపతిలో బీజేపీ కేవలం 1.2 శాతం ఓట్లు మాత్రమే సాధించింది. కాని ఏపీలో బీజేపీకి దాదాపుగా 6 శాతం ఓటింగ్ ఉందన్నది ఆ పార్టీ నేతల లెక్క. ఈ లెక్కన తిరుపతిలో బీజేపీకి సంబంధించిన నాలుగు శాతానికి పైగా ఓటు ఇతర పార్టీలకు వెళ్లింది. 2019 ఎన్నికల సమయంలో ప్రధాని మోడీ, ఎన్డీఏకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా పర్యటించారు టీడీపీ అధినేత చంద్రబాబు. మోడీ, అమిత్ షాలపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. దీంతో చంద్రబాబును ఓడించాలన్న కసితో బీజేపీ కార్యకర్తలంతా వైసీపీకి ఓట్లు వేశారు. ఇప్పుడు తిరుపతిలో బీజేపీ గట్టిగా పోరాడుతుంది కాబట్టి.. వాళ్ల ఓట్లన్ని వాళ్లకే పడతాయి. అంటే గతంలో వచ్చిన ఓట్లలో వైసీపీకి దాదాపు నాలుగు శాతం ఓటింగ్ తగ్గనుంది. ఈ లెక్కన వైసీపీ ఓటింగ్ లో 40-50 వేల ఓట్లు తగ్గనున్నాయి.   కారణం 4 .. జనసేన దెబ్బ బీఎస్పీ, జనసేన కూటమికి తిరుపతిలో 2019లో 1.6 శాతం పోలింగ్ జరిగింది. అయితే తిరుపతి లోక్ సభ పరిధిలో పవన్ కల్యాణ్ సామాజిక వర్గం ఓట్లు భారీగానే ఉన్నాయి. గబ్బర్ సింగ్ ఫ్యాన్స్  కూడా ఎక్కువే. తిరుపతి లోక్ సభ పరిధిలో జనసేనకు 4 శాతం ఓటింగ్ ఉందన్నది ఆ పార్టీ నేతల అంచనా. ఈ లెక్కన జనసేనకు సంబంధించిన రెండున్నర శాతం ఓటింగ్ కూడా క్రాస్ అయింది. ఇందులో కూడా ఎక్కువగా ఫ్యాన్ కే పడ్డాయని భావిస్తున్నారు. ఇప్పుడు జనసేన, బీజేపీ అలయన్స్ కాబట్టి.. ఈ ఓట్లన్ని వాళ్ల కూటమి అభ్యర్థికే పడతాయి. సో... 2019లో పడిన ఓట్లలో వైసీపీ దాదాపు 20 వేల ఓట్లు కోల్పోయే అవకాశముంది.   కారణం 5 .. టీడీపీ దెబ్బ 2019 ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఎంపికలో టీడీపీ తప్పులు చేసిందనే ఆరోపణలున్నాయి. ప్రజల నుంచి వ్యతిరేకత ఉన్న కొందరు సిట్టింగులకు టికెట్లు ఇచ్చారు చంద్రబాబు. పార్టీలోకి కొత్తగా వచ్చినవారికి టికెట్లు ఇవ్వడాన్ని తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోయారు. దీంతో కొందరు టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు కూడా వైసీపీకి ఓట్లేశారని.. ఫలితాల తర్వాత చంద్రబాబు చేసిన పోస్ట్ మార్టమ్ లో తేలింది. ఇలా దాదాపు 2-3 శాతం టీడీపీ ఓటింగ్ పోయిందని అంచనా వేశారు. వీళ్లంతా ఇప్పుడు తిరిగి టీడీపీకి మద్దతుగా ఉంటారు. అంటే వైసీపీకి మరో 20-30 వేల ఓట్లు తగ్గనున్నాయి.   కారణం 6.. ఉద్యోగులు... వైసీపీ ప్రభుత్వంపై ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు. ఉద్యోగుల ప్రమోషన్లు, బదిలీల విషయంలో వైసీపీ నేతల తీరు వివాదాస్పదమైంది. ఉద్యోగుల పెండింగ్ సమస్యలు తీరలేదు. ఉద్యోగ సంఘం నేత చంద్రశేఖర్ రెడ్డి ఓవరాక్షన్ ఎక్కువైందనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్జీవో సంఘాన్ని అధికార పార్టీకి తాకట్టు పెట్టారనే చర్చ ఉద్యోగుల్లో జరుగుతోంది. దీంతో ఉద్యోగులు కూడా తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీకి వ్యతిరేకంగానే ఓటు వేస్తారని భావిస్తున్నారు. తిరుపతి పరిధిలో మూడు శాతం ఉద్యోగులు ఉండనుండగా.. మూడు పార్టీలకు ఒక్కో శాతం ఓట్లు రావచ్చని అంచనా. ఈ లెక్కన 2019 పోలింగ్ తో పోల్చితే వైసీపీకి దాదాపు 10 వేల ఓట్లు తగ్గనున్నాయి.   కారణం7.. నిరుద్యోగ యువత , విద్యావంతులు వైసీపీ సర్కార్ పాలనా తీరుపై నిరుద్యోగ యువత , విద్యావంతులు అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. వాలంటీర్ గా చేస్తే పాకెట్ మనీ వస్తుంది కానీ.. ఫ్యామిలీని పోషించే అంత మనీ రాదు. యువతకు సరైన ఉపాధి, ఉద్యోగాలు చూపడంలో జగన్ సర్కార్ విఫలమైంది. సర్కార్ అస్తవ్యస్థ విధానాలు, కోర్టుల్లో వరుసగా జరుగుతున్న ఎదురు దెబ్బలు.. ఇలా అన్ని అంశాల్లోనూ జగన్ పాలనపై విద్యావంతుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. తిరుపతిలో పరిధిలో యువత, విద్యావంతుల ఓట్లు 10 శాతం ఉంటే.. గతంలో వైసీపీకి ఓటేసిన వారిలో.. ఈసారి 5 శాతం మంది వ్యతిరేకంగా ఓటేసే అవకాశముంది. అంటే వైసీపీ 5 నుంచి పదివేల ఓట్లు కోల్పోనుంది.   కారణం8.. దళితుల్లో వ్యతిరేకత తిరుపతిలో ఎస్సీ ఓటర్లు ఎక్కువ. గతంలో ఈ వర్గ ఓట్లలో మెజార్టీ వైసీపీకే పడ్డాయి. జగన్ రెడ్డి పాలనలో దళితులపై దాడులు పెరిగిపోయాయి. దళితులకు వైసీపీ నేతలు శిరోముండనం వేయించిన ఘటనలు వెలుగుచూశాయి. చిత్తూరు జిల్లాలో దళిత సామాజిక వర్గానికి చెందిన జడ్జీ రామకృష్ణ కుటుంబ సభ్యులపై దాడి జరిగింది. విశాఖలో దళిత డాక్టర్ సుధాకర్ పై జరిగిన దాడి ఘటన కలకలం రేపింది. దివంగత ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కుటుంబాన్నిఇంతవరకు సీఎం జగన్ మోహన్ రెడ్డి పరామర్శించలేదు. ఇది కూడా తిరుపతిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక ఎంపీ చనిపోతే.. ఆయన పార్టీ అధ్యక్షుడు, సీఎం హోదాలో ఉన్న జగన్ వారితో కనీసం మాట్లాడకపోవడంపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. వరుసగా జరుగుతున్న ఘటనలతో ఆ సామాజిక వర్గం వైసీసీపైనా, సీఎం జగన్ పైనా కోపంగా ఉన్నారని తెలుస్తోంది. దీంతో ఎస్సీ సామాజిక వర్గంలో వైసీపీకి గతంలో వచ్చిన ఓట్ల కంటే రెండు శాతం ఓట్లు తగ్గవచ్చంటున్నారు.   కారణం 9.. అన్నదాతల అసహనం ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వేల ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. తిరుపతి పరిధిలోనూ వందలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. వరదలతో నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవడంతో జగన్ సర్కార్ పూర్తిగా విఫలమైందనే ఆరోపణలు వచ్చాయి. వరద బాధితులకు ఎలాంటి పరిహారం ఇవ్వలేదు. కష్టాల్లో ఉన్న తమను కనీసం పరామర్శించడానికి కూడా వైసీపీ నేతలు రాలేదని ఆరోపిస్తున్నారు రైతులు. దీంతో రైతుల ఓటింగ్ లోనూ వైసీపీకి ఓటింగ్ మైనస్ కానుందని తెలుస్తోంది.   కారణం 10.. రెండేళ్ల జగన్ పాలన మూడు రాజధానుల ప్రతిపాదనతో గందరగోళం.. ఏపీకి ఇప్పుడు రాజధాని ఏంటో తెలియని అయోయమం. పెట్టుబడులు రావట్లేదు,.. ఆదాయం లేదు.. అప్పులు పెరిగిపోతున్నాయి.. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉంది. సర్కార్ అనాలోచిత నిర్ణయాలు, అస్తవ్యస్థ విధానాలు, కోర్టుల్లో వరుసగా జరుగుతున్న ఎదురు దెబ్బలు.. ఇలా జగన్ పాలనపై తటస్థుల్లో కూడా అసంతృప్తి వ్యక్తమవుతోంది. గతంలో వైసీపీకి ఓటేసిన తటస్థుల్లో ఇప్పుడు రెండు మూడు శాతం మంది వ్యతిరేకంగా ఓటేసే అవకాశముంది. దీంతో వైసీపీ దాదాపు 20 వేల ఓట్లు కోల్పోనుంది.   కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్టు.. తిరుపతి ఉపఎన్నికలో వైసీపీ ఓడిపోతుందని చెప్పడానికి ఈ పది కారణాలు కనిపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో 2 లక్షల 40 వేల ఓట్ల మెజార్టీతో గెలిచిన వైసీపీ.. ఉపఎన్నికలో మాత్రం దాదాపు 3 లక్షల ఓట్లు కోల్పోయి.. సుమారు 50 వేల ఓట్ల తేడాతో తిరుపతి సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయే అవకాశముంది.

చంద్రబాబు రామతీర్థం అందుకే వెళ్లారా ? ఏపీలో అసలేం జరుగుతోంది ?  

తొమ్మిది నెలలుగా సైలెంట్ గా ఉన్న చంద్రబాబుకు అంత దూకుడెందుకు? కరోనా  భయపెడుతున్నా కదనరంగంలోకి ఎందుకు దూకారు ? ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చర్చనీయాంశంగా మారింది.  కరోనా  కారణంగా  జనంలోకి రావడానికి జంకిన చంద్రబాబు.. ఇప్పుడు కొత్త కరోనా భయపెడుతున్నా వందలాది మంది కార్యకర్తలతో కలిసి ఆందోళన చేయడం అందరిని  అశ్చర్యపరుస్తోంది.  వైద్యుల సూచనలు పక్కనపెట్టి మరీ చంద్రబాబు ప్రజల్లోకి రావడంపై  రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీని ఖతం చేసేందుకు జరుగుతున్న కుట్రలను చేధించేందుకే  ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా చంద్రబాబు కార్యరంగంలోకి దిగారంటున్నారు.  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కరోనా వైరస్ ఎంట్రీ తర్వాత జనంలోకి వెళ్లలేదు. ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. చంద్రబాబు వయసు ప్రస్తుతం 76 ఏండ్లు. అందుకే కరోనా వైరస్ భారీన పడకుండా ఉండేందుకు ఆయన్ను బయట  తిరగవద్దని వైద్యులు చెప్పారని తెలుస్తోంది. అందుకే పార్టీ కార్యక్రమాలు కూడా దాదాపుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే నిర్వహిస్తున్నారు. గత మార్చి తర్వాత ఆయన పార్టీ కార్యక్రమాల్లో నేరుగా పాల్గొన్నవి రెండు. మూడే. మహానాడు సందర్భంగా కొందరు నేతలతో సమావేశమయ్యారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ సమయంలో గుంటూరు హాస్పిటల్ కు వెళ్లి ఆయన్ను పరామర్శించారు. అప్పుడు కూడా ఆయన పూర్తి స్థాయిలో కోవిడ్ జాగ్రత్తలు తీసుకున్నారు. తొమ్మిది నెలలుగా జనంలోకి రాని చంద్రబాబు... ఇప్పుడు మాత్రం ఒక్కసారిగా స్పీడ్ పెంచారు. విజయనగరం జిల్లా  రామతీర్థంలో  విగ్రహం ధ్వంసమైన ప్రదేశాన్ని పరిశీలించారు. అక్కడే ఆయన ఆందోళన నిర్వహించారు.  ఏపీలో కొన్ని రోజులుగా హిందూ ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. పలు ఆలయాల్లో దేవుళ్ల విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. తాజాగా విజయనగరం జిల్లా రామతీర్థం ఆలయంలో రాముడి విగ్రహం ధ్వంసం చేశారు. ఇన్నేళ్ల ఏపీ చరిత్రలో ఇలా హిందూ ఆలయాలపై వరుసగా దాడులు జరిగిన దాఖలాలు ఎప్పుడూ లేవు. దీంతో దీనివెనుక రాజకీయ కోణం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హిందుత్వ నినాదంతో బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో బలపడాలని చూస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఆలయాలపై దాడులు జరుగుతుండటంతో హిందువుల్లో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇదే అదనుగా  హిందుత్వ పార్టీగా ముద్రపడిన బీజేపీ.. హిందువుల తరఫున స్వరం వినిపిస్తూ.. హిందువులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోందనే చర్చ  జరుగుతోంది. ఏపీలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తోన్న రాజకీయ విశ్లేషకులు కూడా  మతాలుగా ఓట్లను చీల్చి, వాటిని రెండు పార్టీలు పంచుకొని  ఏపీలో టీడీపీని నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతుందని అంటున్నారు.  తెలంగాణలోని గ్రేటర్ హైదరాబాద్ కు ఇటీవల జరిగిన ఎన్నికల్లో మత రాజకీయాలే రాజ్యమేలాయి. బీజేపీ, ఎంఐఎం పార్టీలు హిందూ, ముస్లిం అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ వేడి పుట్టించాయి. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ముస్లిం మతానికి గానీ, పాతబస్తీ ప్రాంతానికి గానీ ఏమాత్రం సంబంధం లేని ఎన్టీఆర్, పీవీ ఘాట్ లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయనలా మాట్లాడిన నిమిషాల్లోనే పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామంటూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. ఇలా మత పరమైన విమర్శలతో గ్రేటర్ ఎన్నికల్లో రెండు పార్టీలు లబ్దిపొందాయి. ఎప్పటిలానే మెజారిటీ ముస్లిం ఓట్లు ఎంఐఎంకు పడగా.. గతంలో గ్రేటర్ లో 10-12 శాతం ఓట్లు సాధించిన బీజేపీ ఈసారి 35 శాతానికి పైగా ఓట్లు సాధించింది. మత పరమైన వ్యాఖ్యలతో ఇతర పార్టీలకు వెళ్లాల్సిన హిందూ ఓట్లను రాబట్టడంలో బీజేపీ సక్సెస్ అయింది. అదే సమయంలో గ్రేటర్ లో గతంలో బలంగా ఉన్న కాంగ్రెస్, టీడీపీ లు పూర్తిగా వెనకబడి పోయాయి. ఓటర్లు మత పరంగా చీలడం వల్లే కాంగ్రెస్, టీడీపీకి భారీగా నష్టం జరిగిందని ఫలితాల తర్వాత తేలింది.    గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వ్యూహాన్నే ఏపీలో వైసీపీతో కలిసి బీజేపీ అమలు చేస్తుందని అంటున్నారు. గ్రేటర్ లో ఎలాగైతే మెజారిటీ ముస్లిం ఓటర్లు ఎంఐఎం వైపు ఉంటారో.. అలాగే ఏపీలో మెజారిటీ క్రిస్టియన్, ముస్లిం ఓటర్లు వైసీపీ వైపు ఉంటారు. ఇక్కడ కూడా బీజేపీ బలపడాలంటే హిందూ ఓట్లను తన వైపు తిప్పుకోవాలి. ఆ ప్రయత్నమే ఇప్పుడు ఏపీలో జరుగుతుందని అంటున్నారు.  కొంతకాలంగా హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్న బీజేపీ.. జగన్ ను క్రిస్టియన్ సీఎం అంటూ విమర్శిస్తోంది. వైసీపీ నేతలేమో బీజేపీ హిందుత్వ పార్టీ అంటున్నారు. ఈ రకంగా హిందువులు అంటే బీజేపీకి ఓటెయ్యాలనే అభిప్రాయాన్ని తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. క్రిస్టియన్, ముస్లిం ఓటర్లు ఎలాగూ ఎక్కువశాతం వైసీపీ వైపు ఉంటారు. ఇక మెజారిటీ హిందూ ఓట్లను రాబట్టి బీజేపీ బలపడాలని చూస్తోంది. అదే జరిగితే ఏపీలో టీడీపీ భవిష్యత్ ప్రశ్నార్థం అయ్యే పరిస్థితి ఉంది.   ఏపీలో వైసీపీ, బీజేపీ కుట్రలను గ్రహించడం వల్లే చంద్రబాబు కరోనాను కూడా లెక్క చేయకుండా జూలు విదిల్చారని చెబుతున్నారు. బీజేపీ, వైసీపీ పార్టీల కుట్రలో భాగంగానే ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీని బలహీనం చేస్తే ఏపీలో తమకు అధికారం ఖాయమనే ఆలోచనలో బీజేపీ ఉందని చెబుతున్నారు. జగన్ కూడా తన ప్రధాన శత్రువు చంద్రబాబు కాబట్టి.. ముందు టీడీపీని పినిష్ చేయాలనే కుట్రతో కమలంతో కలిసి  ఈ స్కెచ్ వేశారనే చర్చ జరుగుతోంది. టీడీపీని బలహీనం  చేసిన తర్వాత బీజేపీ బలపడినా తనకు పెద్దగా నష్టం ఉండదనే భావనలో జగన్ ఉన్నారంటున్నారు. ఈ రెండు పార్టీల కుట్రలను గమనించడం వల్లే ఆరోగ్యం సహకరించకున్నా, కరోనా ఇంకా భయపెడుతున్నా.. టీడీపీని నిలబెట్టుకునేందుకు చంద్రబాబు రంగంలోకి దిగారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అందుకే ఓట్ల కోసం బీజేపీ, వైసీపీలు నీచానికి దిగజారి మత రాజకీయాలు చేస్తున్నాయనే విషయాన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఏపీ తమ్ముళ్లు చెబుతున్నారు.   ఏపీలో జరుగుతున్న పరిణామాలపై జనాలు కూడా ఆగ్రహంగా ఉన్నారు. ఓట్ల కోసం మత రాజకీయాలు , ఆలయాలపై దాడులు జరుగుతున్నాయన్న ప్రచారంతో వారంతా ఆందోళనకు గురవుతన్నారు. స్వార్ధ రాజకీయాల కోసం ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ను రావణాకాష్టంలా మారుస్తున్నారని జనాలు మండిపడుతున్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం ఎంతో సేఫ్ గా ఉండేదని, జగన్ రెడ్డి పాలనతో రాష్ట్రం అల్లకల్లోలం అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ, వైసీపీ కుట్రలను తిప్పికొట్టేందుకు టీడీపీకి మద్దతు ఇవ్వాలనే ఆలోచన కూడా ఏపీ జనాల్లో వ్యక్తమవుతోందని రాజకీయ అనలిస్టులు చెబుతున్నారు.   

మితృత్వం లాంటి శతృత్వం.. బీజేపీ వైసీపీల పొలిటికల్ గేమ్ లో టీడీపీ బలి కానుందా?

'విభజించు.. ఓట్లు పట్టు' అనే సిద్ధాంతంతో జాతీయ పార్టీ బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో బలపడాలని చూస్తోందా?.. హిందుత్వ కార్డునే పెట్టుబడిగా భావిస్తోందా?.. గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇటీవల కాలంలో హిందూ ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. పలు ఆలయాల్లో దేవుళ్ల విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. అంతర్వేది రథం దగ్ధం, కనకదుర్గ అమ్మవారి వెండి రథం సింహాలు మాయం వంటి ఘటనలు జరిగాయి. తాజాగా విజయనగరం జిల్లా రామతీర్థం ఆలయంలో రాముడి విగ్రహం ధ్వంసం ఘటన వెలుగు చూసింది. ఇలా నిత్యం రాష్ట్రంలో ఏదోక ప్రాంతంలో హిందూ ఆలయాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీంతో హిందువుల్లో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు, హిందుత్వ పార్టీగా ముద్రపడిన బీజేపీ.. హిందువుల తరఫున స్వరం వినిపిస్తూ.. హిందువులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. ఇదంతా గమనిస్తోన్న రాజకీయ విశ్లేషకులు దీని వెనుక ఓ రాజకీయ ఎత్తుగడ ఉందని అభిప్రాయపడుతున్నారు. మతాలుగా ఓట్లను చీల్చి, వాటిని రెండు పార్టీలు పంచుకొని.. ఏపీలో టీడీపీని నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతుందని అంటున్నారు.   తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్నే బీజేపీ ఏపీలో అమలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో మత రాజకీయాలు రాజ్యమేలాయి. మతపరమైన విమర్శలతో ఒకానొక సమయంలో బీజేపీ, ఎంఐఎం పార్టీల మధ్యనే అసలు పోటీ అన్న అభిప్రాయం వ్యక్తమైంది. బీజేపీ, ఎంఐఎం పార్టీలు హిందూ, ముస్లిం అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ వేడి పుట్టించాయి. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ అసందర్భంగా ఎన్టీఆర్, పీవీ ఘాట్ లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లిం మతానికి గానీ, పాతబస్తీ ప్రాంతానికి గానీ ఏమాత్రం సంబంధం లేని అంశాన్ని ఆయన తెరపైకి తీసుకొచ్చారు. ఆయనలా మాట్లాడిన నిమిషాల్లోనే పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామంటూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. ఇలా మత పరమైన విమర్శలతో గ్రేటర్ ఎన్నికల్లో రెండు పార్టీలు లబ్దిపొందాయి. ఎప్పటిలానే మెజారిటీ ముస్లిం ఓట్లు ఎంఐఎంకు పడగా.. గతంలో గ్రేటర్ లో 10-12 శాతం ఓట్లు సాధించిన బీజేపీ ఈసారి 35 శాతానికి పైగా ఓట్లు సాధించింది. దీన్నిబట్టే అర్థంచేసుకోవచ్చు హిందుత్వ కార్డు ఎంతలా పనిచేసిందో!. ఇతర పార్టీలకు వెళ్లాల్సిన హిందూ ఓట్లను రాబట్టడంలో బీజేపీ సక్సెస్ అయింది. ఇలా బీజేపీ- ఎంఐఎం పార్టీలు 'పైకి శతృత్వం- లోపల మితృత్వం' అనే సినిమా చూపించి గ్రేటర్ లో కాంగ్రెస్, టీడీపీ లను నిర్వీర్యం చేశాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి పరోక్షంగా బీజేపీ కూటమి విజయానికి కారణమైన ఎంఐఎం.. గ్రేటర్ ఎన్నికల్లో మత పరమైన వ్యాఖ్యలతో బీజేపీకి లబ్ది చేకూర్చిందని అంటున్నారు.   గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వ్యూహాన్నే ఏపీలో వైసీపీతో కలిసి బీజేపీ అమలు చేస్తుందని అంటున్నారు. గ్రేటర్ లో ఎలాగైతే మెజారిటీ ముస్లిం ఓటర్లు ఎంఐఎం వైపు ఉంటారో.. అలాగే ఏపీలో మెజారిటీ క్రిస్టియన్, ముస్లిం ఓటర్లు వైసీపీ వైపు ఉంటారు. ఇక్కడ కూడా బీజేపీ బలపడాలంటే హిందూ ఓట్లను తన వైపు తిప్పుకోవాలి. ఆ ప్రయత్నమే ఇప్పుడు ఏపీలో జరుగుందని అంటున్నారు. ఇన్నేళ్ల ఏపీ చరిత్రలో ఇలా హిందూ ఆలయాలపై వరుసగా దాడులు జరిగిన దాఖలాలు ఎప్పుడూ లేవు. కేవలం కొద్ది నెలలుగానే ఏపీలో ఆలయాలపై వరుసగా దాడులు జరుగున్నాయి. దీంతో దీనివెనుక రాజకీయ కోణం ఉందన్న అనుమానాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. కొంతకాలంగా హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్న బీజేపీ.. జగన్ ను క్రిస్టియన్ సీఎం అంటూ విమర్శిస్తోంది. వైసీపీ నేతలేమో బీజేపీ హిందుత్వ పార్టీ అంటున్నారు. ఓ రకంగా హిందువులు అంటే బీజేపీకి ఓటెయ్యాలనే అభిప్రాయాన్ని తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. తద్వారా గ్రేటర్ లో బీజేపీ, ఎంఐఎం ఎలాగైతే హిందూ, ముస్లిం అంటూ లబ్దిపొందాయో.. అలాగే ఏపీలో బీజేపీ, వైసీపీ లబ్దిపొందే ప్రయత్నం చేస్తున్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. క్రిస్టియన్, ముస్లిం ఓటర్లు ఎలాగూ ఎక్కువశాతం వైసీపీ వైపు ఉంటారు. ఇక మెజారిటీ హిందూ ఓట్లను రాబట్టి బీజేపీ బలపడాలని చూస్తోంది. అదే జరిగితే ఏపీలో టీడీపీ భవిష్యత్ ప్రశ్నార్థం అయ్యే పరిస్థితి ఉంది. బీజేపీ, ఎంఐఎం పార్టీల 'మితృత్వం లాంటి శతృత్వంతో' గ్రేటర్ లో కాంగ్రెస్ ఎలా బలి అయిందో.. బీజేపీ, వైసీపీల మితృత్వం లాంటి శతృత్వంతో ఏపీలో టీడీపీ బలైపోయినా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు అంటున్నారు.

గంటల్లో రూ. 2 వందల కోట్లు హాంఫట్! అధికార పార్టీ ముఖ్య నేత డీల్?  

రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావొచ్చా? కొన్ని గంటల్లోనే వందల కోట్ల రూపాయలు సంపాదించడం సాధ్యమా?. మాములుగా అయితే ఎవరికి ఇది సాధ్యం కాదు. కాని రాజకీయ నేతలకైతే అది చిన్న పనిగానే ఉంటుందట. అధికారంలో ఉన్న నేతకు సన్నిహితంగా ఉంటే ఇంకా ఈజీనట. పాలించే నేతకు దగ్గరి బంధువైతే ఇక తిరుగేలేదట. రాత్రికి రాత్రే వందల కోట్ల రూపాయలు ఇట్టే స్వాహా చేయవచ్చట. ఇందుకు పెద్దగా కష్టపడాల్సిన పని కూడా లేదట. మాయా మశ్చీంద్రలు చేయాల్సిన అవసరం రాదట. అలా పలకగానే ఇలా  డబ్బులు వచ్చిపడటానికి అల్లావుద్దీన్ అద్బుత దీపం ఉండాల్సిన అవసరం కూడా లేదట. కేవలం అధికారాన్ని ఉపయోగించి అక్రమ మార్గంలో నిమిషాల్లో  వందల కోట్ల రూపాయలు కొట్టేయవచ్చని తెలుస్తోంది.    తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఇలాంటి దందాలకు అడ్డాగా మారిపోయిందని తెలుస్తోంది. హైదరాబాద్ కు మణిహారంగా ఉన్న అవుటర్ రింగ్ రోడ్డు చుట్టూ ఉన్న భూములపై కన్నేసిన బడాబాబులు.. అడ్డదారుల్లో వాటిని రాత్రికి రాత్రే సొంతం చేసుకుంటున్నారట. ఖరీదైన ఏరియాలో భూములున్న వ్యక్తులను గుర్తించి.. తమకున్న అధికారంతో వారిని భయపెట్టి, బెదిరింది లొంగదీసుకుంటున్నారట. అయినా వినకపోతే అ భూములపై వివాదం స్పష్టించి.. పోలీసుల కేసులతో వేధించి తమ దారికి తెచ్చుకుంటున్నారట. అత్యంత ఖరీదైన భూములను కారు చౌకగా వారి దగ్గర కొట్టేసి.. కొన్ని గంటల్లోనే అంతకు పదుల రెట్లకు అమ్ముకుంటూ వందల కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇలాంటి ఘటన ఇటీవలే జరిగిందని తెలుస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓ ప్రముఖ పార్టీ నుంచి పోటీ చేసిన ఓ బడా వ్యాపారి కమ్ రాజకీయ నేతకే మైండ్ బ్లాక్ అయ్యిందట.    మేడ్చల్ జిల్లా పరిధిలో హైదరాబాద్ శివారు అవుటర్ రింగ్ రోడ్డుకు ఆనుకుని ఆ  బడా వ్యాపారవేత్తకు 3 వందల ఎకరాల భూమి ఉందట. ఆ భూములపై  అధికార పార్టీలోని ముఖ్య నేత బంధువు కన్ను పడిందట. ప్రజాప్రతినిధిగానూ ఉన్న ఆ బడా నేత.. అ వ్యాపారి భూముల కోసం కతర్నాక్ స్కెచ్ వేశారట. పోలీస్ పెద్దలతో కలిసి ఈ తతంగం నడిపించాడట ఆ దొరగారు. దీంతో  రాత్రికి రాత్రే కొత్త సీన్ క్రియేట్ అయిందట.  భూములపై వివాదం ఉందంటూ సదరు బిజినెస్ మెన్ కొడుకును తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారట. తన కొడుకును పోలీసులు తీసుకెళ్లడంతో ఆ వ్యాపారి తనకున్న రాజకీయ పరిచయాలతో అన్ని ప్రయత్నాలు చేశారట. ఖమ్మం జిల్లాకు చెందిన అధికార పార్టీ ముఖ్య నేతలతోనూ చెప్పించారట. ప్రస్తుత ఎంపీ, మాజీ మంత్రి పోలీసుల పెద్దలతో మాట్లాడినా పని కాలేదట.  వ్యాపారి కొడుకును విడిపించేందుకు ఫోన్ చేసిన ప్రజా ప్రతినిధులకు పోలీసు బాస్ ల  నుంచి వచ్చిన ఒకే ఒక్క సమాధానం.. పై నుంచి ఆర్డర్స్ .. మేం ఏం చేయలేం. విషయం గ్రహించిన బాధిత వ్యాపారి.. చివరికి చేసేది లేక బడానేతతో డీల్ కు ఓకే చెప్పాడట.  వాళ్లు చెప్పినట్లే చేసి తన కొడుకును పోలీస్ స్టేషన్ నుంచి అర్దరాత్రి ఇంటికి తీసుకెళ్లాడట.     అర్ధరాత్రి ఆ  బడా రాజకీయ నేత జరిపిన ఈ  డీల్ ఎంతో తెలుసా. అక్షరాల రెండు వందల కోట్ల రూపాయలు. మీరు వింటున్నది నిజమే.. ఆక్కడ రాత్రికి రాత్రే జరిగిన డీల్ తో  200,00,00,000 రూపాయలు ఆ ముఖ్య నేతకు అప్పనంగా వచ్చేశాయట.  బాడా నేత కన్నుబడిన వ్యాపారికి సంబంధించిన భూమి విలువ ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం ఎకరాకు మూడు కోట్ల రూపాయలు ఉందట. అయితే భూములను కాజేయాలనే స్కెచ్ వేసిన సదరు దొరగారు మాత్రం ఎకరాకి 70 లక్షల రూపాయలు మాత్రమే ఇస్తానని మొదట బేరం పెట్టాడట. పోలీసు పెద్దలు, వ్యాపారికి మద్దతుగా నిలిచిన ప్రజా ప్రతినిధుల చొరవతో చివరికి కోటి రూపాయల చొప్పున.. ఈ వ్యాపారికి 3 వందల కోట్లు విదిల్చాడట. కొడుకును విడిపించుకునేందుకు చేసేది లేక 9 వందల  కోట్ల రూపాయల విలువైన భూములను... కేవలం మూడు వందల కోట్లకు ఆ బడా నేతకు అప్పగించి బతుకు జీవుడా అంటూ ఆ వ్యాపారి తన కొడుకును తీసుకుని పోలీస్ చెర నుంచి , ఆ బడా నేత కబంద హస్తాల నుంచి బయటపడ్డాడట.     అత్యంత ఖరీదైన భూములను వ్యాపారి నుంచి అక్రమంగా సొంతం చేసుకున్న ఆ ముఖ్య నేత..  కొన్ని గంటల్లోనే మరో వ్యాపారికి ఆ భూమిని  అమ్మేశాడట. వ్యాపారికి ఎకరాకు కోటి రూపాయలు ముట్టచెప్పిన సదరు నేత..  ఐదు వందల కోట్ల రూపాయలకు ఆ భూమిని విక్రయించాడట.  అంటే సదరు నేత కేవలం కొన్ని గంటల్లోనే అక్షరాల రెండు వందల కోట్ల రూపాయలు నొక్కేశాడటన్న మాట. హైదరాబాద్ లో జరిగిన ఈ భూ దందా బాగోతం కేంద్రం పెద్దలకు కూడా చేరిందని తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలిసిన రాష్ట్ర పెద్దకు ... ఈ డీల్ వివరాలు చూపించి చుక్కలు చూపించారట కేంద్రం పెద్దలు. ఇంతటి అరాచకాలు జరుగుతుంటో ఏం చేస్తున్నారని క్లాస్ పీకారట. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందని కూడా  ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ డీల్ కు సంబంధించిన వివరాలను కేంద్రం పెద్దలు టేబుల్ పై ఉంచి ప్రశ్నించడంతో.. ఆ రాష్ట్ర పెద్ద నేత సమాధానం చెప్పుకోలేక దిక్కులు చూశారని తెలుస్తోంది.    వినడానికే వింతగా, ఏదో మాయ జరిగినట్లుగా అనిపిస్తున్నఈ ఘటన..  హైదరాబాద్ శివారులో  జరుగుతున్న అక్రమ భూదందాకి  సాక్ష్యంగా నిలుస్తోంది. మాములుగా సినిమాల్లో మనం ఇలాంటి సీన్లు చూస్తుంటాం. తనకు నచ్చిన భూమి కనిపిస్తే చాలు విలన్లు కబ్జా చేసేస్తుంటారు. బలవంతంగా తమకు నచ్చిన రేటుకే కొనుగోలు చేస్తుంటారు. భూ యజమానులు వినకపోతే .. అతన్నో, అతని కుటుంబ సభ్యులనే కిడ్నాప్ చేసి ల్యాండ్ డాక్యుమెంట్లపై బలవంతంగా సంతకాలు చేయించుకుంటూ ఉంటారు. పోలీసులతో కుమ్మక్కై సెటిల్ మెంట్లు చేసుకుంటారు.  అయితే అలా జరగడం సినిమాల్లోనే  సాధ్యమనే భావనే జనాల్లో ఉంటుంది. సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్ లోనూ  ఇలాంటి షాకింగ్ ఘటనలు జరుగుతాయని తాజా ఘటనతో  తెలుస్తోంది.  రాజకీయాలతో మంచి సంబంధాలు ఉన్న , ఎన్నికల్లోనూ పోటీ చేసిన వ్యాపారికే దిక్కు లేకుండా ఉంటే ..  మిగితావాళ్ల  పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో ఊహించవచ్చు. గ్రేటర్ హైదరాబాద్ శివారులో జరిగిన ఈ భూ మాయాజాలం  ఘటన ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో కలవరం రేపుతుందని తెలుస్తోంది.

ఓడిన కార్పొరేటర్ల వసూళ్ల పర్వం! గ్రేటర్ లో కొత్త పంచాయితీ  

తెలంగాణ రాజకీయాలను హీటెక్కించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమరం ముగిసింది. ఫలితం కూడా వచ్చేసింది. కాని ఇంకా కొత్త బల్దియా కొత్త పాలక మండలి కొలువు దీర లేదు. ప్రస్తుత పాలక మండి గడువు వచ్చే ఫిబ్రవరి వరకూ ఉంది. దీంతో గ్రేటర్ లో అనుకున్న ఫలితాలు సాధించని అధికార పార్టీ.. కొత్త పాలక మండలి ఏర్పాటుపై ఆచితూచి స్పందిస్తోంది. ఫిబ్రవరి వరకూ పాత టీమ్ నే కొనసాగించే ప్రయత్నం చేస్తోంది. ఇదే ఇప్పుడు జీహెచ్ఎంసీలో పెద్ద సమస్యగా మారింది. తాజా ఎన్నికల్లో ఓడిపోయిన సిట్టింగ్ కార్పొరేటర్లు అక్రమ దందాలకు తెర తీశారని తెలుస్తోంది. ఎన్నికల్లో ఓడిపోయామనే కసితో ఉన్న పాత కార్పొరేటర్లు.. తమకు మరో రెండు నెలలు అధికారం ఉండటంతో రెచ్చిపోతున్నారట. అందినకాడికి దోచుకుంటున్నారట. ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా పని చేశారనే అనుమానం ఉన్న వ్యక్తులను కావాలనే టార్గెట్ చేస్తున్నారని తెలుస్తోంది. తమకు సహకరించే అధికారులతో కలిసి తమ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టాలని పాత కార్పొరేటర్లు ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.    డివిజన్లలో పాత కార్పొరేటర్లు, కొత్తగా గెలిచిన కార్పొరేటర్ల మధ్య పంచాయితిలు జరుగుతున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచిన చోట ఈ సమస్య లేదు. పాతబస్తిలో తన స్థానాలను ఎంఐఎం నిలుపుకుంది కాబట్టి అక్కడ కూడా పెద్ద ఇబ్బంది లేదు. కాని బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచిన డివిజన్లలో మాత్రం ఇలాంటి గొడవలు ముదురుతున్నాయి. ఫిబ్రవరి వరకూ తమదే అధికారమని టీఆర్ఎస్ పాత కార్పొరేటర్లు చెబుతుండగా.. ఎన్నికల్లో గెలిచిన తమకే ఆ అధికారం ఉంటుందని విపక్ష నేతలు వాదిస్తున్నారు. పాత, కొత్త కార్పొరేటర్ల మధ్య గొడవలతో బల్దియా అధికారులు నలిగిపోతున్నారని తెలుస్తోంది. బీజేపీ కార్పొరేటర్లు ఎక్కువగా గెలిచిన ఎల్బీన‌గ‌ర్, గోషామ‌హ‌ల్, ముషీరాబాద్ , సనత్ నగర్, అంబర్ పేట, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది.    ఎల్బీన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం11 డివిజ‌న్లు ఉండ‌గా .. అన్ని డివిజ‌న్లను బీజేపీ గెలుచుకుంది . 2016 ఎన్నిక‌ల్లో ఇక్కడ టీఆర్ఎస్ క్లీన్ స్విప్ చేసింది. ఇక్కడ టీఆర్ఎస్‌కు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఉండటంతో ఆయన పాత కార్పొరేటర్లకు మద్దతుగా ఉంటున్నారు. దీంతో బీజేపీ నుంచి గెలిచిన కార్పొరేట‌ర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఓడించిన కార్పొరేటర్లు ఇంకా డివిజన్ లో పెత్తనం చేయడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. ముషిరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఇదే ప‌రిస్థితి ఉంది. 2016 లో నియోజ‌క‌వ‌ర్గంలోని 6 డివిజ‌న్లకు 5 డివిజ‌న్లను టీఆర్ఎస్, ఒక డివిజ‌న్ ను ఎంఐఎం కైవ‌సం చేసుకున్నాయి. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో 5 డివిజ‌న్లను బీజేపీ గెలుచుకోగా ఒక డివిజ‌న్ ను ఎంఐఎం నిల‌బెట్టుకుంది. ఇక్కడ కూడా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఉన్నారు. దీంతో డివిజన్లలో పెత్తనం కోసం పాత కార్పొరేట‌ర్లకు, కొత్త కార్పొరేట‌ర్లకు అధికారం కోసం ఆదిప‌త్య పోరు జరుగుతోంది. ఎమ్మెల్యే అండతో అధికార పార్టీ పాత కార్పొరేటర్లే అభివృద్ది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.    గోషామ‌హ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో ఈ గొడవ తారా స్థాయికి చేరింది. గోషా మహల్ నియోజకవర్గంలో ఆరు డివిజ‌న్లు ఉండ‌గా తాజా ఎన్నిక‌ల్లో బీజేపీ ఐదు డివిజ‌న్లను కైవ‌సం చేసుకుంది. ఇక్కడ ఎమ్మెల్యే బీజేపీ పార్టీకి చెందిన రాజాసింగ్ ఉన్నారు. 2016 లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఇక్కడి నుంచి ముగ్గురు టీఆర్ఎస్ కార్పొరేట‌ర్లు ఉన్నారు. దీంతో రెండు పార్టీల మ‌ధ్య యుద్ధం జ‌రుగుతోంది. పాత కార్పొరేట‌ర్లు బ‌స్తీల్లో పెండింగ్ లో ఉన్న ప‌నులు చేయించ‌డం, ఓడిపోయినా ప్రజల్లో తిరుగుతుండటాన్ని కొత్త కార్పొరేట‌ర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎమ్మెల్యే రాజా సింగ్... సర్కిల్ పరిధిలోని జీహెచ్ఎంసీ అధికారులతో సమావేశమై కొత్తగా గెలిచిన కార్పొరేటర్లకే సహకరించాలని ఆదేశించారనే ప్రచారం జరుగుతోంది. అంబర్ పేట, సనత్ నగర్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లోనూ మెజార్టీ డివిజన్లు బీజేపీ గెలుచుకుంది. ఇక్కడ కూడా ఇదే సమస్య ఉందంటున్నారు.     ఈసారి అధికార పార్టీ దాదాపు 25 మంది సిట్టింగులను మార్చి కొత్త వారికి అవకాశం ఇచ్చింది. వారిలో కొందరు విజయం సాధించారు. ఇక్కడ కూడా కొత్త, పాత కార్పొరేటర్ల మధ్య రగడ జరుగుతుందట. టికెట్ రాని కొందరు వేరే పార్టీలోకి పోగా.. ఇంకొందరు అధికార పార్టీలో ఉన్నారు. అయితే పాత కార్పొరేటర్ అధికార పార్టీలోనే ఉన్నా.. కొత్తగా గెలిచిన తన పార్టీ నేతలకు వారు సహకరించడం లేదటా. ఈ గొడవతో ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది. తమ సమస్యలు చెప్పుకోవడానికి పాత కార్పొరేటర్ దగ్గరికి వెళ్లాకా లేక కొత్తగా గెలిచిన నేత దగ్గరకు వెళ్లాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారట. కొత్త పాలక మండలి ఏర్పడే వరకు ఈ సమస్యలు తప్పవని భావిస్తున్నారు. ప్రభుత్వమే దీనిపై క్లారిటీ ఇస్తే బెటరని ప్రజలు కోరుకుంటున్నారు.

జోన్లు తేలకుండా, టెట్ లేకుండా భర్తీ ఎలా? ఓట్ల కోసం కేసీఆర్ మరో మోసమా? 

తెలంగాణలో ఖాళీగా ఉన్న దాదాపు 50 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించారు ముఖ్యమంత్రి కేసీఆర్. వివిధ శాఖల్లో ఉన్న ఖాళీల నియమాకాలకు వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఎక్కడైన ఉద్యోగ ప్రకటన వస్తే నిరుద్యోగులు సంతోషపడతారు. ఖాళీలు భర్తీ చేస్తామన్న సర్కార్ కు కృతజ్ఞతలు చెబుతారు. కాని తెలంగాణ రాష్ట్రంలో మాత్రం సీన్ రివర్స్ గా ఉంది. ముఖ్యమంత్రే స్వయంగా ఉద్యోగ ప్రకటన చేసినా నిరుద్యోగులు మండిపడుతున్నారు. విద్యావేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సీఎం ప్రకటనను జనాలు కూడా నమ్మడం లేదు. తమను సీఎం మోసం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యకం చేస్తున్నారు ఉద్యోగాల కోసం ప్రీపేరవుతున్న అభ్యర్థులు. ఓట్ల కోసం మరోసారి కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.    ఉద్యోగ నియామకాలపై సీఎం కేసీఆర్ చెప్పినా నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత రావడానికి బలమైన కారణాలే ఉన్నాయి. ఉద్యోగ ఖాళీల భర్తీపై ముఖ్యమంత్రే ప్రకటన పలు అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యంగా జోనల్ కేడర్ తేల్చకుండా పోస్టులను ఎలా నియమిస్తారన్న ప్రశ్న అన్ని వర్గాల నుంచి వస్తోంది. రాష్ట్రంలో జోన్ల సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న జోన్లను పునర్ వ్యవస్థికరిస్తూ కేసీఆర్ సర్కార్ తీసుకున్న విధాన పరమైన నిర్ణయం ఇంకా కొలిక్కి రాలేదు. దీంతో రాష్ట్రంలో మల్జీ జోనలో పోస్టులేంటీ, జోనల్ పోస్టులేంటీ, డిస్ట్రిక్ లెవల్ కేడర్ ఏంటో తేలలేదు. ప్రెసిడెన్షియల్ రూల్ ప్రకారం ఉండాల్సిన పోస్టుల సంగతి తేలలేదు. జోనల్ సిస్టమ్ లో క్లారిటీ లేకనే.. కేసీఆర్ సర్కార్ ఇంతవరకు గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. గ్రూప్ 2 ఇచ్చి కొన్ని పోస్టులకు నియామక ప్రక్రియను చేపట్టినా.. వారికి ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు. జోనల్ , మల్జీ జోనల్ కేడర్ విషయంలో క్లారిటీ లేకపోవడంతో ఉద్యోగం వచ్చి  ఏండ్లు గడుస్తున్నా కొలువులో చేరలేకపోతున్నారు గ్రూప్ 2 విజేతలు.     జోన్ల ఇష్యూ పరిష్కరించకుండా జేఎల్,డీఎల్ వాంటి ఉద్యోగాల భర్తీ అసాధ్యం. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగ ప్రకటనపై విద్యా వేత్తలు, నిరుద్యోగ అభ్యర్థులు మండిపడుతున్నారు. జోన్లపై సర్కార్ క్లారిటీ ఇవ్వకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిడం మోసపూరితమేనని వారంతా ఆరోపిస్తున్నారు. ఇవేవి తేల్చకుండా సర్కార్ ముందుకు పోయినా.. ఎవరో ఒకరు కోర్టుకు వెళితే నియామక ప్రక్రియ ఆగిపోవడం ఖాయమంటున్నారు.  తెలంగాణ వచ్చాకా కేసీఆర్ సర్కార్ నిర్వహించిన పరీక్షల్లో చాలా వరకు కోర్టు కేసులతోనే నిలిచిపోయిన విషయాన్ని నిరుద్యోగులు గుర్తు చేస్తున్నారు. ఇదే విషయాన్నిప్రస్తావిస్తూ ప్రభుత్వంపై నిరుద్యోగ అభ్యర్థులు ఫైరవుతున్నారు. పోలీసు నియామకాల్లోనూ జోనల్ సిస్టమ్ పెద్ద సమస్యగా మారింది. డీఎస్పీ, సీఐ పోస్టులపై స్పష్టత రాక ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు, ఈ సమస్య వల్లే పోలీస్ శాఖలో చాలా కాలంగా ప్రమోషన్లు నిలిచిపోయాయని చెబుతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిర్వహించిన ఎస్ఐ, కానిస్టేబుల్ నియామకాల్లో అర్హులుగా ఎంపికై ట్రైనింగ్ పూర్తి చేసుకున్నవారికి కూడా ఇంకా పోస్టింగులు ఇవ్వడం లేదు.    ఇక కేసీఆర్ ప్రకటించిన ఉపాద్యాయ పోస్టుల నియామకంలో పెద్ద గందరగోళమే ఉంది.  టీచర్ పోస్టుకు కనీస అర్హత అయిన టెట్  ఎగ్జామ్ నిర్వహించకుండా ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ ఎట్లా అన్న చర్చ వస్తోంది.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆరేండ్లలో కేవలం రెండుసార్లే .. 2016 మే 22న, 2017 జులై 23న టెట్ నిర్వహించారు. ఒకసారి టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థికి ఏడేండ్ల వరకు కాల పరిమితి ఉంటుంది. ఆ గడువు దాటితే మళ్లీ టెట్‌ పరీక్ష రాయాలి. ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారం ఏటా రెండుసార్లు నిర్వహించాలి. కాని తెలంగాణ విద్యాశాఖ మాత్రం తాము ఏడాదికి ఒక్కసారే నిర్వహించేలా 2015లో ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ప్రకారమైనా 2018, 2019, 2020లో మూడు సార్లు నిర్వహించాల్సి ఉన్నా పరీక్ష జరపలేదు.  ఇప్పటికే గడువు తీరిన ఐదు లక్షల మంది అభ్యర్థులు టెట్ కోసం ఎదురు చూస్తున్నారు. టెట్ నిర్వహించని కారణంగా 2018, 2019, 2020లో బీఈడీ, టీటీసీ పూర్తి చేసిన అభ్యర్థులు టెట్ రాయలేదు. మొత్తంగా ఆరేడు లక్షల మంది బీఈడీ పూర్తి చేసిన నిరుద్యోగులు.. సర్కార్ ఎగ్జామ్ పెట్టకపోవడం వల్ల టెట్ కు దూరమయ్యారు. ఇప్పుడు ప్రభుత్వం టీఆర్టీ నిర్వహిస్తే..  వీరంతా ఆ పరీక్ష రాసే అవకాశం కోల్పోతారు. ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే టీచర్ల పోస్టుల నియామకం జరగడమన్నది జరిగే పని కాదంటున్నారు విద్యా రంగ నిపుణులు, నిరుద్యోగ అభ్యర్థులు.    తెలంగాణ ఏర్పాటు తర్వాత డీఎస్సీని ప్రభుత్వం టీచర్ రిక్రూట్ మెంట్ గా మార్చేసింది. టీఎస్ పీఎస్సీ ద్వారా ఒక్కసారే టీచర్ పోస్టులను భర్తీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 8,792 టీచర్ పోస్టుల భర్తీకి 2017, అక్టోబర్‌ 21న టీఆర్టీ నోటిఫికేషన్‌ ఇవ్వగా కోర్టు కేసులు, ఇతరత్రా కారణాలతో నియామక ప్రక్రియలో  జాప్యం జరిగింది. అనేక ఆందోళనల అనంతరం పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. గత ఆరేండ్ల లో వేలాది మంది టీచర్లు రిటైర్డ్ అయినప్పటికీ మళ్లీ టీఆర్టీ నోటిఫికేషన్ ఇవ్వలేదు. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి టెట్‌ స్కోర్‌ కాలపరిమితిని ఏడేళ్లకు బదులు జీవితకాలం ఉండేలా ఇటీవలే నిర్ణయించింది. అయితే ఇక నుంచి టెట్‌ రాసి, ఉత్తీర్ణులయ్యే అభ్యర్థులకే ఇది వర్తిస్తుంది. ఇప్పటికే ఉత్తీర్ణులైన వారికి న్యాయనిపుణుల సలహా తీసుకొని దాన్ని పాటిస్తామని ఎన్‌సీటీ ప్రకటించింది. కాని దానిపై ఇంకా తుది నిర్ణయం రాలేదు. అది వస్తే గాని తెలంగాణలో డీఎస్సీ నిర్వహించడం కుదరదు. టీఆర్టీ పెట్టే ఉద్దేశం లేకనే ప్రభుత్వం అంతకాలం టెట్ ను నిర్వహించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. టెట్ లేకుండానే  సర్కార్ టీఆర్టీ నోటిఫికేషన్ వేస్తే..  ఎవరో ఒకరు కోర్టుకు వెళ్లడం ఖాయం. అదే జరిగితే టీచర్ పోస్టుల నియామక ప్రక్రియ ఆగిపోతుందని నిరుద్యోగులు చెబుతున్నారు.    ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ఇన్ని జటిలమైన అంశాలు ఉన్నా కేసీఆర్ మాత్రం.. త్వరలోనే నోటిఫికేషన్లంటూ మోసం చేస్తున్నారని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో జరగనున్న రెండు ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నిరుద్యోగుల ఓట్ల కోసమే తాజా ప్రకటన వచ్చిందనే ఆరోపణలు వస్తున్నాయి. నిరుద్యోగులు, యువత టీఆర్ఎస్ సర్కార్ పై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారంతా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉండనున్నారని తెలుస్తోంది. అందుకే కేసీఆర్  ఉద్యోగ ప్రకటనల పేరుతో నిరుద్యోగులను, జనాలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తుందనే ఆరోపణలే ఎక్కువగా వస్తున్నాయి. ఓట్ల కోసం కుట్రలు చేస్తూ నిరుద్యోగులతో ఆటలాడవద్దని సీఎం కేసీఆర్ కు కొందరు హెచ్చరిస్తున్నారు.

పీసీసీ ఎంపికలో చేతులెత్తేసిన ఠాగూర్! పార్టీ సీనియర్ల తీరుపై కేడర్ ఫైర్ 

రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించాడట. తెలంగాణలో కాంగ్రెస్ నాయకుల పరిస్థితి కూడా అచ్చం అలానే ఉంది. వరుస పరాజయాలతో పార్టీ భవిష్యతే ఆగమ్యగోచరంగా తయారైనా.. హస్తం నేతల తీరు మాత్రం మారడం లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన పీసీసీ చీఫ్ పదవి కోసం వర్గ పోరుకు తెర తీశారు. పార్టీ ప్రస్తుతం ఉన్న గడ్డు పరిస్థితుల్లో ఏకాభిప్రాయంతో పీసీసీ చీఫ్ ను ఎన్నుకోవాల్సింది పోయి.. బల ప్రదర్శనకు దిగారనే చర్చ కాంగ్రెస్ కేడర్ లో జరుగుతోంది. తనకు రాకపోయినా ఫర్వాలేదు గానీ ఫలానా వ్యక్తికి రావద్దని అడ్డుకునే ప్రయత్నాలు కొందరు చేస్తుంటే.. తనకు ఇవ్వకుంటే పార్టీకి రాజీనామా చేస్తానని మరికొందరు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారట.   కాంగ్రెస్ నేతల తీరుతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ నాలుగు రోజుల పాటు గాంధీభవన్ లో కూర్చుని కసరత్తు చేసినా పీసీసీ అధ్యక్ష ఎంపిక కొలిక్కి రావడం లేదని తెలుస్తోంది. ఈ నెల 9న టీపీసీసీ కోర్‌ కమిటీ సభ్యులతో ప్రారంభమైన అభిప్రాయ సేకరణ శనివారం వరకు జరిగింది. పార్టీ నుంచి పోటీచేసిన ఎమ్మెల్యే అభ్యర్థుల నుంచీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు, అనుబంధ సంఘాలు, డీసీసీ అధ్యక్షులు, కంటెస్టెడ్‌ ఎంపీ అభ్యర్థుల నుంచి ఠాగూర్‌ విడివిడిగా అభిప్రాయాలను తీసుకున్నారు. టీపీసీసీ రేసులో ముందు చాలా మంది నేతల పేర్లు వినిపించినా.. చివరకు మాత్రం ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి మధ్యే నువ్వానేనా అన్నట్లుగా పోటీ ఉందని చెబుతున్నారు. పార్టీ నేతలు కూడా రెండు వర్గాలుగా విడిపోయారంటున్నారు. ఎవరూ పట్టు వీడకపోవడంతో ఏకాభిప్రాయం సాధించడంలో మాణిక్కం ఠాగూర్ కూడా చేతులెత్తేశారనే చర్చ గాంధీభవన్ లో జరుగుతోంది. ఎటూ తేలకపోవడంతో ఆయన కూడా ఢిల్లీకి వెళ్లిపోయారు. ఏఐసీసీ నివేదిక ఇచ్చి తప్పించుకునే ఆలోచనలో మాణిక్కం ఠాగూర్ ఉన్నట్లు చెబుతున్నారు.    యథా లీడర్ తథా కేడర్ అన్నట్లుగా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అలానే తయారయ్యారు. తమ నేతకే పీసీసీ పగ్గాలివ్వాలంటూ సోషల్ మీడియాలో ఊదరగొడుతున్నారు. తమ నేతకు పీసీసీ పగ్గాలు ఇవ్వాలని కోరుకోవడంలో తప్పు లేదు కాని.. పీసీసీ రేసులో ఉన్న ఇతర కాంగ్రెస్ నేతలను వారు టార్గెట్ చేస్తున్నారు. గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో ఇదే రచ్చ జరుగుతోంది. కాంగ్రెస్ కార్యకర్తలు కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి వర్గాలుగా విడిపోయి పోటాపోటీ పోస్టులు పెట్టుకుంటున్నారు. ఒకరికొకరు వాదనకు దిగుతూ తమ పార్టీ లోపాలను వారే బయట పెట్టుకుంటున్నారు. 33 డీసీసీల్లో 20 జిల్లా అధ్యక్షులు రేవంత్ రెడ్డికి మద్దతు ఇచ్చారని రేవంత్ గ్రూప్ ప్రచారం చేస్తే.. 23 జిల్లా అధ్యక్షులు వెంకట్ రెడ్డికి సపోర్ట్ చేశారని కోమటిరెడ్డి గ్రూప్ కౌంటర్ పోస్టులు పెడుతోంది. సీనియర్ నేతల మాదిరిగానే కార్యకర్తలు కూడా గ్రూపులుగా విడిపోవడంతో కాంగ్రెస్ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.     పీసీసీ చీఫ్ మార్పు అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా  కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య ఆధిపత్య పోరు బయటికి వస్తుంది. నేతల మధ్య మాటల యుద్ధం, గ్రూపు తగాదాలు, లుకలుకలు షరా మామూలే. సీనియర్ నేతలంతా పీసీసీ రేసులో నేనున్నాంటూ దరఖాస్తు చేసుకోవడం, లాబీయింగ్ చేసుకోవడం ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం. ఎవరికి ఇచ్చినా ఇంకొరికి కోపం. సహాయ నిరాకరణ, గ్రూపుల తగాదాలు. ఈ పరిస్థితుల్లో ఎవరికి ఇస్తే పార్టీ ఏమవుతుందోనని ఏఐసీసీకి భయం. సీనియారిటీ, సొంత పార్టీ వారికే అవకాశం ఇవ్వాలనే వాదన, రెడ్డి సామాజిక వర్గానికి బదులుగా బీసీలకు ఇవ్వాలనే డిమాండ్.. ఇలా అనేకం ఆ పార్టీ అధిష్ఠానానికి రాష్ట్ర పీసీసీ చీఫ్ మార్పు నెత్తిమీద కుంపటిలా తయారైందని చెబుతున్నారు. పార్టీ బలోపేతం, అధికారంలోకి రావడం వంటి విషయాలు కాంగ్రెస్ సీనియర్లకు పట్టడం లేదని, పదవుల కోసమే కీచులాడుతూ కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నారని కొందరు నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.    పార్టీ హైకమాండ్ కూడా త్వరగా పీసీసీ చీఫ్ ఎవరో తేల్చాలని, లేదంటే పార్టీ పరిస్థితి మరింత దిగజారుతుందనే ఆందోళన కొందరు కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే చాలా మంది నాయకులు వెళ్లిపోయారని, మరికొందరు అదే బాటలో ఉన్నారంటున్నారు. ఇతర పార్టీలు నేతలను తన్నుకుపోవడానికి కాచుకుని ఉంటే.. పదవుల కోసం సీనియర్లు తగాదా పడటం ఎంత వరకు కరెక్ట్ అన్న అభిప్రాయం పార్టీ కార్యకర్తల నుంచి వస్తోంది. సీనియర్ నేతల తీరు మారకుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లా మారిపోతుందని చెబుతున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజల్లో గుర్తింపు ఉన్నా నాయకుల అసమర్దత వల్లే పార్టీ అధికారంలోకి రాకపోయిందనే అభిప్రాయం కాంగ్రెస్ కార్యకర్తల నుంచి వస్తోంది.