ఇనుప తెర
సందెచీకట్లు క్రమంగా దగ్గరగా కమ్ముకుంటున్నాయి. పట్నాల నాగరికత పొడసోకని మారుమూల పల్లె 'కోనాల' చీకటి దుప్పటి నిండుగా కప్పుకుంది. కరెంటు సౌకర్యంలేని ఆ పల్లె రాత్రి రోజులు నెలలో సగం అమావాస్యే! అంత చీకట్లో కూడా వూరికి చివరగా ఉన్న తాటాకు పాకకు ఒక్కొక్కరూ చేతిలోని లాంతరుతో చేరుకుంటున్నారు. చూస్తుండగానే క్రమంగా ఆపాక నిండా పండంటి వెల్తురు పరుచుకుంది. ఆ వెలుగులో ఆడా - మొగా... తల నెరిసీ నెరవని వారు మొదలు, ముగ్గుబుట్టల వాళ్ళు, బట్టతల వాళ్ళు చాపలమీద కూర్చున్నారు. కొందరి పక్కన మనవళ్ళు, మనవరాళ్ళు కూడా కన్పిస్తున్నారు. అందరి దృష్టి దీక్షగా సౌమ్యమీదే! ఆమె లేచి బోర్డు దగ్గరికి నడిచింది. చేతిలోని లాంతరును బోర్డు పక్కనున్న మేకుకు తగిలించింది. "అందరికీ ఇక అక్షరాలన్నీ వచ్చినట్లేగా" ఆమె గొంతు వాడిగా ఉన్నా మృదువుగా కూడా ఉంది.
'అర'
'అరక'
'కల'
'కలప'
'కమల'
'జడ'
అంతా నిశ్శబ్దంగా పలకల మీద రాసుకుంటున్నారు. బోర్డుపై రాస్తున్న సౌమ్య హఠాత్తుగా ఏదో గుర్తొచ్చినట్లు వెనక్కి తిరిగింది.
"పున్నయ్య బాబాయి రాలేదేం!" అడిగింది సూటిగా.
"లేదమ్మా! ఆయనగోరికి జారంగా ఉందంట" ఎవరో చెప్పారు.
"అయ్యో అలాగా" మళ్ళీ చదువు చెప్పటంలో నిమగ్నమైంది.
ఆనాటి పాఠాలు పూర్తికాగానే ఇంటికేసి నడిచింది. 'చల్లని తల్లి! యెయ్యేళ్ళు సల్లంగా ఉండాల! మనకిన్నాల్లకి నాలుగచ్చరం ముక్కలు సెప్పే మా తల్లి దొరికింది.'
క్రమంగా వాళ్ళ మాటలు ఆమెకు దూరంగా విన్పిస్తున్నాయి. తృప్తిగా నడుస్తోందామె.
సౌమ్య ఇంట్లోకి వస్తూనే మూడంకె వేసుకుని పడుకున్న తమ్ముడ్ని చూసింది.
ఆమె మనసు కరిగి నీరయింది.
దగ్గరగా వెళ్ళి దుప్పటి సరిచేసింది.
"నాన్నా! మందు తాగారా" పడుకుని ఉన్న తండ్రిని అడిగింది.
"తాగాను తల్లీ! నువ్వన్నం తిను, పొద్దు పోయింది" తండ్రి వెంకట్రామయ్య స్వరం చలివల్లనో, పెద్దతనం వల్లనో వణుకుతోంది.
"శీను అన్నం తిన్నాడా నాన్నా!" తమ్ముడికేసి చూస్తూ అడిగింది ప్రేమగా.
"ఆ! అన్నం తిని కాస్సేపు చదువుకొని పడుకున్నాడు" దగ్గు తెర ఆపుకోవటం కష్టమౌతోందాయనకు.
ఖళ్...మంటూ దగ్గుతూనే ఛాతీపట్టుకొని బాధగా మూలిగాడు.
"ఏం నాన్నా! బాధగా ఉందా" దగ్గర కూచొని ఛాతీమీద రాయటం మొదలుపెట్టింది.
"లేదులేమ్మా! ఈ జబ్బు ఉండనీయదు.. పోనీయదు" కూతురు చేయి పట్టి వారించాడు.
ఇది వాళ్లకు అలవాటయిన సంఘటనే అయినా సౌమ్య హృదయాన్ని ఎప్పటికప్పుడు కలచివేస్తూనే ఉంటుంది.
"నీకు నేనింకా ఎన్నాళ్ళిలా భారంగా బతకాలో!"
తండ్రి మాటలకు సౌమ్య కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి.
"ఊరుకోండి నాన్నా! నేనే మీ కొడుకైతే ఇలా అనగలరా!"
"అదేనమ్మా! నా బాధంతా! ఆడపిల్లవి, ఒక అయ్య చేతిలో పెట్టాలి గానీ... నీమీద ఇలా ఆధారపడి బతకటం గుండెకోతగా ఉండదూ..."
సౌమ్యకివి అలవాటయిన మాటలే! అయినా ఎప్పటికప్పుడు నిష్ఠూరంగానే ధ్వనిస్తాయి.
"నా ఉద్యోగం నాకు రోగాన్ని మిగిల్చింది. చచ్చి ఏ లోకాన ఉందో!" అంటూ ఆయాసపడుతూ కాసేపు ఆగాడు. 'మీ అమ్మ అదృష్టవంతురాలు. ఇవన్నీ చూడకుండానే దాటిపోయింది". కళ్ళు కండువాతో ఒత్తుకున్నాడు.
"నాకు నచ్చని సంగతిదే! కొడుకుతో సమానంగా ఆస్తిలో వాటా కావాలనుకునే కూతురు బాధ్యతలు మాత్రం ఎందుకు పంచుకోగూడదు! కొడుకైనా కూతురైనా ఒకటేననే ఆలోచన ముందు తల్లిదండ్రులలో రానంత కాలం ఆడపిల్లలు అంటే ఆ యింటి పిల్లలు' అనే తక్కువ భావం ఈ సమాజంలో ఉంటూనే ఉంటుంది". ఆమె స్వరంలోని ఆవేదన ఆ పితృ హృదయాన్ని కదిలించివేసింది.
"నిజమే తల్లీ! నువ్వు నాకు కొడుకు కన్నా ఎక్కువే! నీ మనసు కలవరపెట్టాను. త్వరగా అన్నంతిని పడుకోమ్మా! కూతురి చేతిపై సాంత్వనగా తట్టి కళ్ళు మూసుకొని అటు తిరిగి పడుకున్నాడాయన.
సౌమ్య అన్నం తింటున్నట్లు, గిన్నెలు సర్దుతున్నట్లు వంటింటి శబ్దాలు విన్పిస్తున్నాయి.
గోడకేసి తిరిగి పడుకున్నాడే గానీ వెంకట్రామయ్య మాస్టారికి నిద్ర పట్టడం లేదు.
"సర్సూ! నన్ను ఒంటరివాణ్ణి చేసి ఈ అమాయకపు పిల్లల్ని వదిలేసి నీ దోవ నువ్వు చూసుకున్నావు. సౌమ్య పెళ్ళి చేయాలి. శీను పసివాడు. అమ్మాయేమో కట్నం తీసుకునేవాడ్ని చేసుకోనంటోంది. ఎలా! దీని ఆదర్శం పెళ్ళికొడుక్కి నచ్చొద్దూ! నువ్వుంటే ఆ దోవ వేరుగా ఉండేది" భార్యని ఉద్దేశిస్తూ తనలో తాను సంభాషిస్తూనే నిద్రలోకి జారి పోయాడాయన.
