Previous Page Next Page 
చదువు పేజి 16

   

    సుందరం జనం మధ్య నిలబడి చూస్తుంటే ఎక్కణ్ణుంచో చూసి సుబ్బులు గుర్తుపట్టాడు. వాడుకూడా ఆడవాళ్ళలోకివచ్చి, "అరె, నువ్వు వచ్చావే? రా, మా నాన్నను చూపిస్తా" అని సుందరాన్ని పట్టుకెళ్ళాడు.

    ఇద్దరూకలసి స్టేజిలోకి వెళ్ళారు. అక్కడ వేషాలు వేసుకుంటున్నవాళ్ళూ, వేసుకున్న వాళ్ళూ కనిపించారు. వాళ్ళకేసి సుందరం మతి పోయినట్టు చూశాడు. ఒక పక్కగా ఒకావిడ బీడీ కాలుస్తూ ఎవరితోనో మాట్లాడటం కనిపించింది. "ఆవిడ"మగ వాడేనని సుందరం ఊహించలేదు.

    "ఇదుగోనాన్నా, సుందరం, వాళ్ళమ్మా, నాన్నా కూడా  వచ్చారు నాటకానికి" అన్నాడు సుబ్బులు.

    సుబ్బులు మాట్లాడుతున్నది "ఆవిడ" తోనే అని సుందరం కల్లోకూడా అనుకోలేదు.

    "అట్లాగా?" అన్నా "డావిడ" నోట్లోనుంచి బీడీతీసి.

    "చూడు సుబ్బులూ, శేషాచలాన్ని పిలిచి ఈ అబ్బాయినీ, వాళ్ళ నాన్నగారినీ రిజర్వడులో కూచోబెట్టించు."

    "అట్లాగే, నాన్నా... రారా, సుందరం!"

    మిగిలిన వసంతా సుబ్బులు తనంతట తనే నిర్వహించాడు. మొదట శ్రీమన్నారాయణ "ఎందుకులేండి? ఇక్కడ బాగానే ఉన్నది" అన్నాడుగాని, ఆ శేషాచలమన్న మనిషి విడిచిపెట్టలేదు.

    సుబ్బులుకు తెలిసిన విషయాలలో తనకు సహస్రాంశం తెలీదని సుందరానికి అనిపించింది.

    "చూడు సుబ్బులూ! నువ్వు ఆ లోపల మాట్లాడావే__ మీ నాన్నా?" అన్నాడు సుందరం.

    సుబ్బులు నవ్వి, "అవును. ఆడదానల్లే ఎట్లా ఉన్నాడో!" అన్నాడు.

    నాటకం మొదలయ్యేసరికి సుబ్బులూ, సుందరం కూడా శ్రీమన్నారాయణ పక్క చేరారు.

    ప్రార్ధనా, తెరఎత్తుకోవటం దగ్గర్నుంచీ నాటకం ప్రతిక్షణమూ ఎంతో అద్భుతంగా తోచింది సుందరానికి. అన్ని వేషాలలోకీ కృష్ణుడి వేషమూ, సత్యభామ వేషమూ  వాడికి చాలా అద్భుతంగా ఉన్నాయి. సత్యభామ వేషం వేసింది సుబ్బులు నాన్నే.

    ఇంటికి తిరిగొచ్చేటప్పుడు శ్రీమన్నారాయణా, ఆయన కన్న ఎక్కువగా సీతమ్మా నాటకాన్ని గురించి మాట్లాడుతున్నారు.
 
    "ఏం జరిగిందనుకున్నారూ? సత్యభామ వేషం వేసినయన పెళ్ళాం మా పక్కనే కూచుంది. ఆ వేషం వచ్చినప్పుడల్లా ఆవిడ కళ్ళు మూసుక్కూచుంది. పాపం, మొగుడు ఆడ వేషం వేస్తె పెళ్ళాం  చూడరాదు"అన్నది సీతమ్మ.   
    "ఎందుకు చూడరాదో? చూస్తే ఏమవుతుందో?" అనుకున్నాడు సుందరం. తల్లి మాట్లాడుతున్నది సుబ్బులు తల్లిని గురించి అయిఉండాలని ఎంతో సేపటికిగాని సుందరానికి తట్టలేదు.

    దీపావళి పండగ సరదాగా వెళ్ళిపోయింది. శ్రీమన్నారాయణ బందరుతోటాలు దొరికితే కొనికాల్చాడు. ఆయన అవి కాలుస్తున్నంతసేపూ సీతమ్మ, "ఇవెందుకు తెచ్చారండీ? భద్రమండీ?" అంటూనే ఉన్నది.

    సుందరం పువ్వొత్తులూ, పగలొత్తులూ, చిటపటాలూ కాల్చాడు. రంగు నిప్పెట్టెలుకూడా కాల్చాడు.

    దీపావళి వెళ్ళిన పది పదిహేను రోజులకు సీతమ్మ ఆడపిల్లను కన్నది.
 
    తల్లి పురిటింటోఉన్న పదిరోజులూ సుందరానికి పిచ్చిపిచ్చిగా ఉన్నది. ఆ తరువాత మళ్ళా జీవితం యధా ప్రకారమయింది.
   
                                         *    *    *    *

    సుందరం ఇంగ్లీషు అక్షరాలు నేర్చుకుంటున్నాడు. వాడు తన దగ్గరకి రాకుండా, తన సహాయంలేకుండా "ఏ.బీ.సీ.డీ" అంటూ అక్షరాలు దిద్దుకుంటూంటే సీతమ్మకు ఎందుకో కష్టం వేసింది. అప్పుడే వాడు తనకు అలివిగాని చదువులో పడ్డాడు. వాడు తనచేత అక్షరాలు రాయించుకుని దిద్దినరోజులు జ్ఞాపకం చేసుకుంటే ఎంతో కాలమైనట్టుగా తోచిందావిడకు, వాడితో పాటు తానుకూడా ఇంగ్లీషు నేర్చుకుందామన్న ఆలోచనకూడా కలిగింది. సీతమ్మకు. కాని సగం పిల్లతో తీరకా, సగం ఎవరన్నా నవ్వుతారన్న బిడియంచేతా ఆ పనిచేయలేదావిడ. ఎప్పుడన్నావాడు దిద్దే అక్షరాలకేసి చూసేది. వాడు అక్షరాల పేర్లు పైకి అంటుంటే వినేది, అంతే.

    హైస్కూళ్లకు వేసవి శలవులిచ్చే సమయానికి సుందరం ఇంగ్లీషు రీడరు పూర్తిచేశాడు.
 
    అప్పటికే శ్రీమన్నారాయణకు అస్వస్థత ప్రారంభమయింది. ఆయన ఉద్యోగానికి శలవుపెట్టి ఇంట్లోనే ఉండి, మందు పుచ్చుకుంటున్నాడుగాని ఏమీ ఫలితం కనిపించలేదు. నాటు వైద్యులు రక్తహీనత అన్నారు. "అపాతికరీ" కూడా చూశాడు. ఆ జబ్బు బెరిబెరీ అనీ ప్రమాదకరమనీ ఆయన చెప్పాడు. ఆయన ఏదో మందిచ్చాడు, కాని ఏ వైద్యమూ ఫలించలేదు.
 
    మేనెల ఆరంభంలో శ్రీమన్నారాయణ పోయినాడు. చెడ్డనక్షత్రం సుబ్బమ్మగారూ వాళ్ళూ ఇంకో ఇంటికి వెళ్ళిపోయినారు ఇల్లుపాడుపెట్టి. వైధవ్యంతో రూపుమారిన చంటిపిల్ల తల్లి సీతమ్మా, సుందరం దగ్గరలోనే మరొక ఇంట చేరారు.

    ఈ స్థితిలో సీతమ్మకు శేషగిరివచ్చి చాలా సహాయం చేశాడు.

   
                                                ౭

    అదివరకు చావును గురించి అనేకమంది విచారంగా, విరక్తిగా, నిర్లక్ష్యంగా మాట్లాడుకోవడం సుందరం విన్నాడు. అప్పుడప్పుడూ శ్మశానానికి వెళ్ళే శవాలను చూశాడు. కాని తన తండ్రీ చచ్చిపోయేదాకా చావును గురించి సుందరానికి ప్రత్యక్షానుభవం లేదు.
     
    తండ్రి శవం చుట్టూరాచేరి తల్లీ, ఇతర ఆడవాళ్ళూ ఏడుస్తుంటే సుందరంకూడా ఏడిచాడు. కాని వాడి మనస్సులో దిగులు తప్ప శోకంలేదు. తన తండ్రి ఇక మాట్లాడడనీ, ఆయన్ను తీసుకుపోయి దహనం చేస్తారనీ వాడికి క్రమంగా అర్దమయి ఆశ్చర్యం వేసిందిగాని, విచారం కలగలేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS