"ఇటువంటి మొద్దువెధవలంతా మార్కండేయులు బళ్ళో వచ్చిపడతారు" అన్నాడు సుందరం పక్కనున్న కుర్రావాడు.
"మార్కండేయులు పిల్లలని చావగొడతాడు. నా కటువంటి వాళ్ళంటే అసహ్యం. రాఘవయ్యపంతులు కొడతాడనే ఆయన బళ్ళో మానేశా" అన్నాడు సుందరం.
"మార్కండేయులు కొట్టటం కొట్టటమా? పొట్టిపంతులేంచేస్తాడో తెలుసూ?" అన్నాడు రెండో కుర్రవాడు.
"నాకు తెలీదు" అన్నాడు సుందరం తెలుసుకోవాలనే కుతూహలం కనబరుస్తూ.
"పిల్లల్ని కోదండం వేయిస్తాడు."
"అంటే?" అన్నాడు సుందరం.
"దూలానికి తాడుకట్టి దానికి వేళ్ళాడతీస్తాడు."
"ఎంతసేపు వెళ్ళాడతీస్తాడూ?"
"ఇష్టంమొచ్చినంతసేపు."
"చేతులు నెప్పెట్టవూ?"
"వదిలిపెడితే కిందపడి కాళ్ళు విరుగుతైగా!"
"తరువాత కాళ్ళు విరగనీ, చేతులు నెప్పెట్టితే వొదిలెయ్యమూ?" అన్నాడు సుందరం, తనకే కోదండం వేస్తున్నట్టు ఊహించుకుంటూ.
"అట్లా వొదిలిపెట్టకుండా పొట్టిపంతులింకో తమాషా చేస్తాడుగా!"
"ఏమిటా తమాషా?"
"కింద మంట పెడతాడు."
సుందరం తన స్నేహితుడికేసి వెర్రిగా చూశాడు....
౬
సుందరంబుర్ర లెక్కల్లో బాగా పనిచేసేది. వాడికి ఇరవై ఎక్కాలూ వచ్చినతారువాత పంతులు కూడికలూ, తీసివేతలూ నేర్పాడు. సుబ్రహ్మణ్యం ఒక్క తెలివైన పని చేశాడు. చిన్న అంకెలకూడికకు వేళ్ళు ఉపయోగించే దురభ్యాసం అయినా ప్రోత్సహించలేదు. అందుచేత ఒంటిఅంకెల కూడికలూ, తీసివేతలూ తలలోనే చేసే అలవాటు సుందరానికి పట్టుబడింది. వాడింకో సంగతి కూడా తనంతట తానే కనిపెట్టాడు. ఎక్కాలన్నీ కూడికలే! వరసగా నాలుగు మూళ్ళువేసి కూడితే పన్నెండు వస్తుంది. ఆరుమూళ్ళు కలిపితే పద్దెనిమిది వస్తుంది. ఈ సంగతి కనిపెట్టినప్పుడు సుందరానికి చాలా ఆనందం కలిగించింది. కూడికలూ తీసివేతలూ నేర్చుకున్నాక, సుందరం హెచ్చవేతలూ భాగాహారాలూ నేర్చుకున్నాడు.
దసరాపండుగ దగ్గిర పడుతున్నదనగా వీధిబళ్ళలో చదువు మానేసి పిల్లలకు పాటలు నేర్పటం మొదలుపెట్టారు. పంతుళ్ళు.
"శ్రీహరి కరుణాకటాక్షా__ వీక్షణాలంకారా! అర్దిజనకుముద చంద్రోదయా! ఆశ్రిత విద్వజ్ఞనాధారా! దానరాధేయా! సంగ్రామధనంజయా; సాహస విక్రమార్కా!" మొదలైన భట్రాజు పొగడ్తలతోనూ, ధర సింహాసనమై , నభంబుగొడుగై" వగైరా పద్యాలతోనూ, "అర్దరూపాయిస్తే అంటేది లేదూ, ముప్పావలా అయితే ముట్టేదిలేదూ, అయ్యవారికిచాలు అయిదువరహాలూ, పిల్లవాళ్ళకుచాలు పప్పుబెల్లాలూ." అన్నగేయాలతోనూ వీధి మారుమ్రోగింది.
"ఒరేయ్, రేపు మీరంతా మంచి మంచి బట్టలు వేసుకొని, చద్దిఅన్నాలు తిని, దసరాబొమ్మతో సహాతెల్లావారుతోనే ఇక్కడికి వచ్చేయ్యండీ. ఊరంతా తిరాగాలి" అనిసప్తమినాడు పంతులు పిల్లలకు చెప్పాడు.
దసరా తిరుగుళ్ళను గురించి సుందరానికి ఏమీ అనుభవంలేదు. అందుచేత వెంకటప్పయ్యనడిగి తెలుసుకున్నాడు. అంతా విన్నతరువాత సుందరానికి చాలా ఉత్సాహం వచ్చింది. పాటలు పాడుకుంటూ మూడురోజులపాటు ఇల్లిల్లూ తిరగటం భలే బాగుంటుందనిపించింది సుందరానికి. ఆ సాయంకాలం వాడు తండ్రివెంట బజారుకుపోయి కోతిబొమ్మ కొనుకున్నాడు. తలవని తలంపుగా సుందరానికి కొత్తచొక్కా, కొత్తలాగూ కూడా వచ్చాయి. తనతండ్రి ఇవి కుట్టిస్తున్నట్టు సుందరానికి తెలియదు. చొక్కా ట్విల్లుచొక్కా, సుందరం కళ్ళ కది మల్లెపువ్వులకన్న తెల్లగా మెరిసిపోతున్నట్లు కనబడింది. లాగుకూడా ఎంతో బాగుంది. తెల్లగీరగల నల్లలాగు, తను అంతమంచిగుడ్డ లెన్నడూ వేసుకోలేదనుకున్నాడు సుందరం.
ఆ రాత్రి చాలాసేపు సుందరానికి నిద్రపట్టలేదు. రేపు గురించి ఎంత ఊహించుకున్నా వాడికి తనివి తీరలేదు. ఆఖరుకు, ఏ అర్దరాత్రివేళో కన్నుమూసి ఒక్క క్షణమైనా నిద్ర పోయినట్టు లేదు. ఇంతలో తల్లి "లేవరా, సుందరం" అని లేపేసింది.
లేచిన క్షణంనుంచీ ప్రతిదీ సుందరానికి మామూలుకన్న బాగా ఉన్నట్టు తోచింది. మొహం కడుక్కోవటానికి బయటికి వచ్చాడు. చలిచలిగా ఉంది. ఆ చలి వాడికి బాగున్నట్టుతోచింది. అప్పుడే కొద్దికొద్దిగా విచ్చుకుంటున్న చీకట్లు కూడా వాడికెంతో ఆనందం కలిగించాయి.
సుందరం మొహం కడుక్కొని, అన్నంతిని కొత్తబట్టలు వేసుకుని కోతిబొమ్మ చేతపట్టుకుని నిర్మానుష్యంగా ఉన్న వీధులు వెంట బడికి బయలుదేరాడు. సగందారిలో ఎవరో వెనుక నుంచి, "సుందరం" అని పిలిచారు. సుందరం సుబ్బులు గొంతు గుర్తు పట్టాడు.
"నువ్వు కొత్తబట్టలు వేసుకోలేదే?" అన్నాడు సుందరం ఆశ్చర్యంతో.
"ఆ !" అన్నాడు సుబ్బులు నిర్లక్ష్యంగా.
"బొమ్మకూడా కొనుక్కోలేదా?"
"బొమ్మాలేదూ గిమ్మాలేదూ!"
సుబ్బులు నిర్లిప్తత చూసిన తరువాత సుందరానికి తన ఉత్సాహంమీద ఉత్సాహం తగ్గింది.
"నీ వంటివాళ్లనే దసరా బుల్లాడంటారు" అన్నాడు సుబ్బులు.
సుబ్బులు తనకన్న ఒక ఏడాది ఏమైనా పెద్దేమో, అంతకంటే ఉండదు; అయినా తనకన్నా ఎంతో పెదవాడల్లే ఎందుకు కనిపిస్తాడో, తనకు తెలియని విషయాలు వాడి కెందుకు తెలుసో సుందరానికి అర్దమయేది కాదు.
