Previous Page Next Page 
చదువు పేజి 15

   

    ఇద్దరూ బడికి చేరేసరికి ఇంకా బాగా వెలుతురొచ్చింది. ఎండ వచ్చేదాకాపంతులు రానేలేదు.

    పంతులు ఒకడే రాలేదు. ఆయన వెంట ఇంకో పంతులూ, ఆ పంతులు వెంట ఇంకో ఇరవైమంది పిల్లలూ వచ్చారు. పిల్లలందరూ కలిసి కాసేపు పాటలు పాడారు. తరవాత మంద బయలుదేరింది. రెండోపంతులు పిల్లలందర్నీ సైజు వారీగా జతలుగా విడగొట్టి, ఈ జతలన్నిటినీ ఒక వరసలో నిలబెట్టాడు. పిల్లల్లో చాలామంది దగ్గర కోతులున్నాయి. కొంతమంది దగ్గర విల్లంబులున్నాయి. వాళ్ళు వాటితో గులాంకొట్టారు. గులాం ఎర్రని పొగలాగా గాలిలోకి లేచింది. కొందరు పిల్లలు మెరుపుపుల్లలకు రంగుకాగితాలతో జెండాలు తయారుచేసి అవి పట్టుకున్నారు. నీలం, ఎరుపు, పసుపు జెండాలు గాలిలోకి లేచాయి.
 
    "జయాభిజైభవా! దిగ్విజైభవా!"  అని అరిచి పిల్లలు కదిలారు. పంతుళ్ళిద్దరూ ముందు నడిచారు. ఆ పూట ఏ పేటకు వెళ్ళాలో, ఎవరెవరిళ్ళకు ముందు వెళ్ళాలో పంతుళ్ళమధ్య అది వరకే నిర్ణయమయింది.

   
                                      *    *    *    *   

    ఇల్లిల్లూ తిరగటం సుందరానికి మంచి అనుభవమయింది.  బళ్ళో పిల్లల్లో చాలామంది ఇళ్లను వాడు ఇదే మొదటి సారి చూడటం. ఒక ఇల్లున్నట్టు ఇంకో ఇల్లులేదు. వెంకటప్పయ్య ఇల్లు చాలా పెద్దది. "లంకంత" ఇల్లు. ఇంటి చుట్టూ గొడ్లూ, ఆవులూ  బోలెడు కట్టివున్నాయి. ఇటువంటి ఇళ్ళు ఒకటి రెండు తప్పిస్తే మిగిలిన ఇళ్ళు సుందరం ఇంటివంటివే.

    పంతులు కొందరిళ్లకు పోనేలేదు. సుందరం సులభంగానే కారణం ఊహింఛాడు. కొందరు పిల్లలు నివసించేవి ఇళ్ళనటానికి వీల్లేదు. వెంకటప్పయ్యగారి గొడ్లపాకలాంటి ఇళ్ళల్లో నివసిస్తున్న వాళ్ళున్నారు. ఇటువంటి ఇళ్లను సుందరం దూరాన్నుంచి మాత్రమే చూశాడు.

    ఒకచోట పిల్లలు కొన్ని గుడిసెల పక్కగా పోతుండగా, చేతిలో పేడ ఎత్తుకుని ఒక మనిషి కనిపించింది. ఆమె బొత్తిగా అంట్లుతోమేదానల్లే ఉంది. ఇంతమంది పిల్లలమధ్య తన కొడుకును చూసి ఆనందిస్తూ ఆమె ఒక పక్కగా నిలబడింది. ఆమె కొడుకు అందరి దగ్గరికి వచ్చి, "అదిగో, మా అమ్మ" అని చూపించసాగాడు.

    వాడి తల్లి తన తల్లిలాగా లేనందుకు సుందరం నొచ్చుకున్నాడు. అయితే, వాడుకూడా చదువుకుంటున్నాడు, కనుక పెద్దవాడై ఉద్యోగంచేసి డబ్బు  సంపాదిస్తాడనీ, అప్పుడు ఈ మనిషికూడా తన తల్లిలాగే ఉంటుందనీ, సుందరం పూర్తిగా నమ్మాడు. చదువుకోదలిచిన వారంతా ఎంతకాలమన్నా చదువుకోవచ్చుననీ, చదువుకున్నవాళ్ళందరికీ చదువుకుతగ్గ ఉద్యోగాలు వస్తాయనీ సుందరం నమ్మకం....

    సుందరం ఇంకా చాలా విషయాలు గమనించాడు. పిల్లలు తమ ఇళ్లకు వెళ్ళినప్పుడు తాము పాడరు. కొన్ని ఇళ్లకు పోగానే పంతులుకూ, పిల్లలకూ ఇచ్చేదేదో ఇచ్చేస్తారు. మరికొన్ని ఇళ్ళలో ఎంతసేపటికీ తేలదు. కొందరు తరువాత చూసిమెల్లిగా ఇస్తాం లెమ్మంటారు. కొన్ని ఇళ్ళల్లో పప్పుబెల్లాలు ఎక్కువిస్తారు. కొన్ని ఇళ్ళల్లో తక్కువిస్తారు. కొందరు పంతుల్ని మర్యాదగా "ఏమండీ" అంటే, మరికొందరు "ఏవయ్యా. పంతులూ" అంటారు.

    ఒక ఇంట్లో ఎవరో ఆయన సుబ్రమణ్యాన్ని, "ఏమండీ మేష్టరుగారూ? జయాభిజైభవా అంటే ఏమిటర్డం? ద్వ్గిగ్విజైభవా ఏమిటి?" అని అడిగాడు.

    పంతులు నవ్వి ఊరుకున్నాడేగాని సమాధానం చెప్పలేదు. రెండో ఆయన వదల్లేదు.

    "జయ విజయీభవా అన్న ముక్కను ఇట్లా అపభ్రంశం చేస్తున్నారు. మన చదువు లిట్లా అఘోరిస్తున్నయ్" అన్నాడు.

    ఆ ఇంటిలోనుంచి బయటకి వస్తూనే పిల్లలు, "జయాభిజైభవా! ద్విగిజైభవా" అని కేకవేశారు. తప్పొప్పు లెవరిక్కావాలి? సంస్కృతికన్న సంప్రదాయం బలమైనది; అర్ధంకంటె నినాదం బలమైనది.

   
                                          *    *    *    *

    ఇవి సుందరానికి చాలా ఉల్లాసపు రోజులు, దసరా వెళ్ళినట్టేలేదు. దీపావళి వచ్చింది. రేపుదీపావళి అనగా నరక చతుర్దశినాడు సాయంకాలం తలపని తలంపుగా సుబ్బులు సుందరం ఇంటికి వచ్చాడు.

    "ఇవాళ నరకాసుర వధ నాటకం ఉంది. మనం ఊరికేపోవచ్చు. వస్తావోయ్?" అన్నాడు సుబ్బులు.
 
    సుందరం ఎన్నడూ నాటకం చూడలేదు, "మా అమ్మ నడగాలోయ్" అన్నాడు సుందరం, ఆవిడ ఒప్పుకుంటుందని ఆశలేకుండా.

    వాడనుకున్నట్టే ఆవిడ, "ఎందుకురా నాటకాలూ? నిద్రదండగా!" అన్నది.

    "ఊరికే వస్తుంటే పోవటానికేమమ్మా?"  అన్నాడు సుందరం, తల్లి డబ్బుకు లోభిస్తున్నట్టు.

    సీతమ్మ చాలా అభ్యంతరాలు చెప్పింది. సుందరం మధ్యలో నిద్రపోతాడు. అర్ధరాత్రివేళ ఎవరు ఇంటికి చేరుస్తారు?
 
    సుందరం మట్లాడలేదు. కాని ఆశాభంగం అయినట్టు ఆవిడ తెలుసుకున్నది. "వీడిప్పటినుంచీ నాటకాలు మరిగితే చదువురాదు" అనుకున్నదావిడ.

    తన నిర్ణయంమీద పూర్తి విశ్వాసం లేకనో ఏమో ఆవిడ నాటకం మాట శ్రీమన్నారాయణ దగ్గర ఎత్తింది. ఆయన అందర్నీ నాటకానికి బయలుదేరతీశాడు.

    నాటకం హాలు దగ్గర దీపాలూ, కేకలూ, మేళాలూ జనం___ సందడిగా ఉంది. సీతమ్మనూ, సుందరాన్నీ ఆడవాళ్ళలో కూచోబెట్టి శ్రీమన్నారాయణ ఎనిమిదణాల టిక్కెట్టులో కూచున్నాడు.

    హాలులోపల తెరలూ అనీ చూసి సుందరం చాలా సంతోషించాడు. ఆ తెర లేస్తుందనీ, మనుషులు వేషాలు వేసుకొచ్చి నాటకం ఆడతారనీ, సీతమ్మ కొడుక్కి చెప్పింది. తెర ఎట్లా లేస్తుందో వాడూహించలేకపోయినాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS