Previous Page Next Page 
పిపాసి పేజి 2


    "రాధికేదీ...." అంది సరోజిని. అందరూ తిరిగి చూశారు కనిపించలేదు. "రాధీ..... రాధీ....." అంటూ పిలిచారు. చుట్టుపక్కలెక్కడైనా వుందేమోనని లాభం లేకపోయింది. సరోజినీ ఏడుపు నాపుకోలేకపోయింది. రాజేశ్వరమ్మ కూడా ఎలాగో దుఃఖాన్నాపుకుంటూ సరోజినీని ఓదారుస్తోంది. శ్రీహరి సాంబశివరావుగారూ మూల మూలలా వెతకడం మొదలెట్టారు. లాభం లేకపోయింది. దిగులుతో కుప్పకూలిపోయాడు శ్రీహరి.


    సాంబశివరావుగారు పోలీసు రిపోర్టిచ్చారు. మదన్, రేణుక ఏడుపులంకించుకున్నారు. ఎవరూ కూడా శ్రీహరినీ సరోజనమ్మనీ ఓదార్చలేకపోతున్నారు. ఆరోజల్లా ఎవరూ పచ్చిమంచినీళ్ళు ముట్టుకోలేదు. సాంబశివరావుగారు ఊరంతా తిరిగొచ్చారు. ' అయ్యో దేముడా! ఎందికిలా మాయం చేశావు. అంతకన్నా మాయం చేయిందని తెలిస్తే మన ఖర్మ అని ఊరుకోవొచ్చు అంతేకాని, ఏం బెంగపెట్టుకుందో!" మరి మాట్లాడలేక, హృదయం బద్దలయ్యేలా ఏడుస్తోంది సరోజిని. అందరూ కంటతడి పెట్టకుండా వుండలేకపోయారు. గట్టిగా ఏడుస్తున్న మదన్ నీ  రేణుకనీ ఓదార్చలేకపోతున్నారు.


    వెతికి వెతికి, మరి చేసేదిలేక, సత్తెనపల్లికి ప్రయాణమయ్యారు. వచ్చేటప్పుడు ఎంతో సంతోషంగా వచ్చారో, అంతకు పదింతల దుఖ్ఖంతో, బయలుదేరారు. మదన్, రేణుకా, పిచ్చి వాళ్ళలా కూర్చున్నారు. సరోజినీ, శ్రీహరి, దారి పొడుగునా ఏడుస్తూనే వున్నారు.  


    "వొదినా..... వుత్తమనిషివి కూడా కాదమ్మా, ఏదో సరదాపడి వచ్చావుకానీ, ఏడవటం మంచిది కాదు" ఓదార్చింది రాజేశ్వరమ్మ.


    "నా బిడ్డ ఎక్కడుందో? ఏం కష్టాలు పడుతుందో వొదినా." గుండెలు బాదుకుని ఏడుస్తోంది సరోజిని. ఎలాగో యిల్లు చేరుకున్నారు కానీ, మనసు మనసులో లేదు. రాజేశ్వరమ్మే అందరికీ వంట చేసింది. నాలుగు మెతుకులు అందరి చేతా తినిపించేసరికి ఆమెకి తాతలు దిగొచ్చారు. మదన్ పూర్తిగా పిచ్చివాడిలా ఏడుస్తూ కూర్చున్నాడు. ఆ రాత్రి వాడికి జ్వరం కూడా వొచ్చింది.    


    హాయిగా ఆడుతూ పాడుతూ, సంతోషంగా కాలం గడిపే ఆ కుటుంబాలలో శోకదేవత తిష్ట వేసింది. సరోజిని మనోవేదనతో మంచం పట్టింది. శ్రీహరి పిచ్చివాడిలా అయిపోయాడు.


    కాలచక్రం తిరుగుతోంది. క్రమేణా అందరూ రాధికని మర్చిపోయారు.


    ఆ మరుపు అనేదే లేకపోతే మనుగడే కష్టమౌతుందేమో! అందుకే, ఎంత అనుబంధం అనురాగం వున్నా, మనిషి పోయాక, కాలక్రమేణా ఆ గుర్తులనుంచి, ఆ మమతల నుంచి, మనస్సుని మరల్చుతుంది.


    రేణుకకిప్పుడు పదహారేళ్లు సుబ్రహ్మణ్యంకి, పదమూడేళ్లు. మూడోది మాధవి. పదేళ్ళది. వీరి ఆటపాటల్లో క్రమంగా సరోజిని రాధికని మరిచిపోగలిగింది.     


    మదన్ బి.ఎ. పూర్తిచేసి, ఉద్యోగాన్వేషణలో వుండగా మద్రాసులోని ఒక మెడికల్ కంపెనీ నుంచి పిలుపొచ్చింది, అసిస్టెంటు సేల్సు మేనేజరుగా ఇంటర్వ్యూకి వెళ్లాడు. యక్ష ప్రశ్నలడిగివిసిగించి ఏడిపించినా, చివరికి, అపాయింట్ మెంట్ ఆర్డర్ కూడా యిచ్చారు దీక్షితులుగారు.


    అంతేకాదు అతన్ని కన్నబిడ్డలా ఆప్యాయంగా చూసుకునేవారు, కొడుకు కూడా మెడ్రాసులో వుండడం, హోటల్లో తినడం ఇష్టంలేక, సాంబశివరావు దంపతులు, మద్రాసుకే మారిపోవలసి వచ్చింది.  


    ఉన్న వూరూ, కన్నతల్లి, ఒక్కలాంటిదంటారు. ఇన్ని సంవత్సరాల జ్ఞాపకాలను, ఆ వూరిలోనే వదిలేసి, పరాయివూరు వెళుతూ వుంటే, తన వస్తువునేదో పోగొట్టుకున్నట్టుగా బాధపడ్డారా వృద్ధదంపతులు.   


    శ్రీహరి, సరోజినీ, సరేసరి. ఈ ఎడబాటు భరించలేమంటూ కంటతడి పెట్టారు.


    ఒకరినొకరు ఒదలలేక, ఒదలలేక విడిపోయారు రెండు కుటుంబాలవారును, కంటతడి పెట్టుకుంటూ.


    తమాషా! వారెవరో, వీరెవరో, కలిసి కొన్ని సంవత్సరాలు ఒకేచోట ఉన్నందువల్ల అభిరుచులు కలవడంవల్ల, మనసులు కలిసి, మమతలు పెరిగాయి. ఆత్మీయులై పోయారు. ఏనాటి ఋణానుబంధమో, స్నేహమూ ఒక బంధమే, 'ఆత్మీయత అల్లుకుపోయాక. విడిపోవడం ఎంత కష్టమో అది మనసున్న మనిషికే అర్థమౌతుంది, వదినా" అన్న రాజేశ్వరమ్మగారి మాటలు చెవులోరింగుమన్నాయి సరోజనమ్మకి, నిజమే, భగవంతుడు ఈ అనురాగం, అనుబంధం ఎందుకు పెట్టాడో? పెట్టినవాడు పెట్టి మనసులు ఏకమయ్యాక మనుష్యులని వేరుచేస్తాడెందుకో" అంది బాధగా.


    "అదే భగవంతుని లీలమరి. మట్టిని తెచ్చి బొమ్మను చేసి మనిషన్నాడు. ప్రాణంపోసి, మాటలు నేర్పి మనసిచ్చానన్నాడు. ఆ మనసులు కలిపి, మనిషి మనిషికీ మమతలు పెంచాడు. ఆ పెంచిన మమతను, అలా వుంచడమో, తుంచి పారెయ్యడమో, అతని ఇష్టం. ఏం చెయ్యాలనుకుంటే అది చేస్తాడు, తను ఆనందిస్తాడు."


    "ఊ..... అంతా తనిష్టమే తను ఆనందిస్తాడు. మనకి బాధ మిగులుస్తాడు" చెప్పుకున్నట్టుగా అంది సరోజనమ్మ.


    "పుట్టడం ఎవరి పర్మిషన్ తో పుట్టాం గిట్టడం ఎవరి పర్మిషన్ తో గిట్టుతాం. బతకడం కూడా అంతే" అన్నాడు ఆలోచిస్తూ శ్రీహరి.   


    "ఏనాటి స్నేహం అండీ, మదన్ నాలుగేళ్ళవాడు వాళ్లీ ఊరొచ్చేటప్పటికి. రాధిక కడుపులో వుంది" అంది.


    రాధిక పేరెత్తగానే, ఆమెను విషాదరేఖలు చుట్టుముట్టాయి. మనసు మేఘాహృతమైంది. కళ్ళు వర్షించాయి, జ్ఞాపకాలు గతంలోకి లాక్కెళ్ళి, ఉక్కిరిబిక్కిరిచేశాయి. మరి మాట్లాడలేకపోయింది సరోజనమ్మ. "పిచ్చితల్లి ఎక్కడుందో, ఏం కష్టాలు పడుతుందో" అంది.    


    "అసలు వుందో లేదో?" అన్నారు శ్రీహరి ఆలోచిస్తూనే.               


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS