Previous Page Next Page 
చదువు పేజి 13

   

    కాని మార్కేండేయులు పిల్లలకిచ్చే శిక్షలో ఇది ముఖ్యభాగం కానే కాదు. పిల్లలు ఇంటి దగ్గర పెద్దవాళ్ళమాట విననందుకూ, బళ్ళో కూచున్న సమయంలో పిల్లలు స్వాభావికంగా చేసేపనులు చేసినందుకూ, మార్కండేయులు పిల్లల్ని చెండుకుతినేవాడు. పిల్లలు స్వతహాగా దుర్మార్గులనీ వాళ్ళకు తనపై భయం కలిగిస్తే చెడు యావత్తూ వదిలిపోయి బాగుపడతారనీ మార్కేండేయులు విశ్వాసమై వుంటుంది.

    మార్కేండేయులు పిల్లల్ని శిక్షిస్తుంటే చూసేవారికి ఆయనకు పిల్లలమీద ఏదో పగఉన్నదా అనిపించేది. ఆయన పిల్లలను మంచివాళ్ళను చేసే పద్దతులలో తల గోడకేసి కొట్టటమూ, పిల్లల్ని డొక్కల్లోతన్ని అరుగు ఒక మూలనుంచి ఇంకోమూలకు విసరటమూ, వాళ్ళచేతులు మెలిపెట్టటమూ, వాళ్ళను జుట్టుపట్టుకుని పైకెత్తటమూ  మొదలైన నాజూకులుండేవి. ఎన్నోసార్లు మార్కండేయులు పిల్లలు పంతులు దెబ్బలకు లాగుల్లో ఉచ్చలు పోసుకునేవాళ్ళు. దొడ్డి క్కూచునేవాళ్ళు.

    ఒకరోజు మార్కేండేయులు డొక్కలో తన్నిన తన్నుకు ఒక కుర్రవాడు అరుగుమీద నుంచి వీధిలోపడి  ప్రాణంకడబట్టి చచ్చినట్టుగా పడిపోయినాడు. నలుగురూ చేరారు. మొహాన నీళ్ళుచల్లి వాణ్ణి బతికించారు. ఒక్కరు కూడా మార్కండేయులు పంతుల్ని "ఇదేమిటి?నువ్వు మనిషివా, గొడ్డువా?" అని అడగలేదు. ప్రాణం కడబట్టిన పిల్లవాణ్ణి తెప్పరించటానికి ఆయన సహాయపడలేదు కూడా. సహాయపడితే మిగిలిన విధ్యార్ధులకు లోకువవుతాడు!

    ఇదంతా ప్రత్యక్షంగా చూస్తున్న సుందరానికి ఆ క్షణానే వెళ్ళి మార్కండేయుల్ని గొంతుపిసికి చంపెయ్యాలన్నంత కోపంవచ్చింది. ఇంతవరకూ సుందరానికి ఎవరిమీదా అంత కోపంవచ్చి వుండలేదు. ఇది వాడికి తొలి అనుభవం.
 
    చచ్చినంతపనై మళ్ళి త్రాణవచ్చిన కుర్రాణ్ణి ఎవరో ఇంటికి చేర్చారు. మరుక్షణమే మార్కేండేయులు తన "శిక్ష"ప్రారంభించాడు. నలుగురు పిల్లల్ని గోడకుర్చీ వేయించాడు ఇద్దరిచేత గుంజీలు తీయించాడు.

    మార్కండేయులు గుంజీలు తీయించటం ఒక కవాతు. పాదాలు రెండూకలిపి పెట్టాలి. కుడిచేత్తో ఎడమ చెవీ, ఎడమ చేత్తో కుడి చెవీ పట్టుకోవాలి. ముందు మోకాళ్ళమీద పడాలి తరువాత మోచేతులమీద పడాలి. యాభయ్యో, వందో గుంజీలు తీస్తున్నంతసేపూ పాదాలు ఎడమైనా, చెవికి చెయ్యి ఎడమైనా వీపు పేలిపోతుంది.  యాభైగుంజీలు ఈవిధంగా తీసేసరికి పిల్లల మోకాలిమీదిలాగూ, మోచేతి మీది చొక్కా రక్తంమరక లయేవి.

    ఒకరోజు ఒక కుర్రాడు మోకాళ్ళకూ మోచేతులకూ గుడ్డలుచుట్టుకు వచ్చాట్ట. యాభైగుంజీలు తీసినా లాగుగాని చొక్కాగాని రక్తం మరకలు కాలా. కారణం తెలుసుకొని మార్కండేయులు పేంబెత్తంతో వీపు వాయగొట్టాడు.
 
    వీధిబడి జీవితంలో సుందరంచూసిన వాటన్నిటిలోకీ వాడికి భయంకరంగా కనిపించి, ఎంతోకాలంపాటు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా చెప్పరాని ఆవేదన కలిగించినది బండకొయ్య. అంతకు పూర్వం బండకొయ్యగురించి విననన్నా ఆకస్మికంగా చూసేటప్పటికి సుందరానికి జీవితాన్ని గురించిన భయంకరమైన ఒక కొత్తసత్యం తనమీద భారంగా విరుచుకుప్పడ్డట్టు అయింది.

    బండకొయ్య మోస్తూ సుందరం కంటబడిన కుర్రవాడికి ఏ పన్నెండేళ్ళో ఉంటాయి. వాడికి చొక్కాలేదు. చాలీచాలని లాగు, బూడిదరంగుది తొడుక్కున్నాడు. వాడి మొహాన మనిషికుండవలసిన భావాలేవీ లేవు. అచ్చగా జంతువల్లే ఉన్నాడు. వాడికంట తడిగాని, మొహాన బాధగాని, విచారంగాని, రోషంగాని, పౌరుషంగాని ఉంటే సుందరం హృదయం వాడికి దగ్గరిగా వెళ్ళటానికి ప్రయత్నించి ఉండేది. కాని వాడిలో ఇవేవీ లేవు. బండకొయ్య రెండుచేతులమీదా అడ్డంగా పెట్టుకొని మోస్తున్నాడు. బండకొయ్యను కొంచెం జాగర్తగా పరిశీలిస్తే దాన్ని ఎవరో పనిపెట్టుకుని, ఒక పద్దతిప్రకారం తయారు చేశారని సుందరానికి అర్దమయింది. పిల్లల్ని కొట్టటానికని బెత్తాలు తయారు చేస్తారన్నమాట  మనస్సుకు తోస్తేనే సుందరానికి మనస్సులో ఏదో వికారంగా ఉంటుంది. ఇటువంటి బండకొయ్యలు తయారుచేస్తారంటే కలిగిన వికారాన్ని సుందరం బొత్తిగా భరించలేకపోయాడు.

    బండకొయ్యకొక ఇనపగొలుసు తాపటం చేసివుంది. ఆ గొలుసు బండకొయ్య మోసేవాడికాళ్ళకు రెంటికీ కట్టిఉంది. వాడు కావాలన్నా పెద్దఅంగలు వెయ్యలేడు. గొలుసు పట్టుకుంటుంది. బండకొయ్య కిందపడేసి పారిపోవటానికి లేదు గొలుసు బరువుకావటంచేతనో ఏమిటో ఆ కుర్రాడు చిన్న అంగలైనా కాలు ఎత్తివెయ్యక, కాళ్ళు నేలమీదనే రాస్తూ ముందుకుపోతున్నాడు. వాడు కదలినప్పుడల్లా గొలుసు పెద్ద చప్పుడుచేస్తున్నట్టు సుందరం బుద్దికి తోచింది. ఈ గొలుసుచప్పుడు ఎన్నోరోజులు సుందరాన్ని  వెంటాడి, నిద్రలోకూడా వినిపిస్తూ ఉండేది.

    ఈ  బండకొయ్యవేసే కుర్రాడ్ని మరొక పెద్దాయన వెంటబెట్టుకుని సుబ్రహ్మణ్యం బడిపక్కగా మార్కండేయులు బడికి తీసుకువెళ్ళాడు.
   
    "చదువూసంధ్యా లేకుండా పూర్తిగా చెడిపోయి దొంగతనాలూ అవీ మరిగినవాళ్ళకి బండకొయ్య వేస్తారు" అన్నాడు సుందరంతోపాటు బండకొయ్యవేసిన కుర్రవాణ్ణి చూస్తూ ఉండిన మరో కుర్రవాడు.

     తనకన్న తక్కువ చలించినవాడితో మాట్లాడటం సుందరానికి లభించింది.

    "వాడు బాగా చెడిపోయినాడా?" అన్నాడు  సుందరం అయిదేళ్ళవాడిక్కూడా జీవితాన్నీ, మానవుల్నీ విశ్వసించాలనే ఉంటుంది మరి.

    "చెడిపోవటంలో అట్టా ఇట్టాగా? వాణ్ణి కొట్టు, చంపు. ఎవరిమాటా వినడు. కొంచెం సందు చిక్కిందో అందకుండా పారిపోతాడు" అన్నాడు ఆ కుర్రవాడు.
 
    అదంతా బాగానే ఉంది. కాని వాణ్ణి బడికి తీసుకురావటం దేనికి?  వాడికింకా చదువొస్తుందా? తన అనుభవాన్ని బట్టి సుందరం, బుద్ధి పూర్వకంగా, పూర్తి ఇష్టంతో చదివేదే చదువని నమ్మాడు. తన చుట్టూ ఉన్నవాళ్ళలోనే ఎంతమందికి బలవంతాన చదువు అంతగట్టబడుతున్నదీ సుందరానికి తెలియనే తెలియదు. అందుచేత ఆ బండకొయ్యకూ చదువుకూ మధ్య ఏదో పెద్ద అఘాతం ఉన్నట్టు సుందరం నమ్మాడు.                   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS